Thursday, 25 September 2014

ఒకానొక ఊరిలో ఒకానొక సర్వేఆంజనేయస్వామి కి ఆధార్ కార్డ్ . కొన్ని జోక్స్ కన్నా ఇలాంటి న్యూస్ చదివితే బాగా నవ్వొస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాం లో 40 రూపాయలు వసూలు చేసి మరీ రేషన్ కార్డ్లు ఇచ్చారు . మా పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లల వయసులు సరిగ్గానే చెప్పారు కాని ఆవిడ వయసు తగ్గించి చెప్పుకున్నారు. వాళ్ళ పెద్ద అమ్మాయి వయసు 23 ఏళ్ళు అయితే ఆవిడ వయసు 32మాత్రమే. వివరాలు రాసుకునే ఆవిడ  కూడా అదేంటి అనే ప్రశ్న వెయ్యకుండా   రాసుకుని వెళ్ళారు ,కార్డ్ లో కూడా అలాగే వచ్చింది.తెల్ల కార్డ్ కి అర్హులు కాకపోయినా వాళ్ళు ఇచ్చిన వివరాల్ని బట్టి తెల్ల కార్డ్ వచ్చింది.కొన్నాళ్ళు మేము ఆవిడని ఆటపట్టించి నవ్వుకున్నాము. ఏ విధమైన సర్వే అయినా ,డేటా కలెక్ట్   చేసిన దానిలో నిజం కంటే అబద్దం పాళ్ళే ఎక్కువ .

మేము డిగ్రీ ఫైనల్ చదివేప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లో భాగం గా ,మా కాలేజ్ వాళ్ళు దత్తు తీసుకున్న గ్రామం లో సర్వే కి వెళ్ళాము.వారానికి ఒక రోజు (శనివారం) సర్వే చేయటానికి కేటాయించారు. మొదటిసారి వెళ్ళినప్పుడు కొంతమంది అసలు తలుపు తెరవలేదు. కొంతమంది తలుపు ఓరగా తెరిచి ఎందుకు వచ్చారు అని అడిగి ,సర్వే అని చెప్పగానే టక్కున తలుపు వేసుకున్నారు.కొంతమంది డబ్బులు ఇస్తారా అని అడిగి ,ఇవ్వము కాలేజ్ నుంచి వచ్చాము అనగానే అయితే వివరాలు ఎందుకు ?అని ,కొంతమంది ... ఇలా చాలామందే వచ్చి రాసుకెళ్ళారు ,ఎవరూ ఏమి చెయ్యలేదు ,మీరయినా అంతే మేము చెప్పమని ... లంచ్ టైం అయ్యింది ,కనీసం ఒక్క ఇంటి వివరాలు కూడా తీసుకోలేక పోయాము.భోంచేసి మళ్లీ వెళ్ళొచ్చులే  అని కాలేజ్ బస్ దగ్గరికి వెళ్లి భోజనం కానిచ్చాము.ఆ తర్వాత కూడా నో యూజ్.నెక్స్ట్ డే ,మా లెక్చరర్ గారు ఏమంటారో అని కొద్దిగా భయపడుతూనే క్లాస్ కి వెళ్ళాము.అయితే అందుకు భిన్నం గా ,పర్వాలేదు ,రెండు మూడు సార్లు విజిట్ చేస్తే ఆ ఊరు వాళ్ళు మీకు పరిచయమవుతారు ,అప్పుడు ఈజీ గా వివరాలు సేకరించవచ్చు అన్నారు.

సెకండ్ విజిట్ లో వివరాలు సేకరించలేకపోయినా కొద్దిగా మాటలు కలిపి కొంతమందిని పరిచయం చేసుకోగలిగాము.ఆ తర్వాతి విజిట్ లో ఒక ఇంట్లో సంభాషణ ...

మీ పేరు ?
-----
మీ ఆయన పేరు ?
ఎవరయినా ఆయన పేరు చెప్తారా ?
చెప్తే ఏమవుతుంది ?
చెప్పకూడదు
మీ వయసు ?
మీకు మల్లే పేపర్ లో పుస్తకాల్లో రాసి పెట్టుకుంటామ ,తెలియదు .
పిల్లలు ఎంతమంది ?
---
వాళ్ళ వయసు ఎంత ?
తెలియదు
మీ పిల్లల వయసు మీకు తెలియదా ?
---
మీకు పొలం ఎంత ఉంది ?
తెలియదు

ఒక్క పేర్లు తప్పించి ,ఎలాంటి వివరాలు సేకరించలేకపోయాము . మగవాళ్ళు ఉన్నప్పుడు వస్తే పొలము, ఆదాయ వివరాలు తెలుస్తాయి అని చెపితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని అడిగి ఆ టైం కి మళ్లీ వెళ్ళాము . ఒకరు రెండు ఎకరాలు పొలం ఉంది అని చెప్పి ఆదాయం సంవత్సరానికి మూడు నాలుగు వేలు వస్తుందని చెపితే ,ఇంకొకరు అర ఎకరం పొలం - సంవత్సరానికి ఆదాయం 50,000 నుంచి 75,000 వస్తుందని ...
ఆదాయం తక్కువ వస్తుందంటే వాళ్లకు డబ్బు ఇస్తారేమో అనే అభిప్రాయం కొందరిదయితే , గొప్పలు చెప్పే వాళ్ళు కొందరు .
మేము రాసుకున్న వివరాలు ,పేర్లు తప్పించి మిగతావి అన్నీ కరెక్ట్ కాదు అని తెలుస్తూనే ఉంది.పిల్లల చదువుకునే క్లాస్ ని బట్టి వాళ్ళ వయసు వేసి ,పెద్దవాళ్ళకు  ఉజ్జాయింపుగా పిల్లల వయసును బేస్ చేసుకుని ,భార్య భర్తలకు 5 లేదా 6 ఏళ్ళు తేడా ఉంచి వేసాము.ఇక ఆదాయం విషయానికి వస్తే -  లైబ్రరీ కి వెళ్లి రెఫెరెన్స్ బుక్స్ తీసుకుని ,ఏ పంటకు ఎంత ఆదాయం అన్నది చూసుకుని 500, 1000 రూపాయలు ఎక్కువ లేదా తక్కువ కలిపి వేసాము.  అలా ఎలా అయితే ఏమి విజయవంతం గా సర్వే ని పూర్తి చేసాము :)