Tuesday, 26 April 2016

స్వజాతి సమానత్వం ఎప్పుడు అమ్మలూ

మహారాష్ట్రియన్ ల నూతన సంవత్సరం రోజు , ఎన్నేళ్ళు గానో ఉన్న సంప్రదాయాన్ని పక్కన పెట్టి స్త్రీలకు ,శని శింగనాపూర్ లోని శనీస్వరుని దేవాలయం లో ప్రవేశానికి అనుమతిచ్చారు . http://bit.ly/1NIU4Sz సంతోషం.ఇక శబరిమల మిగిలింది.అది కూడా సాధిస్తారేమో,వేచి చూడాలి.
గుడి లోకి అనుమతించకపోవటం , అదేమీ పెద్ద సమస్య కాదు.గుడికి వెళ్ళనందువల్ల వచ్చిన నష్టమేమీ లేదు. పోరాడాల్సిన సమస్యలు చాలానే ఉన్నాయి.మనుషులు,ఎవరైనా అవసరమయిన విషయాలకంటే అనవసరమయిన విషయాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు  :)   

అదొక కళ్యాణమంటపం . జనం తో కిట కిట, కళకళ లాడుతూ ఉంది.పెళ్లి కొడుకు రాకకై ఎదురుచూస్తూ ... పిల్ల తల్లితండ్రులు.కొంతమంది,అక్కడక్కడా గుంపు గా నించుని కబుర్లు చెప్పుకుంటూ ... తెలిసిన వారు కనిపిస్తే కుశలమడుగుతూ ... అలా  సందడి సందడి గా ఉంది. పెళ్లి కొడుకు , కళ్యాణమంటపం  దగ్గరకు వచ్చాడు   అన్న సమాచారం రాగానే హాడవిడి గా పెళ్ళికూతురి తల్లి ,ప్రవేశ ద్వారం దగ్గరకు వచ్చి ... ఆ దగ్గరలోనే నిలబడి కబుర్లు చెప్పుకుంటున్న ఆవిడ అమ్మమ్మ,పెద్దమ్మ ను చూసి అగ్గి మీద గుగ్గిలం అయ్యింది.పెళ్లి కొడుకు  వస్తున్నాడు , మీరు ఒక పక్కకు వెళ్ళండి , ఇక్కడ ఉండొద్దు అని చెప్పటం తో వారు బాధపడుతూ , వస్తున్న కంటి నీరునాపుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళనలా వెళ్ళమని చెప్పటానికి కారణం ,వారు వితంతువులు.  

ఇంకో సంఘటన
ఆడపడచు కూతురి పెళ్లి . సంప్రదాయం ప్రకారం ,మేనమామ మెట్లు,పిల్లేళ్ళు బట్టలు ఇవ్వాలి కావున ,అన్ని తీసుకుని వదిన గారు పెళ్ళికి వెళ్ళింది . పెళ్లి తెల్లవారుఝామున అవటంతో ,వచ్చిన గెస్ట్లు - దరిదాపుగా అందరు భోజనాలు చేసి చదివించాల్సినవి చదివించి వెళ్ళిపోతున్నారు.ఇంతలో బంధువులలో ఒకరు - పెళ్ళికూతురి తల్లితో ... అమ్మాయి ,వదిన మెట్లు ఇవ్వకూడదు గా  ,వరసయిన వాళ్ళను ఒకర్ని ఉండమను అని సలహా . వితంతు వదిన గారు తన డబ్బులుతో మెట్లు, బట్టలు కొని తేవచ్చు , అవి తీసుకోవచ్చు . అప్పుడు కీడు ఏమీ ఉండదు కానీ ,ఆవిడ చేత్తో పెళ్ళికూతురికిస్తే కీడు . పెళ్లి లో కూడా దూరదూరం గా ఉండాలి ... వగైరా వగైరా .

మరొక సంఘటన

ప్రక్కింటి వారు ,సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ పిలవటానికి వచ్చారు. పిలిచే ఆవిడ - మాకు ఎటువంటి పట్టింపులు లేవు , మీరు తప్పక రావాలి ...  పట్టింపులు లేవుగా, మరి పట్టింపులు లేవని ప్రత్యేకించి చెప్పటం ఎందుకు ?ఇక అక్కడకు వెళ్ళినాక ఇంకో తతంగం.బంధువులు ఎవరో వచ్చినవారికి ,బొట్టు పెడుతూ ఉంటారు.ఆవిడకు కూడా బొట్టు పెట్టబోతుంది . ఇంతలో    పక్కనుంచి ,ఏదో ప్రళయం వచ్చినట్టు - అయ్యో ఆవిడకు బొట్టు పెట్టకు .. అవతల ఆమె వెలా ,తెలా పోతూ -అయ్యో సారీ అండి అని ఒకటికి పది సార్లు చెప్తుంటే అందరి దృష్టి అటే ఉంటుంది . అప్పుడు ఆమెకు,ఛీ అనవసరం గా వచ్చి అవమానం పొందానని  అనిపిస్తుంది .

ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని ... ఇక పిలుపులకు వచ్చినవాళ్ళు ,బొట్టు గుమ్మానికి పెట్టి వెళతారు. గుమ్మానికిచ్చిన విలువ ,ఒక స్త్రీ వితంతువు అయితే లేదు.
స్త్రీల సమానత్వం కోసం పోరాడటం మొదలుపెట్టి ఎన్ని శతాబ్దాలు అయ్యిందో తెలియదు కానీ ,ఇలాంటి పనికిమాలిన ఆచారాలు పాటించటం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

సమాజం,ప్రభుత్వాల దృష్టి లో కూడా స్త్రీలు వేరు . వితంతువులు వేరు .
అందుకే మనం International women's day   అని ప్రతి సంవత్సరం మార్చ్ 8 న , International Widows Day ని ప్రతి సంవత్సరం జూన్ 23 న జరుపుకుంటున్నాము.

ఇప్పటికే చాలా (పనికి వచ్చే / పనికి మాలిన) విషయాలలో మగవారితో సమానత్వం సాధించాము , ఇకనైనా మన తోటి ఆడవారినందరిని సమానంగా ఆదరిద్దాము