ప్రస్తుత బిజీ ప్రపంచం లో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నది తాము మాట్లాడితే వినటానికి ఒక మనిషి . వినే తీరిక ఎవరి కుంది?
వంశీ మంగళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనేర్ గా పని చేస్తుంటాడు . ఒక పెళ్లి అటెండ్ అవటానికి హైదరాబాద్ వస్తాడు . తాతకు గిఫ్ట్ గా షాల్ ఇస్తాడు
"నా కిప్పుడు కావాల్సింది గిఫ్ట్ లు కాదురా ,నేను చెప్పేది వినే మనిషి ,నా ఆలోచనల్ని అర్ధం చేసుకునే ప్రాణి " అంటాడు తాత.
తాత మనవడికి చెప్పిన కథే ఈ 'వినడానికో మనిషి ' నవల.
అంతగా చదువుకోని ,లోకజ్ఞానం లేని,మాట్లాడటం తెలియని ఒక పల్లెటూరి అబ్బాయి జీవితగమనం .
జీవితం లో ఎదురైన కొన్ని సంఘటనలు అతని నెగెటివ్ ఆలోచనల్ని పాజిటివ్ గా మార్చిన వైనం ...
మాష్టారి ఆజ్ఞ తు.చ తప్పకుండా పాటిస్తూ తనను వంద గుంజీళ్ళు తీయించిన సహాధ్యాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వేసిన ప్లాన్ ఫలించకపోగా, ఆ సహాధ్యాయి యే తనను ఆపదనుంచి కాపాడటం తో తను చేయాలనుకున్న పని ఎంత బుద్దిహీనమైనదో అర్ధమవుతుంది. రాయి విసిరిన వాడిని వదిలేసి రాయిని శిక్షించ టానికి పూనుకున్నట్లు గా ఉంది అని అనుకుంటాడు.
ఒక లక్ష్యమంటూ లేని అతనికి , స్నేహితుల ద్వారా ఎదురైన ఒక చేదు సంఘటన తదుపరి పరిణామాలు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి.
అమాయకత్వం,అజ్ఞానం ,అవమానాలు,వైఫల్యాలు,సమస్యలు అన్నీ విజయం లో భాగాలే. చావును జీవితం నుండి వేరు చేసి చూడకూడనట్లే ఓటమిని గెలుపు నుండి వేరు చేసి చూడకూడదు అనే సందేశం రచయిత అందించారు.
తాత చెప్పిన ఆత్మ కథ మనవడి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది.
గొప్ప నవల అని చెప్పలేను కాని ,చదవదగ్గ నవల అని మాత్రం చెప్పగలను. :)