Thursday 16 September 2010

వద్దంటే బహుమతులు

బహుమతులు వద్దనుకునే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారా అని అనుకుంటున్నారా?పోటీ లో పాల్గొని గెలుచుకునే బహుమతులు గురించి కాదు నేను చెప్పేది.అలాగే ఫంక్షన్ కు వచ్చిన వాళ్ళు ,ఫంక్షన్ చేస్తున్న వాళ్లకు ఇచ్చే బహుమతుల గురించి కూడా కాదు.ఫంక్షన్ చేస్తున్న వాళ్ళు ఫంక్షన్ కు వచ్చినవాళ్ళకు ఇచ్చే బహుమతుల గురించి.బారసాల మొదలుకుని మరణం వరకు వివిధ రకాల ఫంక్షన్స్ లో ఇచ్చే బహుమతుల గురించి. ఒక అయిదు ,ఆరు దశాబ్దాల క్రితం కుటుంబం లో ఎవరయినా చనిపోతే వారి జ్ఞాపకార్థం ఇత్తడి గ్లాసులు బాగా దగ్గరి బందువులకు మాత్రమే ఇచ్చుకునే వారట.కాలక్రమేణా బంధువులందరికీ ఇవ్వటం ,ఆ తరువాత బంధువులు కానివారికి కూడా ఇవ్వటం ,ఇత్తడి స్థానాన్నిస్టీల్ ఆక్రమించటం జరిగింది. అలాగే గ్లాసుల స్థానం లో ప్లేటులు,తపాలాలు,గిన్నెలు ,బాక్స్లు,etc .,etc .,ఇవ్వటం మొదలు పెట్టారు.ఎవరు మొదలు పెట్టారో తెలియదు కానీ 90 ల లో వోణీ ల ఫంక్షన్ లో,ఎంగేజి మేంట్ (మ్యారేజ్ )ఫంక్షన్ ల లో కూడా ఇవ్వటం మొదలు పెట్టారు.చనిపోతే కర్మ రోజే కాకుండా ఐదో రోజు గారెలు ,పూర్ణాలు పంచేటప్పుడు కూడా ఒక గిన్నో,ప్లేటో ఇవ్వటం మొదలు పెట్టారు.అలాగే ఎంగేజి మేంట్ కు ఒకటి ,పెళ్లి లో మరొకటి.ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ అని భేధభావం చూపెట్టకుండా బారసాల మొదలుకుని అన్ని ఫంక్షన్ లకు,గృహప్రవేశాలకు,పుట్టిన రోజులకు  ఏదో ఒక వస్తువు ఇవ్వటం మొదలు పెట్టారు.స్టీల్ వే కాకుండా స్తోమతను బట్టి,కాదేది బహుమతి కి అనర్హం అన్నట్లు వెండి కుంకుం భరిణలు ,బంగారపు పోగులు ,ప్లాస్టిక్ వస్తువులు ,గాజు ,పింగాణి పాత్రలు ఇస్తున్నారు.ప్రస్తుత ట్రెండ్ గాజు బౌల్స్ ఇవ్వటం.సరే వెండి,బంగారం అంటే రేర్ గా వచ్చేవి కాబట్టి పరవాలేదు.వచ్చిన ఇబ్బంది అంతా స్టీల్,గాజు వాటితోనే.ఈ ఇరవై ఏళ్ళలో మాకు వచ్చిన స్టీల్,గాజు వస్తువులు ఎక్కడ సర్దాలో తెలియక పిచ్చెక్కుతోంది.మేము విజయవాడ లో ఉన్నప్పుడు స్టీల్ సామాను చాలా వరకు ఉల్లిపాయల వాడికి వేసి వదిలిన్చుకున్నాను.గాజు సామాను వదిలించుకోవటానికి ఏలాంటి మార్గము లేదు.(చేతిలోంచి జార విడిస్తే వదిలించుకోవచ్చు అనుకోండి.కానీ కావాలని జార విడువ లేము కదా)ఈ వేలం వెర్రి, జనాలను ఎప్పుడు వదులుతుందో?ఆచారం గా మారిన ఈ బహుమతులు ఇచ్చే పద్దతి ని తొందరలో నే జనాలు వదిలి పెడతారని ఆశిద్దాము.

ఈ పోస్ట్ రాయటానికి కారణం .........
ఈ మధ్య మా పిన్ని వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ,మా పిన్ని స్టీల్ ,గాజు సామాను చూపించి నీకు నచ్చినవి తీసుకు వెళ్ళు.మా ఇంట్లో అలమారాలు అన్ని నిండిపోయాయి ,ఎక్కడ సర్దాలో తెలియటం లేదు అంటే నాదీ అదే పరిస్తితి ,నాకు వద్దు బాబోయ్ అని వచ్చేసాను.

No comments: