Monday, 7 December 2015

ఏ కాలం లో ఉన్నాము ?





అదొక అపార్ట్మెంట్ . అందులో ఒక ఫ్లాట్ లో అద్దెకు ఉండే వారి బంధువు ,ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పటల్ లో మరణించారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు కాబట్టి శవాన్ని ఇంట్లో కి తీసుకురాకూడదు ఎలా ? అన్నది సమస్య . అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒకరు తమ కార్ పార్కింగ్ లో శవాన్ని పెట్టటానికి పర్మిషన్ ఇచ్చారు . అయితే మిగతా వారందరు ,గేట్ లోపలకి తీసుకువస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అయితే పర్మిషన్ ఇచ్చిన వారు " మీ ఇంట్లో వారే ఎవరయినా చనిపోతే మీరు ఏమి చేస్తారు ? రోడ్ పైనే ఉంచుతారా ? ఇంట్లోకి తీసుకు రాకపోయినా కాంపౌండ్ లోకి కూడా తీసుకు రారా ?" అని అడిగారు. అద్దెకు ఉండేవారి కోసం మమ్మల్ని అంత మాట అంటారా ? అని వారి మీద ఎదురు దాడి   :(

అద్దెకుండేవారు , మనుషులు కాదా ?
చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెత. ఇంట్లో మనిషి చనిపోతే ఏమి చేస్తారు ? పుట్టిన ప్రతి ఒక్కరూ ,ఏదో ఒక రోజు చనిపోతారు . అంత మాత్రానా ఆ ఇంటికి /అపార్ట్మెంట్ కి కీడు జరుగుతుందా ?21వ శతాబ్దం లో ఉన్నామా  ? లేదా ఆది మానవుల కాలం లో ఉన్నామా ? అర్థం కావటం లేదు. 


    

11 comments:

Sakshyam Education said...

Good post. మనిషి నైతిక పతనానికి ఓ ఉదాహరణ.

Anuradha said...

Thank you Chowdary garu !

విన్నకోట నరసింహా రావు said...

రోడ్డు పైనే ఉంచమనే కుసంస్కారులు కూడా లేకపోలేదులెండి (నా అనుభవంలో నేను చూసినదే చెబుతున్నాను).

మరో రకం మనుష్యులు కూడా తగిలారు. మా బంధువొకాయన ఓ ఇండిపెండెంట్ ఇంట్లో మొదటి అంతస్తులో అద్దెకి ఉండేవారు, ఇంటివారు క్రింద భాగంలో ఉంటారు. ఈ మధ్య మా బంధువు పోయారు. కబురు తెలిసి వారింటికి మేం వెళ్ళేసరికి శరీరాన్ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చి గేటు లోపల ఓ ప్రక్కగా చిన్న షామియానా వేసి పడుకోబెట్టారు. కనీసం గేటు దాటి లోపలకి తీసుకురానిచ్చారు ఫరవాలేదే అనుకున్నాం. అంత్యక్రియలకి తీసుకువెడటానికి రెడీ అవుతుంటే మా బంధువు కొడుకుని ఇంటి యజమాని పిలిచి కొన్ని ఆదేశాలిచ్చాడు, వినండి - (1). అంత్యక్రియల కార్యక్రమం ముగిసిన తర్వాత వాళ్ళెవరూ తిరిగి ఈ ఇంటికి రాకూడదట. (2). అంత్యక్రియలకి బయలుదేరుతున్నప్పుడే పోయినాయన భార్యతో సహా కుటుంబం మొత్తం ఇంట్లోంచి బయటకొచ్చేసి వాళ్ళ పోర్షన్ తాళం పెట్టి 12 రోజులూ అటువైపు రాకూడదట (ఆ కుటుంబం ఎక్కడ తలదాచుకుంటుంది అన్నది ఆ కుటుంబం సమస్యట). (3). కర్మకాండల కార్యక్రమం పూర్తయిన తర్వాత కూడా సరాసరి ఆ ఇంటికి తిరిగొచ్చేయకూడదట. ఏదైనా గుడికి వెళ్ళి అక్కడ మూడు రోజులు గడిపిన తర్వాతే రావాలిట. ఇది పరాకాష్ట కి చేరిన మూఢత్వంలాగా లేదూ? విసుగు చెందిన మా బంధువు కుటుంబం (అసలే ఇంటిపెద్ద పోయాడని బాధలో ఉన్నారు) కార్యక్రమాలన్నీ ముగిసిన వారం పది రోజుల్లోనే ఆ ఇల్లు అసలు ఖాళీ చేసేసి వేరే ఇల్లు అద్దెకి తీసుకుని మారిపోయారు.

కాబట్టి మనం ఎన్ని సామెతలు చెప్పుకున్నా ప్రయోజనంలేదు. భౌతికంగా సంపాదనల్లోను, సౌకర్యాలలోను "ప్రగతి" చూస్తున్నాం కాని చదువుకున్నవారు, చదువులేనివారు అనే తేడా లేకుండా ఆలోచనల్లోను, మూఢనమ్మకాల్లోనూ మీడియా వారు సినిమాలు సమాజాన్ని కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారు / తీసుకువెడుతున్నారు అని నా గట్టి అభిప్రాయం. అందువల్ల "ఏ కాలంలో ఉన్నాం" అనే ప్రశ్నకి మధ్యయుగంలో ఉన్నాం అనే జవాబు.

మీ టపా కన్నా నా వ్యాఖ్య పెద్దదయినట్లుంది. మనుష్యులు ఇంత వివేచన లేకుండా తయారయ్యారే అనే విచారంతో వ్రాశేసాను. కాలంతో పాటు మారాలన్నారు గానీ ఆ మార్పు ఇలా తిరోగమనపు మార్పు కాదు అని ఆ సూక్తి ఉద్దేశ్యం అనుకుంటాను. (అదీగాక, అపార్ట్మెంటులో నివసిస్తూ పోతే ఎలాగా అనే బెంగ. సర్లే, తర్వాతి కార్యక్రమం జరిపించవలసిన వాళ్ళ తలనెప్పి అని అనుకోవడం అంతే.)

sarma said...

ఏభై సంవత్సరాల కితం నాకు వ్యక్తిగతంగా నా పాతికేళ్ళ వయసులొ పెద్ద అనుభవమే ఉంది. చిత్రం ఏమంటే మూఢనమ్మకాలు పోవాలని గొంతు చించుకునేవాళ్ళే ఇటువంటి పనులు ఎక్కువగా చేస్తున్నారు.

Anuradha said...

*ఎన్ని సామెతలు చెప్పుకున్నా ప్రయోజనంలేదు.*
అవునండీ,నిజమే !
నేను రాసినది కూడా నిజంగా జరిగినదే అండి.ఇక్కడ కూడా రోడ్ పైన ఉంచమనే చెప్పారు.మీరన్నట్టు మీడియా వారు, సినిమాలు సమాజాన్ని వెనక్కు నెడుతున్నాయి అన్నది నిజం .
చాలా సందర్భాలాలో చదువుకోని వారే ఎంతో నయ్యం అనిపిస్తుంది అండి.(నేను చూసినంతవరకు)

Anuradha said...

యాభై సంవత్సరాల నాటి సమాజానికి, ప్రస్తుత(2015) సమాజానికి ఆహార్యం లో తప్పించి ఆలోచనల్లో (మూఢ నమ్మకాలలో)పెద్ద మార్పులు ఏమీ రాలేదనుకుంటా శర్మ గారు .

Jai Gottimukkala said...

కొన్ని కాంప్లెక్సులలో గేటు లోపలికే రానివ్వరు. సొంత ఇల్లు ఉన్నాఇబ్బంది ఎదురు అవుతుంది. ఇల్లు మనదే అయినా కామన్ ఏరియాలోకి రానిదే కుదరదు కదా.

Anuradha said...

@ jai gottimukkala
ఇది కొత్త విషయం .ఇప్పుడే వింటున్నాను అండి.

Jai Gottimukkala said...

అనురాధ గారూ, దురదృష్టం కొద్దీ ఇది స్వానుభవం. పైగా గొడవ పెట్టినవారిలో ఒనర్లతొ పాటు కిరాయిదార్లు కూడా ఉన్నారు.

Anuradha said...

హ్మ్!నిజంగా చాలా బాధాకరమైన విషయం జై గారు

Unknown said...

really sad andi