Monday, 7 December 2015

ఏ కాలం లో ఉన్నాము ?





అదొక అపార్ట్మెంట్ . అందులో ఒక ఫ్లాట్ లో అద్దెకు ఉండే వారి బంధువు ,ట్రీట్మెంట్ తీసుకుంటూ హాస్పటల్ లో మరణించారు. అద్దె ఇంట్లో ఉంటున్నారు కాబట్టి శవాన్ని ఇంట్లో కి తీసుకురాకూడదు ఎలా ? అన్నది సమస్య . అదే అపార్ట్మెంట్ లో ఉంటున్న ఒకరు తమ కార్ పార్కింగ్ లో శవాన్ని పెట్టటానికి పర్మిషన్ ఇచ్చారు . అయితే మిగతా వారందరు ,గేట్ లోపలకి తీసుకువస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.అయితే పర్మిషన్ ఇచ్చిన వారు " మీ ఇంట్లో వారే ఎవరయినా చనిపోతే మీరు ఏమి చేస్తారు ? రోడ్ పైనే ఉంచుతారా ? ఇంట్లోకి తీసుకు రాకపోయినా కాంపౌండ్ లోకి కూడా తీసుకు రారా ?" అని అడిగారు. అద్దెకు ఉండేవారి కోసం మమ్మల్ని అంత మాట అంటారా ? అని వారి మీద ఎదురు దాడి   :(

అద్దెకుండేవారు , మనుషులు కాదా ?
చదవేస్తే ఉన్న మతి పోయిందని సామెత. ఇంట్లో మనిషి చనిపోతే ఏమి చేస్తారు ? పుట్టిన ప్రతి ఒక్కరూ ,ఏదో ఒక రోజు చనిపోతారు . అంత మాత్రానా ఆ ఇంటికి /అపార్ట్మెంట్ కి కీడు జరుగుతుందా ?21వ శతాబ్దం లో ఉన్నామా  ? లేదా ఆది మానవుల కాలం లో ఉన్నామా ? అర్థం కావటం లేదు. 


    

Sunday, 15 November 2015

సామాజిక బాధ్యత - సామాజిక సేవ

సామాజిక బాధ్యత - సామాజిక సేవ  ఈ రెండు ,ఒకటే అని నేను అనుకోవటం లేదు. తరచూ వినిపించే మాట ఏమిటంటే ,ఇక్కడ ప్రభుత్వపు /దేశపు డబ్బులతో చదువుకుని ,విదేశాలకు వెళ్లి అక్కడ సేవ చేస్తున్నారు ,స్వార్ధపరులు - దేశద్రోహులు -సామాజిక బాధ్యత లేదు వగైరా వగైరా !
ఈ దేశం లో చదువుకుని , ఈ దేశం లోనే ఉద్యోగం చేసుకుంటూ ఉంటే - దేశభక్తి , సామాజిక భాధ్యత ఉన్నట్లా ? మన పరిసరాలను శుభ్రం గా ఉంచుకోవటం మన (సామాజిక)బాధ్యత.వీధి దీపాలు ,ఒక్కోసారి మిట్టమధ్యాహ్నం కూడా వెలుగుతూ ఉంటాయి.అలా చూసినప్పుడు సంబంధిత శాఖ వారికి తెలియపరచటం కూడా (సామాజిక)భాధ్యతే ! వీధి కుళాయి నుంచి నీరు వృధాగా పోతూ ఉంటుంది,చూసినా కుళాయి కట్టేసే వారి కంటే పట్టించుకోకుండా పోయే వారే ఎక్కువ. పశువులను రోడ్ల మీదకు వదలకుండా ఉండటం ... తప్ప తాగి రోడ్ల మీద పడకుండా ఉండటం ... వగైరా . 

   









 సామాజిక సేవ విషయానికి వస్తే ... ఆపదలో ఉన్న వారికి సహాయం చెయ్యటం , పేద పిల్లలకు సహాయం చెయ్యటం , వారిని చదివించటం ...
కొంతమంది గ్రామాలను దత్తు తీసుకుని వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు . పుట్టి పెరిగిన ఊరు కు సౌకర్యాలు కల్పించటానికి , ఆ ఊరి లోనే ఉండనవసరం లేదు .
భాధ్యత అనేది తప్పనిసరిగా చెయ్యాల్సినది . కాని మనం చెయ్యం అనుకోండి :)

సేవ అనేది ఒకరు డిమాండ్ చేస్తే చేసేది కాదు . తప్పనిసరి కూడా కాదు . అది ఎవరికి వారు ఇష్టం తో చేసేది .


Wednesday, 14 October 2015

The Boy in the Striped pyjamas

నేను  ఇంగ్లిష్ సినిమాలు ఎక్కువ చూడను , అర్ధం కావు కనుక. ఎప్పుడన్నా టివీ లో సబ్ టైటిల్స్ చదువుకుంటూ చూస్తూ ఉంటాను :) అలా చూసిన వాటిలో నచ్చిన సినిమా ఒకటి -   The Boy in the Striped pyjamas .

ఈ సినిమా , యుద్ధ సమయం లో పిల్లల అమాయకత్వం , స్నేహం కోసం పడే తపనని అందం గా ఆవిష్కరించింది . 
 
బ్రూనో  8 ఏళ్ల బాలుడు . హోలోకాస్ట్ సమయంలో నాజీ జర్మనీలోని  బెర్లిన్ లో తన కుటుంబంతో ఉంటాడు. అతను తన తండ్రికి ప్రమోషన్ వచ్చినందు వల్ల ,గ్రామీణ ప్రాంతానికి షిఫ్ట్ అవుతారు.బ్రూనో కి తనతో   ఆడటానికి ఎవరూ లేనందున కొత్త ప్రదేశం నచ్చదు . అంతే  కాకుండా  తోట లో ఆడడం  నిషేధం ,ఇంకో కారణం . 
ఒక రోజు బ్రూనో , తల్లి తండ్రుల ఆజ్ఞ మీరి తోట లో ఆడుకుంటూ ఒక శిబిరం చుట్టూ ఉన్న  విద్యుత్ ముళ్ల కంచె చేరుకుంటాడు. అక్కడ శిబిరం లో ఉంటున్న తన వయసు బాలుడు తో పరిచయం ఏర్పడుతుంది . బ్రూనో క్రమం తప్పకుండా ఆ పిల్లవాడికి(Shmuel ) ఆహారం తెచ్చి ఇస్తూ ,ఆడుతూ ఉంటాడు.Shmuel , తన తండ్రి కనిపించటం లేదని బాధ పడటం చూసి ,బ్రూనో -తన స్నేహితుడి తండ్రి ని వెదకటం లో సహాయం చేస్తానని హామీ ఇస్తాడు .   

ఒక దుర్దినాన ,బ్రూనో ఖైదీల దుస్తులు ధరించి ,కంచె ఆవలి మరణ శిబిరం లోకి ప్రవేశిస్తాడు.స్నేహితులు ఇద్దరు  Shmuel తండ్రి కోసం వెతుకుతుండగా , వారిని సైనికులు చుట్టు ముట్టి ఇతర ఖైదీలతో పాటు గాస్ చాంబర్ లో  వేస్తారు. అలా ఆ బాలురిద్దరూ విషాదకరం గా మరణిస్తారు.

మనం మంచి చేస్తే మంచి ,చెడు చేస్తే చెడు తిరిగి వస్తాయి అనే దానికి ఉదాహరణ , ఈ సినిమా . తండ్రి చేసిన పాపానికి కొడుకు (బ్రూనో ) బాలి అవటం విషాదకరం .



 
 
  

Friday, 7 August 2015

మేఘ మాలికలు

 చూడు చూడు ,మబ్బులు ఎంత బావున్నాయో !
మబ్బుల్ని ఎప్పుడూ చూడలేదా ?
హ్మ్ !
ఒక్క మబ్బులు విషయమనే కాదు,ఏ విషయం లో అయినా ప్రకృతి ఆరాధకులు,అనారాధకులు మధ్య జరిగే సంభాషణ ఇంచుమించు ఇలానే ఉంటుంది  :) 
పావురాలే కాదు ,మేఘాలతో కూడా సందేశాలు పంపించొచ్చు . ఇలా మేఘమును రాయబారిగా ఎంచుకొనే కల్పనలో కాళిదాసే ప్రధముడు. (మేఘ సందేశం )
ఇక సినిమా ల విషయానికి వస్తే ,మేఘాల ప్రస్తావనతో కూడిన పాటలు ఎన్నో !
ఆకాశ వీధిలో హాయిగా అంటూ భానుమతి 
ఓహో ,మేఘమాల అంటూ సావిత్రి 
నీలి మేఘమా ,జాలి చూపుమా అంటూ చంద్రకళ 
మేఘమా దేహమా అంటూ సుహాసిని 
మేఘమా నీలి మేఘమా అంటూ సుమలత 
తమ మనసు లోని భావాలు /విన్నపాలు మేఘాలకే విన్నవించుకున్నారు . 
విషాదమే కాదు ,ఆనందం కూడా ... 
మేఘాలలో తేలిపోమ్మన్నది 
మేఘాలే తాకింది హాయ్ హైలెస్సా ... 
ఇక ఇలా రాసుకుంటూ పొతే లిస్టు చాంతాడంత అవుతుంది . 
అలాగే సామెతలు ... 
మబ్బుల్లో నీటిని చూసి ముంత వొలకపోసుకున్నట్లు 
మన కథలు/కావ్యాలు/నవలల్లో కూడా మబ్బుల్ని రకరకాలు గా వర్ణించారు 
వెండి తో ఒకరు పోలిస్తే (వెండిమబ్బులు ) మరొకరు దూది పింజలతో ... మీగడ తరకలు ,కారు మబ్బులు వగైరా వగైరా
కుక్కపిల్ల ,అగ్గిపుల్ల ,సబ్బు బిళ్ళ -  కాదేదీ  కవితకు అనర్హము అన్నారు ఓ కవి . అలాగే కబుర్లు కి కూడా . ప్రతీ దాని గురించి అనర్ఘళం గా కబుర్లు చెప్పుకోవచ్చు
















Friday, 26 June 2015

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం

 
మార్జువానా వనం లో నేతి బీర పువ్వు 
 
గంజాయి వనం లో తులసి మొక్క - ఈ పద ప్రయోగం వినని వారు ఉండక పోవచ్చు.కాని పైన రాసిన కాప్షన్ ఎవరూ విని ఉండరు ,ఎందుకంటే ఇంతకు ముందు ఎవరూ అనలేదు ,మొదటిసారిగా నేనే రాసాను కాబట్టి 
 
ఈ మధ్య జలంధర్ వెళ్ళినప్పుడు ,మేమున్న( క్వార్టర్స్ )ఇళ్ళవద్ద ,రోడ్ కిరువైపులా ఎక్కడ పడితే అక్కడ ,ఈ ఫోటోలో చూస్తున్న మొక్కలే.వాటిని చూసి ,గోంగూర మొక్కల్లా ఉన్నాయి ,పూలను చూస్తే గోంగూరపూలలా లేవు,ఏమి మొక్కలో ఇవి అనుకున్నాము.తర్వాత తెలిసింది,అవి మార్జువానా(గంజాయి)మొక్కలు అని.ఇంకా నయం గోంగూరలా ఉందని ,కోసి కూర వండుకోలేదు  ఉత్తరభారతదేశంలో ,హోలీపండగ సమయం లో ఈమొక్కల ఆకులతో  పకోడీలు చేసుకుని తింటారు.ఆకులు,పువ్వులతో పానీయం చేసుకుని తాగుతారు.పంజాబ్ లో శివరాత్రి కి  ఆకులు ,పువ్వులతో పానీయం చేసుకుని  తాగుతారు. 
ఈ మొక్కలనుంచి లభ్యమయ్యే నారను,విత్తనాలనుంచి నూనెను పారిశ్రామిక అవసరాల కోసం వాడుతారు.ఔషధ తయారీ లోనూ ఉపయోగిస్తారు.    
 
ఐక్యరాజ్యసమితి ,ప్రపంచ మానవాళిని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా చైతన్యవంతం చేయడానికి ప్రతి ఏటా జూన్ 26వ తేదీని అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినంగా ప్రకటించింది.
 
కానీ , మన దేశం లో మాదక ద్రవ్యాల వినియోగం అరికట్టటానికి ఉన్న చట్టాలు అమలు అవుతున్న తీరు ఆక్షేపణీయం . 
 
Transport and cultivation of cannabis to be illegal in India,but legal and/or tolerated (for personal use in small quantity) in several states such as West Bengal, Bihar, Orissa Tripura, and the North East due to Hindu customs.These  states have their own laws as per which cannabis is legal and can be obtained from govt. excise shops. 
 

     


Wednesday, 24 June 2015

జలియన్ వాలా బాగ్

జలియన్ వాలా బాగ్ - పంజాబ్ లోని అమృత్ సర్ లో గోల్డెన్ టెంపుల్ సమీపం లో ఉన్న పబ్లిక్ పార్క్.పంజాబీల నూతన సంవత్సరం బైసాఖీ రోజున ,జనరల్ డయ్యర్ జరిపించిన కాల్పులలో(కాల్పులలో మరణించిన వారు కొందరు , బయటకు వెళ్లేందుకు వేరే మార్గం లేక ,ఆ పార్క్ లోనే ఉన్న బావి లో దూకి మరణించిన వారు కొందరు.) మరణించిన వారికి చెందిన స్మారక చిహ్నం ఉన్న స్థలం.


పార్క్ లోనికి ,బయటకు వెళ్ళే ఏకైక మార్గం   
 
 
 
 
బుల్లెట్ మార్క్స్ ఉన్న గోడలు    
 


 
 

 

Thursday, 18 June 2015

Pushpa Gujral Science City

మాజీ ప్రధాని I.K.Gujral  అమ్మగారి పేరు తో నిర్మించిన ఈ సైన్స్ సిటీ చూడటానికి ఎంతో బాగుంది. ఒక రోజు అంతా సరిపోతుంది ,పూర్తిగా చూడటానికి. జలంధర్ వెళ్తే తప్పక చూడాల్సిన వాటిలో ఒకటి.పిల్లలనే కాదు ,పెద్దలనూ అలరిస్తుంది.లేజర్ షో చాలా బాగుంది . 
 


 
 మన పూర్వీకులు -కోతులు అని చదువుకున్నాము కదా !కోతి  నుంచి ఇప్పటి రూపానికి మధ్య లోని దశలు ,బొమ్మల రూపం లో చూడొచ్చు . 

 
 
 
 వర్చ్యువల్ గేమ్స్ ఆడుకోవచ్చు. వివిధ గ్రహాల పైన మీరు ఎంత బరువు ఉంటారో తెలుసుకోవచ్చు.ఆస్ట్రోనాట్ రూపం ధరించొచ్చు :)కొద్ది క్షణాలు న్యూస్ రీడర్ అవతారం దాల్చొచ్చు . 
    
 Apollo 16, 17 చంద్రుని పై  సేకరించిన రాళ్లు  చూడొచ్చు . 
 
 


 
 
 
 మాజిక్ చెయ్యటం తెలియదా ? పర్వాలేదు ,ఇక్కడ ఫోటో దిగి మాజిక్ చేసాను అని  చెప్పొచ్చు  :)
 
 
 నేను చెప్పింది 1 % మాత్రమే . మిగతావి చూసి తెల్సుకోవాల్సిందే :) 
 
 ఇవాళే న్యూస్ లో చూసాను - మండలానికో వైన్ షాప్ మంజూరు ... ఎవరిని ఉద్దరించటానికో ?
విజ్ఞానం ,వినోదం పంచే    ఇలాంటి సైన్స్ సిటీ లు ,ప్రతి ఒక్క రాష్ట్రం లో ఉంటే బాగుంటుంది . 

Wednesday, 10 June 2015

అవసరమా ?

 వాఘా బోర్డర్ వేడుక -
 
భారత్ ,పాకిస్తాన్ దేశాల సరిహద్దు వద్ద జరిగే  ఇలాంటి వేడుక ప్రపంచం లో మరెక్కడ లేదు.ఈ వేడుక ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయానికి రెండు గంటల ముందు మొదలు అయ్యి ,సూర్యాస్తమయ సమయానికి ఇరు దేశాల జండాలు ఒకే సమయంలో క్రిందకు దించటంతో పూర్తి అవుతుంది.రెండు గంటలకు attari కి చేరుకున్న మేము ,సెక్యూరిటీ చెక్ లు అన్నీ పూర్తీ చేసుకుని ,గ్యాలరీ చేరుకునే సరికి 4 అయ్యింది.చూడటానికి వెళ్ళిన వారు ,ఆసక్తి ఉంటే మన దేశపు జండా పట్టుకుని పరుగులు పెట్టవచ్చు. ప్లే చేస్తున్న పాటలకు డాన్సు చెయ్యొచ్చు :)మా అమ్మాయి ,మేనకోడలు - ఇద్దరు  జెండా పట్టుకుని పరుగు పెట్టి వచ్చారు. వేడుక జరుగుతున్నంత సేపు ఒక రకమైన భావోద్వేగం . చూడటానికి బాగుంది . కానీ ,ప్రతి రోజూ ,కొన్ని గంటల సమయం వృధా చెయ్యటం - అవసరమా అనిపించింది .