Friday, 7 August 2015

మేఘ మాలికలు

 చూడు చూడు ,మబ్బులు ఎంత బావున్నాయో !
మబ్బుల్ని ఎప్పుడూ చూడలేదా ?
హ్మ్ !
ఒక్క మబ్బులు విషయమనే కాదు,ఏ విషయం లో అయినా ప్రకృతి ఆరాధకులు,అనారాధకులు మధ్య జరిగే సంభాషణ ఇంచుమించు ఇలానే ఉంటుంది  :) 
పావురాలే కాదు ,మేఘాలతో కూడా సందేశాలు పంపించొచ్చు . ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రధముడు. (మేఘ సందేశం )
ఇక సినిమా ల విషయానికి వస్తే ,మేఘాల ప్రస్తావనతో కూడిన పాటలు ఎన్నో !
ఆకాశ వీధిలో హాయిగా అంటూ భానుమతి 
ఓహో ,మేఘమాల అంటూ సావిత్రి 
నీలి మేఘమా ,జాలి చూపుమా అంటూ చంద్రకళ 
మేఘమా దేహమా అంటూ సుహాసిని 
మేఘమా నీలి మేఘమా అంటూ సుమలత 
తమ మనసు లోని భావాలు /విన్నపాలు మేఘాలకే విన్నవించుకున్నారు . 
విషాదమే కాదు ,ఆనందం కూడా ... 
మేఘాలలో తేలిపోమ్మన్నది 
మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా ... 
ఇక ఇలా రాసుకుంటూ పొతే లిస్టు చాంతాడంత అవుతుంది . 
అలాగే సామెతలు ... 
మబ్బుల్లో నీటిని చూసి ముంత వొలకపోసుకున్నట్లు 
మన కథలు/కావ్యాలు/నవలల్లో కూడా మబ్బుల్ని రకరకాలు గా వర్ణించారు 
వెండి తో ఒకరు పోలిస్తే (వెండిమబ్బులు ) మరొకరు దూది పింజలతో ... మీగడ తరకలు ,కారు మబ్బులు వగైరా వగైరా
కుక్కపిల్ల ,అగ్గిపుల్ల ,సబ్బు బిళ్ళ -  కాదేదీ  కవితకు అనర్హము అన్నారు ఓ కవి . అలాగే కబుర్లు కి కూడా . ప్రతీ దాని గురించి అనర్ఘళం గా కబుర్లు చెప్పుకోవచ్చు