Wednesday, 31 July 2013

వెలలేని ఆభరణాలు ,బొమ్మలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసి దిగులు ఒక పక్క.జోరున వర్షం ఇంకో పక్క . విపరీతమైన చిరాకు ,ఏ పని చెయ్యాలనిపించటం లేదు.బాల్కనీ లో నుంచొని అలా వర్షాన్ని చూస్తూ ఉంటే ,రాలి పడిన కొబ్బరి మట్ట ఒకటి కనిపించింది . దాన్ని చూస్తే ,చిన్నప్పుడు ఆడిన ఆటలు జ్ఞాపకానికి వచ్చాయి.

కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి ఆ బొమ్మలకు అలంకరణ చేసి ఆ బొమ్మలకు పెళ్లి చేసే వాళ్ళం :)
అలంకరణకు బట్టలు - వూళ్ళో ఉన్న ఏకైక దర్జీ ,బాజీ గారి ని అడిగి తెచ్చే వాళ్ళం.సరే మరి పెళ్లి జరిపించే వాళ్లకు ఆభరణాలు కావొద్దూ! వాచీ ,ఉంగరం కొబ్బరి ఆకులతో చేసుకొనేవాళ్ళం.మరి ఆ బొమ్మలు ,ఆభరణాలు ఎలా ఉంటాయో చూడాలని ఉందా?అయితే చూడండి ... 
          Tuesday, 23 July 2013

ఏమిటి ఈ లోకం

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి ,ఆ పాట విన్నప్పుడు అబ్బా నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండేది అనుకునేదాన్ని. చిన్నతనం కదా,లోకం పోకడ అంత తెలియనప్పుడు అన్నమాట.రామాయణం లో లక్ష్మణ ,భరతుల గురించి విన్నప్పుడు  ఆహా ,ఆ తమ్ముళ్ళకు అన్న అంటే ఎంత ప్రేమ అనిపించేది.అలా సినిమాల్లో అన్న దమ్ముల  ప్రేమ ని  చూసి నిజ జీవితం లో కూడా అలాగే ఉంటారేమో అనుకునేదాన్ని. 
కొద్ది కొద్ది గా లోకజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ,ఆ సినిమాల్లో చూపించేది అంతా పెద్ద ట్రాష్ అని ... 
అనుబంధం ,ఆత్మీయత అంతా ఒక బూటకం,ఆత్మతృప్తి కై మనుషులు ఆడుకునే నాటకం అని తాత మనవడు సినిమా లో పాట విని  అదే నిజం అని తెలుసుకున్నాను.  ఇక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కొటేషన్స్ అయితే చెప్పక్కరలేదు.If you love your brother/sister/mother/father/daughter   share this అంటూ.అలాగే స్నేహితుల గురించి . స్నేహితులు లేని జీవితం వృధా ,బ్లా  బ్లా బ్లా 
సరే ,ఇప్పుడు ఈ ఉపోద్గాతమంతా ఎందుకు అంటే , ... 

మూడు నెలల క్రితం మా తమ్ముడి వాళ్ళ ఇంట్లో   ఒక ఫంక్షన్ జరిగింది.ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళలో ఒక పాప తన ముద్దు ముద్దు మాటల తో అందరిని ఆకట్టుకుంది.5 లేక 6 ఏళ్ళు ఉండొచ్చు.మాటల పోగు అయినప్పటికీ ,తన పేరు ఏమిటో తనతో ఎవరమూ చెప్పించలేక పోయాము.మళ్ళీ ఆ పాపను ఈ విధం గా గుర్తు చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు.ఆ పాప వాళ్ళ నాన్న,పెదనాన్న ఇద్దరూ పంచాయతీ  ఎలెక్షన్స్ లో పోటీ చేస్తున్నారు.ఇద్దరూ చెరొక పార్టీ .ప్రచారం చేసేప్పుడు ఇద్దరికీ గొడవ జరిగింది.ఆ గొడవ లో అన్న తమ్ముడిని చంపేసాడు.ఈ విషయం విన్న దగ్గర్నుంచి ఎంతో బాధ అనిపిస్తుంది.అంత చిన్న వయసులో ఆ పాప తండ్రిని కోల్పోవటం ,అదీ తన పెదనాన్న చేతి లో .   :(

           


  

Wednesday, 10 July 2013

స్వేచ్ఛ

స్వేచ్ఛ అంటే ఏమిటి ? అసలు భూమి మీద ఎవరికైనా పూర్తి స్వేచ్ఛ ఉంటుందా ?
అబ్బా పిల్లల పని హాయి. ఏ బాధ్యతలు ఉండవు ,హ్యాపీ గా ఉండొచ్చు అనుకుంటాము. కాని వాళ్ళ బాధలు వాళ్ళవి. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండాలనే ఉంటుంది ,చదువు పెద్ద గుదిబండ లా తోస్తుంది.హాయిగా ఆడుకుందామంటే ,ఈ హోం వర్క్,పరీక్షలు అంటూ అమ్మ ఆడుకోనివ్వదు అనుకుంటారు . 

ఆకాశం లో ఎగిరే పక్షులు ,అడవి లో తిరిగే జంతువులు ... వాటికి ఎంత స్వేచ్ఛ అనుకోకుండా ఎవరు ఉండరేమో . అదొక మిస్ కాన్సేప్షన్.స్వేచ్ఛ అనేది  ఏ జీవికైనా కొన్ని పరిమితులకు లోబడే అన్నది పచ్చి నిజం. 

ఆకాశం లో స్వేచ్ఛ గానే ఎగురుతుంది పక్షి . కాని ఎప్పుడు ఏ వేటగాడు దాని ప్రాణాన్ని హరిస్తాడో తెలియదు . నాకు స్వేచ్ఛ ఉంది,నేను ఇక్కడే కదలకుండా ఉంటాను అని జింక   ఏ సింహమో ,పులో వస్తున్నా అలాగే ఉంటే  వాటికి ఆహారం అవ్వక తప్పదు.

నిప్పు కాలుతుంది అని తెలుసు,అందుకే దాన్ని ముట్టుకోము.నిప్పును ముట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా అనుకోము కదా !మనకు ఏదైనా మంచిది కాదు ప్రమాదం అని తెల్సినప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే విజ్ఞత.అలా కాకుండా నాకు ఏదైనా చేసే స్వేచ్ఛఉంది,నేను నాకిష్టమొచ్చినట్టు ఉంటాను అనుకుంటే దాని ద్వారా ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కూడా సిద్ధం గా ఉండాలి .  

మానవ జీవితం లోని ఏ దశ లోనూ స్వేచ్ఛ లేదని చెప్పే ఈ పద్యం డా. వానమామలై గారు రచించిన 'సూక్తి వైజయంతి' నుంచి ...


బాల్యమొక పంజరపు చిల్క ,పర్వులెత్తు 
జవ్వనము పాలపొంగు ,ముసలితనమ్ము 
పాటిదప్పిన కొలబ్రద్ద ,భయద మృతియె 
కాచుకొని యున్న పులి,బందెకాన బ్రతుకు.