తల్లి-తండ్రి,అత్తా-మామ,అక్క-చెల్లెళ్ళు,అన్న-తమ్ముళ్ళు,వదిన-మరదళ్ళు,బావ-మరుదులు,భార్య-భర్త స్నేహితులు,ఇరుగు-పొరుగు .....వీళ్ళందరూ కూడా మన జీవితం లో ఒక విడదీయలేని భాగం.అయినప్పటికీ వీళ్ళతో మన సంబంధాలు... ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ,సజావుగా సాగటానికి ప్రయత్నం చేయము.జీవితాంతము చేసిన పొరపాట్లే మళ్ళీ,మళ్ళీ చేస్తూ ఉంటాము.
సాధారణం గా మనం చేసే పొరపాట్లు:
పొసెసివ్ నెస్ :మనకు బాగా ఇష్టమైన వ్యక్తి పట్ల ఉండే పొసెసివ్ నెస్ వల్ల అసూయ ,అభద్రతా భావం తలెత్తుతాయి.మనం బాగా ఇష్టపడే వ్యక్తీ కి వేరే ఎవరైనా దగ్గరవుతుంటే అసూయ పడతాము. ఆ వ్యక్తి ని ఎక్కడ కోల్పోతామో అనే అభద్రతా భావానికి గురవుతాము.పొసెసివ్ నెస్ కలిగి ఉండటం అనేది ఎప్పుడూ మంచిది కాదు.వ్యక్తుల మధ్య బంధాలు దెబ్బ తినటానికి ఇది ఒక ముఖ్య కారణం.ఎప్పుడూ కూడా మనం ఇష్టపడే వ్యక్తులు లేకపొతే మనం లేము అనే భావన ఉండకూడదు.ఈ లోకం లో ఏ వ్యక్తి తో అయినా మన బంధం శాశ్వతం కాదు.కొంతమంది తో ...రోజులు,కొన్ని వారాలు,నెలలు ,సంవత్సరాలు.చివరికి ఎపుడో ఒకప్పుడు బంధాలను వీడవలసిందే. ఈ సత్యాన్ని గుర్తుంచుకుంటే , పొసెసివ్ నెస్ అనేది ఉండదేమో.అదే లేకపొతే గొడవలే ఉండవేమో కదా!
ఎదుటివారిని మార్చాలనుకోవటం:పెళ్లి అయ్యి అవటం తోటే భార్యను ,భర్త...భర్తని భార్య తమకు అనుగుణంగా మార్చు కోవాలని అనుకుంటారు.దీని వల్ల ఇంట్లో ఎంతో కొంత గొడవ తప్పదు.అయినప్పటికీ ఈ మార్చాలనుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది.
ఎదుటి వారిని మెప్పించాలనుకోవడం :మనకు నచ్చిన వారికి ఇష్టమైన పనులు చేస్తుంటే ,వాళ్ళు మనల్ని ఎక్కువ ఇష్టపడుతారనే అపోహ తో ,ఎదుటివారిని మెప్పించటానికి ప్రయత్నం చేస్తుంటాము.కానీ ఎప్పుడో ఒకప్పుడు మన అసలు స్వభావం బయట పడకుండా ఉండదు.అప్పుడు పరిస్థితి?అసలయినా ఎదుటి వారు మన నుంచి ఏమి ఆశిస్తున్నారో ,మనకు ఎలా తెలుస్తుంది? ఏ బంధం అయిన సవ్యంగా ఉండాలంటే ఎదుటివారిని మెప్పించాలని ప్రయత్నించకుండా ,మనం మన లాగానే నిజాయితిగా ఉండటం ముఖ్యం.
ఆశించడం :
“Love sought is good, but given unsought is better”-- William Shakespeare
If we really want to love
we must learn how to forgive.-మదర్ థెరెసా
మనం ఎవరినైనా ప్రేమించి నప్పుడు,ఎవరి నయితే ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తి నుంచి కూడా అదే ప్రేమను ఆశిస్తాము.మనం ఆశించిన విధం గా అవతలి వ్యక్తి స్పందించకపోతే ,నిరాశ పడుతాము.ఏమీ ఆశించకుండా ప్రేమించినప్పుడు అవతలి వ్యక్తి స్పందన ఎలా ఉన్నప్పటికీ మనం బాధ పడము.
మాట్లాడకుండా బిగుసుకుపోవడం: ఏవైనా అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు,సమస్యను గుర్తించి...దాన్ని పరిష్కరించు కోవటానికి బదులు కోపం తో మాట్లాడటం మానివేస్తాం. అక్కడనుంచి ఆ వ్యక్తీ చేసే ప్రతి పని,మాట్లాడే ప్రతి మాట తప్పు గానే అనిపిస్తుంది.నెగటివ్ ఆలోచనలు ఎక్కువయి ,అసలు సమస్య తో పాటూ ఇంకొన్ని కొత్త సమస్యలను కొని తెచ్చుకుంటాము.అలా కాకుండా ,ఎవరు ముందు మాట్లాడాలి అనే ఇగో ని పక్కన పెట్టి సమస్య గురించి మాట్లాడుకుని వెంటనే పరిష్కరించుకోవడం ఉత్తమం.
విమర్శించటం:మనకున్న ఇన్ఫీరియారిటి లేదా సుపీరియారిటి ఫీలింగ్ వల్ల ఎదుటి వారిని విమర్శిస్తూ ఉంటాము.ఎదుటి వారి లోపాలు గురించి వాళ్లకు తెలియజేయటం తప్పు కాదు కానీ వాళ్ళు నొచ్చు కోకుండా చెప్పగలగాలి.
When we judge, we separate.
గమనిక:ఇన్ని చెప్పారు,మీరు వీటిని పాటిస్తారా?అని అడగకండి ...సరేనా!ఎందుకంటే ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి.