ఏమిటి ఈ పిచ్చి ప్రశ్న ?ఈవిడ కు మతి గాని పోయిందా...అని అనుకుంటున్నారా?అలాంటిదేమీ లేదు లెండి.చావు అనేది విషాదకరమయిన సంఘటనే...అందరి దృష్టి లో .మరయితే ఎవరయినా చనిపోయినప్పుడు ,వారి కుటుంబ సభ్యులను పలకరించటానికి వెళ్ళినప్పుడు స్వీట్స్ తీసుకొని వెళతాము,ఎందుకు?నాకు తెలిసినంతవరకూ మన కుటుంబ సభ్యులు ఎవరయినా చనిపోయినప్పుడు ఏడవకూడదు.ఏడిస్తే మన కన్నీళ్లు అడ్డుపడి ,చనిపోయిన వారి ఆత్మ,స్వర్గానికి వెళ్ళటానికి వైతరిణి దాటటం కష్టమవుతుందట.కానీ ,చనిపోయిన వారి తో మనకున్న అనుబంధం,వారి తాలూకు జ్ఞాపకాలు మనల్ని ఏడిచేలా చేస్తాయి.ఇప్పటి కాలం లో కొంతమంది ఏడుపు రాకపోయినా ఇతరులు ఏమనుకుంటారో అని ,తప్పక ఏడిచే వాళ్ళు ఉన్నారు.మా మామ గారు చనిపోయినప్పుడు ,మా అత్తగారు,ఆడపడుచు ....ఉన్నన్నాళ్ళు ఊళ్ళో వాళ్ళనే పట్టించుకున్నాడు,ఇంట్లో వాళ్లకు చేసిందేమీ లేదు,అదీ..ఇదీ అని మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్తా,పలకరించటానికి వచ్చే వాళ్ళను గేటు దగ్గర చూడగానే శోకాలు మొదలు పెట్టారు.వాళ్ళు వెళ్ళిపోగానే మళ్లీ మామూలు గానే మాటలు మొదలు.అలా ఎవరయినా రావటం చూడగానే ఏడుపు ,వెళ్ళిపోగానే రకరకాలుగా మాట్లాడుకోవటం .....ఇదే తంతు కొనసాగింది.ఒక సంవత్సరంన్నర క్రితం మా అక్కయ్య గారమ్మాయి రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయింది.పలకరించటానికి వెళ్ళాము.బావగారు వచ్చిన వాళ్ళందరిని ,చాలా క్యాజువల్ గా నవ్వుతూ పలకరిస్తున్నారు.మాకు ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.వచ్చిన వాళ్ళందరూ తలా ఒక రకం గా మాట్లాడారు.బ్రహ్మకుమారి సంఘం లో ఉన్నాడు కదా ...అందుకనే అలా దుఃఖ పడకుండా మామూలు గా ఉండగలుగుతున్నాడు అని కొందరు,చిన్న వయసు లో నే పిల్ల చనిపోయింది కదా ,షాక్ లో ఉండి అలా ప్రవర్తిస్తున్నాడు అని కొందరు ....
నేనయితే గీత లో చెప్పినట్లు చావు విషాదకరమయినది కాదు అనే అనుకుంటున్నాను.
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌవనం జరా
తధా దేహాంతర ప్రాప్తిః ధీర స్తత్ర న ముహ్యతి
బాలుడు శైశవం ,బాల్యం,యౌవనం,మొదలగు మార్పులు చెందినప్పుడు ఎట్లా దుఃఖించట్లేదో,అట్లే మరణం అంటే ఒక దేహాన్ని విడిచి ఇంకో దేహం ధరించుట అని జ్ఞానులు గ్రహించి మరణ విషయమై చింతించరు.