Tuesday 25 June 2019

ప్రజా వేదిక



రెండు రోజుల క్రితం రాజధాని ప్రాంతం వైపు వెళ్ళినప్పుడు కరకట్ట పొడవునా భారీ కట్టడాలు.నది కనిపించలేదు.నా చిన్నప్పుడు, తాతమ్మ వాళ్ళ ఊరు వెళితే తోట కెళ్ళినప్పుడు,తోట చివరికంటా వెళితే కట్ట - ఆ కట్ట ఎక్కితే కృష్ణా నది కనిపించేది. ఒక్కోసారి నీరు తక్కువున్నప్పుడు ఆ కట్ట దిగి ఇసుక లో ఆడి వచ్చేవాళ్ళం.కరకట్ట పక్కన కట్టిన అక్రమ కట్టడాలు అన్నీ ఇప్పటికిప్పుడు కట్టినవి కావు.గత పదేళ్ల నుంచి కడుతూనే ఉన్నారు.మరి అవి కట్టటానికి ఎవరు అనుమతులిచ్చారు?ఒకవేళ అనుమతి లేకుండా కట్టితే అప్పటి ప్రభుత్వం ఎందుకు ఊరుకుంది?సరే ఆతర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయింది?యాక్షన్ తీసుకోవటానికి, అక్కడ ఉన్న కట్టడాల్లో ఎక్కువ శాతం ఆశ్రమాలే !వాటిని కూల్చితే వారి భక్తులు ఊరుకుంటారా ? గత కొన్నేళ్లుగా ,హిందూ మతానికి ఏదో ముప్పు వాటిల్లుతుందని,మతాన్ని పరిరక్షించాలని స్లో పాయిజన్ టైపు లో ప్రజలలో ఒక భ్రమ కలిగించారు.ఆ భ్రమ లో నుంచి ఇప్పట్లో జనం బయటకు వచ్చే సూచనలు ఏమీ కనిపించటం లేదు.ప్రజావేదిక కూల్చివేతకు జగన్ తీసుకున్న నిర్ణయం లో తప్పు బట్టే అంశం ఏమీ లేదు. స్పీచ్ కూడా చాలా గొప్పగా ఉంది.కాకపోతే ఆచరణలో ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూడాలి.ప్రజావేదిక ప్రభుత్వానికి చెందినది కావున వెంటనే కూల్చివెయ్యొచ్చు.మరి ఆశ్రమాలు,మిగతా ప్రైవేట్ కట్టడాల సంగతి ? అంత ఈజీ కాకపోవచ్చు.అన్ని కట్టడాలను కూల్చివెయ్యగలిగితే,నిజం గానే ఒక మంచి ముఖ్య మంత్రి ఆంధ్రప్రదేశ్ కి లభించాడని సంబరపడొచ్చు.

ఇంకో విషయం ...

బకింగ్ హాం కెనాల్ - ఈ పేరు వినే ఉంటారు,(కాకినాడ నుంచి తమిళనాడు వరకు ,ఈ కెనాల్ ఉంది )విజయవాడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళుతుంటే ,దారి పొడువుతా ,కాలాలతో సంబంధం లేకుండా ,నిండుగా నీళ్లతో ప్రవహిస్తూ కనిపించేది. అలాంటి కెనాల్ ఇప్పుడు చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంది.ఇంతకు మునుపెన్నడూ కెనాల్ని ఆ విధంగా చూడలేదు.ఇది కూడా ఆక్రమణలకు గురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ఏవయినా నిర్మాణాలు జరిగి అవి పూర్తయ్యేంతవరుకు నిద్రపోవటమో,లేదా నిద్ర నటించడమో చేయకుండా ప్రభుత్వం త్వరగా మేలుకుని సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది .


18 comments:

Jai Gottimukkala said...

అనురాధ గారూ, చక్కటి వ్యాసం. ఎన్ని కట్టలు కట్టినా ఆక్రమణలు ఆగేనా? జనచైతన్యమే పర్యావరణకు శ్రీరామరక్ష. చదువుతుంటే "Boundaries don't protect rivers, people do" అన్న Aristotle సూక్తి గుర్తుకు వచ్చింది.

బకింగ్ హాం కెనాల్: NW-4 కల ఎప్పుడు నిజం అవుతుందో ఏమో.

నీహారిక said...


చంద్రబాబు గారి నివాసం, ప్రజావేదికలే కాకుండా కరకట్టపై అనేక అక్రమ నిర్మాణాలున్నాయి. గోకరాజు గంగరాజు గారి విశ్రాంతి భవనం, మంతెన సత్యనారాయణ గారి ప్రకృతి ఆశ్రమం లాంటి నిర్మాణాలు ఉన్నాయి. అక్కడ ఉన్న భవన యజమానులు కొంతమంది ఇప్పటికే కోర్టునుండి, వాటిని కూల్చకుండా స్టేలు తెచ్చుకున్నారు.


ప్రభుత్వం తమ నిర్మాణాన్ని కూల్చివేసుకుంటున్న విధంగానే, అక్కడ ఉన్న అన్ని ప్రయివేటు నిర్మాణాలను నోటీసులు ఇచ్చి కూల్చివేయగలదా? ముఖ్యంగా గోకరాజు గంగరాజు గారు బిజెపి ప్రముఖుడు. ఆయన ఈ నివాసానికి ఏకంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా గారే వచ్చారు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవడం, కలెక్టర్ల సమావేశంలో ఆదర్శాలు చెప్పినంత సులభమైతే కాదు.

నీహారిక said...

కరకట్టలో నీళ్ళు ఉంటే కట్టడాలు ఎందుకు కడతారు ? నది ఒడ్డున రాజధాని కట్టమని వాస్థు సలహా ఇచ్చింది కేసీఆర్ గారే !
మా చిన్నతనంలో నదిలో, కాలువలో నిండుగా నీళ్ళుండేవి. ఇపుడు లేవు. యమునా నది ఒడ్డున తాజ్ మహల్ ఉండకూడదని అంటే దాన్నీ కూల్చేస్తారా ?

విజయవాడలో కొండలపై ఇళ్ళు కట్టేసుకున్నారు అవన్నీ సక్రమ కట్టడాలా ? లేబర్ ఇళ్ళు కూల్చేసి డబల్ బెడ్ రూం ఇళ్ళు కట్టిస్తున్నారు. చంద్రబాబుగారికి కూడా కట్టిస్తారా ? అవి కూడా అక్రమ కట్టడాలే కదా ? లేబర్ కి ఒక న్యాయం ముఖ్యమంత్రికి ఒక న్యాయం ఉండకూడదు.

Anuradha said...

జై గారు, థాంక్యూ ! NW-4 మొదట ప్రతిపాదించిన ప్రకారం 2013 కి పూర్తవ్వాల్సింది.ఆ తర్వాత నేషనల్ వాటర్ వేస్ యాక్ట్ 2016- NW-4 పొడవు పెంచి జూన్ 2019 కల్లా పూర్తిచెయ్యాలని నిర్ణయించారు కానీ పూర్తవలేదు.కల నిజమవుతుందో లేదా కలగానే మిగిలిపోతుందో చెప్పలేము :)

Anuradha said...

నీహారిక గారు, గణపతి సచ్చిదానంద ఆశ్రమం కూడా అక్కడే ఉంది అండి.చిగురు అనే అనాధ ఆశ్రమం ... ఇంకా చాలా ఉన్నాయి. నేను అంటున్నది అదే, ప్రజావేదిక కూల్చినంత ఈజీ గా మిగతా కట్టడాలు కూల్చగలరా ?నదిలో నీళ్ళు లేవని ఆశ్రమాలు, గెస్ట్ హౌస్ లు కట్టటం సరైనది కాదు కదండి.అసలు భవనాలు నిర్మించే ముందే అడ్డుకోవాలి.అది చెయ్యలేదు.ఈ వీడియో చూడండి

https://www.youtube.com/watch?v=IioDCQmF4bc

నీహారిక said...

విజయవాడ మీకు తెలిసేఉంటుంది. బస్ స్టాండ్ మొదలుకుని కృష్ణలంక మీదుగా యనమలకుదురు వరకూ భారీ జనావాసాలున్నాయి. వరదొస్తే అందరి ఇళ్ళలోకీ నీళ్ళు వెళతాయి. వరదొచ్చినపుడు ఖాళీ చేయిస్తారు. అవన్నీ అక్రమ కట్టడాలే కదా ?
అవి కట్టడం తప్పే కానీ ఇపుడు కళ్ళు తెరిచి ఏం ప్రయోజనం ? ఒక్క ప్రజావేదిక కూల్చి ఏం చెప్పదలుచుకున్నారు ?

Anuradha said...

తెలుసు నీహారిక గారు.మా ఇల్లు ఒకప్పుడు ఉన్న కెనెడీ స్కూల్ కి దగ్గరలోనే ! విజయవాడ లో కొండల పైన ఉన్న ఇళ్ళు కూడా తెలుసు.అవన్నీ అక్రమ కట్టడాలే! సికింద్రాబాద్ లో రామక్రిష్ణాపురం లో ఉన్న చెరువు ని కూడా ఆక్రమించి ఇళ్ళు కట్టుకున్నారు .వాటిని డబ్బులు కట్టి క్రమబద్దీకరించుకోమన్నారు!వాటిని కూలతొయ్యలేదు!ప్రజావేదికను కూల్చి ఏమి చెప్పదల్చుకున్నారు అంటే వాళ్ళే చెప్తున్నారు కదా, ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదు ,అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తాము అని ! అది ఎంతవరకు అమలు పరుస్తారో వేచి చూద్దాము

Jai Gottimukkala said...

అనురాధ గారూ, భారత్ జల వికాస్ మార్గ్ పథకానికి అనుమతులు & నిధుల సమీకరణ తరహా ప్రాధమిక అడ్డంకులు తొలిగిపోయాయని అంటున్నారు. రోడ్డు/రైలులతో పోలిస్తే నదీ రవాణా వ్యయం అత్యల్పం, కాలుష్యరహితం, పైగా బహుళప్రయోజనాలను (ఉ. మత్స్య & పర్యటన రంగాలకు ప్రోత్సాహం) చేకూరుస్తుంది.

ఇకపోతే అక్రమ కట్టడాలంటే సాధారణ అర్ధం నియమనిబంధనలకు వ్యతిరేకంగా లేదా భూమి మీద హక్కులు లేకుండా కట్టినవని. ప్రస్తుత వివాద కట్టడాలకు ఇంతకంటే తీవ్రమయిన సమస్య ఉంది: వరద ముంపును కట్టడి చేయడాని కొరకు కట్టిన కరకట్ట మీద భారీ కట్టడాలు నిర్మిస్తే వాటి వలన కట్ట స్థిరతకే ముప్పు. The comparison with "ordinary illegal constructions" is not appropriate.

నీహారిక said...

కెనడీ దగ్గరే మా అమ్మవాళ్ళ ఇల్లు. ఇపుడు అక్కడ లేరు. మీరు అక్కడే ఉంటారా ?

నీహారిక said...

నిన్న కలెక్టర్ల సమావేశంలో అధికారులందరికీ ఆదర్శాలు వల్లించారు. కలెక్టర్ శ్రీలక్ష్మి గతి ఏమయిందో ఎవరికీ గుర్తులేదనుకుంటున్నారా ? మీరు సంతకాలు పెట్టేముందు శ్రీలక్ష్మిని గుర్తుకుతెచ్చుకోండి అని పనిగట్టుకుని చెప్పినా ఒక్క అధికారికీ చీమ కుట్టినట్లైనా అనిపించలేదెందుకా అని ఆలోచిస్తున్నా.కలెక్టర్ చదవడానికి ఎంత జ్ఞాపక శక్తి ఉండాలి? జగన్ విషయంలో అన్నీ మరిచిపోతున్నారెందుకు. ఈ రోజు పోలీసులకు నీతులు చెప్పారు. ఒక్క పోలీసయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు విప్పడం లేదు. ఇదంతా జనం ఇచ్చిన అలుసు కాదూ ?

విన్నకోట నరసింహా రావు said...

జై గారు,
// "నదీ రవాణా వ్యయం అత్యల్పం, కాలుష్యరహితం," // అంటున్నారు మీరు. ఏ రకంగా "కాలుష్యరహితం" అవుతుంది? పడవలకు కూడా ఈ రోజుల్లో డీసెలో, పెట్రోలో పొయ్యాల్సిందేగా?

Jai Gottimukkala said...

@విన్నకోట నరసింహా రావు:

"పడవలకు కూడా ఈ రోజుల్లో డీసెలో, పెట్రోలో పొయ్యాల్సిందేగా"

నిజమేనండీ కాకపొతే పోలికలో మాత్రం నదీ రవాణా ఆర్థికంగానే కాక పర్యావరణ పరంగా ఎన్నో రెట్లు మెరుగు.

కలపను * దిగువకు రూపాయి ఖర్చు లేకుండా గ్రావిటీ/కరెంట్స్ ద్వారా పంపవచ్చు. Of course, this works only one way. అసలు బకింగామ్ కెనాల్ ఇందుకే రూపొందించారని గుర్తు.

"రహదారి" నిర్మాణం & మైంటెనెన్సులో సైతం రోడ్డు రోలర్/డాంబర్ వగైరాల కంటే డ్రెడ్జింగ్ దాదాపు కాలుష్యరహితం.

* Just for info please: Navigability & "floatability" are distinct concepts right from the Napoleonic code till modern legal systems.

Anuradha said...

@Niharika ఇప్పుడు అక్కడ ఉండటం లేదు అండి

Anuradha said...

అనుమతులు గురించి కాదు జై గారు. గత కొన్నేళ్ళుగా తుఫాను వస్తే తప్పించి వర్షాలు లేవు.చెరువులు, నదులు ,కాల్వలు అన్నీ ఎండిపోతున్నాయి.నీళ్ళు ఉంటేనే కదా జలరవాణా సాధ్యం !

Jai Gottimukkala said...

"చెరువులు, నదులు ,కాల్వలు అన్నీ ఎండిపోతున్నాయి"

అవునండీ. గోరేటి వెంకన్న రాసినట్టు "మడుగులన్ని అడుగంటిపోయినవి, బావులు సావుకు దగ్గరయ్యినవి, వాగులు వంకలు ఎండిపోయినవి".

సూర్య said...

నీళ్లు లేకపోయినా"జల"రవాణా సాధ్యమే!

Anuradha said...

@ సూర్య,
హ హ హ ! నీళ్ళను రవాణా చేస్తారా ?

విన్నకోట నరసింహా రావు said...

Great song Jai 👏👇

పల్లె కన్నీరు పెడుతోందో (గోరేటి వెంకన్న గారి రచన)