అమ్మ చెప్పినట్లు వదిన చేయకపోతే ,అమ్మ ను వదిన గౌరవించటం లేదు,సరిగా చూడటం లేదు అంటాం,అదే మన అత్తగారు మనకేమైనా సలహా ఇస్తే పాటించకపోగా,అన్నిట్లోనూ ఈవిడ జోక్యం చేసుకుంటుంది అనుకుంటాము.
అన్న వదినను అపురూపంగాచూసుకుంటే,పెళ్ళాం కొంగుపట్టుకుతిరుగుతున్నాడు,పెళ్ళాంవచ్చాక తల్లి,తోబుట్టువులు పనికిరాని
వారై పోయారు అంటాం,మన శ్రీవారు మాత్రం వాళ్ళ వాళ్లకు ప్రాముఖ్యం ఇవ్వకుండా ,మన మాట వింటూ మన చుట్టే తిరగాలి.
కోడలు తెచ్చిన కట్నం చాలలేదని రాచి రంపాన పెడతాము,మన అమ్మాయిని మాత్రం అత్తవారి ఇంట్లో బాగా చూడాలి అనుకుంటాము.
అందరూ ఆడవాళ్లే,కానీ ఏ ఇద్దరినీ సమానంగా చూడలేము.
పిల్లలు లేని వాళ్ళను గొడ్రాలు అని అవమానిస్తాం.భర్త చనిపోయిన స్త్రీ పొద్దున్నే కనిపిస్తే ,పొద్దున్నే దీని మొహం చూడాల్సి వచ్చిందని వాపోతాం.
పెళ్ళైనవాడని తెలిసినా ...అతనినే ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకో ఆడదాని జీవితం లో కలతలు రేపుతాం.
సాటి ఆడవారు అని అయినా చూడకుండా అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తాం.
డబ్బుల కోసం ....సినిమాలలో,అడ్వర్ టైజ్మెంట్లలో అంగాంగ ప్రదర్శనలు చేస్తాం,పొట్టకూటి కోసమని సమర్ధించుకుంటాం.
మగవాళ్ళ దౌర్జన్యాలగురించి ప్రశ్నిస్తాము కానీ,మనసాటివారి మీద మనమే చేస్తున్న దౌర్జన్యాల గురించి,వారిని పెట్టే మానసిక హింస గురించి ఎవరం మాట్లాడం.ఎందుకంటే మనం ఆడవాళ్ళం ,గొప్పవాళ్ళం కదా !
హైదరాబాద్ లో కన్నతల్లే తన ముగ్గురు కుమార్తెలతో బలవంతం గా వ్యభిచారం చేయిస్తుందన్న వార్త చూసిన తరువాత...ఇలా రాయాలని
అనిపించింది.
No comments:
Post a Comment