Monday 23 July 2012

ఓ నాలుగు మంచి మాటలు

  
ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం వ్యక్తిత్వ వికాసం పుస్తకం ఒకటి చదివాను.ఆ పుస్తకం చదువుతున్నప్పుడు నాకు నచ్చిన కొన్ని వాక్యాలను నోట్ చేసుకున్నాను.నోట్ చేసుకున్న పేపర్ ఎక్కడో భద్రంగా అలమారా లో ఉండిపోయింది.పుస్తకం పేరేమిటో కూడా మర్చిపోయాను.నిన్న ఆ నోట్  చేసుకున్న పేపర్ కి మోక్షం కలిగింది.ఆ నోట్ చేసుకున్న విషయాలలో ఒక్కటన్నా ఇంతవరకు పాటించలేదు.ఇకముందైనా అన్నీ కాకపోయినా ,కొన్నైనా పాటించాలని నిర్ణయం.ఎంతవరకు పాటించగలనో చూడాలి.

నేను నోట్ చేసుకున్న పాయింట్లు ఇవే :)
  • తోటి వారందరిలోకి ప్రధములుగా ఉండాలని కోరుకోవడంలో,అందుకై ప్రయత్నించడం లో తప్పు లేదు.కానీ అలా ఉండకపోవడం తో మీ జీవితానికి విలువే లేదనుకోవడం పొరపాటు.
  • ఈ ప్రపంచమంతా మీరు కోరుకున్న రీతిలో ఉండకపోవచ్చు.అందుకని మీరు ఆగ్రహానికి లోనవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.
  • గతం లో ఏదైనా పొరపాటు చేసి ఉంటె ఆ పొరపాటు పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.అంతే తప్ప ఆ పొరపాటు వలన మీ ప్రయోజకత్వమే మంట గలసి పోయిందనుకోవద్దు.గతానుభవాల దృష్ట్యా మనం నేర్చుకోవలసిందేమిటా  అని ఆలోచించాలే తప్ప,అది అలా చేసి ఉండవలసింది కాదు అని మధనపడడం తప్పు.మారని,మార్చలేని అంశాల గురించి బాధపడడం తప్పు.
  •  ఒకసారి వద్దని చెప్పిన తరువాత ఎదుటివారి బలవంతానికి ఎట్టి పరిస్థితులలోనూ లొంగిపోవద్దు.మీరు మొదట  వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే తిరిగి వెల్లడించండి.ధృడంగా వ్యవహరించడం అలవాటుగా మారాలి.
  • తమను తాము అభిమానించు కోకుండా తోటివారిని ప్రేమించే వారికి అనతికాలం లోనే తామేదో కోల్పోతున్నామన్న బాధ ఎదురవుతుంది.ఇతరుల పట్ల వ్యతిరేకత కలుగుతుంది.అందుకే మీ అవసరాలకు అగ్ర తాంబూలం ఇవ్వాలి.మిమ్మల్ని మీరే పట్టించుకోకపోతే,మీ అవసరాలను ఇంకెవరు పట్టించుకుంటారు.   
  • దేనికీ వ్యతిరేకంగా మాట్లాడవద్దు.మీకు కావలసినదేమిటో,కోరుతున్నదేమిటో ఒకటికి పదిసార్లు చెప్పండి.మీ దృష్టి ని ,ఇష్టపడని విషయాల పై కేంద్రీకరిస్తే కొంతకాలానికి  మీకిష్టం లేని విషయాలే మీ మనస్సును ఆక్రమించి మిమ్మల్ని తీవ్రమైన క్లేశానికి లోను చేస్తాయి.మీరు దేనిని వ్యతిరేకిస్తున్నా సరే ఆ అంశాన్ని విస్మరించి మీరు కోరుతున్నదేమిటో  గుర్తించడాన్ని అలవాటు చేసుకోండి.
  • కోపం వచ్చినప్పుడు ఎదుటివారి పై అరవక్కరలేదు.స్పష్టం గా వ్యక్తీకరించడం అలవాటు చేసుకోండి.

 

No comments: