Monday 20 April 2020

మాహుర్ గడ్ - శ్రీక్షేత్ర (దత్తాత్రేయుని జన్మ స్థలం)


మాహుర్ లో ఒకే కొండ పైన మూడు దేవాలయాలు ఉన్నాయి. రేణుక, అనసూయ మరియు దత్తాత్రేయ.మొదటగా రేణుకాదేవి గుడి.గుడికి చేరుకోవాలంటే సుమారు 200 మెట్లు ఎక్కాలి.మెట్లకిరువైపున,మొదట్లో దుకాణాలున్నాయి. అమ్మవారికి సమర్పించుకోవటానికి,చీరలు, గాజులు,పూలు, ప్రసాదాలు అమ్ముతున్నారు.ఇక్కడ ప్రతి ఒక్కరూ తమలపాకులు , వక్క ,సోంపు అమ్మవారికి ఇస్తున్నారు.వాటిని దంచి విగ్రహం నోటి భాగం లో ఆ ముద్దను పెట్టారు. వచ్చిన భక్తులకు అదే ప్రసాదం గా ఇస్తున్నారు.



ఈ గుడి నుంచి మాహుర్ కోట కనిపిస్తుంది. 


గుడి వెనక వైపు మెట్లు ఉన్నాయి.కిందకు దిగితే పరశురాముడి గుడి ఉంది. ఈ గుడికి వెళ్లే దారి పొడుగూతా కోతులు  గుంపులు గుంపులుగా ఉన్నాయి.





వాటిని చూస్తే కొంచం భయం అనిపించి వెనక్కు వెళ్ళి పోదాము అనుకున్నాము.మళ్లీ ధైర్యం చేసి ముందుకు వెళ్ళాము.


    

ఈ గుడి నుంచి కోనేరు దగ్గరికి వెళ్ళటానికి మెట్లు, మట్టిబాట ఉంది. అక్కడకు వెళ్లకుండానే వెనక్కివచ్చేసాము.పరుశురాముడు తల్లి తల నరికిన తర్వాత ఆ కోనేట్లోనే స్నానం చేసాడంట. ఆలా అని అక్కడకు వచ్చిన ఒకరు చెప్పారు.


కోనేరు


ఈ గుడి నుంచి  కొండ పైకి వెళితే అనసూయ మాత దేవాలయం. దారి సరిగా లేదు అని డ్రైవర్ చెప్పటం తో మేము అక్కడకి వెళ్ళలేదు.పూర్తి గా కొండ పైన  దత్తాత్రేయుని దేవాలయం ఉంది. ఇది దత్తాత్రేయుని జన్మస్థలం అంట. మాఘపూర్ణిమ సందర్భం గా ఉత్సవం జరుగుతుందని , దానికి ఏర్పాట్లు చేస్తున్నారు.మేము నాందేడ్ నుంచి వస్తుంటే జనం కాలి నడకన,మధ్య మధ్య లో నాట్యం చేస్తూ,దత్తాత్రేయని విగ్రహం/పటం  పల్లకీ లో,ఇతర వాహనాల లో పెట్టుకుని  వస్తున్నారు.అలా నడుస్తూ వాళ్ళు సరిగ్గా పౌర్ణమికి దత్త శిఖరం చేరుకుంటారట.

    






మాకు తిరిగి సికిందరాబాద్ రావటానికి  ట్రైన్  రాత్రి 9:30 కి . ఇంకా చాలా టైం ఉండటం తో మాహుర్ నుంచి సహస్రకుండ్  జలపాతం దగ్గరకు వెళ్ళాము. చెపితే తప్పించి అది జలపాతం అని తెలిసే ఛాన్సే లేదు. అలా ఉంది :) ఇక్కడ కూడా కోతులు విపరీతం గా ఉన్నాయి. వ్యూ చాలా బాగుంది. చల్లటి గాలి ... కొద్దిసేపు అలా చుట్టూ  చూస్తూ ఫొటోస్ తీసుకుంటూ, మాట్లాడుకుంటూ కాలం గడిపి, జలపాతానికి దగ్గరలోనే ఉన్న పాక హోటల్ లో టీ  తాగి , తిరిగి నాందేడ్ కి బయలు దేరాము.











Friday 17 April 2020

మాహుర్యే ఏకవీరికా



ఫిబ్రవరి మొదటి వారం లో నాందేడ్ వెళ్ళాము.అప్పటికింకా కరోనా గురించి తెలియదు. నాందేడ్ లో గురుద్వారా చూసుకుని అక్కడ్నుంచి మాహుర్ వెళ్లాలని  అనుకున్నాము.6వ తారీఖు మధ్యాహ్నం 12:30 కి దేవగిరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరాము.సాయంకాలానికల్లా నాందేడ్ చేరుకున్నాము. అక్కడ్నుంచి ఆటో లో గురుద్వారా చేరాము.గురుద్వారా సొసైటీ వాళ్ళే నిర్వహించే యాత్రినివాస్ లో రూమ్ బుక్ చేసుకోవటానికి వెళ్తే, అక్కడివారు రూమ్ ఎక్కడికి పోదు, గురుద్వారా చూసి అక్కడ లంగర్ లో భోజనం చేసి రండి అని చెప్పటం తో మళ్ళి గురుద్వారా కి వచ్చి తీరిగ్గా అంతా కలదిరిగి ,9 గంటలకు భోజనం చేసి  యాత్రి నివాస్ చేరుకున్నాము. గురుద్వారా లైట్ల వెలుతురు  లో  చాలా అందం గా ఉంది. అక్కడ్నుంచి కదలాలనిపించలేదు . గురుద్వారా చుట్టుపక్కల ప్రాంతమంతా ఎటు చూసినా సిక్కులే !మినీ పంజాబ్ అనిపించింది :)
గురుద్వారా వద్దే మరుసటి రోజు మాహుర్ వెళ్ళటానికి వెహికల్ మాట్లాడుకున్నాము. 





నాందేడ్ నుంచి మాహుర్ కు  మూడున్నర గంటల ప్రయాణం. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది 8వ శక్తి పీఠం.ఈ శక్తి పీఠం మాహుర్ కి 10 కిలోమీటర్ల దూరం లోనే హివరా గ్రామం లో ఉంది. మాహుర్ కి వెళ్ళటానికి ముందే డైవెర్షన్ తీసుకోవాలి. ఇక్కడ తెలుగు లో రాసిన బోర్డు చూసి ఆశ్చర్యం వేసింది.గుడిలో కూడా తెలుగు లోనే రాసి ఉంది. గుడి పక్కనే పెన్ గంగ (నది) ప్రవహిస్తుంది.గుడి చిన్నది. భక్తులు కూడా చాల తక్కువ మంది ఉన్నారు.దర్శనానికి ఎక్కువ టైమ్ పట్టలేదు. 







       
అక్కడ్నుంచి మాహుర్ గడ్ రేణుక ఎల్లమ్మ గుడికి వెళ్ళాము. ఆ గుడి విశేషాలు ఇంకో పోస్ట్ లో ...