పేరు లో నేముంది టపాలు చదివాకా నాకు కూడా నా పేరు వల్ల పడ్డ ఇబ్బందులు రాయాలనిపించింది.మరీ చారి గారు పడినన్ని ఇబ్బందులు కాకపోయినా ,కొద్దో గొప్పో కష్టాలు పడ్డాను.
నాకు అనూరాధ అని పేరు పెట్టినప్పుడు ,మా అమ్మ వాళ్ళ వదిన ,అనూరాధ ఏంటి?మనోబాధ లాగా!అయినా నక్షత్రాల పేరు పెట్టుకుంటారా ఎవరైనా ? పేరు బాగోలేదు ,వేరే పేరు పెట్టమన్నారు అంట.కానీ మా అమ్మ కు ఆ పేరు బాగా నచ్చినందువల్ల,మరియు ఆ టైం లో అనూరాధ అనే పేరు హవా నడుస్తుండటం తో ఆ పేరే ఉంచేశారు.
నా పేరు తో మొట్టమొదటిసారి గా ఇబ్బంది ఎదురైంది.. నేను ఎలిమెంటరీ స్కూల్ లో చదివేటప్పుడు.మా స్కూల్ లో ,స్కూల్ వదలటానికి గంట ముందు అన్ని క్లాస్ ల వాళ్ళని (1to5th )స్కూల్ గ్రౌండ్ లో కూర్చోబెట్టి అందరి తో ఒకటి నుంచి ఇరవయ్ వరకు ఎక్కాలు,తెలుగు సంవత్సరాల పేర్లు,నెలల పేర్లు,నక్షత్రాల పేర్లు చెప్పించే వారు.అదేంటో తెలియదు కానీ ప్రతి రోజూ నక్షత్రాల పేర్లు చెప్పేటప్పుడే నా టర్న్ వచ్చేది.అదికూడా హస్త లేదా చిత్త నక్షత్రం దగ్గర నా ముందు వాళ్ళు ఆపితే అక్కడ నుంచి నేను కంటిన్యు చేయాల్సి వచ్చేది.విశాఖ వరకు బాగానే చెప్పేదాన్ని.ఆ తరవాతే నోరు పెగిలేది కాదు నా పేరు చెప్పటానికి.ఎప్పుడు చెపుతాన అని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ ఎదురు చూసి ,పేరు చెప్పంగానే అందరూ పక్కున నవ్వే వాళ్ళు.ఇలా ఎలిమెంటరీ స్కూల్ లో ఉన్నన్ని రోజులు బాధ పడ్డాను.నేను నా పేరు పలకటానికి ఎందుకు మొహమాట పడ్డానో,వాళ్ళు ఎందుకు నవ్వేవాళ్ళో ,ఇప్పటికి నాకు అర్ధం కాదు.
ఇక నేను 7th చదివేటప్పుడు ..మా క్లాస్ లో అనూరాధ పేరు తో ఎనిమిది మందిమి ఉండేవాళ్ళము.attendence పిలిచేటప్పుడు ఇంటి పేరు తో సహా పిలిచేవారు కాబట్టి ఇబ్బందేమీ ఉండేది కాదు.క్లాస్ లో అక్షింతలు వేసేప్పుడే .ఎవరిని తిడుతున్నారో తెలిసేది కాదు.మనల్ని కాదులే అని ఇకిలించుకుంటా కూర్చుంటే ,తిడుతున్నా సిగ్గు లేదా ?ఇకిలిస్తున్నావు అని extra అక్షింతలు.మనల్నే తిడుతున్నారేమో అని లోకంలోని విషా దాన్నంతా మన ఫేస్ లోనే కనబరిస్తే ,నిన్ను కాదు గా తిట్టేది నువ్వు ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు అని అక్షింతలు.
8th క్లాస్ కు స్కూల్ మారాను.హైదరాబాద్ లో h .f .h .s లో జాయిన్ అయ్యాను.మొదటి రోజు క్లాస్ లో ,మా టీచర్.. అందరి పేర్లు పిలిచి రోల్ నంబర్స్ చెప్పింది.క్లాస్ అయిపోయి టీచర్ క్లాస్ నుంచి వెళ్ళటం ఆలస్యం ,నామీద ప్రశ్నల వర్షం కురిపించారు.
అల్లూరు సీతా రామ రాజు మీకు ఏమవుతారు?
అల్లూరు సీతా రామ రాజు ది మీది ఒకే ఊరా?
అల్లూరు సీతా రామ రాజు అసలు ఫొటోస్ చూసావా?బుక్ లో ఉన్నట్లే ఉంటారా?
నాకేమీ అవరు .అయినా ఇవన్ని నన్ను ఎందుకు అడుగుతున్నారు?అన్నాను.
మీ ఇంటి పేరు కూడా అల్లూరు కదా,అందుకని మీ relative ఏమో అని అడుగుతున్నాము అని అన్నారు.మా ఇంటి పేరు అల్లూరు కాదు వల్లూరు అని చెప్పాను.అయినా వదలకుండా నువ్వు అబద్దం చెపుతున్నావు ,టీచర్ నీ పేరు పిలిచినప్పుడు విన్నాము అని కొంచం సేపు వాదించి వదిలేసారు.ఎందుకయినా మంచిది అని ,రిజిస్టర్ లో నా పేరు
వి .అనూరాధ గా మార్పించేసుకున్నాను.
వి .అనూరాధ గా మార్పించేసుకున్నాను.
ఆ తరువాత graduation అయిపోయేంతవరకు ఏ సమస్య లేదు.నేను స్కూల్ లో వర్క్ చేసేటప్పుడు మళ్లీ...గవర్నమెంట్ స్కూల్ లో వర్క్ చేసి రిటైర్ అయ్యి మళ్లీ మా స్కూల్ లో తెలుగు టీచర్ గా జాయిన్ అయ్యారు.అందరిని పరిచయం చేసుకుంటున్నారు.నేను నా పేరు అనూరాధ అని చెప్పాను.అనూ... ఏమనాలి?రాధా...నీకు ఏమి రాదా ?అయితే పిల్లలకు పాఠాలు ఎలా చెపుతున్నావు అమ్మాయ్? అని ఏమనకోకు అమ్మాయ్ ,నీ కంటే పెద్దవాడిని ,సరదాగా అన్నాను.సీరియస్ గా తీసుకోకు అన్నారు.ఇంతటితో నా పేరు తో తంటాలు సమాప్తం.
No comments:
Post a Comment