Showing posts with label రెసిపి. Show all posts
Showing posts with label రెసిపి. Show all posts

Wednesday, 20 June 2018

స్వీట్ కార్న్ ,రాజ్మా అడై


 ఆరోగ్యకరమైన అల్పాహారం 

కావాల్సిన పదార్ధాలు :
  • బియ్యం  – 1 కప్పు 
  • స్వీట్ కార్న్ – 1 కప్పు 
  • రాజ్మా  – 1/2 కప్పు 
  • శనగపప్పు  – 1/2 కప్పు 
  • పెసరపప్పు  – 1/4 కప్పు 
  • కరివేపాకు   – 2 రెబ్బలు 
  • ఇంగువ  – 1/4 టీ స్పూను 
  • ఎండుమిరపకాయలు  – 5
  • ఉప్పు తగినంత  




తయారు చేసే విధానం :


బియ్యం,శనగపప్పు,రాజ్మా,పెసరపప్పు ను నాలుగు గంటలు నానపెట్టుకోవాలి  
నీరు వంపేసి, కరివేపాకు ఎండుమిరపకాయలు వేసి గ్రైండ్ చేసుకోవాలి 
రుబ్బిన పిండిలో ఉప్పు, ఇంగువ వేసి కలుపుకోవాలి 
రుబ్బిన పిండిని రెండు మూడు గంటల తర్వాత వాడుకోవచ్చు 
బెల్లం తో గానీ కొబ్బరి చట్నీ తో గానీ 
 వేడి వేడిగా తింటే బాగుంటుంది.  




Saturday, 30 July 2016

ఓట్స్ ఇడ్లీ





పప్పు నానబెట్టుకోవటం , కడిగి రుబ్బుకోవటం లాంటి జంజాటాలు లేకుండా ,చాలా త్వరగా చేసుకునే అల్పాహారం. రుచికి రుచి .ఆరోగ్యానికి ఆరోగ్యం . ముఖ్యం గా మధుమేహం తో బాధ పడేవారికి ...  

కావాల్సిన పదార్ధాలు :

ఓట్స్  :  కప్పు

ఉప్మా రవ్వ  : 1/2 కప్పు

పెరుగు  : 1/2 కప్పు 

పచ్చి మిరప కాయలు - 2

అల్లం తురుము : 1/2 స్పూన్ 

ఉప్పు : తగినంత 

తాలింపు కి   : నూనె ,శనగ పప్పు , ఆవాలు, జీలకర్ర ,కరివేపాకు 

చేయు విధానం : 

ఓట్స్ ,రవ్వ  విడివిడిగా నూనె వెయ్యకుండా వేయించుకోవాలి . బాండీ (బాణలి ) లో నూనె వేసుకుని , వేడెక్కగానే తిరగమాత దినుసులు వేసి అందులోనే పచ్చి మిరప కాయ ముక్కలు ,అల్లం తురుము వెయ్యాలి . పెరుగు లో ఉప్పు వేసుకుని అందులో వేయించిన ఓట్స్ ,రవ్వ , తాలింపు వేసి కలుపుకోవాలి . గట్టిగా ఉంటె కొద్దిగా నీరు పోసుకుని పలుచన చెయ్యాలి . ఇడ్లి ప్లేట్స్ లో పిండి వేసి కుక్కర్ లో (విజిల్ పెట్టకూడదు )10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించాలి . ఈ కొలతలకు 10 -12 ఇడ్లి లు తయారు అవుతాయి . కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీ తో తినొచ్చు . 


Tuesday, 8 March 2016

ఓట్స్ చీల

రోజూ ఒకటే టైపు బ్రేక్ ఫాస్ట్ తిని తిని బోర్ అనిపిస్తుందా ?మీ కోసం  ఒక  హెల్తీ   బ్రేక్ ఫాస్ట్. ఇడ్లీ ,దోసలకు పట్టినట్టు ముందు రోజే పిండి పట్టి ఉంచుకోవక్కరలేదు. చాలా తక్కువ సమయం లో 
తయారు చేసుకోవచ్చు . 




కావలసిన పదార్ధాలు : 

ఓట్స్ - 1 కప్ (పొడి చేసుకోవాలి )
శనగ పిండి - 1/2  కప్
ఉప్పు,పసుపు,కారం - తగినంత
వాము - చిటికెడు
పచ్చి మిరపకాయ - 1 (సన్నగా తరగాలి )
తరిగిన అల్లం - 1/2 టీ స్పూన్
కొత్తిమీర -చిన్న కట్ట
ఉల్లిపాయ ముక్కలు - గుప్పెడు
తురిమిన క్యారెట్ - 3 టేబిల్ స్పూన్లు
టొమేటో ముక్కలు - 3 టేబిల్ స్పూన్లు
క్యాప్సికం ముక్కలు -  3 టేబిల్ స్పూన్లు 
నూనె 

అన్నిటిని ఒక గిన్నెలో వేసి తగినంత నీరు పోసి  కలుపుకోవాలి. పెనం పైన ,దోశ లా వేసి కాల్చుకోవాలి . అల్లం చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు లేదా వేడి వేడి గా అలానే తినొచ్చు 
చాలా ఈజీ కదా ... 




Thursday, 5 December 2013

మేథి తెప్లా



కావలసినవి :

గోధుమ పిండి : 4 గుప్పిళ్ళు లేదా 150 గ్రాములు 
మెంతి కూర : ఒక కట్ట 
కొత్తిమీర : సగం  కట్ట 
అల్లం : చిన్న ముక్క 
పచ్చిమిర్చి : 2
జీలకర్ర పొడి : పావు స్పూన్ 
పెరుగు : చిన్న కప్పు 
బెల్లం (పొడి చేసినది) : సగం కప్పు 
నూనె :రెండు టేబిల్ స్పూన్స్
ఉప్పు : తగినంత 

చేసే పద్ధతి :
మెంతి కూర,కొత్తిమీర ఆకులు సన్నగా తరుక్కోవాలి.
పెరుగు లో బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
గోధుమ పిండి లో ఉప్పు,నూనె,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,మెంతి కొత్తిమీర ఆకులు , జీలకర్ర పొడి వేసి బెల్లం కలిపిన పెరుగు తో కలపాలి.   
ఈ పిండిని ముద్దలు గా చేసుకుని ,చపాతీ ల్లా వత్తి పెనం మీద కాల్చుకోవాలి.
ఇది గుజరాతీయులు చేసుకునే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం.   
 
 


Tuesday, 13 December 2011

సాంబారు పొడి కాదు....సంబారు కారం

చాలా మందికి సంబారు కారం అంటే తెలియదు,సాంబారు పొడి గా పొరబడుతుండటం తో ఈ పోస్ట్ రాయాల్సి వచ్చింది.(ఈ పోస్ట్ ఎందుకు రాశావ్ అని ఎవరూ అడగరను కోండి,ఊరికే చెప్పాలనిపించిది)

కావాల్సినవి:
ఎండు మిరపకాయలు -1 kg
జీలకర్ర -2 గిద్దలు (1/4 kg)
మెంతులు -గిద్ద (125 gms)
ధనియాలు -3 గిద్దలు (375gms)
కళ్లుప్పు - 5 గిద్దలు (625gms)
చిన్నుల్లి పాయలు(వెల్లుల్లి)-1/4 kg
ఆముదం -100gms  Optional 

ముందుగా ఎండు మిరపకాయల్ని తొడిమలు తీసి మంచి ఎండలో (పిచ్చి ఎండ కూడా ఉంటుందా అనే పిచ్చి ప్రశ్నలు వేయకండి,నాకు తెలుసు మీరందరూ చాలా మంచి వారని,అలాంటి పిచ్చి ప్రశ్నలు వేయరని.ఏదో ముందు జాగ్రత్తగా చెప్పాను.)ఎండ పెట్టండి.జీలకర్ర,మెంతులు,ధనియాలు కూడా ఎండపెట్టండి.

ఆ తరువాత జీలకర్ర,మెంతులు,ధనియాల ని విడి విడిగా కమ్మని వాసన వచ్చేవరకు బాణలి లో వేయించుకోండి.(నూనె వెయ్యకుండా)ఉప్పు ను కూడా డార్క్ గ్రే కలరు వచ్చేవరకు వేయించండి.

వేయించుకున్నారా?ఇప్పుడు అన్నిటిని కలిపి మిరపకాయల తో పాటు రోటిలో వేసి దంచండి. అవి మెదిగాక, చివరికి చిన్నుల్లి పాయలు వేసి దంచి ఆముదం వేసి కలుపుకోవాలి.గ్రైండ్ చేసేటట్లయితే మరీ మెత్తగా కాకుండా కొంచం బరక గా ఉండేలా గ్రైండ్ చేసుకోండి.

కారం తయారు చేసుకోవటం అయిపోయింది.ఇక దీన్ని ఎలా వాడాలి అంటారా?వేపుడు కూరల్లో తప్పించి అన్ని కూరల్లో వేయొచ్చు.

ఈ కారం లో నెయ్యి వేసుకుని ఇడ్లి,దోశ,ఆయ కుడుములు నంజుకుని తినొచ్చు.అన్నం లోకి ముద్దపప్పు ,సంబారు కారం,నెయ్యి వేసుకుని తినొచ్చు.

మరి ఇక ఆలస్యం ఎందుకు?మీరు కూడా సంబారు కారం తయారు చేసుకుని ,ఉపయోగించి మీకు నచ్చిందో లేదో తెలియ చేయండి.