Tuesday, 3 August 2010

చిన్ననాటి తీపి గురుతులు

నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.అసలు పేరు తో ఎవరూ పిలిచేవారు కాదు.అందరూ మా స్కూల్ ను  రైలు కట్ట బడి అని పిలిచేవారు.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన డబ్బులు (5,10పైసల నాణాలు) ఉంటే డబ్బులు లేకపోతే పిన్నీసులు పెట్టె వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయిన వాటిని తీసుకుని సంబరపడేవాళ్ళం.రైలు వచ్చి ఆగిన తరువాత ఇంజిన్ దగ్గరకు వెళ్లి,డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు.వాళ్ళను  గ్రీజ్ అడిగే వాళ్ళం.డ్రైవర్ వెళ్ళండి అని అరిచే వాడు కానీ ,వేరే అతను ఒకళ్లిద్దరికి గ్రీజ్ ఇచ్చి ,ఇక వెళ్ళండి,రైలు కదులుతుంది అని పంపించేసేవాడు.ఆ ఇచ్చిన గ్రీజ్ ను తలా కొంచం పంచుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం.అంతకు ముందు మా ఇంట్లో కొట్టుడు పంపు పాడయినప్పుడు  బాగు చేయటానికి వచ్చినతను ,పంపు బాగుచేసినాక నట్టులకి గ్రీజ్ రాయటం చూసాను.గ్రీజ్ రాస్తే పంపు పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యం తో నేను ఇంటికి వెళ్ళగానే ,గ్రీజ్ ను పంపు కు నట్టు కనిపించిన చోటల్లా రాసాను.ఈ క్రమం లో గ్రీజ్ ,పంపు కే కాకుండా ,నా బట్టలకు,వంటికి కూడా అంటింది.పాపం ఇప్పటి వాళ్లకు తెలిసినట్లు గా ......మరక మంచిదేనని అప్పటి వాళ్లకు తెలియదు గా ! అందుకని మా అమ్మమ్మ బట్టలతో పాటూ నన్నూ ఉతికి ఆరవేసేది.