స్వేచ్ఛ అంటే ఏమిటి ? అసలు భూమి మీద ఎవరికైనా పూర్తి స్వేచ్ఛ ఉంటుందా ?
అబ్బా పిల్లల పని హాయి. ఏ బాధ్యతలు ఉండవు ,హ్యాపీ గా ఉండొచ్చు అనుకుంటాము. కాని వాళ్ళ బాధలు వాళ్ళవి. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండాలనే ఉంటుంది ,చదువు పెద్ద గుదిబండ లా తోస్తుంది.హాయిగా ఆడుకుందామంటే ,ఈ హోం వర్క్,పరీక్షలు అంటూ అమ్మ ఆడుకోనివ్వదు అనుకుంటారు .
ఆకాశం లో ఎగిరే పక్షులు ,అడవి లో తిరిగే జంతువులు ... వాటికి ఎంత స్వేచ్ఛ అనుకోకుండా ఎవరు ఉండరేమో . అదొక మిస్ కాన్సేప్షన్.స్వేచ్ఛ అనేది ఏ జీవికైనా కొన్ని పరిమితులకు లోబడే అన్నది పచ్చి నిజం.
ఆకాశం లో స్వేచ్ఛ గానే ఎగురుతుంది పక్షి . కాని ఎప్పుడు ఏ వేటగాడు దాని ప్రాణాన్ని హరిస్తాడో తెలియదు . నాకు స్వేచ్ఛ ఉంది,నేను ఇక్కడే కదలకుండా ఉంటాను అని జింక ఏ సింహమో ,పులో వస్తున్నా అలాగే ఉంటే వాటికి ఆహారం అవ్వక తప్పదు.
నిప్పు కాలుతుంది అని తెలుసు,అందుకే దాన్ని ముట్టుకోము.నిప్పును ముట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా అనుకోము కదా !మనకు ఏదైనా మంచిది కాదు ప్రమాదం అని తెల్సినప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే విజ్ఞత.అలా కాకుండా నాకు ఏదైనా చేసే స్వేచ్ఛఉంది,నేను నాకిష్టమొచ్చినట్టు ఉంటాను అనుకుంటే దాని ద్వారా ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కూడా సిద్ధం గా ఉండాలి .
మానవ జీవితం లోని ఏ దశ లోనూ స్వేచ్ఛ లేదని చెప్పే ఈ పద్యం డా. వానమామలై గారు రచించిన 'సూక్తి వైజయంతి' నుంచి ...
బాల్యమొక పంజరపు చిల్క ,పర్వులెత్తు
జవ్వనము పాలపొంగు ,ముసలితనమ్ము
పాటిదప్పిన కొలబ్రద్ద ,భయద మృతియె
కాచుకొని యున్న పులి,బందెకాన బ్రతుకు.