Sunday 25 July 2010

Foodles


నిన్న మా అమ్మాయి స్కూల్లో ఇచ్చారని foodlesప్యాకెట్ ఒకటి తీసుకు వచ్చింది. సేమ్, నూడుల్స్   లాగానే ఉన్నాయి.కాకపొతే నూడుల్స్ ని గోధుమ పిండి తో తయారు చేస్తే ఈ ఫూడుల్స్ ని గోధుమ పిండి,వరిపిండి,రాగి,మొక్కజొన్న పిండులతో తయారు చేశారు.ఆ ప్యాకెట్ ని చూడగానే నా చిన్నప్పటి సంగతి ఒకటి గుర్తుకు వచ్చింది.నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు ,మా స్కూల్ లో maggiపాకెట్స్ ఇచ్చారు.ఒక్కో స్టూడెంట్ కు రెండు పాకెట్స్ ఇచ్చారు.వాటిని ఇంటికి తీసుకు వెళ్లి మా అమ్మ కు ఇస్తే ,వాటిని ఎలా వండాలో నాకు తెలియదు అంది.ప్యాకెట్ మీద ఎలా తయారు చేయాలో రాసి ఉంది ,నేను వండుతాను అని ఎంతో శ్రద్దగా చదివి నూడుల్స్ ను వండాను.చిన్న బౌల్స్ లో సర్ది అందరి కి ఇచ్చి నేను కూడా తీసుకున్నాను.మాకు ఎవరికి నూడుల్స్ నచ్చలేదు.అందరం ఒక స్పూన్ కంటే ఎక్కువ తినలేకపోయాము.అంతా బయటికి తీసుకు వెళ్లి పారవేసాము.సరే నేను తెచ్చిన రెండు పాకెట్స్ వండి అలా పారబోసాము.మా తమ్ముడు కిచ్చిన రెండు పాకెట్స్ ని ఏమి చెయ్యాలా అని ఆలోచించి ,సేమియా లాగానే ఉన్నాయి కాబట్టి పాయసం చేసుకుందాము అని మా అమ్మకు సలహా ఇచ్చాను.మా అమ్మ నూడుల్స్ తో పాయసం చేసింది.సేమియా పాయసం లాగా టేస్ట్ గా లేకపోయినా,తియ్యగా ఉంది కాబట్టి ఎలాగో అలాగా బలవంతాన తాగేసాము.అప్పుడు,అసలు తినటానికి ఇష్టపడని వాళ్లము ...ఇప్పుడు ఎంతో ఇష్టం గా తింటున్నాము.ఇడ్లి,దోశ చేస్తే వాటిల్లోకి చట్ని చేయాలి.చపాతీ నో ,పూరి నో అయితే కూర వండాలి.ఈ బాధ లేమి లేకుండా ,నూడుల్స్ అయితే రెండు నిమిషాల లో చేసేసుకోవచ్చు.మనమే చేయాలని లేదు.పిల్లలయినా తయారు చేసేసుకోవచ్చు.నేను నెలవారీ సరకులు తెచ్చేటప్పుడే ,రెండు డజన్లు నూడుల్స్ పాకెట్స్ తీసుకు వస్తాను.వంట చేయటానికి బద్దకించి నప్పుడు  నూడుల్స్  జిందాబాద్.ఫూడుల్స్ ,నూడుల్స్  అంత టేస్ట్ గా లేకపోయినా పరవాలేదు,తినొచ్చు.

1 comment:

Unknown said...

హ హ...కరెక్ట్ అండి, రేపు నూడుల్స్ చెయ్యి చాలు అని మా వారు అంటే, హమ్మయ్య ఇంకో అరగంట ఎక్కువ నిద్రపోవచ్చు అని సంబరపడిపోతాను.