Thursday 5 January 2017

కర్ణాటక కోవెల యాత్ర - కొల్లూరు

మురుడేశ్వర్ నుంచి ఉడుపి జిల్లాలోని కొల్లూరు మూకాంబికా గుడికి వెళ్ళాము.పురాణాల ప్రకారం , పూర్వం కౌమాసుర  అనే రాక్షసుడు శివుడు ఇచ్చిన శక్తుల అహంకారం తో దేవతలను వేధిస్తూ ఉండేవాడు.కౌమాసుర,తనకు చావు లేకుండా వరం పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమయ్యి,ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు.వరం పొందితే రాగల  ఆపదను పసిగట్టిన సరస్వతీ దేవి అతని వాక్కును బంధించగా వరం అడగలేకపోతాడు.అప్పట్నుంచి అతనికి మూకాసురుడు అనే పేరు వచ్చింది. మూకాసురుడు ని చంపటానికి ముగ్గురు అమ్మలు (లక్ష్మి,సరస్వతి,పార్వతి)ఒక్కటయ్యి మూకాంబికా అవతారమెత్తి సంహరిస్తారు.చారిత్రిక ఆధారాల ప్రకారం ఈ గుడి 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడింది.



  అమ్మవారి రధం 


గుడి లోపల, ఎంట్రన్స్ కి దగ్గర 


ఇంకో కథనం ఏమిటంటే, శంకరాచార్యులు - సరస్వతి అమ్మవారిని భక్తి తో కొలవగా, అమ్మవారు ప్రసన్నమయ్యి ప్రత్యక్షమయ్యారుట.అప్పుడు శంకరాచార్యుల వారు కేరళ లో ఆవిడకంటూ ఒక్క గుడి కూడా లేదని ,అందుకని తనతో కేరళ రమ్మని కోరారుట.దానికి అమ్మవారు అంగీకరించి ఒక షరతు విధించారట.అదేమిటంటే,గమ్యం చేరేవరకు వెనుదిరిగి చూడకూడదు.అలా చేస్తే ఉన్న చోటే నిలిచి పోతానని.దానికి అంగీకరించి బయలుదేరారు.తనతో పాటే వస్తున్న అమ్మవారి కాళీ మువ్వల శబ్దం- ఒకచోట  ఆగిపోయేసరికి  శంకరాచార్యులు వెనుదిరిగి చూడటం తో అమ్మవారు అక్కడే ఆగిపోయారు. శంకరాచార్యుల వారు పదే పదే క్షమించమని వేడుకోవటంతో,కేరళ లోని చొట్టనిక్కర గుడి లో ఉదయం పూట ,మధ్యాహ్నం మూకాంబిక గుడిలో ఉంటానని చెప్పారట. 

మేము కొల్లూరు వెళ్ళేప్పటికి మధ్యాహ్నం అయ్యింది.ఆ కథనం నిజమయితే - అమ్మవారు వచ్చే సమయానికి మేము వెళ్లామన్న మాట 😄       

దర్శనం చేసుకుని,సాయంకాలానికి మళ్ళీ ఉడుపి చేరుకున్నాము.మళ్ళీ కృష్ణుడి గుడికి వెళ్లి , మేము కూడా దీపాలు వెలిగించి వచ్చాము. కొంచం షాపింగ్ కూడా   😄 

      

No comments: