Showing posts with label జ్ఞాపకాలు. Show all posts
Showing posts with label జ్ఞాపకాలు. Show all posts

Wednesday, 16 November 2016

మొన్నటి చంద్రుడు



ప్రత్యేకించి చంద్రుడిని చూడాలని చూడకపోయినా ,చందమామ పలు రూపాలని చాలా సార్లే చూసాను. చిన్నతనం లో మరీ ఎక్కువ గా. వేసవి కాలం లో , సాయంకాలం అవగానే సూర్యుని ప్రతాపానికి కాలిపోతున్న నేల తల్లిని చల్లార్చటానికి,పెరట్లో బకెట్లకు బకెట్లు నీళ్లు చల్లి ,ఆ తర్వాత వరసనే మంచాలు ... 6:30 , ఏడింటి కల్లా భోజనం చేసి పిల్లలమంతా మంచాల మీదకు చేరి కబుర్లు చెప్పుకోవటం , అదొక అద్భుతమైన జ్ఞాపకం. చుక్కల్ని చూసి వాటికి రకరకాల రూపాల్ని ఆపాదించటం , చందమామ లో కుందేలు ఉంటదన్నారు,మచ్చ ఉందన్నారు , ఏదీ కనపడటం లేదే ... ఇలా . ఏం మాట్లాడుకునేవాళ్ళమో పూర్తిగా గుర్తు లేదు కానీ , ఆ కబుర్లకు అంతు అంటూ ఉండేది కాదు . అప్పట్లో చందమామ లో ఉన్న మచ్చలు ఏమి కనిపించలేదు - ఇప్పుడు చాలానే కనిపిస్తున్నాయి , బహుశా ఈ భూమి మీద మనం పొంగి పొర్లిస్తున్న కాలుష్యం కావొచ్చు లేదా చందమామ మనకి చాలా దగ్గరగా వచ్చి  ఉండొచ్చు. ఇంకొన్నాళ్ల తర్వాత , సిటీ లో ... వేసవి లో రోజూ టంచన్ గా ఏడింటికి కరెంట్ పోయేది,మళ్ళీ కరెంట్ వచ్ఛేలోపు భోజనాలు పూర్తిచేసి అంత్యాక్షరి ఆడేవాళ్ళం.అదే పౌర్ణమి రోజయితే ఆనందానికి హద్దు ఉండేది కాదు,ఎందుకంటే,గుడ్డివెల్తురులో,ఉక్కపోత భరిస్తూబొంచెయ్యక్కరలేదు.హాయిగా వెన్నెల్లో  హాయ్ హాయ్ అనుకుంటూ ప్రశాంతం గా తినొచ్చు.ఇక అపార్టుమెంట్లు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా చూడటం తప్ప చంద్రుణ్ణి చూడటం పూర్తిగా మర్చేపోయాను.ఈ మధ్య ఫలానా రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు, భూమికి దగ్గరగా వస్తాడు, పెద్దగా కనిపిస్తాడు , చూడండి , మిస్ అవ్వొద్దు అని అందరూ పదే పదే   ఊదరగొడుతుంటే , ఎలా ఉంటుందో తప్పక చూడాలి , మిస్ కాకూడదు అనుకుంటే , మొదటిసారి చెప్పినప్పుడు ఆకాశం మబ్బులు పట్టేసి అసలు చంద్రుని దర్శనమే అవలేదు.నిన్న మాత్రం చూడగలిగాను.నాకు,చంద్రుడు మరీ అంత పెద్దగా ఏమీ అనిపించలేదు.అంతకుముందు, పర్లి నుంచి తిరిగి వచ్చేప్పుడుట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండటం తో , ఏమి తోచక -  మాఘ పౌర్ణిమ రోజు చంద్రుడిని  ఫోటోలు తీస్తూ టైం పాస్ చేసాను.ఒక్క రంగులో తప్పించి, అప్పటి చంద్రుడికి , మొన్నటి చంద్రుడికి తేడా ఏమి లేదు 😊  



మాఘ పౌర్ణిమ చంద్రుడు 


మొన్నటి చంద్రుడు 


బాక్ లైటింగ్ చేంజ్ చేస్తే ఇలా ... 


Thursday, 25 September 2014

ఒకానొక ఊరిలో ఒకానొక సర్వే







ఆంజనేయస్వామి కి ఆధార్ కార్డ్ . కొన్ని జోక్స్ కన్నా ఇలాంటి న్యూస్ చదివితే బాగా నవ్వొస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాం లో 40 రూపాయలు వసూలు చేసి మరీ రేషన్ కార్డ్లు ఇచ్చారు . మా పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లల వయసులు సరిగ్గానే చెప్పారు కాని ఆవిడ వయసు తగ్గించి చెప్పుకున్నారు. వాళ్ళ పెద్ద అమ్మాయి వయసు 23 ఏళ్ళు అయితే ఆవిడ వయసు 32మాత్రమే. వివరాలు రాసుకునే ఆవిడ  కూడా అదేంటి అనే ప్రశ్న వెయ్యకుండా   రాసుకుని వెళ్ళారు ,కార్డ్ లో కూడా అలాగే వచ్చింది.తెల్ల కార్డ్ కి అర్హులు కాకపోయినా వాళ్ళు ఇచ్చిన వివరాల్ని బట్టి తెల్ల కార్డ్ వచ్చింది.కొన్నాళ్ళు మేము ఆవిడని ఆటపట్టించి నవ్వుకున్నాము. ఏ విధమైన సర్వే అయినా ,డేటా కలెక్ట్   చేసిన దానిలో నిజం కంటే అబద్దం పాళ్ళే ఎక్కువ .

మేము డిగ్రీ ఫైనల్ చదివేప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లో భాగం గా ,మా కాలేజ్ వాళ్ళు దత్తు తీసుకున్న గ్రామం లో సర్వే కి వెళ్ళాము.వారానికి ఒక రోజు (శనివారం) సర్వే చేయటానికి కేటాయించారు. మొదటిసారి వెళ్ళినప్పుడు కొంతమంది అసలు తలుపు తెరవలేదు. కొంతమంది తలుపు ఓరగా తెరిచి ఎందుకు వచ్చారు అని అడిగి ,సర్వే అని చెప్పగానే టక్కున తలుపు వేసుకున్నారు.కొంతమంది డబ్బులు ఇస్తారా అని అడిగి ,ఇవ్వము కాలేజ్ నుంచి వచ్చాము అనగానే అయితే వివరాలు ఎందుకు ?అని ,కొంతమంది ... ఇలా చాలామందే వచ్చి రాసుకెళ్ళారు ,ఎవరూ ఏమి చెయ్యలేదు ,మీరయినా అంతే మేము చెప్పమని ... లంచ్ టైం అయ్యింది ,కనీసం ఒక్క ఇంటి వివరాలు కూడా తీసుకోలేక పోయాము.భోంచేసి మళ్లీ వెళ్ళొచ్చులే  అని కాలేజ్ బస్ దగ్గరికి వెళ్లి భోజనం కానిచ్చాము.ఆ తర్వాత కూడా నో యూజ్.నెక్స్ట్ డే ,మా లెక్చరర్ గారు ఏమంటారో అని కొద్దిగా భయపడుతూనే క్లాస్ కి వెళ్ళాము.అయితే అందుకు భిన్నం గా ,పర్వాలేదు ,రెండు మూడు సార్లు విజిట్ చేస్తే ఆ ఊరు వాళ్ళు మీకు పరిచయమవుతారు ,అప్పుడు ఈజీ గా వివరాలు సేకరించవచ్చు అన్నారు.

సెకండ్ విజిట్ లో వివరాలు సేకరించలేకపోయినా కొద్దిగా మాటలు కలిపి కొంతమందిని పరిచయం చేసుకోగలిగాము.ఆ తర్వాతి విజిట్ లో ఒక ఇంట్లో సంభాషణ ...

మీ పేరు ?
-----
మీ ఆయన పేరు ?
ఎవరయినా ఆయన పేరు చెప్తారా ?
చెప్తే ఏమవుతుంది ?
చెప్పకూడదు
మీ వయసు ?
మీకు మల్లే పేపర్ లో పుస్తకాల్లో రాసి పెట్టుకుంటామ ,తెలియదు .
పిల్లలు ఎంతమంది ?
---
వాళ్ళ వయసు ఎంత ?
తెలియదు
మీ పిల్లల వయసు మీకు తెలియదా ?
---
మీకు పొలం ఎంత ఉంది ?
తెలియదు

ఒక్క పేర్లు తప్పించి ,ఎలాంటి వివరాలు సేకరించలేకపోయాము . మగవాళ్ళు ఉన్నప్పుడు వస్తే పొలము, ఆదాయ వివరాలు తెలుస్తాయి అని చెపితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని అడిగి ఆ టైం కి మళ్లీ వెళ్ళాము . ఒకరు రెండు ఎకరాలు పొలం ఉంది అని చెప్పి ఆదాయం సంవత్సరానికి మూడు నాలుగు వేలు వస్తుందని చెపితే ,ఇంకొకరు అర ఎకరం పొలం - సంవత్సరానికి ఆదాయం 50,000 నుంచి 75,000 వస్తుందని ...
ఆదాయం తక్కువ వస్తుందంటే వాళ్లకు డబ్బు ఇస్తారేమో అనే అభిప్రాయం కొందరిదయితే , గొప్పలు చెప్పే వాళ్ళు కొందరు .
మేము రాసుకున్న వివరాలు ,పేర్లు తప్పించి మిగతావి అన్నీ కరెక్ట్ కాదు అని తెలుస్తూనే ఉంది.పిల్లల చదువుకునే క్లాస్ ని బట్టి వాళ్ళ వయసు వేసి ,పెద్దవాళ్ళకు  ఉజ్జాయింపుగా పిల్లల వయసును బేస్ చేసుకుని ,భార్య భర్తలకు 5 లేదా 6 ఏళ్ళు తేడా ఉంచి వేసాము.ఇక ఆదాయం విషయానికి వస్తే -  లైబ్రరీ కి వెళ్లి రెఫెరెన్స్ బుక్స్ తీసుకుని ,ఏ పంటకు ఎంత ఆదాయం అన్నది చూసుకుని 500, 1000 రూపాయలు ఎక్కువ లేదా తక్కువ కలిపి వేసాము.  అలా ఎలా అయితే ఏమి విజయవంతం గా సర్వే ని పూర్తి చేసాము :)

  
                       

Thursday, 19 December 2013

స్టాంప్ కలెక్షన్


మనం చేసే చాలా పనులు ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్న వేసుకుంటే కారణాలు దొరకవు.దీని వలన ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే చెయ్యాలి అనుకున్నవి చాలానే చెయ్యము.అప్పుడు జీవితం చాలా చప్పగా,ఆసక్తి అన్నదే లేకుండా ఉంటుందేమో!

మా నాన్నగారి ఫ్రెండ్ (వాళ్ళ వైఫ్ కువైట్ లో వర్క్ చేసేవారు )వాళ్ళ వైఫ్ పంపించారని,నాకు ఒక పెన్ (గ్రీన్ షేడ్ )ఒక కవర్ లో కొన్ని స్టాంప్స్ ఇచ్చారు.ఆ పెన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం.చాలా బాగా రాసేది.మా ట్యూషన్ టీచర్ వాళ్ళ అమ్మాయి (బొమ్మి అక్క )ఆ పెన్ తనకు ఇస్తే, నాకు రెండు పెన్నులు ఇస్తాను అని చాల సార్లు అడిగింది కానీ,నేను ఇవ్వలేదు.డిగ్రీ వరకు అదే పెన్ ఉండేది.ఆ తర్వాత ఆ పెన్ ని పోగొట్టుకున్నాను. :(    ఇక స్టాంప్స్ - వాటిని చూసి,బాగున్నాయి అనుకుని కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత పారేసాను. 

సెలవలకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళితే, అక్కడ నా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్టాంప్స్ ఆల్బమ్స్.కొత్తగా వచ్చిన సోషల్ టీచర్ కలెక్ట్ చెయ్యమని చెప్పారు అని ఎక్కువ కలెక్ట్ చేసిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు అని చెప్పారు.అది విన్నాక నేను పారేసిన  స్టాంప్స్ గుర్తొచ్చి అయ్యో అనుకున్నాను!   
   
స్టాంప్ కలెక్షన్ అనేది ఒక హాబీ అని, ఆ కలెక్ట్ చేసిన స్టాంప్స్ దాచటానికి ఆల్బం ఉంటుందని అప్పటికి తెలియదు.ఇక అప్పట్నుంచి నేను కూడా స్టాంప్స్ కలెక్ట్ చేద్దాము అనుకున్నాను. వాళ్ళ అందరికి సోర్స్ మా వరలక్ష్మి మామ్మ!వాళ్ళింటికి వెళ్లి ,ఇకనుంచి వాళ్లకు స్టాంప్స్ ఇవ్వొద్దు ,నాకే ఇవ్వాలి అని చెప్పాను.దానికి మామ్మ లెటర్ ఇంటికి వచ్చేటప్పటికే స్టాంపులు ఉండటం లేదమ్మాయ్,పోస్ట్మాన్ ని అడిగి తీసేసుకుంటున్నారు,  పోస్ట్మాన్ కి గట్టిగా చెప్పాలి ఇవ్వొద్దని ,ఈసారి నువ్వొచ్చెప్పటికి దాచి ఉంచుతాను అని చెప్పారు. ఒక 2 లేదా 3 సంవత్సరాలు కలెక్ట్ చేసి ఉంటాను.ఫ్రెండ్స్,చుట్టాలు సహాయం తో చాలా స్టాంప్సే కలెక్ట్ చేసాను.ఆ తర్వాత మానేసాను.స్టాంప్ కలెక్షన్ పోస్ట్స్ చూసే ఉంటారు కదా !ఇంకా పోస్ట్ చెయ్యాల్సినవి ఉన్నాయి.   


Thursday, 12 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 3




దిష్టి మంత్రం :

దిష్టి అనేది ఉందనో లేదనో ,నేను స్టేట్మెంట్ ఇవ్వటం లేదు.దిష్టి ఉందని నమ్మేవాళ్ళు ,నమ్మని వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఇక నా సంగతికొస్తే నమ్మాలా ,వద్దా అని సందిగ్దం.జీవిత పయనం లో మనకు కలిగే సందేహాలకు చాలా వాటికి సమాధానాలు ఉండవు / దొరకవు.కొన్ని నమ్మకాలకు లాజిక్ లు ఉండవు.మన అనుభవం లోకి వచ్చే కొన్ని సంఘటనల వల్ల కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి.అవి ఎదుటివారికి వింతగానో పిచ్చిగానో అనిపించవచ్చు. 

చిన్నప్పుడు,ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే,వచ్చిన అతిధులు అందరూ వెళ్లిపోయినాక ఇంట్లోని చిన్నపిల్లలకు దిష్టి తీయటం అనేది సాధారణంగా జరిగేదే !అలాగే బయటకు వెళ్లి వచ్చినా ! 
చీపురుకట్ట తల చుట్టూ3సార్లు తిప్పి అవతల పడవేసి,అరచేతులు తలకు ఆనించుకుని మెటికలు విరిచేవాళ్ళు.అలా చేసినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దిష్టి బాగా ఉందనో,లేదనో అనుకునే వాళ్ళు.దిష్టి ఎక్కువ ఉందని అనుకుంటే,ఇంకోసారి కళ్లుప్పు తో రిపీట్ ... అప్పటికి కూడా దిష్టి పోలేదు, ఇంకా ఉంది అనుకుంటే ఒక గుడ్డ పీలికను నూనె లో ముంచి,నూనె పిండేసి దానికి నిప్పంటించి అట్లకాడ పై వేసి తల చుట్టూ తిప్పేవాళ్ళు.అలా తిప్పినప్పుడు నూనె బొట్లు పడితే దిష్టి ఉన్నట్లు.పడకపోతే లేనట్లు.

ఒకసారి నాకు జ్వరం వచ్చింది.ఎంతకీ తగ్గలేదు. మా కాంపౌండ్ లోనే ఉంటున్న నాగరత్నం ఆంటీ(ఆంటీ వాళ్ళు బొంబాయి లో ఉండి వచ్చారు.మాట్లాడే ప్రతి మాటకి ముందు బొంబాయి ప్రసక్తి తీసుకు వస్తారని ఆవిడకు బొంబాయి అని నిక్ నేం పెట్టారు.ఆవిడ కూడా అది ఒక బిరుదులా ఫీల్ అయ్యేవారు)మా అమ్మకు, దిష్టి మంత్రం వేయించమని సలహా ఇచ్చారు.మేముండే దగ్గరే రోడ్ కు ఆవలి వైపు,కొత్తగా కాలనీ ఒకటి ఏర్పడింది.అక్కడ ఒక మామ్మగారు దిష్టి మంత్రం వేస్తారు అని చెప్పారు.ఆవిడ మంత్రం వేసినందుకు డబ్బులు ఏమీ తీసుకునేవారు కాదు.గుప్పిట్లో పట్టినన్ని బియ్యం తీసుకు వెళ్ళాలి.ఆవిడ ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ,కళ్ళు మూసుకుని మంత్రం చదివి బియ్యం మీద మూడుసార్లు ఊది ఆ బియ్యాన్ని తిరిగి మనకే ఇస్తారు.వాటిని వేరే బియ్యంతో కలిపి అన్నం వండుకుని తినాలి.ఆవిడ కు ఎలా తెలుస్తుందో మరి,దిష్టి ఎక్కువ ఉంది - రెండు లేదా మూడు సార్లు మంత్రం వెయ్యాలి అని చెప్పేవారు. కొన్ని సార్లు ఒక్కసారి వేస్తే సరిపోయేది. రోజుకు ఒక్క సారే మంత్రం వేస్తారు కనుక ప్రతి రోజూ వెళ్లి మంత్రం వేయించుకు వచ్చేవాళ్ళం.మంత్రాలు ఉన్నాయా అంటే నేనేమి చెప్పలేను కాని ,దిష్టి వలన కలిగిన లక్షణాలు మటుకు అన్నీ  ఆ మంత్రం తో మాయమయ్యేవి.     

                        

Monday, 9 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 2

ఎక్కువ నచ్చినవి / ఇష్టమైనవి

వేసవి లో తర్బూజా తిని, గింజల్ని ఎండబెట్టి ఉంచేవాళ్ళం.హావలాక్ లైన్స్ (ఆర్మీ క్వార్టర్స్ ) చివరికి వెళ్ళితే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండేవి.అప్పుడప్పుడు సాయంకాలం,ఆ ఎండబెట్టిన గింజల్ని తీసుకుని ఆ కొండరాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళం.ఆ రాళ్ళ పైకి ఎక్కితే బేగంపేట్ విమానాశ్రయం చాలా చక్కగా కనిపించేది.ఇప్పుడు రాక్ క్లైంబింగ్ అనే పేరు తో మీట్ అప్ లు నిర్వహిస్తున్నారు కాని అప్పట్లో అలాంటివి ఏమి లేవు.ఆ రాళ్ళు ఎక్కి కూర్చుని తర్బూజా గింజల్ని వలుచుకుతింటూ  సూర్యాస్తమయాన్ని చూడటం ,అలానే టేకాఫ్ మరియు లాండ్ అవుతున్న విమానాల్ని చూడటం ఎంతో ఇష్టం మరియు ఆనందం. 

ఇంకో ఇష్టమైన విషయం డబల్ డెక్కర్ బస్ . 
 











స్కూల్ కి వెళ్ళేప్పుడు ముందుగా ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినా ,తిరిగి వచ్చేప్పుడు మాత్రం డబల్ డెక్కర్ బస్ కోసం
వేచి ఉండేవాళ్ళం.స్కూల్ కి ఇంటికి మధ్య దారి పొడుగూ మోదుగుపూల చెట్లు ఉండేవి.ఆ పూలు కోసుకోవాలంటే మామూలుగా అందవు కాబట్టి డబల్ డెక్కర్ బస్ ఎక్కితే ఆ పూలు కోసుకోవచ్చు అని ఆ బస్ కోసం వేచి ఉండేవాళ్ళమన్నమాట.ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది. :(    


Sunday, 8 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 1

ట్రాన్స్ లేటర్  అవతారం

ట్యూషన్ లో ఒకరకం కష్టాలు అయితే ,స్కూల్లో ఇంకోరకం కష్టాలు.అంతకు ముందు చదివినది పల్లెటూళ్ళో,ప్రభుత్వ పాటశాల లో. పాఠం చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ లో ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసుకుని నోట్స్ లో రాసుకునే వాళ్ళం.అదే హోంవర్క్.ఒక్క లెక్కలకు తప్పించి మిగతా సబ్జెక్ట్స్ కి ప్రత్యేకించి వేరే  హోంవర్క్ ఏమీ ఉండేది కాదు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే ,ప్రతి సబ్జెక్ట్ కి ఒక క్లాస్ నోట్ బుక్ ,హోంవర్క్ కి ఒకటి,వీక్లీ టెస్ట్ కి ఒకటి,మంత్లీ టెస్ట్ కి ఒకటి , అలా ఒక్కో సబ్జెక్ట్ కి నాలుగు నోట్ బుక్స్.కాకపోతే ఇప్పటి పిల్లల్లా అన్నీ మోసుకెళ్ళే బాధ లేదు.టెస్ట్ నోట్స్ అన్నీ,క్లాస్ లోనే ఉన్న అలమర లో ఉంచేవాళ్ళు.వాటి బాధ్యత క్లాస్ లీడర్ ది.కీస్ తన దగ్గర ఉండేవి.టెస్ట్ ఉన్న రోజు బుక్స్ తీసి ఎవరివి వాళ్లకు ఇచ్చేది.ఇక టెక్స్ట్ బుక్స్,వేరే నోట్ బుక్స్ అవసరమైనవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం.మిగతావి  డెస్క్ లో పెట్టి లాక్ చేసుకునే వాళ్ళం.అతి పెద్ద ప్రాబ్లం నోట్స్ డిక్టేట్ చెయ్యడం.ప్రత్యేకించి సోషల్ &ఇంగ్లిష్ .ఆవిడ ఏమి చెప్తుందో అర్ధమయ్యేది కాదు.పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో.(మలయాళీ లు మాట్లాడుతున్నప్పుడు విన్నారా?అలా అన్నమాట :)  )క్రొత్తలో ఏమీ రాసుకోలేక ఏడ్చేసేదాన్ని.నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యాను.మాథ్స్,సైన్స్,తెలుగు - ఇబ్బంది లేని సబ్జెక్ట్స్.ఇక హిందీ.పిల్లల గొంతు వినిపించని క్లాస్ ఏదన్నా ఉందంటే అది ఇదే ! ఆ క్లాస్ లో హిందీ తప్పించి వేరే బాష లో మాట్లాడితే 10 పైసలు ఫైన్.అందుకని టీచర్ అడిగిన దానికి జవాబు చెప్పటానికి తప్పించి ఎవరూ నోరు తెరిచేవాళ్ళు కాదు.

సరే,ఇక ట్యూషన్ లో పెద్ద కష్టం వచ్చిందన్నాను కదా ! అదేమిటంటే ...
 ట్యూషన్ లోచేరిన ఒక నాలుగు నెలలకు అనుకుంటా,వారానికి ఒకసారి - మంగళవారం క్రైస్తవ ప్రచారకులు వచ్చేవాళ్ళు.ఒక గంటన్నర పాటు,బైబిల్ లో కొన్ని వాక్యాలు చదివి చెప్పేవాళ్ళు.వాటి తో పాటు కొన్ని పిట్టకథలు.ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు పాడించేవాళ్ళు.ఆ చెప్పేవాళ్లకు తెలుగు రానందున వెంట ఒక ట్రాన్స్లేటర్ ని కూడా తీసుకుని వచ్చేవాళ్ళు.ఒకరోజు ఆ  ట్రాన్స్లేటర్ ఒకటి తప్పు చెప్పటం తో నేను,విని ఊరుకోకుండా ,దాని అర్ధం అది కాదు అని సరిదిద్దాను.అంతే !నువ్వు బాగా చెప్తున్నావు,ఇక నుంచి తెలుగు లో నువ్వే చెప్పు అని ట్రాన్స్లేషన్ బాధ్యత నాకిచ్చేసారు.అది తప్పు చెప్పారు కనుక సరిచేసాను,మొత్తం చెప్పాలంటే నాకు రాదు అన్నా వినలేదు.గుంపు లో కూర్చుంటే,పూర్తిగా విన్నా వినకపోయినా సమస్య లేదు.కాని ట్రాన్స్లేషన్ చెయ్యాలంటే చచ్చినట్టు శ్రద్ధగా అంతా వినాల్సిందే!తప్పించుకునే మార్గం లేకపోయింది :(
ఆ తర్వాత భక్తి గీతాలు పాడేటప్పుడు " మేరా మన్ మే హై ఈసా,తన్ మే హై ఈసా" అని పాడిస్తున్నారు.నేనేమో మేరా మన్ మే హై రామ్ ,తన్ మే హై రామ్ అని పాడుతున్నాను.టీచర్ ఎప్పుడు వచ్చారో తెలియదు,నీకెంత పొగరు అని నెత్తి మీద మొట్టారు.హోం వర్క్ చెయ్యలేదనో,మార్క్స్ తక్కువ వచ్చాయనో ఎప్పుడూ తన్నులు తినలేదు కానీ,ఇలాంటి వాటికి అప్పుడప్పుడు చీవాట్లు తినేదాన్ని.

తర్వాత కొన్నిరోజులకు నాకు  బైబిల్ కొని ఇచ్చారు.ఒక ఆదివారం హెబ్రోన్ కి తీసుకువెళ్ళారు.ప్రవచనాలు పూర్తయ్యాక,ఈ వారం ఏ తప్పు(సినిమాలు చూడకపోవటం,సినిమా పాటలు వినకపోవడం,మత గ్రంధాలు తప్పించి వేరే పుస్తకాలు చదవక పోవటం ,అబద్దాలు చెప్పకపోవటం etc ) చెయ్యని వాళ్ళు చేతులు ఎత్తమన్నారు.చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు.అలా చేతులు ఎత్తిన వారికి చిన్న బ్రెడ్ ముక్క నోట్లో వేసి కొంచం వైన్ పోశారు.కొంతమంది కన్ఫెషన్ రూం అని ఉంది,అక్కడకు వెళ్లి కన్ఫెసర్ కి తమ తప్పులను చెప్పుకున్నారు.ఆ తర్వాత సాంబార్ అన్నం తిని ఇంటికి వచ్చేసాము.
నాకు అప్పుడప్పుడు మతం మార్చుకోవాలని అనిపించినా ఎక్కడో చిన్న హెజిటేషన్.అందుకనే మతం మారలేదు :)                                        

 
                               

Tuesday, 3 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు

నాకు 11 ఏళ్లప్పుడు నేను సికిందరాబాద్ వచ్చాను.నా తెలివితేటల మీద అపారనమ్మకం కల నా తల్లితండ్రులు ,ఎ,బి,సి,డి లు ,కాట్,రాట్ లాంటి చిన్న పదాలు మాత్రమే తెలిసిన నన్ను అమాంతం గా తెలుగు మీడియం నుంచి తీసుకొచ్చి ఇంగ్లిష్ మీడియం లో పడేశారు.దేశం కాని దేశం లో దారి తప్పిన బాటసారి లా అయ్యింది నా పరిస్థితి.మేము ఉన్న ఇంటి కాంపౌండ్ లో 4 ఇళ్ళు ఉండేవి.అందులో ఒక దాంట్లో ఇంటి ఓనర్ (కన్నడ)ఉండేవాళ్ళు.ఇంటి పక్కన మళయాళ మామి.ఆ పక్కన బెంగాలి బేన్జీ (బెహన్ జీ వాడుకలో అలా అయ్యింది)ఆవిడ కి మా అమ్మమ్మ గారి వయసు అయినా ,మా అమ్మ వాళ్లకు మాకు అందరికి బేన్జీ నే.వాళ్లకు చిన్నకిరాణా షాప్ ఉండేది.అర్జంట్ గా సరకులు ఏమన్నా కావాల్సివస్తే అక్కడనుంచి తెచ్చేవాళ్ళం.ఆ పక్కనే వరసగా తమిళియన్స్ ఇళ్ళు.ఆ ఏరియా లో తమిళియన్స్ ఎక్కువే ఉండేవాళ్ళు.తర్వాత ఒక ఆంగ్లోఇండియన్ వాళ్ళు.ఇంటి కి ఇంకో ప్రక్కన కూడా తమిళియన్స్ ,ఒక పంజాబీ ఫామిలీ ఉండేది. కాంపౌండ్ దాటి బయటకు వస్తే ఒక వైపు సికిందరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ ,ఇంకో వైపు ఆర్మీ క్వార్టర్స్ (హావ్లక్ లైన్స్)క్వార్టర్స్ మొదట్లో పార్క్ ఉండేది.అక్కడే మా ఆటలన్నీ!మెయిన్ రోడ్ కి ,ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉండేది.సాయంకాలం ,ఆ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు.అప్పుడప్పుడు పిల్లలం కూడా వెళ్లి వచ్చే,పోయే బస్ లను చూస్తూ కూర్చునేవాళ్ళం.ఇంటి కి దగ్గర లోనే మహంకాళి గుడి.అక్కడ కూర్చుంటే మహంకాళి గుడి కనిపిస్తూ ఉండేది.         
ఆగస్ట్ లో బోనాలు పండగ అప్పుడు చాలా సందడి గా ఉండేది.బోనాలు మొదలవుతాయనగా రెండు రోజులు ముందు గుడి దగ్గరకు పోలీస్ వ్యాన్ వచ్చేది.వ్యాన్ ఆగగానే బిల బిల కొంతమంది వచ్చి వ్యాన్ లో కూర్చునేవాళ్ళు. బోనాలప్పుడే కాకుండా ,మామూలు రోజుల్లో కూడా అప్పుడప్పుడు  పోలీస్ వ్యాన్ వస్తే అదే సీను.వీళ్ళకు సిగ్గు శరం లేదు,పోలీసులకు శ్రమ లేకుండా వాళ్ళే నవ్వుకుంటూ వచ్చి వ్యాన్ లో కూర్చుంటున్నారు అని పెద్దవాళ్ళు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. 

నాకు ఇంగ్లిష్ రాదు కాబట్టి ,ఇంగ్లిష్ నేర్పటానికి ట్యూషన్ ...   ట్యూషన్ టీచర్ -పేరు రాధ.మా స్కూల్లోనే ఎలెమెంటరీ సెక్షన్ లో పని చేసేవారు.మా చెల్లి,తమ్ముడు,కజిన్ అందరమూ అక్కడే !ఆ టీచర్ గారికి 4 పిల్లలు.ఆడ పిల్లల పేర్లు బొమ్మి మరియు కుట్టి.ట్యూషన్ కి వచ్చిన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చుంటే నన్ను మాత్రం సెపరేట్ గా వేరే రూం లో కూర్చోపెట్టే వాళ్ళు.పర్యవేక్షణ బొమ్మి మరియు కుట్టి.అరగంట కో సారి ఒక స్టూడెంట్ ని మలాయ్ చాయ్ తెమ్మని పంపించే వాళ్ళు.ఆ చాయ్ తేవటానికి పాపం చాలామంది రెడీ గా ఉండేవాళ్ళు.కాని ,అది తెచ్చే అదృష్టం ఒకరికే దక్కేది.ఎందుకంటే ఆ అబ్బాయి అయితేనే చాయ్ లో మలాయ్ ఎక్కువ వేయించుకుని వస్తాడంట. :)  

అలా ఒక్కదాన్నే కూర్చుని చదవాలంటే చాలా విసుగ్గా ఉండేది.అందరి లో కూర్చున్టానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కొంతలో కొంత రిలీఫ్ ఏమిటంటే బెన్నీ అని టీచర్ గారి బంధువు.తను గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు.అది వినటం.ఇక బొమ్మి అక్క,తను MA చదువుతుంది అనుకుంట.సరిగా గుర్తు లేదు.తన బుక్స్ ఇచ్చి నన్ను పెద్దగా చదవమనేది.అలా చదివితే తను చదువుకోవటం ,నాకు ఇంగ్లిష్ రావటం రెండూ జరుగుతాయి అని చెప్పేది.ఇలా కష్టాల కడలి లో ఈదుతూ చదువు కొనసాగిస్తూ ఉండగా ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. 

ఆ కష్టం ఏమిటి అనేది నెక్స్ట్ పోస్ట్ లో   :)                                              

Thursday, 5 September 2013

ఉపాధ్యాయ దినోత్సవం





టీచర్స్ డే - దిగుమతి చేసుకున్న సంప్రదాయమో ,మనదే నో తెలియదు కానీ,

దసరా అప్పుడు అయ్యవారలకు చాలు ఐదు వరహాలు,పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అని పాడుకుంటూ ఇల్లిల్లు తిరిగిన జ్ఞాపకం ఉంది  :) టీచర్స్ డే కి బహుమతులు ఇవ్వటం లాంటివి ఏమీ లేవు . ఇప్పటివాళ్ళు పిల్లల దగ్గర్నుంచి డబ్బులు బాగానే పోగు చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు అనుకోండి . 

మా స్కూల్లో నేనొక రాజకుమారిని. మాస్టార్లందరికి నేను అమ్మాయినే.వేసవి లో ఇంట్లో ఉంటే ఎండలో ఆడతామని ప్రైవేట్ (ట్యూషన్)కి పంపించేవారు. అక్కడ కూడా మనదే రాజ్యం :) నా హోంవర్క్ ,చదవటం చాలా తొందర గా అయిపోయేది ,ఆ తర్వాత వేరే పిల్లల హోంవర్క్ బుక్స్ కరక్ట్ చేయటం ,తప్పులు చేస్తే బెత్తం తో వడ్డించటం కూడా :))
అక్కడ ఏమి అనలేక,చెయ్యలేక మా ఇంటికి వచ్చి, అనూ చదవకుండా ఇలా చేస్తుంది అని చెప్పేవాళ్ళు . నిన్ను ప్రైవేట్ కి పంపిస్తుంది ఎందుకు అని ఇంట్లో అక్షింతలు పడేవి అనుకోండి.ఇక ప్రొద్దున్నుంచి ,సాయంకాలం వరకు అక్కడే కాబట్టి తిండి ,తిప్పలు కూడా అక్కడే . నేను తీసుకెళ్ళినవి కాకుండా,మా మాస్టారు గారి ఇంటి నుంచి వచ్చిన వాటిలో కూడా నాకు వాటా అన్నమాట :) అలా మొదటిసారి సబ్జా విత్తుల పానీయం రుచి చూసాను.
మా అమ్మాయి పెద్ద డాక్టర్ అవుతుంది రా అని అందరి తో అంటూ ఉండేవాళ్ళు.పలక మీద అనూరాధ Mbbs అని రాసే వాళ్ళు.కానీ ఆ విధాత నా నుదిటి మీద రాయక పోతే ఏమి చేస్తాము?నేను డాక్టర్ అవలేదు.

మా సాంబశివ రావు మాస్టారిని (ట్యూషన్)ఎప్పటికీ మర్చిపోలేను . నాకు చదువు నేర్పించిన గురువులందరికీ వందనాలు.వారందరూ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.     


Wednesday, 31 July 2013

వెలలేని ఆభరణాలు ,బొమ్మలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసి దిగులు ఒక పక్క.జోరున వర్షం ఇంకో పక్క . విపరీతమైన చిరాకు ,ఏ పని చెయ్యాలనిపించటం లేదు.బాల్కనీ లో నుంచొని అలా వర్షాన్ని చూస్తూ ఉంటే ,రాలి పడిన కొబ్బరి మట్ట ఒకటి కనిపించింది . దాన్ని చూస్తే ,చిన్నప్పుడు ఆడిన ఆటలు జ్ఞాపకానికి వచ్చాయి.

కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి ఆ బొమ్మలకు అలంకరణ చేసి ఆ బొమ్మలకు పెళ్లి చేసే వాళ్ళం :)
అలంకరణకు బట్టలు - వూళ్ళో ఉన్న ఏకైక దర్జీ ,బాజీ గారి ని అడిగి తెచ్చే వాళ్ళం.సరే మరి పెళ్లి జరిపించే వాళ్లకు ఆభరణాలు కావొద్దూ! వాచీ ,ఉంగరం కొబ్బరి ఆకులతో చేసుకొనేవాళ్ళం.మరి ఆ బొమ్మలు ,ఆభరణాలు ఎలా ఉంటాయో చూడాలని ఉందా?అయితే చూడండి ... 




          



Wednesday, 2 March 2011

శివరాత్రి -ఉపవాసం




Myspace Shiva pictures Graphics Shakti Clipart


నేను ఎనిమిదో తరగతి చదవటానికి మా అమ్మ వాళ్ళ దగ్గరకు -హైదరాబాద్ వచ్చాను.ఏదో వేరే లోకం లోకి వచ్చి పడ్డట్లు అనిపించింది.అప్పటి వరకు నాకు గుడి కి వెళ్ళటం,పూజలు చెయ్యటం అలవాటు లేదు.ఇక్కడ అమ్మావాళ్ళు ప్రతి శనివారం హనుమాన్ టెంపుల్ కి వెళ్ళే  వాళ్ళు.శుక్రవారం సంతోషిమాత పూజ చేసేది.ఆ రోజు పులుపు వస్తువులు తినేది కాదు.ఒకపూట ఉపవాసం   ఉండేది.శనివారం కూడా ఉపవాసం ఉండేది.ఇంట్లో ఇలా ఉంటె ,స్కూల్ లో క్లాస్ మేట్స్ కూడా చాలానే భక్తిపరులు.మా క్లాస్ లీడర్ మరాటీ అమ్మాయి.ప్రతి సోమవారం మౌన వ్రతం ఆచరించేది.ఆ రోజు క్లాస్ లో ఎవరిని అంటుకునేది కాదు(కొన్ని రోజులకు మా సైన్స్ టీచర్ కు తెలిసి ,ఆ అమ్మాయిని తిట్టి ఆ వ్రతాన్ని మానిపించింది అనుకోండి).ఇంకా చాలా మంది ఉపవాసాలు,మొక్కులు....నాకు వాళ్ళు వింతగా అనిపిస్తే,నేను వాళ్లకు వింత. ఇలా వీళ్ళందరినీ చూసి నేనేదో చాలా పాపాత్మురాలినేమో,భక్తి అన్నది లేదు అనిపించింది.మెల్లగా నేను కూడా కొంచం భక్తి అలవరుచుకున్నాను.ఈ లోగా శివరాత్రి వచ్చింది.ఆ ముందు రోజు క్లాస్ లో డిస్కషన్స్.ఎవరెవరు ఉపవాసం ఉంటున్నారు,జాగారం చేస్తున్నారు అని.ఉపవాసం ఉండట్లేదు,జాగారం చెయ్యట్లేదు అంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారో,ఏమి మాట్లాడతారో అని భయపడి నేను కూడా ఉపవాసం, జాగారం  చేస్తున్నాను అని చెప్పాను.చెప్పాను కానీ ...ఆకలి కి తట్టుకోలేను,నిద్ర ఆపుకోలేను ఎలాగబ్బా!అని మనసు లో దిగులు.మొత్తానికి శివరాత్రి రోజు ,కనీసం మంచి నీళ్ళు కూడా తాగకుండా సాయంకాలం వరకు ఉన్నాను.అదే రోజు మా కజిన్ పుట్టిన రోజు.సాయంత్రం ఆరింటికి మా పిన్ని,కజిన్ వచ్చారు...చేతిలో బాక్స్,బాక్స్ లో కేకు ముక్కలు.ఫస్ట్ నాకే ఇచ్చింది.ఉపవాసం సంగతి మర్చిపోయి కేకు ఇచ్చిన వెంటనే టక్కున నోట్లో పెట్టేసుకున్నాను.కొంచం తిన్న తరువాత ఉపవాసం సంగతి గుర్తు వచ్చింది.ఇంకేం చేస్తాం?ఎలాగు కేకు తిన్నాను గా,అన్నం తినేస్తాను అని మా అమ్మను అన్నం పెట్టమని భోంచేసా.అలా ఉపవాసం పూర్తయ్యింది.ఇంక ఉపవాసం చేయనప్పుడు జాగారం మాత్రం ఏం చేస్తాం లే అని ఎప్పటి లాగానే ఎనిమిదింటికల్లా నిద్రపోయా.ఇక అప్పట్నించి ఇప్పటి వరకు ఉపవాసం,జాగారం సంగతి మళ్ళీ తలచుకుంటే ఒట్టు. 

Sunday, 12 December 2010

సంక్రాంతి

డిసెంబర్-16సంక్రాంతి నెల మొదలు.పండగలన్నింటి లోకి నాకు సంక్రాంతి పండగ అంటే చాలా ఇష్టం.దసరా,వినాయకచవితి,శ్రీరామనవమి లాంటి పండగలు వారం రోజులపాటు సందడి చేస్తే ,సంక్రాంతి పండగ కు మటుకు నెలరోజుల ముందు నుంచే సందడి మొదలవుతుంది.ఇప్పటి రోజుల గురించి కాదు,మా చిన్నప్పటి సంగతి.ఇప్పుడు పల్లెటూళ్ళల్లో కూడాకళా,కాంతికోల్పోయింది.నెలపట్టినరోజునుంచిసంక్రాంతిప్రత్యేకముగ్గులు
గొబ్బెమ్మలు,వాటిపైనబంతిపూలతోవాకిళ్ళుకళకళ,హరిదాసులు,గంగిరెద్దులవాళ్ళు,బుడబుక్కలవాళ్లు,కాబూలివాళ్ళు వస్తే వాళ్లకు బియ్యం వెయ్యటానికి....మాచెల్లెళ్లలతోపోటిపడటం ,అరిసెలు వండుతుంటే...బెల్లం పాకం కోసం...ప్లేట్ లోనీళ్ళు పోసుకుని ఎదురు చూడటం,చలిమిడి కోసం...నాకు ముందు అంటే నాకు ముందు అని గోల చెయ్యటం,వండిన అరిసెలను గడ్డి పై ఆరబెట్టటానికిపరుగులు పెట్టటం,  
పరుగులుపెడుతూనే,ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది అన్న అమ్మమ్మ మాటలు లెక్కచేయకుండా  అందులో కొన్ని అరిసెలను స్వాహా చెయ్యటం, ధాన్యపుబస్తాలనే ప్లే గ్రౌండ్ గాచేసుకుని ఆటలుఆడటం,భోగి మంటలు .....అవిఅన్నీ గుర్తుకు వస్తే,ఆదిత్య 369సినిమా లో లాగా టైం మెషీన్ ఒకటి దొరికి అప్పటి రోజులలోకి వెళ్ళిపోయి అలాగే ఉండిపోవాలని ఉంది.

Wednesday, 17 November 2010

నిక్ నేమ్స్

ఇవాళ ఎందుకో అకస్మాత్తుగా మా కాలేజ్ ఫ్రెండ్స్,లెక్చరర్స్,మేము వాళ్లకు పెట్టిన నిక్ నేమ్స్  గుర్తొచ్చాయి.జీవితంలో ప్రతి ఒక్కరూ,ఎప్పుడో ఒకప్పుడు ,ఎవరికో ఒకరికి,సరదా గానో,కోపం తోనో నిక్ నేమ్ పెట్టని వారు ఉండరేమో కదా?
మా కెమిస్ట్రీ మేడంకు -బి.పి.మేడం....మా కెమిస్ట్రీ మేడం చాలా సాఫ్ట్.చాలా నెమ్మది గా మాట్లాడే వారు.కానీ ఉన్నట్టుండి ఏమయ్యేదో తెలియదు గానీ ,ఒక్కసారే పూనకం వచ్చినట్లు పెద్ద,పెద్దగా అరిచేసేవారు.అందుకని ఆ పేరు.
ప్లాంట్ పాథాలజీ సర్ కు-చార్కోల్ రాట్....ఈ పేరు ఆయన టీచ్ చేసే సబ్జెక్టు కు రిలేటెడ్.ఆయన చాలా నల్లగా ఉండేవారు.అందుకని ఆ పేరు  పెట్టాము.
(చార్కోల్ రాట్ వ్యాధి వచ్చిన మొక్క,వ్రేళ్ళు,ఆకులు,కాయలు,పళ్ళు,ఏ భాగం అఫెక్ట్ అయితే ఆ భాగం నల్లగా చార్కోల్ లాగా అవుతుంది.)
ఎంటమాలజి సర్ కు-ఇన్ సెక్ట్....ఇది కూడా సబ్జెక్టు కు రిలేటెడ్.సర్, పొట్టిగా చాలా సన్నగా గాలి వీస్తే పడిపోయేలాగా ఉండేవారు.
ఇంగ్లిష్ మేడం కు -చైనీ డాల్ ...
బొద్దుగా,ముద్దుగా చైనీయుల పోలికలతో,బొమ్మ  లా ఉండేవారు.
హాస్టల్ వార్డన్ సిస్టర్ మెర్సీ కు-సాడిస్ట్,డెవిల్.....నేతిబీరకాయ లో నెయ్యి ఎంతో సిస్టర్ మెర్సీ లో మెర్సీ అంత.అసలు జాలి,దయ అనే మాటలకు అర్ధం తెలియదు ఆమెకు.అరటికాయ తొక్కల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయని ,ఆ తొక్కల తో కూర వండించి హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ తో తిన్పించిన ఘనత ఆమెది.
 క్లాస్మేట్ డేవిస్- టిక్రో(తమిల్నాడ్ కాకి)నల్లగా ,ముక్కు కాకి ముక్కులా షార్ప్ గా ఉండేది.
మా క్లాస్ లో వివేకానంద పేరు గల వాళ్ళు  ఇద్దరు ఉండేవారు.అందులో ఒకరు లావుగా,1984ఒలింపిక్స్ మస్కట్ అప్పు లాగా ఉండేవాడు.అందుకని అతనికి అప్పు అని పేరు.రెండో అతను ఎప్పుడూ కళ్ళు ఆర్పుతూ ఉండేవాడు.అతనికి బ్లింక్ అని పేరు పెట్టాము.కానీ తరువాత అదొక జబ్బు అని,నర్వస్ వీక్నేస్స్ వల్ల అని తెలిసి అలా పిలవటం మానివేసాము.
మా ప్రిన్సిపాల్ గారు మా క్లాస్ వాళ్ళందరికీ కలిపి ఇచ్చిన బిరుదు-రౌడీ బ్యాచ్ అని.

Tuesday, 3 August 2010

చిన్ననాటి తీపి గురుతులు

నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.అసలు పేరు తో ఎవరూ పిలిచేవారు కాదు.అందరూ మా స్కూల్ ను  రైలు కట్ట బడి అని పిలిచేవారు.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన డబ్బులు (5,10పైసల నాణాలు) ఉంటే డబ్బులు లేకపోతే పిన్నీసులు పెట్టె వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయిన వాటిని తీసుకుని సంబరపడేవాళ్ళం.రైలు వచ్చి ఆగిన తరువాత ఇంజిన్ దగ్గరకు వెళ్లి,డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు.వాళ్ళను  గ్రీజ్ అడిగే వాళ్ళం.డ్రైవర్ వెళ్ళండి అని అరిచే వాడు కానీ ,వేరే అతను ఒకళ్లిద్దరికి గ్రీజ్ ఇచ్చి ,ఇక వెళ్ళండి,రైలు కదులుతుంది అని పంపించేసేవాడు.ఆ ఇచ్చిన గ్రీజ్ ను తలా కొంచం పంచుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం.అంతకు ముందు మా ఇంట్లో కొట్టుడు పంపు పాడయినప్పుడు  బాగు చేయటానికి వచ్చినతను ,పంపు బాగుచేసినాక నట్టులకి గ్రీజ్ రాయటం చూసాను.గ్రీజ్ రాస్తే పంపు పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యం తో నేను ఇంటికి వెళ్ళగానే ,గ్రీజ్ ను పంపు కు నట్టు కనిపించిన చోటల్లా రాసాను.ఈ క్రమం లో గ్రీజ్ ,పంపు కే కాకుండా ,నా బట్టలకు,వంటికి కూడా అంటింది.పాపం ఇప్పటి వాళ్లకు తెలిసినట్లు గా ......మరక మంచిదేనని అప్పటి వాళ్లకు తెలియదు గా ! అందుకని మా అమ్మమ్మ బట్టలతో పాటూ నన్నూ ఉతికి ఆరవేసేది.

Sunday, 25 July 2010

Foodles


నిన్న మా అమ్మాయి స్కూల్లో ఇచ్చారని foodlesప్యాకెట్ ఒకటి తీసుకు వచ్చింది. సేమ్, నూడుల్స్   లాగానే ఉన్నాయి.కాకపొతే నూడుల్స్ ని గోధుమ పిండి తో తయారు చేస్తే ఈ ఫూడుల్స్ ని గోధుమ పిండి,వరిపిండి,రాగి,మొక్కజొన్న పిండులతో తయారు చేశారు.ఆ ప్యాకెట్ ని చూడగానే నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది.నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ,మా స్కూల్ లో maggiపాకెట్స్ ఇచ్చారు.ఒక్కో స్టూడెంట్ కు రెండు పాకెట్స్ ఇచ్చారు.వాటిని ఇంటికి తీసుకు వెళ్లి మా అమ్మ కు ఇస్తే ,వాటిని ఎలా వండాలో నాకు తెలియదు అంది.ప్యాకెట్ మీద ఎలా తయారు చేయాలో రాసి ఉంది ,నేను వండుతాను అని ఎంతో శ్రద్దగా చదివి నూడుల్స్ ను వండాను.చిన్న బౌల్స్ లో సర్ది అందరి కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను.మాకు ఎవరికి నూడుల్స్ నచ్చలేదు.అందరం ఒక స్పూన్ కంటే ఎక్కువ తినలేకపోయాము.అంతా బయటికి తీసుకు వెళ్లి పారవేసాము.సరే నేను తెచ్చిన రెండు పాకెట్స్ వండి అలా పారబోసాము.మా తమ్ముడు కిచ్చిన రెండు పాకెట్స్ ని ఏమి చెయ్యాలా అని ఆలోచించి ,సేమియా లాగానే ఉన్నాయి కాబట్టి పాయసం చేసుకుందాము అని మా అమ్మకు సలహా ఇచ్చాను.మా అమ్మ నూడుల్స్ తో పాయసం చేసింది.సేమియా పాయసం లాగా టేస్ట్ గా లేకపోయినా,తియ్యగా ఉంది కాబట్టి ఎలాగో అలాగా బలవంతాన తాగేసాము.అప్పుడు,అసలు తినటానికి ఇష్టపడని వాళ్లము ...ఇప్పుడు ఎంతో ఇష్టం గా తింటున్నాము.ఇడ్లి,దోశ చేస్తే వాటిల్లోకి చట్ని చేయాలి.చపాతీ నో ,పూరి నో అయితే కూర వండాలి.ఈ బాధ లేమి లేకుండా ,నూడుల్స్ అయితే రెండు నిమిషాల లో చేసేసుకోవచ్చు.మనమే చేయాలని లేదు.పిల్లలయినా తయారు చేసేసుకోవచ్చు.నేను నెలవారీ సరకులు తెచ్చేటప్పుడే ,రెండు డజన్లు నూడుల్స్ పాకెట్స్ తీసుకు వస్తాను.వంట చేయటానికి బద్దకించి నప్పుడు  నూడుల్స్  జిందాబాద్.ఫూడుల్స్ ,నూడుల్స్  అంత టేస్ట్ గా లేకపోయినా పరవాలేదు,తినొచ్చు.

Tuesday, 13 July 2010

విందుభోజనం

ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు.చదివినాక నిజంగా జరిగిందా అని కూడా అనిపించవచ్చు.ఎవరైనా నాకు చెప్పితే నేను నమ్మేదాన్ని కాదేమో కానీ ,ఆ పరిస్థితి నాకే ఎదురైంది కాబట్టి ,ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మక తప్పటం లేదు.
మేము అద్దె కుండే ఇంట్లో మొత్తం నాలుగు పోర్షన్ లు ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు,ఫస్ట్ ఫ్లోర్ లో రెండు.గ్రౌండ్ ఫ్లోర్ లో,సునీత,వాణి వాళ్ళు అద్దె కుంటే , ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్ ,ఇంకొక దాంట్లో మేము ఉండేవాళ్ళము.సునీత వాళ్ళది ప్రేమ వివాహం.పెళ్ళికి పెద్ద వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ,అంతస్తుల తేడా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ వాళ్లకు,అత్తగారి వాళ్లకు సరిపడేది కాదు.వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు
వాళ్ళ అత్తగారు వాళ్ళు,వీళ్ళ ఇంటికివచ్చేవారుకాదు. అలాగేవాళ్ళ అమ్మావాళ్ళు ఉన్నప్పుడు అత్తగారువాళ్ళువచ్చేవారుకాదు.సునీతవాళ్ళపాపకు ఆరో నెల .అన్నప్రాసన చేయటానికి మంచిరోజు చూసుకున్నారు.
మా కాంపౌండ్ లో వారిని,పక్కింటి వారిని మాత్రమే పిలుస్తున్నానని చెప్పింది. ఏమన్నా గొడవ జరిగితే బాగోదుఅని ఎక్కువ మందిని పిలవటం లేదని చెప్పింది. సరే అన్నప్రాసనకు వెళ్ళాము.

ఆ కార్యక్రమం అవగానే పాపను నిద్ర పుచ్చటానికని సునీత ,వెనకాలే వాళ్ళ అమ్మ,అత్తగారు,వాళ్ళ తరపు బంధువులు అందరూ లోనికి వెళ్లారు. గెస్ట్ లం హాల్ లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.కడుపు లో ఎలుకలు పరిగెత్తే వరకు ఎవరికీ భోజనం సంగతి గుర్తుకు రాలేదు.టైం చూస్తే ఒకటిన్నర అయ్యింది.ఏమిటి ,వీళ్ళు ఇంకా భోజనానికి పిలవలేదు,నేను లోనికి వెళ్లి కనుక్కొని వస్తాను ఉండండి అని మా ఇంటి ఓనర్ గారు లోనికి వెళ్ళారు.విషయం ఏమిటంటే.........పాతిక,ముప్పై మందికంటే ఎక్కువ అవరు కదా ,ఇంట్లో నే వంట చేయోచ్చు లే అనుకుందట సునీత.అయితే వాళ్ళ అమ్మ ఏమో,నేను వంట చేస్తే మీ అత్తగారు వాళ్ళు కూర్చొని తింటారా?నేను చేయను అందట.వాళ్ళ అత్తగారు ఏమో అమ్మాయి తరపు వాళ్ళు,మీరు చేయకపోతే,మేము చేస్తామా?మేము చేయం అందట.ఎంత బతిమాలినా ఇద్దరు ససేమిరా అని మొండికేసారంట .నేను డయాబెటిక్ ని.నెమ్మదిగా తల నెప్పి స్టార్ట్ అయ్యింది.వాళ్ళు ఎప్పుడు రాజీకొస్తారో,ఏమిటో నండీ,నేను ఇంటికివెళ్లి ఏమన్నా లేకపోతే పడిపోయే లాగున్నాను అని అక్కడనుంచి వచ్చేసాను.మా పిల్లలిద్దరికి బాక్స్ లో పెట్టగ మిగిలిన అన్నం కొంచం ఉంటె అది తిన్నాను.(భోజనానికి వెళుతున్నాను కదా అని నాకు వండుకోలేదు)రెండు అయ్యింది.శివయ్య సీరియల్ చూద్దామని టి.వి.పెట్టాను.ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.ఎవరా అని చూస్తే మా ఇంటి ఓనర్.వాళ్ళు ఎవరూ కదిలే లాగా లేరండి.వాణి గారు మనమే చేద్దాం అన్నారు ,మీరు కూడా రండి అని పిలిచారు.కుక్కరు, బాండి,కత్తిపీట తీసుకు రండి,నేను కూడా మావి తీసుకు వెళుతున్నాను అన్నారు.వంట చేయటం అంటే నాకు పరమ చిరాకు.ఇంట్లో తప్పదు కాబట్టి ,ఎలాగో వండాను అనిపిస్తాను.ఇప్పుడు హాయిగా సీరియల్ చూద్దామనుకుంటే ,ఇదేమి కర్మరా బాబు అనుకుంటూ ,ఆవిడ చెప్పిన సరంజామా అంతా తీసుకుని వెళ్ళాను.మొత్తానికి వంట చేసి ,గెస్ట్ లు మయిన మేము హోస్ట్ లు గా మారి,మా హోస్ట్ లకు ముందు వడ్డించి ,వారు తిన్న తరువాత ,మేము కూడా తిని ఇంటికి చేరాము.

Wednesday, 9 June 2010

పేరు తో తంటాలు

పేరు లో నేముంది టపాలు చదివాకా నాకు కూడా నా పేరు వల్ల పడ్డ ఇబ్బందులు రాయాలనిపించింది.మరీ చారి గారు పడినన్ని ఇబ్బందులు కాకపోయినా ,కొద్దో గొప్పో కష్టాలు పడ్డాను.
నాకు అనూరాధ అని పేరు పెట్టినప్పుడు ,మా అమ్మ వాళ్ళ వదిన ,అనూరాధ ఏంటి?మనోబాధ లాగా!అయినా నక్షత్రాల పేరు పెట్టుకుంటారా ఎవరైనా ? పేరు బాగోలేదు ,వేరే పేరు పెట్టమన్నారు అంట.కానీ మా అమ్మ కు ఆ పేరు బాగా నచ్చినందువల్ల,మరియు ఆ టైం లో అనూరాధ అనే పేరు హవా నడుస్తుండటం తో ఆ పేరే ఉంచేశారు.
నా పేరు తో మొట్టమొదటిసారి గా ఇబ్బంది ఎదురైంది.. నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదివేటప్పుడు.మా స్కూల్ లో ,స్కూల్ వదలటానికి గంట ముందు అన్ని క్లాస్ ల వాళ్ళని (1to5th )స్కూల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అందరి తో ఒకటి నుంచి ఇరవయ్ వరకు ఎక్కాలు,తెలుగు సంవత్సరాల పేర్లు,నెలల పేర్లు,నక్షత్రాల పేర్లు చెప్పించే వారు.అదేంటో తెలియదు కానీ ప్రతి రోజూ నక్షత్రాల పేర్లు చెప్పేటప్పుడే నా టర్న్ వచ్చేది.అదికూడా హస్త లేదా చిత్త నక్షత్రం దగ్గర నా ముందు వాళ్ళు ఆపితే అక్కడ నుంచి నేను కంటిన్యు చేయాల్సి వచ్చేది.విశాఖ వరకు బాగానే చెప్పేదాన్ని.ఆ తరవాతే నోరు పెగిలేది కాదు నా పేరు చెప్పటానికి.ఎప్పుడు చెపుతాన అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు చూసి ,పేరు చెప్పంగానే అందరూ పక్కున నవ్వే వాళ్ళు.ఇలా ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నన్ని రోజులు బాధ పడ్డాను.నేను నా పేరు పలకటానికి ఎందుకు మొహమాట పడ్డానో,వాళ్ళు ఎందుకు నవ్వేవాళ్ళో ,ఇప్పటికి నాకు అర్ధం కాదు. 

ఇక నేను 7th చదివేటప్పుడు ..మా క్లాస్ లో అనూరాధ పేరు తో ఎనిమిది మందిమి ఉండేవాళ్ళము.attendence పిలిచేటప్పుడు ఇంటి పేరు తో సహా పిలిచేవారు కాబట్టి ఇబ్బందేమీ ఉండేది కాదు.క్లాస్ లో అక్షింతలు వేసేప్పుడే .ఎవరిని తిడుతున్నారో తెలిసేది కాదు.మనల్ని కాదులే అని ఇకిలించుకుంటా కూర్చుంటే ,తిడుతున్నా సిగ్గు లేదా ?ఇకిలిస్తున్నావు అని extra అక్షింతలు.మనల్నే తిడుతున్నారేమో అని లోకంలోని విషా దాన్నంతా మన ఫేస్  లోనే కనబరిస్తే ,నిన్ను కాదు గా తిట్టేది నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అక్షింతలు.

8th క్లాస్ కు స్కూల్ మారాను.హైదరాబాద్ లో h .f .h .s లో జాయిన్ అయ్యాను.మొదటి రోజు క్లాస్ లో ,మా టీచర్.. అందరి పేర్లు పిలిచి రోల్ నంబర్స్ చెప్పింది.క్లాస్ అయిపోయి టీచర్ క్లాస్ నుంచి వెళ్ళటం ఆలస్యం ,నామీద ప్రశ్నల వర్షం కురిపించారు.
అల్లూరు సీతా రామ రాజు మీకు ఏమవుతారు?
అల్లూరు సీతా రామ రాజు  ది మీది ఒకే ఊరా?
అల్లూరు సీతా రామ రాజు అసలు ఫొటోస్ చూసావా?బుక్ లో ఉన్నట్లే ఉంటారా?
నాకేమీ అవరు .అయినా ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నారు?అన్నాను.
మీ ఇంటి పేరు కూడా అల్లూరు కదా,అందుకని మీ relative ఏమో అని అడుగుతున్నాము అని అన్నారు.మా ఇంటి పేరు అల్లూరు కాదు వల్లూరు అని చెప్పాను.అయినా వదలకుండా నువ్వు అబద్దం చెపుతున్నావు ,టీచర్ నీ పేరు పిలిచినప్పుడు విన్నాము అని కొంచం సేపు వాదించి వదిలేసారు.ఎందుకయినా మంచిది అని ,రిజిస్టర్ లో నా పేరు
 వి .అనూరాధ గా మార్పించేసుకున్నాను.
ఆ తరువాత graduation అయిపోయేంతవరకు ఏ సమస్య లేదు.నేను స్కూల్ లో వర్క్ చేసేటప్పుడు  మళ్లీ...గవర్నమెంట్ స్కూల్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యి మళ్లీ మా స్కూల్ లో తెలుగు టీచర్ గా జాయిన్ అయ్యారు.అందరిని పరిచయం చేసుకుంటున్నారు.నేను నా పేరు అనూరాధ అని చెప్పాను.అనూ... ఏమనాలి?రాధా...నీకు ఏమి రాదా ?అయితే పిల్లలకు పాఠాలు ఎలా చెపుతున్నావు అమ్మాయ్? అని ఏమనకోకు అమ్మాయ్ ,నీ కంటే పెద్దవాడిని ,సరదాగా అన్నాను.సీరియస్ గా తీసుకోకు అన్నారు.ఇంతటితో నా పేరు తో తంటాలు సమాప్తం.