Wednesday, 31 August 2016

భూమి గుండ్రం గా ఉంది



చిన్నప్పుడు , అమ్మమ్మ   వంట చెయ్యటానికి,ఎక్కువగా మట్టిపాత్రలే వాడేది. అల్యూమినియం పాత్రలను అప్పట్లో వంటకు మంచిది కాదు అని వాడేది కాదు. మట్టి పాత్రలలో వండిన తోటకూర పప్పు , గోంగూర పప్పు , ఉలవచారు ... వాటి రుచి కి సాటి ఇంకేదీ రాదు.కాలం తో పాటు , మట్టి పాత్రలకు కాలం చెల్లి వాటి స్థానాన్ని స్టీల్ ,నాన్స్టిక్ , గాజు పాత్రలు(అవెన్ వాడేవారైతే)ఆక్రమించాయి.మనకు ఎప్పుడూ కూడా కొత్తొక వింత , పాతొక రోత  :)

అలాగే తినే ఆహార పదార్ధాలు. మా అమ్మమ్మ చిన్నప్పుడు,జొన్నఅన్నం తినేవారంట. ఎక్కువగా ఆహారం ఆవిరి మీద ఉడికించో లేదా నిప్పుల మీద కాల్చుకుని . నూనె వాడకం చాలా తక్కువ. ఏదైనా నూనె ఉపయోగించి వండే దయితే , ఇంట్లోనే తయారు చేసిన ఆముదం వాడేవారట. వండే పాత్రలే మారిపోయినప్పుడు వంటలు మారకుండా ఉంటాయా ?ఆ మారిన వంటలు తిని తిని రోగాల పాలు పడటం ఎక్కువయ్యేప్పటికి,ఇప్పటి  జనాలకు ఆరోగ్య స్పృహ పెరుగుతూంది.దాని ఫలితమే మళ్ళీ చిరుధాన్యాల వైపు కి ప్రయాణం . ఇంకా మట్టి పాత్రలు . ఏవో రోడ్డు మీద పెట్టి అమ్మే వాటిని కొనుక్కోవాలంటే చిన్నతనం కానీ, నాన్ స్టిక్ వాటితో పోటీ పడే ధర తో ఆన్ లైన్ లో దొరుకుతుంటే , ముద్దొచ్ఛే లా ఉన్న  వాటిని చూసి కొనకుండా ఉండగలమా ?