Saturday, 1 May 2010

అజ్ఞానం లోనే ఆనందం ఉంది

అజ్ఞానం లోనే ఆనందం ఉంది.అవునండి,సరిగ్గానే చదివారు.ఏమిటీ అందరూ జ్ఞానాన్ని పెంచుకోండి,జీవితంలోకి వెలుగు తెచ్చుకోండి  అని చెపుతుంటే ,నువ్వేమో అజ్ఞానం లోనే ఆనందం ఉందని చెపుతున్నావు,నిన్న ఏమన్నా చింపాంజీ వారసుల తెలుగు సినిమా గానీ చూసావా అని అడుగుతున్నారా?అబ్బే అదేమీ లేదండి.కాకపోతే నేను సంపాదించుకున్న మిడి మిడి జ్ఞానం వల్ల పడిన కష్టాల వల్ల అలా అనవలసి వచ్చింది.కొంచం జ్ఞానం సంపాదించుకున్నందువల్లె  ఇన్ని కష్టాలు పడ్డాను,ఇక ఎక్కువ జ్ఞానం సంపాదించుకుంటే ఎన్ని కష్టాలు పడాలో అని అజ్ఞానం లోనే ఆనందం ఉందనే నిర్ణయానికి వచ్చేసాను.జ్ఞానం ఎక్కువ ఉంటె ప్రతీ విషయాన్ని ఎందుకు ,ఏమిటి అని ప్రశ్నిస్తూఉంటాం.అదిఅలాగే ఎందుకుండాలి?ఇలా కూడా ఉండొచ్చు గా అనిపిస్తుంది. సో జీవితమంతా ప్రశ్నించటం తోను ,శోధించటంతోనే సరిపోతుంది.సరే ఇంతగా ప్రశ్నిస్తున్న,శోధిస్తున్నా ,మనకు నచ్చిన సమాధానం దొరుకుతుందా అంటే అనుమానమే.అదే ఆడవాళ్ళ విషయానికి వస్తే ఈకష్టాలు ఇంకొంచం ఎక్కువగా ఉంటాయి.చదువుకున్నాక ఇంట్లో కూర్చోవాలంటే కూర్చో లేము.సరే ఉద్యోగం చేస్తుంటే ఆనందం ఏమన్నా ఉంటుందా అంటే ఉండదు అనే చెప్పాలి.రెండు పడవల మీద కాళ్ళు  పెట్టి ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది.ఇంట్లో పని,ఆఫీస్ పని మనకు మనమే శారీరక హింస పెట్టుకోవటం.దీనికి తోడూ ఆఫీస్ లో మగ కొలీగ్ ల వెక్కిరింపు మాటలు.ఇదంతా అవసరమా?అసలు చదువుకోపోతే(ఉద్యోగం వచ్చేంత) ఈ బాధ అంతా ఉండదు గా!జ్ఞానం పెరగటం వల్ల వచ్చిన ఇంకో నష్టం ఏమిటంటే ,నేను నీతో సమానం గా చదువుకుని ఉద్యోగం చేసి సంపాదిస్తున్నాను ,నీ గొప్ప ఏమిటి?నువ్వు ఇంటి పనులు చేయాల్సిందే అని ప్రతి రోజూ ఆయన గారితో గొడవ పెట్టుకుంటూ ఇంటిలోని వారికి   కిష్కిందకాండ దృశ్యాన్ని చూపించాల్సి వస్తుంది.అదే ఆడవారికి పురాణాల జ్ఞానం తప్పించి వేరే ఏ జ్ఞానము లేకపోతె,పతియే ప్రత్యక్ష దైవం అని పరవశించి పోతూ బ్రతికేస్తూ ఉంటారు.సదరు భర్త గారికి ఒకరో,ఇద్దరో ఆడ స్నేహితులు ఉన్నా  మా ఆయన అచ్చు ఆ శ్రీకృష్ణ పరమాత్మే అని ఆనంద పడుతూ ఉంటారు.మరి ఇదంతా చదివాక మీరు కూడా అజ్ఞానం లోనే ఆనందం ఉందని ఏకీభవిస్తారా? 


గమనిక:ఇది సరదాకు రాసినది.ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోవద్దని మనవి.

No comments: