Tuesday, 13 July 2010

విందుభోజనం

ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎవరూ ఎదుర్కొని ఉండకపోవచ్చు.చదివినాక నిజంగా జరిగిందా అని కూడా అనిపించవచ్చు.ఎవరైనా నాకు చెప్పితే నేను నమ్మేదాన్ని కాదేమో కానీ ,ఆ పరిస్థితి నాకే ఎదురైంది కాబట్టి ,ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని నమ్మక తప్పటం లేదు.
మేము అద్దె కుండే ఇంట్లో మొత్తం నాలుగు పోర్షన్ లు ఉన్నాయి.గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు,ఫస్ట్ ఫ్లోర్ లో రెండు.గ్రౌండ్ ఫ్లోర్ లో,సునీత,వాణి వాళ్ళు అద్దె కుంటే , ఫస్ట్ ఫ్లోర్ లో ఒక పోర్షన్ లో ఇంటి ఓనర్ ,ఇంకొక దాంట్లో మేము ఉండేవాళ్ళము.సునీత వాళ్ళది ప్రేమ వివాహం.పెళ్ళికి పెద్ద వాళ్ళు ఒప్పుకున్నప్పటికీ,అంతస్తుల తేడా ఉండటం వల్ల వాళ్ళ అమ్మ వాళ్లకు,అత్తగారి వాళ్లకు సరిపడేది కాదు.వాళ్ళ అమ్మగారు ఉన్నప్పుడు
వాళ్ళ అత్తగారు వాళ్ళు,వీళ్ళ ఇంటికివచ్చేవారుకాదు. అలాగేవాళ్ళ అమ్మావాళ్ళు ఉన్నప్పుడు అత్తగారువాళ్ళువచ్చేవారుకాదు.సునీతవాళ్ళపాపకు ఆరో నెల .అన్నప్రాసన చేయటానికి మంచిరోజు చూసుకున్నారు.
మా కాంపౌండ్ లో వారిని,పక్కింటి వారిని మాత్రమే పిలుస్తున్నానని చెప్పింది. ఏమన్నా గొడవ జరిగితే బాగోదుఅని ఎక్కువ మందిని పిలవటం లేదని చెప్పింది. సరే అన్నప్రాసనకు వెళ్ళాము.

ఆ కార్యక్రమం అవగానే పాపను నిద్ర పుచ్చటానికని సునీత ,వెనకాలే వాళ్ళ అమ్మ,అత్తగారు,వాళ్ళ తరపు బంధువులు అందరూ లోనికి వెళ్లారు. గెస్ట్ లం హాల్ లోనే కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము.కడుపు లో ఎలుకలు పరిగెత్తే వరకు ఎవరికీ భోజనం సంగతి గుర్తుకు రాలేదు.టైం చూస్తే ఒకటిన్నర అయ్యింది.ఏమిటి ,వీళ్ళు ఇంకా భోజనానికి పిలవలేదు,నేను లోనికి వెళ్లి కనుక్కొని వస్తాను ఉండండి అని మా ఇంటి ఓనర్ గారు లోనికి వెళ్ళారు.విషయం ఏమిటంటే.........పాతిక,ముప్పై మందికంటే ఎక్కువ అవరు కదా ,ఇంట్లో నే వంట చేయోచ్చు లే అనుకుందట సునీత.అయితే వాళ్ళ అమ్మ ఏమో,నేను వంట చేస్తే మీ అత్తగారు వాళ్ళు కూర్చొని తింటారా?నేను చేయను అందట.వాళ్ళ అత్తగారు ఏమో అమ్మాయి తరపు వాళ్ళు,మీరు చేయకపోతే,మేము చేస్తామా?మేము చేయం అందట.ఎంత బతిమాలినా ఇద్దరు ససేమిరా అని మొండికేసారంట .నేను డయాబెటిక్ ని.నెమ్మదిగా తల నెప్పి స్టార్ట్ అయ్యింది.వాళ్ళు ఎప్పుడు రాజీకొస్తారో,ఏమిటో నండీ,నేను ఇంటికివెళ్లి ఏమన్నా లేకపోతే పడిపోయే లాగున్నాను అని అక్కడనుంచి వచ్చేసాను.మా పిల్లలిద్దరికి బాక్స్ లో పెట్టగ మిగిలిన అన్నం కొంచం ఉంటె అది తిన్నాను.(భోజనానికి వెళుతున్నాను కదా అని నాకు వండుకోలేదు)రెండు అయ్యింది.శివయ్య సీరియల్ చూద్దామని టి.వి.పెట్టాను.ఇంతలో తలుపు కొట్టిన శబ్దం.ఎవరా అని చూస్తే మా ఇంటి ఓనర్.వాళ్ళు ఎవరూ కదిలే లాగా లేరండి.వాణి గారు మనమే చేద్దాం అన్నారు ,మీరు కూడా రండి అని పిలిచారు.కుక్కరు, బాండి,కత్తిపీట తీసుకు రండి,నేను కూడా మావి తీసుకు వెళుతున్నాను అన్నారు.వంట చేయటం అంటే నాకు పరమ చిరాకు.ఇంట్లో తప్పదు కాబట్టి ,ఎలాగో వండాను అనిపిస్తాను.ఇప్పుడు హాయిగా సీరియల్ చూద్దామనుకుంటే ,ఇదేమి కర్మరా బాబు అనుకుంటూ ,ఆవిడ చెప్పిన సరంజామా అంతా తీసుకుని వెళ్ళాను.మొత్తానికి వంట చేసి ,గెస్ట్ లు మయిన మేము హోస్ట్ లు గా మారి,మా హోస్ట్ లకు ముందు వడ్డించి ,వారు తిన్న తరువాత ,మేము కూడా తిని ఇంటికి చేరాము.

2 comments:

abhedyudu said...

ఇది నిజం కాకపోతే ఎంతో సంతోషిస్తానండి.

Unknown said...

రెండిళ్ళ చుట్టం పస్తులున్నాడని మా అమ్మమ్మ సమేత చెప్పేది..వీళ్ళు పెడతారని వాళ్ళు వాళ్ళు పెడతారని వీళ్ళు అనుకుని ఎవరూ పెట్టలేదంతా..ఈ సమేత ఎంత కరెక్టో ఇప్పుడు చూస్తున్నా...చాలా బాగాచెప్పారు..