Saturday, 11 February 2012

తప్పు ఎవరిది?

చెన్నై లో 9 వ తరగతి చదువుతున్న విద్యార్ధి, టీచర్ని కత్తి తో పొడిచి చంపాడు.ఈ వార్త చదవగానే వెల్లువలా రియాక్షన్స్...పలు రకాలుగా,పలువురునుంచి.
తల్లిదండ్రుల పెంపకాన్ని విమర్శించేవారు కొందరైతే,సినిమాలు టి.వి.షోలు చూసి పాడయిపోతున్నారని కొందరు.
కేవలం వారేనా బాధ్యులు?ఇలాంటి సంఘటనలకు మొత్తం సమాజం కారణం అని నేననుకుంటున్నాను.
గత కొన్ని ఏళ్ళుగా వస్తున్న సినిమాలలో క్లాస్ రూం సీన్లు చూస్తే,ఉపాధ్యాయులను ఎంతగా దిగ జారిపోయినట్లు చూపిస్తున్నారో తెలుస్తుంది.ఇటీవల ఒక సినిమాకు  టైటిల్, బెజవాడ రౌడీలు అని పెడితే జనాలు గగ్గోలు పెట్టి రౌడీలు అన్న పదం తీసేసేవరకూ ఊరుకోలేదు.తమ అభిమాన హీరో ను ఎవరైనా కామెంట్ చేస్తే ,ఆ కామెంట్ చేసిన వారిని రాళ్ళతో కొట్టడానికి కూడా వెనకాడరు.
తమ ఊరి పేరు ప్రక్కన రౌడీలు అనే పదం వాడితేనే తట్టుకోలేని జనాలు,మరి ఉపాధ్యాయులను సినిమాలలో  అలా కించపరిచి చూపిస్తుంటే,ఎందుకు ఊరుకుంటున్నారు? గురు బ్రహ్మ అన్నారు.మరి అలాంటి గురువును  గౌరవించే సంగతి పక్కన పెట్టితే ...నీచం గా ,బఫూన్ల లా చిత్రీకరిస్తుంటే సామాన్య జనాల సంగతి వదిలేస్తే,కనీసం ఆ వృత్తి లో ఉన్నవారైనా  స్పందించాలి గా.అటువంటి చిత్రీకరణ ఆపాలని కోరాలిగా.అటువంటి దృశ్యాలను ఆయా సినిమాల నుంచి తొలగించాలని కోరాలిగా?మరి అటువంటివి ఏమీ చేయకుండా ,ఇవాళ ఒక సంఘటన జరిగితే...మీడియా ,సినిమాలు కారణం అని ఆరోపించటం ...చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం లాంటిది.

ఒక సినిమాలో హీరో టాక్సీ డ్రైవర్.కాబట్టి బూతులు మాట్లాడతాడు అని సమర్ధించుకోవటం ఎంతవరకు సబబు.హీరోయిన్ తో హీరో ప్రవర్తించే తీరు,మాట్లాడే విధానం అన్నీ అభ్యంతరకరం గానే ఉన్నాయి ఆ సినిమాలో.ఆ విధంగా బయట ప్రవర్తిస్తే చితక తంతారు.అదేమంటే సినిమాని సినిమాలానే చూడాలి.లాజిక్ మాట్లాడకూడదు  అంటారు.ఇటువంటి సినిమాలను చూసి ఆదరించి ఆనందించే జనాలు,నిజ జీవితం లో కూడా అటువంటి సంఘటనలు జరిగినప్పుడు సినిమాలు చూసి చెడిపోతున్నారు అనటం హాస్యాస్పదం.

ఆ విద్యార్ధి దోషే.అతనితో పాటు సమాజమూ.  

No comments: