What we have done for ourselves alone dies with us; what we have done for others and the world remains and is immortal.
ఇప్పటివరకూ ఏది చేసినా నాకు మాత్రమే చేసుకున్నా.ఇకనుంచి లోకానికి కూడా ఏమన్నా చేయాలని నిర్ణయించుకున్నాను.అలా చేస్తే కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతులు వస్తే నా పేరు చిరస్మరణీయం అవుతుందని ఒక దురాశ /పేరాశ. అలా పేరు సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ,
సైంటిస్ట్ నయినా కాకపోతి కొత్త ఆవిష్కరణలు చేయగా అని రాయినయినా కాకపోతి ట్యూన్ లో పాడుకుంటూ ఉంటే ,ఒక అద్భుతమయిన ఆలోచన తట్టింది.
వంటిల్లే పెద్ద ప్రయోగశాల అని (ఆల్రెడీ ఎవరన్నా అన్నారా?) కొత్త కొత్త వంటలు కనిపెట్టి లోకానికి సేవ చేయోచ్చు కదా అని.
ఆలోచన వచ్చిందే తడవు ,కొత్తగా - ఆరోగ్యానికి మంచి చేసే వంటలు ఏమి చెయ్యొచ్చా అనుకుంటుంటే వంటింట్లో ఎదురుగా కాకరకాయలు కనిపించాయి.చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు,తినరు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా ! కావున నా ప్రయోగం దీనితో మొదలు చేస్తే బాగుంటుంది అనుకున్నాను.కూర టైప్ లో వండితే కాకరకాయ అని తెలిసిపోతుంది కాబట్టి ఏదన్నా స్నాక్ లాంటిది ట్రై చేస్తే బెటర్ అని కాకరకాయ కారప్పూస ,స్వీట్ - కాకరకాయ హల్వా చేసి చక్కగా అలంకరించి ఫోటో లు తీసి, చేసే విధానం రాసి పత్రిక కు పంపించాను.వాళ్ళ పత్రికలో అది ప్రచురించలేక పోతున్నందుకు చింతిస్తూన్నాము అనే నోట్ తో భద్రం గా వెనక్కి వచ్చెయ్యటం కూడా జరిగింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడు లా బంగాళా దుంప బాసుంది,బీరకాయ బిర్యాని, కాబేజీ కజ్జికాయ ,చేమదుంప చేకోడి , పపాయా పాపకార్న్ లాంటి వినూత్న వంటకాలు కనిపెట్టి వాటిని పత్రికలకు పంపించటం ,అవి రాకెట్ వేగం తో తిరిగి రావటం కామన్ అయిపోయింది.ఇక ఇలా లాభం లేదని ,నేనే స్వయం గా బుక్ పబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయం లో ,అంతర్జాలం లో విహరిస్తుంటే - మీ బుక్ ని మీరే పబ్లిష్ చేసుకోండి అనే ప్రకటన కనిపించి,సంతోషాన్ని కలిగించింది. కొద్దిగా ఆలస్యం గా నయినా ఇలా పేరు తెచ్చుకుంటు న్నందుకు ఆనందం గా ఉంది :))
1 comment:
Wow... :) Good luck.
Post a Comment