Wednesday 16 November 2016

మొన్నటి చంద్రుడు



ప్రత్యేకించి చంద్రుడిని చూడాలని చూడకపోయినా ,చందమామ పలు రూపాలని చాలా సార్లే చూసాను. చిన్నతనం లో మరీ ఎక్కువ గా. వేసవి కాలం లో , సాయంకాలం అవగానే సూర్యుని ప్రతాపానికి కాలిపోతున్న నేల తల్లిని చల్లార్చటానికి,పెరట్లో బకెట్లకు బకెట్లు నీళ్లు చల్లి ,ఆ తర్వాత వరసనే మంచాలు ... 6:30 , ఏడింటి కల్లా భోజనం చేసి పిల్లలమంతా మంచాల మీదకు చేరి కబుర్లు చెప్పుకోవటం , అదొక అద్భుతమైన జ్ఞాపకం. చుక్కల్ని చూసి వాటికి రకరకాల రూపాల్ని ఆపాదించటం , చందమామ లో కుందేలు ఉంటదన్నారు,మచ్చ ఉందన్నారు , ఏదీ కనపడటం లేదే ... ఇలా . ఏం మాట్లాడుకునేవాళ్ళమో పూర్తిగా గుర్తు లేదు కానీ , ఆ కబుర్లకు అంతు అంటూ ఉండేది కాదు . అప్పట్లో చందమామ లో ఉన్న మచ్చలు ఏమి కనిపించలేదు - ఇప్పుడు చాలానే కనిపిస్తున్నాయి , బహుశా ఈ భూమి మీద మనం పొంగి పొర్లిస్తున్న కాలుష్యం కావొచ్చు లేదా చందమామ మనకి చాలా దగ్గరగా వచ్చి  ఉండొచ్చు. ఇంకొన్నాళ్ల తర్వాత , సిటీ లో ... వేసవి లో రోజూ టంచన్ గా ఏడింటికి కరెంట్ పోయేది,మళ్ళీ కరెంట్ వచ్ఛేలోపు భోజనాలు పూర్తిచేసి అంత్యాక్షరి ఆడేవాళ్ళం.అదే పౌర్ణమి రోజయితే ఆనందానికి హద్దు ఉండేది కాదు,ఎందుకంటే,గుడ్డివెల్తురులో,ఉక్కపోత భరిస్తూబొంచెయ్యక్కరలేదు.హాయిగా వెన్నెల్లో  హాయ్ హాయ్ అనుకుంటూ ప్రశాంతం గా తినొచ్చు.ఇక అపార్టుమెంట్లు వచ్చాక ఎప్పుడో అనుకోకుండా చూడటం తప్ప చంద్రుణ్ణి చూడటం పూర్తిగా మర్చేపోయాను.ఈ మధ్య ఫలానా రోజు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు, భూమికి దగ్గరగా వస్తాడు, పెద్దగా కనిపిస్తాడు , చూడండి , మిస్ అవ్వొద్దు అని అందరూ పదే పదే   ఊదరగొడుతుంటే , ఎలా ఉంటుందో తప్పక చూడాలి , మిస్ కాకూడదు అనుకుంటే , మొదటిసారి చెప్పినప్పుడు ఆకాశం మబ్బులు పట్టేసి అసలు చంద్రుని దర్శనమే అవలేదు.నిన్న మాత్రం చూడగలిగాను.నాకు,చంద్రుడు మరీ అంత పెద్దగా ఏమీ అనిపించలేదు.అంతకుముందు, పర్లి నుంచి తిరిగి వచ్చేప్పుడుట్రైన్ రావడానికి ఇంకా టైం ఉండటం తో , ఏమి తోచక -  మాఘ పౌర్ణిమ రోజు చంద్రుడిని  ఫోటోలు తీస్తూ టైం పాస్ చేసాను.ఒక్క రంగులో తప్పించి, అప్పటి చంద్రుడికి , మొన్నటి చంద్రుడికి తేడా ఏమి లేదు 😊  



మాఘ పౌర్ణిమ చంద్రుడు 


మొన్నటి చంద్రుడు 


బాక్ లైటింగ్ చేంజ్ చేస్తే ఇలా ... 


No comments: