ఇది కేవలం సరదా కోసం రాసింది.అఫెండ్ అయ్యే మేటర్ ఏమీ లేదు కానీ ,ముందు జాగ్రత్తగా తెలియచేస్తున్నాను.
మా ఫ్రెండ్ విజయ..రేపు నేను సెలవు తీసుకుంటున్నాను అంటే ఎందుకు అని అడిగా.వాళ్ళ అమ్మగారు అర్జంట్ గా ఊరు వెళ్ళాల్సి వచ్చిందని,
రేపువంట తనే చెయ్యాలి కాబట్టి సెలవుతీసుకుంటున్నా అంది.ఏమన్నా డవుట్స్ వస్తే ఫోన్ చేస్తానని చెప్పింది.నాకు వంట అంతంత మాత్రమే వచ్చు.సరే నాకు తెలిస్తే చెపుతాలే అన్నాను నేను.నెక్స్ట్ డే 11 గంటలకు విజయ ఫోన్ .మామిడికాయ పప్పు వండుతున్నాను.అందులో ఉప్పు వేస్తారా?అని.ఒక్కసారే విరగబడి నవ్వటం మొదలు.మా రిసెప్షనిస్ట్ నన్ను వింతగా చూడటం గమనించి ,బలవంతాన నవ్వు ఆపుకుని,వేయాలి అని చెప్పాను.మామిడి కాయ పుల్లగా ఉంటుంది కదా ,ఉప్పు వేస్తారా?మళ్లీ అడిగింది.ఏ కూర లో అయినా ఉప్పు కారం వేస్తారు.మామిడికాయ పుల్లగా ఉంటే పులుపు కోసం చింతపండు వెయ్యరు కానీ ఉప్పు వెయ్యాలి అని చెప్పాను.సరే నేను ఇలా అడిగానని ఎవరికీ చెప్పకే ప్లీజ్ అంది తను.ఎవరికి చెప్పనని హామీ ఇచ్చాక కానీ ఫోన్ పెట్టేయలేదు.మరుసటి రోజు ఇన్స్టిట్యూట్ లో తనని చూసాక ,అమ్మయ్య ,బాగానే ఉన్నావా?నీ వంట తిన్నాకా మీరందరూ ఎలా ఉన్నారో అని భయపడ్డాను అన్నాను.ఈ వంట ఆడవాళ్లే చెయ్యాలని రూల్ ఎవరు పెట్టారో అంది తను.ఇంక ఎవరూ?మన ఆడవాళ్లే,సమానత్వం పేరు తో వంట చేసే హక్కును మగవాళ్లనుంచి లాక్కున్నాం,పాపం మగవాళ్ళు ... వాళ్ళ హక్కును కోల్పోయినందుకు ఎంత బాధపడుతున్నారో ,ఏమిటో!అన్నాను.ఏమిటి,వంట చెయ్యటం మగవాళ్ళ హక్కా?అంది విజయ.అవును.నలభీమపాకం అనే మాట విన్నాం కానీ,దమయంతి హిడింబి పాకం అనే మాట ఎప్పుడైనా విన్నామా?పురాణాల కాలం నుంచి కూడా మగవాళ్ళే వంట చేసేవారు.మనవాళ్ళు ఎప్పుడు ఆ హక్కును మగవారి నుంచి లాక్కున్నారో కానీ ,వంట చేసే తిప్పలు మనకు వచ్చాయి అన్నాను నేను.మగవారు వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు మొదలు పెట్టారు గా,మొట్ట మొదటగా వంట చేసే హక్కును సాధించుకుంటే బాగుంటుంది కదా అంది తను.అవును అని వంతపాడాను.అంతర్జాతీయ పురుషుల దినోత్సవం రోజయినా,అలాంటి ఉద్యమం ఏమయినా చేస్తారేమో అని ఆశగా ఎదురు చూసాము.మా ఆశ అడియాస అయ్యింది.
"ఆశా నిరాశేనా?జీవితానా వంట చెయ్యటం తప్పదా "
అని పాడుకుంటున్న మాకు ,రెండు రోజుల క్రితం బ్లాగ్ వాతావరణం చూసాకా మిణుకు,మిణుకు మంటున్న మా ఆశ,1000 వాట్ల బలుబు లాగా వెలిగింది. అబ్బాయిలూ,అంకుళ్ళూ,పోటీ పడి చేసిన వంటలు చూసాకా ,పాపం వాళ్ళు ఇన్ని రోజులూ ,వాళ్ళ హక్కును కోల్పోయి ఎంత బాధపడి ఉంటారో కదా అనిపించింది.అందుకనే అబ్బాయిలూ,అంకుళ్ళూ,మీ హక్కు కోసం ఇప్పటికైనా ఉద్యమించండి.వంట చేసే హక్కును సాధించుకోండి.నాలాంటి,విజయ లాంటి వాళ్ళ సప్పోర్ట్ మీకు ఎల్లప్పుడూ ఉంటుంది.