Thursday 19 December 2013

స్టాంప్ కలెక్షన్


మనం చేసే చాలా పనులు ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్న వేసుకుంటే కారణాలు దొరకవు.దీని వలన ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే చెయ్యాలి అనుకున్నవి చాలానే చెయ్యము.అప్పుడు జీవితం చాలా చప్పగా,ఆసక్తి అన్నదే లేకుండా ఉంటుందేమో!

మా నాన్నగారి ఫ్రెండ్ (వాళ్ళ వైఫ్ కువైట్ లో వర్క్ చేసేవారు )వాళ్ళ వైఫ్ పంపించారని,నాకు ఒక పెన్ (గ్రీన్ షేడ్ )ఒక కవర్ లో కొన్ని స్టాంప్స్ ఇచ్చారు.ఆ పెన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం.చాలా బాగా రాసేది.మా ట్యూషన్ టీచర్ వాళ్ళ అమ్మాయి (బొమ్మి అక్క )ఆ పెన్ తనకు ఇస్తే, నాకు రెండు పెన్నులు ఇస్తాను అని చాల సార్లు అడిగింది కానీ,నేను ఇవ్వలేదు.డిగ్రీ వరకు అదే పెన్ ఉండేది.ఆ తర్వాత ఆ పెన్ ని పోగొట్టుకున్నాను. :(    ఇక స్టాంప్స్ - వాటిని చూసి,బాగున్నాయి అనుకుని కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత పారేసాను. 

సెలవలకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళితే, అక్కడ నా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్టాంప్స్ ఆల్బమ్స్.కొత్తగా వచ్చిన సోషల్ టీచర్ కలెక్ట్ చెయ్యమని చెప్పారు అని ఎక్కువ కలెక్ట్ చేసిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు అని చెప్పారు.అది విన్నాక నేను పారేసిన  స్టాంప్స్ గుర్తొచ్చి అయ్యో అనుకున్నాను!   
   
స్టాంప్ కలెక్షన్ అనేది ఒక హాబీ అని, ఆ కలెక్ట్ చేసిన స్టాంప్స్ దాచటానికి ఆల్బం ఉంటుందని అప్పటికి తెలియదు.ఇక అప్పట్నుంచి నేను కూడా స్టాంప్స్ కలెక్ట్ చేద్దాము అనుకున్నాను. వాళ్ళ అందరికి సోర్స్ మా వరలక్ష్మి మామ్మ!వాళ్ళింటికి వెళ్లి ,ఇకనుంచి వాళ్లకు స్టాంప్స్ ఇవ్వొద్దు ,నాకే ఇవ్వాలి అని చెప్పాను.దానికి మామ్మ లెటర్ ఇంటికి వచ్చేటప్పటికే స్టాంపులు ఉండటం లేదమ్మాయ్,పోస్ట్మాన్ ని అడిగి తీసేసుకుంటున్నారు,  పోస్ట్మాన్ కి గట్టిగా చెప్పాలి ఇవ్వొద్దని ,ఈసారి నువ్వొచ్చెప్పటికి దాచి ఉంచుతాను అని చెప్పారు. ఒక 2 లేదా 3 సంవత్సరాలు కలెక్ట్ చేసి ఉంటాను.ఫ్రెండ్స్,చుట్టాలు సహాయం తో చాలా స్టాంప్సే కలెక్ట్ చేసాను.ఆ తర్వాత మానేసాను.స్టాంప్ కలెక్షన్ పోస్ట్స్ చూసే ఉంటారు కదా !ఇంకా పోస్ట్ చెయ్యాల్సినవి ఉన్నాయి.   


Monday 16 December 2013

ఆధార్ కార్డ్

తుగ్లక్ పరిపాలన అది ఎలా ఉండేదో తెలియదు .కొంచం వింతగా/పిచ్చి గా ఉన్న వాళ్ళను తుగ్లక్ అని అనటం విన్నాను.దానిని బట్టి  తుగ్లక్ పరిపాలన అంటే పిచ్చిగా ఉంటుందని అనుకోవచ్చు అన్నమాట! ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన అలానే ఉంది. 
 ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, అన్నింటీకీ ఆ ఒక్కటే 'ఆధార'మంటూ అందరూ అంటుంటే,నేను కూడా ఆధార్ కార్డ్ నమోదు కేంద్రానికి వెళ్లాను.అది మా ఇంటి దగ్గర ఉన్న డైట్ కాలేజ్ లోనే ఉంది.తెల్లవారు ఝామున టిఫిన్ క్యారియర్ లతో వచ్చి జనం రోడ్ మీద నుంచుని ఉండేవాళ్ళు.కాలేజ్ గేట్ 10 గంటలకు కాని తెరవరు కదా,ఎందుకు ఇంత ప్రొద్దునే వచ్చి పడిగాపులు కాయటం అనిపించేది వాళ్ళను చూస్తే !సరే,పేరు నమోదు చేయించటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు గుమ్మం వరకు చేరేటప్పటికి టైం అయిపోయింది ,రేపు రండి అని చెప్పి పంపించేసారు.మధ్యానం అయితే కొంచం జనం తక్కువ ఉన్నట్లున్నారు అని రెండో రోజు  మధ్యానం వెళితే ,ఇప్పుడు ఓన్లీ ప్రెస్ వాళ్లకు మాత్రమే ,రేపు రండి అని సలహా!ఆ విధం గా ఒక నాలుగు రోజులు తిరిగి విసుగొచ్చి కార్డ్ లేకపోతే వచ్చిన  నష్టం ఏమీ లేదులే అని ఇక వెళ్ళలేదు.ఆ తర్వాత రెండు నెలలకు,తొందరలో నమోదు కేంద్రాన్ని అక్కడనుంచి తీసివేస్తారని సమాచారం రావటంతో మళ్ళీ తిరుగుడు మొదలు.ఈ సారి ఒక రెండు రోజులు ప్రొద్దున,మధ్యానం తిరిగి ఎలాగయితే పేరు నమోదు చేయించుకోవటం లో విజయం సాధించాను. 
ఆ తర్వాత గాస్ సబ్సిడీ కావాలంటే డీలర్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అంటే అక్కడకు వెళ్ళాను.మాకు ఆధార్ కార్డ్ వచ్చేప్పటికి ఇల్లు మారాము.గాస్ బుక్ లో ఉన్న అడ్రస్ వేరు,ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ వేరు కాబట్టి అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చెయ్యాలి,అది తీసుకు రండి అని చెప్పటం తో మళ్ళీ ఆ అడ్రస్ ప్రూఫ్ తీసుకువెళ్ళి ఎలా అయితే ఏమి ఆ పని కూడా పూర్తి చేసుకున్నాను.

The AADHAAR number is not recognized as a legal proof of residence due to issues with the data protection.   
 
ఇల్లు మారిన ప్రతిసారీ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్చెయ్యాల్సి వస్తే ఇంక ఆధార్ కార్డ్ ఎందుకో నాకు అర్ధం కాలేదు.సబ్సిడీలు పొందటానికి మాత్రమే ఆధార్ కార్డ్... 
నెక్స్ట్ బ్యాంక్ లో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చెయ్యటం . అది కూడా పూర్తయ్యింది. ఇంతలో ఈ న్యూస్ .
Adhaar Card Not Mandatory for LPG Subsidy'

By Express News Service - BANGALORE

Published: 08th December 2013 07:23 AM

It is not mandatory to display your Aadhaar card to get subsidies for LPG connections, Union Petroleum Minister M Veerappa Moily said. He added gas supply agencies insisted that customers show their Aadhaar card only to identify illegal connections.

నేను మా ఎదురింటి వాళ్ళింటికి వెళ్ళేప్పటికి ఆవిడ రాలి పడిన ఎండు కొబ్బరికాయలు ఏరి వాటి పీచు తీస్తున్నారు.నేను, ఆధార్ కార్డ్ అవసరం లేదంట అండి న్యూస్ వచ్చింది అనగానే ఆవిడ కోపం తో ఎవరండి చెప్పింది ,నా ఎదురుగా ఉంటే వాళ్ళ తల మీదే ఈ కొబ్బరి కాయను పగలకొడతాను అని అన్నారు.వాళ్ళు లైన్ లో నించోకుండా ,1000 ఇచ్చి (ముగ్గురి పేర్లు )నమోదు చేయించుకున్నారంట. ఎంత డబ్బు వేస్ట్ అండి ఓ బాధ పడిపోయారు . మళ్లీ ఇప్పుడు ఈ న్యూస్ ... 

December 13, 2013 13:39 IST
Link your Aadhaar number by January 31 to get LPG subsidy

ఇప్పుడు ఏది నిజమో తెలియదు . 
About Rs. 35 billion (Rs.3,500 crore) was spent on Aadhaar program from beginning (January-2009) till September2013 with enrollment of 50 crore persons. It includes operating costs as well as capital expenditure  

ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో కొంత క్లారిటీ ఉండాలి కదా ?వాళ్లకు లేదు సరే,జనాల్ని కూడా అయోమయం లో పడేస్తున్నారు .    


              

Thursday 12 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 3




దిష్టి మంత్రం :

దిష్టి అనేది ఉందనో లేదనో ,నేను స్టేట్మెంట్ ఇవ్వటం లేదు.దిష్టి ఉందని నమ్మేవాళ్ళు ,నమ్మని వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఇక నా సంగతికొస్తే నమ్మాలా ,వద్దా అని సందిగ్దం.జీవిత పయనం లో మనకు కలిగే సందేహాలకు చాలా వాటికి సమాధానాలు ఉండవు / దొరకవు.కొన్ని నమ్మకాలకు లాజిక్ లు ఉండవు.మన అనుభవం లోకి వచ్చే కొన్ని సంఘటనల వల్ల కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి.అవి ఎదుటివారికి వింతగానో పిచ్చిగానో అనిపించవచ్చు. 

చిన్నప్పుడు,ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే,వచ్చిన అతిధులు అందరూ వెళ్లిపోయినాక ఇంట్లోని చిన్నపిల్లలకు దిష్టి తీయటం అనేది సాధారణంగా జరిగేదే !అలాగే బయటకు వెళ్లి వచ్చినా ! 
చీపురుకట్ట తల చుట్టూ3సార్లు తిప్పి అవతల పడవేసి,అరచేతులు తలకు ఆనించుకుని మెటికలు విరిచేవాళ్ళు.అలా చేసినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దిష్టి బాగా ఉందనో,లేదనో అనుకునే వాళ్ళు.దిష్టి ఎక్కువ ఉందని అనుకుంటే,ఇంకోసారి కళ్లుప్పు తో రిపీట్ ... అప్పటికి కూడా దిష్టి పోలేదు, ఇంకా ఉంది అనుకుంటే ఒక గుడ్డ పీలికను నూనె లో ముంచి,నూనె పిండేసి దానికి నిప్పంటించి అట్లకాడ పై వేసి తల చుట్టూ తిప్పేవాళ్ళు.అలా తిప్పినప్పుడు నూనె బొట్లు పడితే దిష్టి ఉన్నట్లు.పడకపోతే లేనట్లు.

ఒకసారి నాకు జ్వరం వచ్చింది.ఎంతకీ తగ్గలేదు. మా కాంపౌండ్ లోనే ఉంటున్న నాగరత్నం ఆంటీ(ఆంటీ వాళ్ళు బొంబాయి లో ఉండి వచ్చారు.మాట్లాడే ప్రతి మాటకి ముందు బొంబాయి ప్రసక్తి తీసుకు వస్తారని ఆవిడకు బొంబాయి అని నిక్ నేం పెట్టారు.ఆవిడ కూడా అది ఒక బిరుదులా ఫీల్ అయ్యేవారు)మా అమ్మకు, దిష్టి మంత్రం వేయించమని సలహా ఇచ్చారు.మేముండే దగ్గరే రోడ్ కు ఆవలి వైపు,కొత్తగా కాలనీ ఒకటి ఏర్పడింది.అక్కడ ఒక మామ్మగారు దిష్టి మంత్రం వేస్తారు అని చెప్పారు.ఆవిడ మంత్రం వేసినందుకు డబ్బులు ఏమీ తీసుకునేవారు కాదు.గుప్పిట్లో పట్టినన్ని బియ్యం తీసుకు వెళ్ళాలి.ఆవిడ ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ,కళ్ళు మూసుకుని మంత్రం చదివి బియ్యం మీద మూడుసార్లు ఊది ఆ బియ్యాన్ని తిరిగి మనకే ఇస్తారు.వాటిని వేరే బియ్యంతో కలిపి అన్నం వండుకుని తినాలి.ఆవిడ కు ఎలా తెలుస్తుందో మరి,దిష్టి ఎక్కువ ఉంది - రెండు లేదా మూడు సార్లు మంత్రం వెయ్యాలి అని చెప్పేవారు. కొన్ని సార్లు ఒక్కసారి వేస్తే సరిపోయేది. రోజుకు ఒక్క సారే మంత్రం వేస్తారు కనుక ప్రతి రోజూ వెళ్లి మంత్రం వేయించుకు వచ్చేవాళ్ళం.మంత్రాలు ఉన్నాయా అంటే నేనేమి చెప్పలేను కాని ,దిష్టి వలన కలిగిన లక్షణాలు మటుకు అన్నీ  ఆ మంత్రం తో మాయమయ్యేవి.     

                        

Monday 9 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 2

ఎక్కువ నచ్చినవి / ఇష్టమైనవి

వేసవి లో తర్బూజా తిని, గింజల్ని ఎండబెట్టి ఉంచేవాళ్ళం.హావలాక్ లైన్స్ (ఆర్మీ క్వార్టర్స్ ) చివరికి వెళ్ళితే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండేవి.అప్పుడప్పుడు సాయంకాలం,ఆ ఎండబెట్టిన గింజల్ని తీసుకుని ఆ కొండరాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళం.ఆ రాళ్ళ పైకి ఎక్కితే బేగంపేట్ విమానాశ్రయం చాలా చక్కగా కనిపించేది.ఇప్పుడు రాక్ క్లైంబింగ్ అనే పేరు తో మీట్ అప్ లు నిర్వహిస్తున్నారు కాని అప్పట్లో అలాంటివి ఏమి లేవు.ఆ రాళ్ళు ఎక్కి కూర్చుని తర్బూజా గింజల్ని వలుచుకుతింటూ  సూర్యాస్తమయాన్ని చూడటం ,అలానే టేకాఫ్ మరియు లాండ్ అవుతున్న విమానాల్ని చూడటం ఎంతో ఇష్టం మరియు ఆనందం. 

ఇంకో ఇష్టమైన విషయం డబల్ డెక్కర్ బస్ . 
 











స్కూల్ కి వెళ్ళేప్పుడు ముందుగా ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినా ,తిరిగి వచ్చేప్పుడు మాత్రం డబల్ డెక్కర్ బస్ కోసం
వేచి ఉండేవాళ్ళం.స్కూల్ కి ఇంటికి మధ్య దారి పొడుగూ మోదుగుపూల చెట్లు ఉండేవి.ఆ పూలు కోసుకోవాలంటే మామూలుగా అందవు కాబట్టి డబల్ డెక్కర్ బస్ ఎక్కితే ఆ పూలు కోసుకోవచ్చు అని ఆ బస్ కోసం వేచి ఉండేవాళ్ళమన్నమాట.ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది. :(    


Sunday 8 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 1

ట్రాన్స్ లేటర్  అవతారం

ట్యూషన్ లో ఒకరకం కష్టాలు అయితే ,స్కూల్లో ఇంకోరకం కష్టాలు.అంతకు ముందు చదివినది పల్లెటూళ్ళో,ప్రభుత్వ పాటశాల లో. పాఠం చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ లో ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసుకుని నోట్స్ లో రాసుకునే వాళ్ళం.అదే హోంవర్క్.ఒక్క లెక్కలకు తప్పించి మిగతా సబ్జెక్ట్స్ కి ప్రత్యేకించి వేరే  హోంవర్క్ ఏమీ ఉండేది కాదు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే ,ప్రతి సబ్జెక్ట్ కి ఒక క్లాస్ నోట్ బుక్ ,హోంవర్క్ కి ఒకటి,వీక్లీ టెస్ట్ కి ఒకటి,మంత్లీ టెస్ట్ కి ఒకటి , అలా ఒక్కో సబ్జెక్ట్ కి నాలుగు నోట్ బుక్స్.కాకపోతే ఇప్పటి పిల్లల్లా అన్నీ మోసుకెళ్ళే బాధ లేదు.టెస్ట్ నోట్స్ అన్నీ,క్లాస్ లోనే ఉన్న అలమర లో ఉంచేవాళ్ళు.వాటి బాధ్యత క్లాస్ లీడర్ ది.కీస్ తన దగ్గర ఉండేవి.టెస్ట్ ఉన్న రోజు బుక్స్ తీసి ఎవరివి వాళ్లకు ఇచ్చేది.ఇక టెక్స్ట్ బుక్స్,వేరే నోట్ బుక్స్ అవసరమైనవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం.మిగతావి  డెస్క్ లో పెట్టి లాక్ చేసుకునే వాళ్ళం.అతి పెద్ద ప్రాబ్లం నోట్స్ డిక్టేట్ చెయ్యడం.ప్రత్యేకించి సోషల్ &ఇంగ్లిష్ .ఆవిడ ఏమి చెప్తుందో అర్ధమయ్యేది కాదు.పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో.(మలయాళీ లు మాట్లాడుతున్నప్పుడు విన్నారా?అలా అన్నమాట :)  )క్రొత్తలో ఏమీ రాసుకోలేక ఏడ్చేసేదాన్ని.నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యాను.మాథ్స్,సైన్స్,తెలుగు - ఇబ్బంది లేని సబ్జెక్ట్స్.ఇక హిందీ.పిల్లల గొంతు వినిపించని క్లాస్ ఏదన్నా ఉందంటే అది ఇదే ! ఆ క్లాస్ లో హిందీ తప్పించి వేరే బాష లో మాట్లాడితే 10 పైసలు ఫైన్.అందుకని టీచర్ అడిగిన దానికి జవాబు చెప్పటానికి తప్పించి ఎవరూ నోరు తెరిచేవాళ్ళు కాదు.

సరే,ఇక ట్యూషన్ లో పెద్ద కష్టం వచ్చిందన్నాను కదా ! అదేమిటంటే ...
 ట్యూషన్ లోచేరిన ఒక నాలుగు నెలలకు అనుకుంటా,వారానికి ఒకసారి - మంగళవారం క్రైస్తవ ప్రచారకులు వచ్చేవాళ్ళు.ఒక గంటన్నర పాటు,బైబిల్ లో కొన్ని వాక్యాలు చదివి చెప్పేవాళ్ళు.వాటి తో పాటు కొన్ని పిట్టకథలు.ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు పాడించేవాళ్ళు.ఆ చెప్పేవాళ్లకు తెలుగు రానందున వెంట ఒక ట్రాన్స్లేటర్ ని కూడా తీసుకుని వచ్చేవాళ్ళు.ఒకరోజు ఆ  ట్రాన్స్లేటర్ ఒకటి తప్పు చెప్పటం తో నేను,విని ఊరుకోకుండా ,దాని అర్ధం అది కాదు అని సరిదిద్దాను.అంతే !నువ్వు బాగా చెప్తున్నావు,ఇక నుంచి తెలుగు లో నువ్వే చెప్పు అని ట్రాన్స్లేషన్ బాధ్యత నాకిచ్చేసారు.అది తప్పు చెప్పారు కనుక సరిచేసాను,మొత్తం చెప్పాలంటే నాకు రాదు అన్నా వినలేదు.గుంపు లో కూర్చుంటే,పూర్తిగా విన్నా వినకపోయినా సమస్య లేదు.కాని ట్రాన్స్లేషన్ చెయ్యాలంటే చచ్చినట్టు శ్రద్ధగా అంతా వినాల్సిందే!తప్పించుకునే మార్గం లేకపోయింది :(
ఆ తర్వాత భక్తి గీతాలు పాడేటప్పుడు " మేరా మన్ మే హై ఈసా,తన్ మే హై ఈసా" అని పాడిస్తున్నారు.నేనేమో మేరా మన్ మే హై రామ్ ,తన్ మే హై రామ్ అని పాడుతున్నాను.టీచర్ ఎప్పుడు వచ్చారో తెలియదు,నీకెంత పొగరు అని నెత్తి మీద మొట్టారు.హోం వర్క్ చెయ్యలేదనో,మార్క్స్ తక్కువ వచ్చాయనో ఎప్పుడూ తన్నులు తినలేదు కానీ,ఇలాంటి వాటికి అప్పుడప్పుడు చీవాట్లు తినేదాన్ని.

తర్వాత కొన్నిరోజులకు నాకు  బైబిల్ కొని ఇచ్చారు.ఒక ఆదివారం హెబ్రోన్ కి తీసుకువెళ్ళారు.ప్రవచనాలు పూర్తయ్యాక,ఈ వారం ఏ తప్పు(సినిమాలు చూడకపోవటం,సినిమా పాటలు వినకపోవడం,మత గ్రంధాలు తప్పించి వేరే పుస్తకాలు చదవక పోవటం ,అబద్దాలు చెప్పకపోవటం etc ) చెయ్యని వాళ్ళు చేతులు ఎత్తమన్నారు.చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు.అలా చేతులు ఎత్తిన వారికి చిన్న బ్రెడ్ ముక్క నోట్లో వేసి కొంచం వైన్ పోశారు.కొంతమంది కన్ఫెషన్ రూం అని ఉంది,అక్కడకు వెళ్లి కన్ఫెసర్ కి తమ తప్పులను చెప్పుకున్నారు.ఆ తర్వాత సాంబార్ అన్నం తిని ఇంటికి వచ్చేసాము.
నాకు అప్పుడప్పుడు మతం మార్చుకోవాలని అనిపించినా ఎక్కడో చిన్న హెజిటేషన్.అందుకనే మతం మారలేదు :)                                        

 
                               

Thursday 5 December 2013

మేథి తెప్లా



కావలసినవి :

గోధుమ పిండి : 4 గుప్పిళ్ళు లేదా 150 గ్రాములు 
మెంతి కూర : ఒక కట్ట 
కొత్తిమీర : సగం  కట్ట 
అల్లం : చిన్న ముక్క 
పచ్చిమిర్చి : 2
జీలకర్ర పొడి : పావు స్పూన్ 
పెరుగు : చిన్న కప్పు 
బెల్లం (పొడి చేసినది) : సగం కప్పు 
నూనె :రెండు టేబిల్ స్పూన్స్
ఉప్పు : తగినంత 

చేసే పద్ధతి :
మెంతి కూర,కొత్తిమీర ఆకులు సన్నగా తరుక్కోవాలి.
పెరుగు లో బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
గోధుమ పిండి లో ఉప్పు,నూనె,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,మెంతి కొత్తిమీర ఆకులు , జీలకర్ర పొడి వేసి బెల్లం కలిపిన పెరుగు తో కలపాలి.   
ఈ పిండిని ముద్దలు గా చేసుకుని ,చపాతీ ల్లా వత్తి పెనం మీద కాల్చుకోవాలి.
ఇది గుజరాతీయులు చేసుకునే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం.   
 
 


Tuesday 3 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు

నాకు 11 ఏళ్లప్పుడు నేను సికిందరాబాద్ వచ్చాను.నా తెలివితేటల మీద అపారనమ్మకం కల నా తల్లితండ్రులు ,ఎ,బి,సి,డి లు ,కాట్,రాట్ లాంటి చిన్న పదాలు మాత్రమే తెలిసిన నన్ను అమాంతం గా తెలుగు మీడియం నుంచి తీసుకొచ్చి ఇంగ్లిష్ మీడియం లో పడేశారు.దేశం కాని దేశం లో దారి తప్పిన బాటసారి లా అయ్యింది నా పరిస్థితి.మేము ఉన్న ఇంటి కాంపౌండ్ లో 4 ఇళ్ళు ఉండేవి.అందులో ఒక దాంట్లో ఇంటి ఓనర్ (కన్నడ)ఉండేవాళ్ళు.ఇంటి పక్కన మళయాళ మామి.ఆ పక్కన బెంగాలి బేన్జీ (బెహన్ జీ వాడుకలో అలా అయ్యింది)ఆవిడ కి మా అమ్మమ్మ గారి వయసు అయినా ,మా అమ్మ వాళ్లకు మాకు అందరికి బేన్జీ నే.వాళ్లకు చిన్నకిరాణా షాప్ ఉండేది.అర్జంట్ గా సరకులు ఏమన్నా కావాల్సివస్తే అక్కడనుంచి తెచ్చేవాళ్ళం.ఆ పక్కనే వరసగా తమిళియన్స్ ఇళ్ళు.ఆ ఏరియా లో తమిళియన్స్ ఎక్కువే ఉండేవాళ్ళు.తర్వాత ఒక ఆంగ్లోఇండియన్ వాళ్ళు.ఇంటి కి ఇంకో ప్రక్కన కూడా తమిళియన్స్ ,ఒక పంజాబీ ఫామిలీ ఉండేది. కాంపౌండ్ దాటి బయటకు వస్తే ఒక వైపు సికిందరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ ,ఇంకో వైపు ఆర్మీ క్వార్టర్స్ (హావ్లక్ లైన్స్)క్వార్టర్స్ మొదట్లో పార్క్ ఉండేది.అక్కడే మా ఆటలన్నీ!మెయిన్ రోడ్ కి ,ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉండేది.సాయంకాలం ,ఆ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు.అప్పుడప్పుడు పిల్లలం కూడా వెళ్లి వచ్చే,పోయే బస్ లను చూస్తూ కూర్చునేవాళ్ళం.ఇంటి కి దగ్గర లోనే మహంకాళి గుడి.అక్కడ కూర్చుంటే మహంకాళి గుడి కనిపిస్తూ ఉండేది.         
ఆగస్ట్ లో బోనాలు పండగ అప్పుడు చాలా సందడి గా ఉండేది.బోనాలు మొదలవుతాయనగా రెండు రోజులు ముందు గుడి దగ్గరకు పోలీస్ వ్యాన్ వచ్చేది.వ్యాన్ ఆగగానే బిల బిల కొంతమంది వచ్చి వ్యాన్ లో కూర్చునేవాళ్ళు. బోనాలప్పుడే కాకుండా ,మామూలు రోజుల్లో కూడా అప్పుడప్పుడు  పోలీస్ వ్యాన్ వస్తే అదే సీను.వీళ్ళకు సిగ్గు శరం లేదు,పోలీసులకు శ్రమ లేకుండా వాళ్ళే నవ్వుకుంటూ వచ్చి వ్యాన్ లో కూర్చుంటున్నారు అని పెద్దవాళ్ళు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. 

నాకు ఇంగ్లిష్ రాదు కాబట్టి ,ఇంగ్లిష్ నేర్పటానికి ట్యూషన్ ...   ట్యూషన్ టీచర్ -పేరు రాధ.మా స్కూల్లోనే ఎలెమెంటరీ సెక్షన్ లో పని చేసేవారు.మా చెల్లి,తమ్ముడు,కజిన్ అందరమూ అక్కడే !ఆ టీచర్ గారికి 4 పిల్లలు.ఆడ పిల్లల పేర్లు బొమ్మి మరియు కుట్టి.ట్యూషన్ కి వచ్చిన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చుంటే నన్ను మాత్రం సెపరేట్ గా వేరే రూం లో కూర్చోపెట్టే వాళ్ళు.పర్యవేక్షణ బొమ్మి మరియు కుట్టి.అరగంట కో సారి ఒక స్టూడెంట్ ని మలాయ్ చాయ్ తెమ్మని పంపించే వాళ్ళు.ఆ చాయ్ తేవటానికి పాపం చాలామంది రెడీ గా ఉండేవాళ్ళు.కాని ,అది తెచ్చే అదృష్టం ఒకరికే దక్కేది.ఎందుకంటే ఆ అబ్బాయి అయితేనే చాయ్ లో మలాయ్ ఎక్కువ వేయించుకుని వస్తాడంట. :)  

అలా ఒక్కదాన్నే కూర్చుని చదవాలంటే చాలా విసుగ్గా ఉండేది.అందరి లో కూర్చున్టానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కొంతలో కొంత రిలీఫ్ ఏమిటంటే బెన్నీ అని టీచర్ గారి బంధువు.తను గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు.అది వినటం.ఇక బొమ్మి అక్క,తను MA చదువుతుంది అనుకుంట.సరిగా గుర్తు లేదు.తన బుక్స్ ఇచ్చి నన్ను పెద్దగా చదవమనేది.అలా చదివితే తను చదువుకోవటం ,నాకు ఇంగ్లిష్ రావటం రెండూ జరుగుతాయి అని చెప్పేది.ఇలా కష్టాల కడలి లో ఈదుతూ చదువు కొనసాగిస్తూ ఉండగా ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. 

ఆ కష్టం ఏమిటి అనేది నెక్స్ట్ పోస్ట్ లో   :)                                              

జంట నగరాలు



ఈ నవల పదునెట్టువాదు అక్షతగలు అనే తమిళ నవలకు అనువాదం.భూమధ్య రేఖ కు ఉత్తరం గా 'పద్దెనిమిదవ అక్షాంశ రేఖ' దగ్గర ఉంది అట హైదరాబాద్ నగరం.చిన్నప్పుడు సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఒకటి చదువుకున్నాను కానీ,ఈ విషయం ఇప్పటివరకూ తెలియదు :) 
తమిళనాడు నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లి స్థిరపడిన కుటుంబం లోని అబ్బాయి చంద్రశేఖర్ అనుభవాలు ఈ నవల కథా వస్తువు.నవలా కాలం 1930-40 కి మధ్య. 
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం లో చేరకుండా విడిగా ఉన్న హైదరాబాద్ లో ప్రజలు అనుభవించిన కష్టాలు ,విలీనం కావటానికి నిరాకరించినప్పుడు సైనిక చర్య తో భారత ప్రభుత్వం ఇండియన్ యూనియన్ లో కలిపేసుకోవడం ... ఈ రాజకీయ పరిణామాలు ఒక విద్యార్ధి జీవితాన్ని ఏ విధం గా బాధించింది అన్నదే ఈ నవల. 
అప్పటికి ,ఇప్పటికి పరిస్థితులలో పెద్ద మార్పేమీ లేదు అనుకుంటా !కాకపోతే ఉద్యమాలకి కారణాలు మారాయి . 

        

Sunday 1 December 2013

ఏడు పాయల

దేని మీదైనా ఎక్కువ అంచనాలు లేకపోతే అంత నిరాశ ఉండదేమో !అంచనా లు ఎక్కువైతే నిరాశ కూడా ఎక్కువే!
ఏడు పాయల గురించి చదివి ,ఫోటో లు చూసి -  ఎంత అందం గా ఉందో ,తప్పకుండా చూడాలి అనుకుని ఒక రెండు నెలల క్రితం అనుకున్నాను. అప్పట్నించి వెళ్ళటానికి ఒక తేది అనుకోవటం,చివరి నిమిషం లో ఏదో ఒక అవాంతరం . అలా వాయిదా పడుతూ వచ్చి చివరకు నిన్న వెళ్లి చూసి వచ్చాము.తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత ,ఏమిటి దీని కోసమా ఇంతగా ... అనిపించింది .

       
దర్శనం బాగా జరిగింది.అమ్మ వారిని చూడటానికి రెండు కళ్ళు చాలవు.అంత సుందర స్వరూపం . 
ఆ తర్వాత, దగ్గర లోనే ఉన్న మంజీరా డాం చూడటానికి వెళ్ళాము.డాం అంటే నాగార్జునసాగర్ ,శ్రీశైలం డాం ల లాగా ఉంటుందేమో అనుకున్నాము.కాని డాం లు ఇలా కూడా ఉంటాయని తెల్సింది.   

      


వెళ్లే దారి లో వానర సైన్యం 


గుడి ప్రాంగణం లో