Wednesday, 31 December 2014

నాగేటి చాలు




ఈ కథల సంపుటి లోని కథలన్నీ వాస్తవానికి అతిదగ్గరగా ఎలాంటి అతిశయోక్తులు లేకుండా ఆసక్తితో చదివేలా ఉన్నాయి.ఏదో కాలక్షేపానికి చదివి అవతల పారేసే కథలు కాదు ,చదివిన వారిని ఓ క్షణమైనా  ఆలోచింపచేసే కథలు ఇవి. 
ఎప్పుడూ పేదవారిని ధనవంతులు దోచుకునే కథలు చదివి చదివి విసుగొచ్చిందా ?అయితే ఈ కథల సంపుటి లోని దొరకోటు చదవండి.తమవర్గం లోనివారే తమవాళ్ళను ఎలా మభ్యపెడుతున్నారో ,పేదవాళ్ళు,పేదవాళ్ళలానే మిగిలిపోవటానికి కారణం ఏమిటో తెలుస్తుంది.ప్రభుత్వ సంక్షేమపధకాలఫలాలు అందవలసిన వాళ్లకు సక్రమంగా అందుతున్నాయా?తెలుసుకోవాలంటే ,ఎండమావి చదవండి.
పురుగు,నాగేటి చాలు,పంట ,పెళ్లి షరతు,గిట్టుబాటు,పరిహారం,పగ కథలు - రైతుల కష్టాలు ,కడగండ్లను తెలుపుతాయి.
వానప్రస్థం ,గుండెలోతులు -నేటి కాలం లో కుటుంబం లోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలలో వచ్చిన మార్పును ప్రస్తావించే కథలు .      

ప్రచురణ :జనవరి 2014 ,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ .

ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు పోస్ట్

బ్లాగ్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 
 

Thursday, 4 December 2014

 తిలక్ గారు రాసిన ఆర్తగీతం కవిత నుంచి నాకు నచ్చిన పంక్తులు కొన్ని ...



 
నా దేశాన్ని గూర్చి పాడలేను,నీ ఆదేశాన్ని మన్నించలేను
ఈ విపంచికకు శ్రుతి కలుపలేను
గత చారిత్రక యశ:కలాపమ్ము వివరింపకు .
బహుళ వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు

ఇంక నన్ను విసిగింపకు
నేడు నేను కన్నీరు గా కరిగిన గీతికను,సిగ్గుతో రెండుగా
చీలిన వెదురు బొంగును,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను
 
నేను చూశాను నిజం గా మూర్తీభవత్ దైన్యాన్ని,హైన్యాన్ని
క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?ఏ విజ్ఞాన ప్రకర్షకుపశ్రుతి?
ఏ బుద్దదేవుడి జన్మభూమి కి గర్వస్మృతి

ఇంక నన్ను నిర్భంధించకు నేస్తం ! ఈ రాత్రి నేను పాడలేను,
ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవుని గా శిరసెత్తుకు తిరుగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను
 

Tuesday, 2 December 2014

నచ్చిన కవిత ఒకటి

 
 
 
 
 
మరచిపోయిన సామ్రాజ్యాలకు 
చిరిగిపోయిన జండా చిహ్నం 
మాయమైన మహాసముద్రాలను 
మరుభూమి లోని అడుగుజాడ స్మరిస్తుంది 
 
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది 
శిలా శాసనం మౌనం గా 
ఇంద్రధనుస్సును పీల్చే ఇవాళ్టి మన నేత్రం
 సాంద్ర  తమస్సు పీల్చే రేపటి మిణుగురు పురుగు 
 
 
కర్పూర ధూమ ధూపం లాంటి 
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట 
ఎప్పుడో ఎందుకో నవ్వే పాప 
 
బాంబుల  వర్షాలు వెలిసి పోయాక 
బాకుల నాట్యాలు అలసిపోయాక 
గడ్డిపువ్వులు హేళన గా నవ్వుతాయి 
గాలి జాలిగా నిస్వసిస్తుంది 
 
ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం 
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
 పొలంలో హలంతో రైతు 
నిలుస్తాడివాళా ,రేపూ .  
 
 
ఈ కవిత, శ్రీ శ్రీ గారు రాసినది .