నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మాకు నాన్ డిటైల్ లో ఒక షార్ట్ స్టోరీ ఉండేది.'GOD SEES THE TRUTH BUT WAITS 'అని.
అందులో ఒకతను వ్యాపార నిమిత్తం వేరే ఊరు వెళ్ళటానికి బయలుదేరతాడు.భార్య తనకు చెడ్డ కల వచ్చిందని ,మరుసటి రోజు వెళ్ళమని చెపుతుంది.కానీ అతను ,తనకు అలాంటి నమ్మకాలేమీ లేవని ఆ రోజే బయలుదేరి వెళతాడు.ఆ రోజు రాత్రి ఒక ఊళ్ళో బస చేస్తాడు.అతను బస చేసిన హోటల్ కే ఒక హంతకుడు వస్తాడు.పోలీసులు వెంటపడుతుండటం తో హత్య కు వాడిన కత్తి ని వ్యాపారి బ్యాగ్ లో దాస్తాడు.హంతకుడు తప్పించుకుంటాడు.వ్యాపారి ని పోలీసులు పట్టుకుంటారు.అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది.ఆ వ్యాపారి శిక్ష అనుభవిస్తూ జైలు లో ఉంటాడు.ఆ వ్యాపారికి డెబ్బయి ఏళ్ళు ఉన్నప్పుడు ,ఆ జైలు కు ఒక కొత్త ఖైదీ వస్తాడు.అతను జైలు కు ఏ నేరం మీద వచ్చాడు అని అడుగుతారు .అందుకు ఆ ఖైదీ ప్రస్తుతం తను ఏ నేరం చేయక పోయినా జైలు కు వచ్చానని ,40 ఏళ్ళ క్రితం తను ఒక హత్య చేసినా పట్టుబడలేదని చెపుతాడు.పాత ఖైదీలను వారు జైలు కు ఎందుకు వచ్చారో చెప్పమని అడుగుతాడు.అలా తెలుసుకుంటున్న క్రమం లో తను చేసిన హత్యకు వ్యాపారి శిక్ష అనుభవిస్తున్నట్లు తెలుసుకుంటాడు.తన నేరం అంగీకరిస్తానని ,ఆ వ్యాపారి జైలు నుంచి వెళ్లిపోవచ్చని చెపుతాడు.అప్పుడు ఆ వ్యాపారి....ఇప్పుడు నేను బయటకు వెళ్లి మాత్రం ఏమి చేస్తాను?అనుభవించాల్సిన వయసంతా జైలు లోనే గడిపాను.నా భార్య ,పిల్లలు ఎక్కడ ఉన్నారో,అసలు ఉన్నారో లేదో తెలియదు.ఈ ముసలి వయసు లో ఏ పనీ చేయలేను అంటాడు.
తప్పు చేసిన వాళ్లకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది,దేవుడు చూస్తూనే ఉంటాడు అంటారు.జీవితాంతం అన్యాయాలు,అక్రమాలు చేస్తా , కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఆనందంగా బ్రతికే వాళ్లకు రేపో మాపో పోతారనగా శిక్ష పడినా ఉపయోగం ఏమిటి?దేవుడు చూస్తానే ఉంటాడు గా ,మరి వెంటనే శిక్ష పడేలాగా చేయకుండా ,ఆలస్యం ఎందుకు చేస్తాడు?ఈ జన్మ లో కాకపోయినా వచ్చే జన్మలో అయినా అనుభవించాల్సిందే అంటారు.ఈ జన్మ లో ఆనందం గానే ఉన్నాము కదా,తప్పులు చేస్తున్నా.....ఉందో,లేదో తెలియని ఆ వచ్చే జన్మ గురించి ఎవరు ఆలోచిస్తారు?ఎంత మంచి గా ఉన్నా కష్టాలు పడుతుంటే ,పూర్వ జన్మలో ఎంత పాపం చేసావో అందుకే నీకు ఇన్ని కష్టాలు అంటారు.మంచి గా ఉండి కష్టాలు పడె బదులు ఆనందం గా ఉండటానికి ఏమయినా చేయోచ్చు అని అనుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినట్లేగా?దాని బదులు ఎప్పుడు చేసిన తప్పుకు అప్పుడే శిక్ష విథించేస్తే ఈ గోల అంతా ఉండదు కదా?
అప్పుడు జనాలు అందరూ మంచివాళ్ల గా అయిపోతారేమో!