Sunday, 29 September 2019

చాక్ అండ్ డస్టర్


చాలాకాలం గా మన సినిమాలలో టీచర్లను బఫూన్ ల లాగా చూపిస్తున్నారు. అందుకు భిన్నం గా టీచర్లను గొప్పగా చూపిస్తూ తీసిన చిత్రమే ఈ చాక్ అండ్ డస్టర్ . నాటకీయత పాలు కొంచం ఎక్కువైనా,కొద్దిపాటి లోపాలున్నా   అంతగా పట్టించుకోనక్కరలేదు. సినిమా అద్భుతం అని చెప్పను కానీ ఒక్కసారి మాత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం. సినిమాలో ఒక డైలాగ్ ఉంది. సెలెబ్రిటీ ల పుట్టినరోజులు గుర్తుంచుకుని మరీ విష్ చేస్తాము. గుడ్ మార్నింగ్ లు గుడ్ నైట్ లు చెప్తాము  కానీ మనకు చదువు నేర్పించిన గురువును గుర్తు పెట్టుకుని  వారికి విషెస్ చెప్పము అని. నిజమే కదా ! సంవత్సరానికి ఒకసారి టీచర్స్ డే జరుపుకుంటాము.ఆ రోజైనా గురువులకు ఎంతమందిమి విష్ చేస్తాము ? ఈ సినిమా చూడాలని అనుకునేవారు కోసం లింక్ ఇస్తున్నాను. 





   

Tuesday, 25 June 2019

ప్రజా వేదిక



రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు కరకట్ట పొడవునా భారీ కట్టడాలు.నది కనిపించలేదు.నా చిన్నప్పుడు, తాతమ్మ వాళ్ళ ఊరు వెళితే తోట కెళ్ళినప్పుడు,తోట చివరికంటా వెళితే కట్ట - ఆ కట్ట ఎక్కితే కృష్ణా నది కనిపించేది. ఒక్కోసారి నీరు తక్కువున్నప్పుడు ఆ కట్ట దిగి ఇసుక లో ఆడి వచ్చేవాళ్ళం.కరకట్ట పక్కన కట్టిన అక్రమ కట్టడాలు అన్నీ ఇప్పటికిప్పుడు కట్టినవి కావు.గత పదేళ్ల నుంచి కడుతూనే ఉన్నారు.మరి అవి కట్టటానికి ఎవరు అనుమతులిచ్చారు?ఒకవేళ అనుమతి లేకుండా కట్టితే అప్పటి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది?సరే ఆతర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది?యాక్షన్ తీసుకోవటానికి, అక్కడ ఉన్న కట్టడాల్లో ఎక్కువ శాతం ఆశ్రమాలే !వాటిని కూల్చితే వారి భక్తులు ఊరుకుంటారా ? గత కొన్నేళ్లుగా ,హిందూ మతానికి ఏదో ముప్పు వాటిల్లుతుందని,మతాన్ని పరిరక్షించాలని స్లో పాయిజన్ టైపు లో ప్రజలలో ఒక భ్రమ కలిగించారు.ఆ భ్రమ లో నుంచి ఇప్పట్లో జనం బయటకు వచ్చే సూచనలు ఏమీ కనిపించటం లేదు.ప్రజావేదిక కూల్చివేతకు జగన్ తీసుకున్న నిర్ణయం లో తప్పు బట్టే అంశం ఏమీ లేదు. స్పీచ్ కూడా చాలా గొప్పగా ఉంది.కాకపోతే ఆచరణలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.ప్రజావేదిక ప్రభుత్వానికి చెందినది కావున వెంటనే కూల్చివెయ్యొచ్చు.మరి ఆశ్రమాలు,మిగతా ప్రైవేట్ కట్టడాల సంగతి ? అంత ఈజీ కాకపోవచ్చు.అన్ని కట్టడాలను కూల్చివెయ్యగలిగితే,నిజం గానే ఒక మంచి ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ కి లభించాడని సంబరపడొచ్చు.

ఇంకో విషయం ...

బకింగ్ హాం కెనాల్ - ఈ పేరు వినే ఉంటారు,(కాకినాడ నుంచి తమిళనాడు వరకు ,ఈ కెనాల్ ఉంది )విజయవాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతుంటే ,దారి పొడువుతా ,కాలాలతో సంబంధం లేకుండా ,నిండుగా నీళ్లతో ప్రవహిస్తూ కనిపించేది. అలాంటి కెనాల్ ఇప్పుడు చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది.ఇంతకు మునుపెన్నడూ కెనాల్ని ఆ విధంగా చూడలేదు.ఇది కూడా ఆక్రమణలకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఏవయినా నిర్మాణాలు జరిగి అవి పూర్తయ్యేంతవరుకు నిద్రపోవటమో,లేదా నిద్ర నటించడమో చేయకుండా ప్రభుత్వం త్వరగా మేలుకుని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది .


Wednesday, 20 February 2019

కేరళ -God's own country

గత సంవత్సరం మే నెలలో కేరళ వెళ్ళాము.అందరూ ఊదరగొట్టినంత అందంగా అయితే నాకనిపించలేదు.ఎక్కడయినా లంక గ్రామాలు,కొండ ప్రాంతాలు  ఎలా ఉంటాయో అలాగే ఉంది.అలాంటి పల్లెలను/ప్రాంతాలను ఎప్పుడూ చూడని వారికి కేరళ అద్భుతం గానే కనిపిస్తుంది.కుమిలీ లో ఒక రిసార్ట్ లో ఉన్నాము.అక్కడ  ఇంతకు  మునుపు  చూడని కొత్త మొక్కలు చూసాము.రిసార్ట్ చాలా అందం గా ఉంది.ఫుడ్ కూడా.
మేమున్న కాటేజ్ బాల్కనీ నుంచి వ్యూ బాగుంది.





కాటేజ్ కి వెళ్లే దారి 


మేమున్న కాటేజ్


మొదటి రోజు పెరియార్ లేక్ లో బోట్ రైడింగ్ చేసాము ... అడవి దున్నలు,జింకలు తప్ప వేరే జంతువులూ ఏమీ కనిపించలేదు.





మరుసటి రోజు సఫారీ కి వెళదాము అనుకున్నాము . కానీ ఆ రోజు జీపులు దొరకటం కష్టం అని చెప్పారు.గవి అడవి లో కొండ మీదున్న మంగళాదేవి గుడి ,సంవత్సరం లో ఒక్క రోజు (చైత్ర పౌర్ణమి )మాత్రమే తెరుస్తారు అంట.జీపులన్నీ అక్కడకే వెళతాయి,సఫారీ అంటే ఎవరూ రారు , మీరు చాలా లక్కీ ,సరైన సమయానికి వచ్చారు ,రేపు ఆ గుడికి వెళ్ళండి అని చెప్పారు. ఏమి చేస్తాం ? సరే అన్నాము .

ఆ విశేషాలు నెక్స్ట్ పోస్ట్ లో ...