Showing posts with label కబుర్లు. Show all posts
Showing posts with label కబుర్లు. Show all posts

Wednesday, 23 October 2024

అండమాన్ ప్రయాణం

అక్టోబర్ 8 , చెన్నై నుంచి పోర్టుబ్లెయిర్ కి ప్రయాణం. సాయంత్రం 4గంటల ప్రాంతం లో చేరుకున్నాము. రూమ్ కి వెళ్లి ఫ్రెషప్ అయ్యి నగరం లో ఆలా ఒక రౌండ్ వేసి వచ్చాము. 

మేము బస చేసిన దగ్గరలోనే 1943  పార్క్( flag point ) ఉంది. 

మొట్టమొదటి సారిగా సుభాష్ చంద్రబోస్ ఇక్కడ మువ్వన్నెల పతాకం ఎగరవేశారు. అండమాన్ & నికోబార్ బ్రిటిష్ నుంచి స్వాతంత్య్రం పొందిందని డిక్లేర్ చేసారు. బ్రిటిషర్లు అండమాన్  వదిలి వెళ్లినాక జండా ఎగర వేశారు. తిరిగి అక్టోబర్ 1945 లో బ్రిటిష్ అండమాన్ ను ఆక్రమించింది. 1947 వరకు వారి ఆధీనం లోనే ఉంది. 


 


 


Monday, 20 April 2020

మాహుర్ గడ్ - శ్రీక్షేత్ర (దత్తాత్రేయుని జన్మ స్థలం)


మాహుర్ లో ఒకే కొండ పైన మూడు దేవాలయాలు ఉన్నాయి. రేణుక, అనసూయ మరియు దత్తాత్రేయ.మొదటగా రేణుకాదేవి గుడి.గుడికి చేరుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కాలి.మెట్లకిరువైపున,మొదట్లో దుకాణాలున్నాయి. అమ్మవారికి సమర్పించుకోవటానికి,చీరలు, గాజులు,పూలు, ప్రసాదాలు అమ్ముతున్నారు.ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలపాకులు , వక్క ,సోంపు అమ్మవారికి ఇస్తున్నారు.వాటిని దంచి విగ్రహం నోటి భాగం లో ఆ ముద్దను పెట్టారు. వచ్చిన భక్తులకు అదే ప్రసాదం గా ఇస్తున్నారు.



ఈ గుడి నుంచి మాహుర్ కోట కనిపిస్తుంది. 


గుడి వెనక వైపు మెట్లు ఉన్నాయి.కిందకు దిగితే పరశురాముడి గుడి ఉంది. ఈ గుడికి వెళ్లే దారి పొడుగూతా కోతులు  గుంపులు గుంపులుగా ఉన్నాయి.





వాటిని చూస్తే కొంచం భయం అనిపించి వెనక్కు వెళ్ళి పోదాము అనుకున్నాము.మళ్లీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాము.


    

ఈ గుడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళటానికి మెట్లు, మట్టిబాట ఉంది. అక్కడకు వెళ్లకుండానే వెనక్కివచ్చేసాము.పరుశురాముడు తల్లి తల నరికిన తర్వాత ఆ కోనేట్లోనే స్నానం చేసాడంట. ఆలా అని అక్కడకు వచ్చిన ఒకరు చెప్పారు.


కోనేరు


ఈ గుడి నుంచి  కొండ పైకి వెళితే అనసూయ మాత దేవాలయం. దారి సరిగా లేదు అని డ్రైవర్ చెప్పటం తో మేము అక్కడకి వెళ్ళలేదు.పూర్తి గా కొండ పైన  దత్తాత్రేయుని దేవాలయం ఉంది. ఇది దత్తాత్రేయుని జన్మస్థలం అంట. మాఘపూర్ణిమ సందర్భం గా ఉత్సవం జరుగుతుందని , దానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మేము నాందేడ్ నుంచి వస్తుంటే జనం కాలి నడకన,మధ్య మధ్య లో నాట్యం చేస్తూ,దత్తాత్రేయని విగ్రహం/పటం  పల్లకీ లో,ఇతర వాహనాల లో పెట్టుకుని  వస్తున్నారు.అలా నడుస్తూ వాళ్ళు సరిగ్గా పౌర్ణమికి దత్త శిఖరం చేరుకుంటారట.

    






మాకు తిరిగి సికిందరాబాద్ రావటానికి  ట్రైన్  రాత్రి 9:30 కి . ఇంకా చాలా టైం ఉండటం తో మాహుర్ నుంచి సహస్రకుండ్  జలపాతం దగ్గరకు వెళ్ళాము. చెపితే తప్పించి అది జలపాతం అని తెలిసే ఛాన్సే లేదు. అలా ఉంది :) ఇక్కడ కూడా కోతులు విపరీతం గా ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. చల్లటి గాలి ... కొద్దిసేపు అలా చుట్టూ  చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ, మాట్లాడుకుంటూ కాలం గడిపి, జలపాతానికి దగ్గరలోనే ఉన్న పాక హోటల్ లో టీ  తాగి , తిరిగి నాందేడ్ కి బయలు దేరాము.











Friday, 17 April 2020

మాహుర్యే ఏకవీరికా



ఫిబ్రవరి మొదటి వారం లో నాందేడ్ వెళ్ళాము.అప్పటికింకా కరోనా గురించి తెలియదు. నాందేడ్ లో గురుద్వారా చూసుకుని అక్కడ్నుంచి మాహుర్ వెళ్లాలని  అనుకున్నాము.6వ తారీఖు మధ్యాహ్నం 12:30 కి దేవగిరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరాము.సాయంకాలానికల్లా నాందేడ్ చేరుకున్నాము. అక్కడ్నుంచి ఆటో లో గురుద్వారా చేరాము.గురుద్వారా సొసైటీ వాళ్ళే నిర్వహించే యాత్రినివాస్ లో రూమ్ బుక్ చేసుకోవటానికి వెళ్తే, అక్కడివారు రూమ్ ఎక్కడికి పోదు, గురుద్వారా చూసి అక్కడ లంగర్ లో భోజనం చేసి రండి అని చెప్పటం తో మళ్ళి గురుద్వారా కి వచ్చి తీరిగ్గా అంతా కలదిరిగి ,9 గంటలకు భోజనం చేసి  యాత్రి నివాస్ చేరుకున్నాము. గురుద్వారా లైట్ల వెలుతురు  లో  చాలా అందం గా ఉంది. అక్కడ్నుంచి కదలాలనిపించలేదు . గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతమంతా ఎటు చూసినా సిక్కులే !మినీ పంజాబ్ అనిపించింది :)
గురుద్వారా వద్దే మరుసటి రోజు మాహుర్ వెళ్ళటానికి వెహికల్ మాట్లాడుకున్నాము. 





నాందేడ్ నుంచి మాహుర్ కు  మూడున్నర గంటల ప్రయాణం. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది 8వ శక్తి పీఠం.ఈ శక్తి పీఠం మాహుర్ కి 10 కిలోమీటర్ల దూరం లోనే హివరా గ్రామం లో ఉంది. మాహుర్ కి వెళ్ళటానికి ముందే డైవెర్షన్ తీసుకోవాలి. ఇక్కడ తెలుగు లో రాసిన బోర్డు చూసి ఆశ్చర్యం వేసింది.గుడిలో కూడా తెలుగు లోనే రాసి ఉంది. గుడి పక్కనే పెన్ గంగ (నది) ప్రవహిస్తుంది.గుడి చిన్నది. భక్తులు కూడా చాల తక్కువ మంది ఉన్నారు.దర్శనానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. 







       
అక్కడ్నుంచి మాహుర్ గడ్ రేణుక ఎల్లమ్మ గుడికి వెళ్ళాము. ఆ గుడి విశేషాలు ఇంకో పోస్ట్ లో ... 












Sunday, 29 September 2019

చాక్ అండ్ డస్టర్


చాలాకాలం గా మన సినిమాలలో టీచర్లను బఫూన్ ల లాగా చూపిస్తున్నారు. అందుకు భిన్నం గా టీచర్లను గొప్పగా చూపిస్తూ తీసిన చిత్రమే ఈ చాక్ అండ్ డస్టర్ . నాటకీయత పాలు కొంచం ఎక్కువైనా,కొద్దిపాటి లోపాలున్నా   అంతగా పట్టించుకోనక్కరలేదు. సినిమా అద్భుతం అని చెప్పను కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సెలెబ్రిటీ ల పుట్టినరోజులు గుర్తుంచుకుని మరీ విష్ చేస్తాము. గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్తాము  కానీ మనకు చదువు నేర్పించిన గురువును గుర్తు పెట్టుకుని  వారికి విషెస్ చెప్పము అని. నిజమే కదా ! సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే జరుపుకుంటాము.ఆ రోజైనా గురువులకు ఎంతమందిమి విష్ చేస్తాము ? ఈ సినిమా చూడాలని అనుకునేవారు కోసం లింక్ ఇస్తున్నాను. 





   

Tuesday, 25 June 2019

ప్రజా వేదిక



రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు కరకట్ట పొడవునా భారీ కట్టడాలు.నది కనిపించలేదు.నా చిన్నప్పుడు, తాతమ్మ వాళ్ళ ఊరు వెళితే తోట కెళ్ళినప్పుడు,తోట చివరికంటా వెళితే కట్ట - ఆ కట్ట ఎక్కితే కృష్ణా నది కనిపించేది. ఒక్కోసారి నీరు తక్కువున్నప్పుడు ఆ కట్ట దిగి ఇసుక లో ఆడి వచ్చేవాళ్ళం.కరకట్ట పక్కన కట్టిన అక్రమ కట్టడాలు అన్నీ ఇప్పటికిప్పుడు కట్టినవి కావు.గత పదేళ్ల నుంచి కడుతూనే ఉన్నారు.మరి అవి కట్టటానికి ఎవరు అనుమతులిచ్చారు?ఒకవేళ అనుమతి లేకుండా కట్టితే అప్పటి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది?సరే ఆతర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది?యాక్షన్ తీసుకోవటానికి, అక్కడ ఉన్న కట్టడాల్లో ఎక్కువ శాతం ఆశ్రమాలే !వాటిని కూల్చితే వారి భక్తులు ఊరుకుంటారా ? గత కొన్నేళ్లుగా ,హిందూ మతానికి ఏదో ముప్పు వాటిల్లుతుందని,మతాన్ని పరిరక్షించాలని స్లో పాయిజన్ టైపు లో ప్రజలలో ఒక భ్రమ కలిగించారు.ఆ భ్రమ లో నుంచి ఇప్పట్లో జనం బయటకు వచ్చే సూచనలు ఏమీ కనిపించటం లేదు.ప్రజావేదిక కూల్చివేతకు జగన్ తీసుకున్న నిర్ణయం లో తప్పు బట్టే అంశం ఏమీ లేదు. స్పీచ్ కూడా చాలా గొప్పగా ఉంది.కాకపోతే ఆచరణలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.ప్రజావేదిక ప్రభుత్వానికి చెందినది కావున వెంటనే కూల్చివెయ్యొచ్చు.మరి ఆశ్రమాలు,మిగతా ప్రైవేట్ కట్టడాల సంగతి ? అంత ఈజీ కాకపోవచ్చు.అన్ని కట్టడాలను కూల్చివెయ్యగలిగితే,నిజం గానే ఒక మంచి ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ కి లభించాడని సంబరపడొచ్చు.

ఇంకో విషయం ...

బకింగ్ హాం కెనాల్ - ఈ పేరు వినే ఉంటారు,(కాకినాడ నుంచి తమిళనాడు వరకు ,ఈ కెనాల్ ఉంది )విజయవాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతుంటే ,దారి పొడువుతా ,కాలాలతో సంబంధం లేకుండా ,నిండుగా నీళ్లతో ప్రవహిస్తూ కనిపించేది. అలాంటి కెనాల్ ఇప్పుడు చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది.ఇంతకు మునుపెన్నడూ కెనాల్ని ఆ విధంగా చూడలేదు.ఇది కూడా ఆక్రమణలకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఏవయినా నిర్మాణాలు జరిగి అవి పూర్తయ్యేంతవరుకు నిద్రపోవటమో,లేదా నిద్ర నటించడమో చేయకుండా ప్రభుత్వం త్వరగా మేలుకుని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది .


Wednesday, 20 February 2019

కేరళ -God's own country

గత సంవత్సరం మే నెలలో కేరళ వెళ్ళాము.అందరూ ఊదరగొట్టినంత అందంగా అయితే నాకనిపించలేదు.ఎక్కడయినా లంక గ్రామాలు,కొండ ప్రాంతాలు  ఎలా ఉంటాయో అలాగే ఉంది.అలాంటి పల్లెలను/ప్రాంతాలను ఎప్పుడూ చూడని వారికి కేరళ అద్భుతం గానే కనిపిస్తుంది.కుమిలీ లో ఒక రిసార్ట్ లో ఉన్నాము.అక్కడ  ఇంతకు  మునుపు  చూడని కొత్త మొక్కలు చూసాము.రిసార్ట్ చాలా అందం గా ఉంది.ఫుడ్ కూడా.
మేమున్న కాటేజ్ బాల్కనీ నుంచి వ్యూ బాగుంది.





కాటేజ్ కి వెళ్లే దారి 


మేమున్న కాటేజ్


మొదటి రోజు పెరియార్ లేక్ లో బోట్ రైడింగ్ చేసాము ... అడవి దున్నలు,జింకలు తప్ప వేరే జంతువులూ ఏమీ కనిపించలేదు.





మరుసటి రోజు సఫారీ కి వెళదాము అనుకున్నాము . కానీ ఆ రోజు జీపులు దొరకటం కష్టం అని చెప్పారు.గవి అడవి లో కొండ మీదున్న మంగళాదేవి గుడి ,సంవత్సరం లో ఒక్క రోజు (చైత్ర పౌర్ణమి )మాత్రమే తెరుస్తారు అంట.జీపులన్నీ అక్కడకే వెళతాయి,సఫారీ అంటే ఎవరూ రారు , మీరు చాలా లక్కీ ,సరైన సమయానికి వచ్చారు ,రేపు ఆ గుడికి వెళ్ళండి అని చెప్పారు. ఏమి చేస్తాం ? సరే అన్నాము .

ఆ విశేషాలు నెక్స్ట్ పోస్ట్ లో ...


  

Tuesday, 24 July 2018

Coir Museum (పీచు మ్యూజియం )Kalavoor (Alappuzha)

అలెప్పీ వెళితే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.ఎక్కువ మంది, పీచు మ్యూజియం - ఏముంటుందిలే చూడటానికి అనుకుని వెళ్లక పోవచ్చు.విషయాసక్తి ఉన్న వాళ్లకి తప్పకుండా నచ్చుతుంది . 

ఈ మ్యూజియం,కొబ్బరి పీచు పరిశ్రమ 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భం గా కాయిర్ బోర్డు కాంప్లెక్స్ లోనే 2014 లో కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ ప్రారంభించారు.ఈ సందర్భం గా భారత ప్రభుత్వం 60 రూపాయల నాణెం విడు దల చేసింది.



ఈ మ్యూజియం లో కొబ్బరి పీచు తో  చేసిన బొమ్మలు,పీచు తీసే యంత్రాలు,పీచు  నుంచి తాళ్లు ,కాళ్ళు తుడుచుకునే పట్టాలు తయారు చేసే యంత్రాలు ఉన్నాయి.కొబ్బరి పీచు తో చేసిన కొన్ని బొమ్మలు ...






















కనిపిస్తున్న ఇంటి నమూనా లో వాడిన తలుపులు, కిటికీ లు, గోడలు అన్నీ కొబ్బరి పీచు +ప్లై వుడ్  కాంబినేషన్ లో తయారయ్యాయి. ఇవి ఫైర్ మరియు వాటర్ ప్రూఫ్ అంట. బెంగళూరు కాయిర్ బోర్డు వారి దగ్గర మాత్రమే ప్రస్తుతం లభిస్తున్నాయి.

   
కొబ్బరికాయలు నుంచి పీచు - దాని నుంచి తాళ్లు,ఇతర వస్తువుల  తయారీ ప్రాసెస్ ... బొమ్మల తో .

మ్యూజియం చూసిన తర్వాత, దగ్గర లో ఉన్న మరారికులం బీచ్ కి వెళ్ళాము. బీచ్ కి వెళ్లే దారిలో మహాదేవ (శివుడు) గుడి ఉంది.బీచ్ నుంచి వస్తూ శివుడు ని దర్శించుకుని వచ్చాము.








Wednesday, 13 June 2018

Torch Ginger ...



అల్లం ... తెలియని/చూడని  వాళ్ళు ఉండరేమో ! ఆ మొక్కను ఎంతమంది చూసి ఉంటారో తెలియదు.అల్లపు మొక్కకి ,అల్లం జాతికి చెందిన ఇతర మొక్కలకి పూలు పూస్తాయన్న సంగతి తెలుసా ?వెయ్యి కి పైనే అల్లం జాతి మొక్కలు ఉన్నాయి.వాటిలో ఓ మూడు  రకాలు నేను చూసాను.ఆ మొక్కల పూల ఫోటోలు    మీ కోసం 

మొదటగా చూసింది - Costus pictus  (Painted spiral ginger) అప్పటికి అది అల్లం జాతి మొక్క అని తెలియదు.మా పిన్నికి తెలిసిన వారు, ఈ మొక్క ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని చెప్పి ఇచ్చారంట.ఆకులు పుల్లగా ఉన్నాయి.టేస్ట్ బాగుంది, తినొచ్చు అని అనుకున్నాము.మొక్క పేరు తెలియదు.ఆ తర్వాత అదే మొక్కను మా ఎదురింటి వాళ్ళింట్లో చూసాను.పేరు ఏమిటి అని అడిగితే, తెలియదు ఆకులు తింటే షుగర్ తగ్గుతుంది అని నా ఫ్రెండ్ ఇచ్చింది. వేరే ఎవరికైనా అయితే ఆవిడ ఒక మొక్కను 500 కి అమ్ముతుంది.ఆకులయితే ఒక్కో ఆకు 10రూపాయలకు అమ్ముతుంది. నాకు ఫ్రీ గా ఇచ్చారు అని చెప్పారు.ఆ తర్వాత కొద్ది రోజులకు పూలు పూశాయి ,వచ్చి చూడండి అని చెప్పారు.(వాళ్ళింట్లో ఏ మొక్కకు పూలు పూసినా అందర్నీ పిలిచి చూపించటం ఆవిడ అలవాటు) పూలు చాలా అందం గా ఉన్నాయని నేను ఫోటో తీసుకున్నాను. ఆ తర్వాత గూగుల్ ఇమేజ్ సర్చ్ లో కొన్ని రోజులు పాటు ప్రయత్నించి  ఎట్టకేలకు పేరు కనుక్కున్నాను 😊   

COSTUS PICTUS


రెండోది Alpinia purpurata . రెడ్ జింజర్ అని కూడా అంటారు 



ఇక మూడోది  -  Etlingera elatior  టార్చ్ జింజర్ ,టార్చ్ లిల్లి ,ఫిలిప్పైన్ వాక్స్ ఫ్లవర్  అనేవి ఇతర పేర్లు. ఈ మొక్కని కుమిలీ  లో చూసాను. ఈ మొక్క పేరు తెలుసుకోవటానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది.గూగుల్ ఇమేజ్ సర్చ్ లో ఎన్ని సార్లు ట్రై చేసినా దొరకలేదు.ఇక పేరు తెలుసుకోలేనే మో అనుకుంటున్న సమయం లో ... నేను జిగ్సా పజిల్స్ సాల్వ్ చేస్తూ ఉంటే ఒక పువ్వు బొమ్మకు మిజోరి బొటానికల్ గార్డెన్  అని ఉంది. గార్డెన్ పేరు ఇవ్వకపోతే     పువ్వు పేరే రాయొచ్చు కదా అనుకున్నాను.ఒక క్లూ దొరికింది అని సంతోషపడి , ఆ గార్డెన్ వెబ్సైటు కి వెళితే ... కొన్ని వేల రకాల పూల మొక్కల పేర్లు.ఆల్ఫాబెట్ వైజ్ చెక్ చెయ్యొచ్చు కానీ పేరు తెలియదు కదా ! చెక్ చేస్తున్నదే పేరు కోసం 😊  
మెనూ లో ప్లాంట్ ఫైండర్ అని ఉంది.అందులో మొక్క వి  కొన్ని లక్షణాలు (ఫీచర్స్)ఇస్తే  పేరు తెల్సుకోవచ్చు. అలా పేరు తెలుసుకున్నాను 😊