Saturday 14 September 2013

పేరు ప్రఖ్యాతులు



What we have done for ourselves alone dies with us; what we have done for others and the world remains and is immortal.

ఇప్పటివరకూ ఏది చేసినా నాకు మాత్రమే చేసుకున్నా.ఇకనుంచి లోకానికి కూడా ఏమన్నా చేయాలని నిర్ణయించుకున్నాను.అలా చేస్తే కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతులు వస్తే నా పేరు చిరస్మరణీయం అవుతుందని ఒక దురాశ /పేరాశ. అలా పేరు సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ,
 సైంటిస్ట్ నయినా కాకపోతి కొత్త ఆవిష్కరణలు చేయగా అని రాయినయినా కాకపోతి ట్యూన్ లో పాడుకుంటూ ఉంటే ,ఒక అద్భుతమయిన ఆలోచన తట్టింది.
వంటిల్లే పెద్ద ప్రయోగశాల అని (ఆల్రెడీ ఎవరన్నా అన్నారా?) కొత్త కొత్త వంటలు కనిపెట్టి లోకానికి సేవ చేయోచ్చు కదా అని.
ఆలోచన వచ్చిందే తడవు ,కొత్తగా  -  ఆరోగ్యానికి మంచి చేసే వంటలు ఏమి చెయ్యొచ్చా అనుకుంటుంటే వంటింట్లో ఎదురుగా కాకరకాయలు కనిపించాయి.చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు,తినరు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా ! కావున నా ప్రయోగం దీనితో మొదలు చేస్తే బాగుంటుంది అనుకున్నాను.కూర టైప్ లో వండితే కాకరకాయ అని తెలిసిపోతుంది కాబట్టి ఏదన్నా స్నాక్ లాంటిది ట్రై చేస్తే బెటర్ అని కాకరకాయ కారప్పూస ,స్వీట్ - కాకరకాయ హల్వా చేసి చక్కగా అలంకరించి ఫోటో లు తీసి, చేసే విధానం రాసి పత్రిక కు పంపించాను.వాళ్ళ పత్రికలో అది ప్రచురించలేక పోతున్నందుకు చింతిస్తూన్నాము అనే నోట్ తో భద్రం గా  వెనక్కి వచ్చెయ్యటం కూడా జరిగింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడు లా బంగాళా దుంప బాసుంది,బీరకాయ బిర్యాని, కాబేజీ కజ్జికాయ ,చేమదుంప చేకోడి , పపాయా పాపకార్న్ లాంటి వినూత్న వంటకాలు కనిపెట్టి వాటిని పత్రికలకు పంపించటం ,అవి రాకెట్ వేగం తో తిరిగి రావటం కామన్ అయిపోయింది.ఇక ఇలా లాభం లేదని ,నేనే స్వయం గా బుక్ పబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయం లో ,అంతర్జాలం లో విహరిస్తుంటే - మీ బుక్ ని మీరే పబ్లిష్ చేసుకోండి అనే ప్రకటన కనిపించి,సంతోషాన్ని కలిగించింది. కొద్దిగా ఆలస్యం గా నయినా ఇలా పేరు తెచ్చుకుంటు న్నందుకు ఆనందం గా ఉంది   :))



Thursday 5 September 2013

ఉపాధ్యాయ దినోత్సవం





టీచర్స్ డే - దిగుమతి చేసుకున్న సంప్రదాయమో ,మనదే నో తెలియదు కానీ,

దసరా అప్పుడు అయ్యవారలకు చాలు ఐదు వరహాలు,పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అని పాడుకుంటూ ఇల్లిల్లు తిరిగిన జ్ఞాపకం ఉంది  :) టీచర్స్ డే కి బహుమతులు ఇవ్వటం లాంటివి ఏమీ లేవు . ఇప్పటివాళ్ళు పిల్లల దగ్గర్నుంచి డబ్బులు బాగానే పోగు చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు అనుకోండి . 

మా స్కూల్లో నేనొక రాజకుమారిని. మాస్టార్లందరికి నేను అమ్మాయినే.వేసవి లో ఇంట్లో ఉంటే ఎండలో ఆడతామని ప్రైవేట్ (ట్యూషన్)కి పంపించేవారు. అక్కడ కూడా మనదే రాజ్యం :) నా హోంవర్క్ ,చదవటం చాలా తొందర గా అయిపోయేది ,ఆ తర్వాత వేరే పిల్లల హోంవర్క్ బుక్స్ కరక్ట్ చేయటం ,తప్పులు చేస్తే బెత్తం తో వడ్డించటం కూడా :))
అక్కడ ఏమి అనలేక,చెయ్యలేక మా ఇంటికి వచ్చి, అనూ చదవకుండా ఇలా చేస్తుంది అని చెప్పేవాళ్ళు . నిన్ను ప్రైవేట్ కి పంపిస్తుంది ఎందుకు అని ఇంట్లో అక్షింతలు పడేవి అనుకోండి.ఇక ప్రొద్దున్నుంచి ,సాయంకాలం వరకు అక్కడే కాబట్టి తిండి ,తిప్పలు కూడా అక్కడే . నేను తీసుకెళ్ళినవి కాకుండా,మా మాస్టారు గారి ఇంటి నుంచి వచ్చిన వాటిలో కూడా నాకు వాటా అన్నమాట :) అలా మొదటిసారి సబ్జా విత్తుల పానీయం రుచి చూసాను.
మా అమ్మాయి పెద్ద డాక్టర్ అవుతుంది రా అని అందరి తో అంటూ ఉండేవాళ్ళు.పలక మీద అనూరాధ Mbbs అని రాసే వాళ్ళు.కానీ ఆ విధాత నా నుదిటి మీద రాయక పోతే ఏమి చేస్తాము?నేను డాక్టర్ అవలేదు.

మా సాంబశివ రావు మాస్టారిని (ట్యూషన్)ఎప్పటికీ మర్చిపోలేను . నాకు చదువు నేర్పించిన గురువులందరికీ వందనాలు.వారందరూ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.