Wednesday, 17 November 2010

నిక్ నేమ్స్

ఇవాళ ఎందుకో అకస్మాత్తుగా మా కాలేజ్ ఫ్రెండ్స్,లెక్చరర్స్,మేము వాళ్లకు పెట్టిన నిక్ నేమ్స్  గుర్తొచ్చాయి.జీవితంలో ప్రతి ఒక్కరూ,ఎప్పుడో ఒకప్పుడు ,ఎవరికో ఒకరికి,సరదా గానో,కోపం తోనో నిక్ నేమ్ పెట్టని వారు ఉండరేమో కదా?
మా కెమిస్ట్రీ మేడంకు -బి.పి.మేడం....మా కెమిస్ట్రీ మేడం చాలా సాఫ్ట్.చాలా నెమ్మది గా మాట్లాడే వారు.కానీ ఉన్నట్టుండి ఏమయ్యేదో తెలియదు గానీ ,ఒక్కసారే పూనకం వచ్చినట్లు పెద్ద,పెద్దగా అరిచేసేవారు.అందుకని ఆ పేరు.
ప్లాంట్ పాథాలజీ సర్ కు-చార్కోల్ రాట్....ఈ పేరు ఆయన టీచ్ చేసే సబ్జెక్టు కు రిలేటెడ్.ఆయన చాలా నల్లగా ఉండేవారు.అందుకని ఆ పేరు  పెట్టాము.
(చార్కోల్ రాట్ వ్యాధి వచ్చిన మొక్క,వ్రేళ్ళు,ఆకులు,కాయలు,పళ్ళు,ఏ భాగం అఫెక్ట్ అయితే ఆ భాగం నల్లగా చార్కోల్ లాగా అవుతుంది.)
ఎంటమాలజి సర్ కు-ఇన్ సెక్ట్....ఇది కూడా సబ్జెక్టు కు రిలేటెడ్.సర్, పొట్టిగా చాలా సన్నగా గాలి వీస్తే పడిపోయేలాగా ఉండేవారు.
ఇంగ్లిష్ మేడం కు -చైనీ డాల్ ...
బొద్దుగా,ముద్దుగా చైనీయుల పోలికలతో,బొమ్మ  లా ఉండేవారు.
హాస్టల్ వార్డన్ సిస్టర్ మెర్సీ కు-సాడిస్ట్,డెవిల్.....నేతిబీరకాయ లో నెయ్యి ఎంతో సిస్టర్ మెర్సీ లో మెర్సీ అంత.అసలు జాలి,దయ అనే మాటలకు అర్ధం తెలియదు ఆమెకు.అరటికాయ తొక్కల్లో విటమిన్స్ ఎక్కువ ఉంటాయని ,ఆ తొక్కల తో కూర వండించి హాస్టల్ లో ఉన్న స్టూడెంట్స్ తో తిన్పించిన ఘనత ఆమెది.
 క్లాస్మేట్ డేవిస్- టిక్రో(తమిల్నాడ్ కాకి)నల్లగా ,ముక్కు కాకి ముక్కులా షార్ప్ గా ఉండేది.
మా క్లాస్ లో వివేకానంద పేరు గల వాళ్ళు  ఇద్దరు ఉండేవారు.అందులో ఒకరు లావుగా,1984ఒలింపిక్స్ మస్కట్ అప్పు లాగా ఉండేవాడు.అందుకని అతనికి అప్పు అని పేరు.రెండో అతను ఎప్పుడూ కళ్ళు ఆర్పుతూ ఉండేవాడు.అతనికి బ్లింక్ అని పేరు పెట్టాము.కానీ తరువాత అదొక జబ్బు అని,నర్వస్ వీక్నేస్స్ వల్ల అని తెలిసి అలా పిలవటం మానివేసాము.
మా ప్రిన్సిపాల్ గారు మా క్లాస్ వాళ్ళందరికీ కలిపి ఇచ్చిన బిరుదు-రౌడీ బ్యాచ్ అని.