Monday 24 October 2011

నేల రాలిన స్నేహ కుసుమం (యదార్ధ సంఘటన)

కథలు,నవలలు,సినిమాలలో వచ్చే ట్విస్ట్ లకంటే నిజజీవితం లో వచ్చే ట్విస్ట్ లు నమ్మశక్యం గాని విధం గానూ,చాలావింతగానూ ఉంటాయి.అలాంటిదే నేను చూసిన ఒక సంఘటన.

ఏడు సంవత్సరాల క్రితం మేము ఆ కాలనీ లోకి  కొత్తగా వెళ్ళాము.వెళ్ళిన కొద్ది రోజులకే చుట్టు ప్రక్కల అందరితో స్నేహం కలిసింది.అందరిలోకి ఎక్కువగా 'X' తో.పిల్లలను స్కూల్ కి పంపించేటప్పుడు వాళ్లకు టాటా చెప్పటానికి బయటకు వస్తే మళ్ళీ లంచ్ చేసే టైం కు ఒక అరగంట ముందే తిరిగి ఇంట్లోకి వెళ్ళటం.అప్పటి వరకు బయట అరుగుల మీదే కాలక్షేపం.మళ్ళీ రెండు గంటలకు అరుగు మీదకు చేరితే పిల్లలు స్కూల్ నుంచి తిరిగి వచ్చే టైం వరకు అందరం అరుగుల మీదే ఉండేవాళ్ళం.మాకందరికీ సీరియల్స్ చూసే పిచ్చి లేకపోవటం తో ఎక్కువగా కబుర్లతో కాలక్షేపం చేసే వాళ్ళం.అందరూ చాలా జోవియల్ గా ఉండేవాళ్ళు.'X' ఇంకొంచం ఎక్కువ.'X'కు పిల్లలు లేరు.'X'వాళ్ళ ఆయన'Y'కు చాలా మంచి పేరు ఉంది.అడగకుండానే ఎవరికి ఏ అవసరం వచ్చినా  సహాయం చేసేవాళ్ళు.అంత మంచి వాళ్లకు పిల్లలు లేకపోవటం ఒక్కటే లోటు,భగవంతుడు వాళ్లకు ఒక నలుసు ను ప్రసాదిస్తే ఆ లోటు కూడా తీరిపోతుంది అని ప్రతి ఒక్కరు అనుకునే వాళ్ళు.

ఇంచు మించు మూడు సంవత్సరాల  తరువాత... ఒక రోజు పోదున్నే నిద్ర లేచి వాకిలి ఊడుద్దామని బయటకు వచ్చాను.రోడ్డు నిండా జనం,పోలీసులు.వాళ్ళతో పాటు ఓ రెండు  కుక్కలు.ఏం జరిగిందో అర్ధం కాలేదు.అప్పటికి కొన్ని రోజులు గా కాలనీ లో ఏదో ఒక వీధిలో దొంగతనాలు జరుగుతుండటం వల్ల దొంగలు ఏమన్నాపడ్డారేమో ,అందుకని పోలీసులు వచ్చి ఉంటారు అని అనుకున్నాను.ఇంతలో మా పక్కింటి ఆవిడ కనిపించటం తో ఏమయ్యిందని అడిగాను.ఆమె 'Y ' ను ఎవరో హత్య చేసారంట అని చెప్పారు.శవాన్ని ఇంకా తీయలేదు,తల పగల కొట్టి,మెడ కొడవలి తో నరికారంట అన్నారు.ఒక్క నిమిషం...తప్పుగా ఏమన్నా విన్నానేమో అని మళ్ళీ అడిగాను.తిరిగి అదే సమాధానం.అసలు ఆయనను అంత దారుణం గా ఎవరు చంపుతారు?శత్రువులు కూడా ఎవరూ లేరు?ఆలోచనల తో సతమతమవుతూ అన్యమనస్కం గానే మా అమ్మాయి ని రెడీ  చేసి స్కూల్ కి పంపించాను.వెళ్లి పలకరించి వచ్చారా?అసలు ఏమి జరిగిందని వాళ్ళను అడిగాను.వెళ్లలేదండి ,పోలీసులు ఎవర్ని వెళ్లనివ్వటం లేదు,ప్రహరి దగ్గర నుంచుని చూసాము.చూడటానికి చాలా భయంకరం గ ఉంది.మీరు అసలు చూడలేరు,'X' గారే చంపారు అని అంటున్నారు అని చెప్పారు.ఇంకో షాక్.ఆవిడ ఎందుకు చంపుతారు?

నాకంటే ,వాళ్ళు మూడేళ్ళు గానే తెలుసు.వాళ్ళతో ఇరవై సంవత్సరాలుగా పరిచయం ఉన్నవాళ్ళు ఉన్నారు.ఎవరూ ఎప్పుడూ వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడంగా విన్నది లేదు...అందరూ వాళ్ళు చాలా మంచి వాళ్ళు,అందరికి సహాయ పడతారు అని చెప్పటమే గాని.అలాంటిది ఆవిడే హత్య చేసిందంటే అసలు నమ్మాలనిపించలేదు.ఇంతలో మా పక్కింటావిడ టి.వి. లో చూపిస్తున్నారు అంటే టి.వి. ఆన్ చేసాను.పిల్లల కోసమని రెండో పెళ్లి చేసుకున్నాడు,అందుకని మా వాళ్ళతో కలిసి చంపేసాను అని చెపుతుంది ఆవిడ.అది విన్నా కూడా ఇంకా సందేహమే!అంతకు ముందు పొగిడిన నోళ్లే,ఆవిడను తిట్టడం మొదలు...అమ్మో ఎంత మంచిది అనుకున్నాము,ఇలా హత్యలు చేసే రకం అనుకోలేదు...ఎక్సెట్రా ఎక్సెట్రా....ఇరవై సంవత్సరాలుగా మంచిది అనిపించుకున్న ఆవిడ ,ఈ ఒక్క సంఘటన తో పరమ కిరాతకురాలిగా మారిపోయింది...ఆవిడ స్నేహితుల దృష్టి లోనే!

హత్య చేసినందుకు ఆవిడ తమ్ముడికి యావజ్జీవ కారాగార శిక్ష,హత్యకు సహకరించినందుకు ఆవిడ కు ఏడేళ్ళు శిక్ష...

రెండు నెలలు జైల్లో ఉన్నాక బెయిల్ మీద ఆవిడ ఇంటికి వచ్చారు.కానీ ఇంట్లోంచి బయటకు రావటం మానివేశారు.మేము కూడా ఎవరమూ వెళ్లి పలకరించలేదు.ఎలా ,ఏమని పలకరించాలి?సందిగ్దం.
క్షణికమైన ఆవేశం/ఉక్రోషం ......ఫలితం నాలుగు జీవితాలు నాశనం.


1 comment:

శిశిర said...

హ్మ్.. అనుకోని సంఘటనలే కదా జీవితమంటే.