దిష్టి మంత్రం :
దిష్టి అనేది ఉందనో లేదనో ,నేను స్టేట్మెంట్ ఇవ్వటం లేదు.దిష్టి ఉందని నమ్మేవాళ్ళు ,నమ్మని వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఇక నా సంగతికొస్తే నమ్మాలా ,వద్దా అని సందిగ్దం.జీవిత పయనం లో మనకు కలిగే సందేహాలకు చాలా వాటికి సమాధానాలు ఉండవు / దొరకవు.కొన్ని నమ్మకాలకు లాజిక్ లు ఉండవు.మన అనుభవం లోకి వచ్చే కొన్ని సంఘటనల వల్ల కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి.అవి ఎదుటివారికి వింతగానో పిచ్చిగానో అనిపించవచ్చు.
చిన్నప్పుడు,ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే,వచ్చిన అతిధులు అందరూ వెళ్లిపోయినాక ఇంట్లోని చిన్నపిల్లలకు దిష్టి తీయటం అనేది సాధారణంగా జరిగేదే !అలాగే బయటకు వెళ్లి వచ్చినా !
చీపురుకట్ట తల చుట్టూ3సార్లు తిప్పి అవతల పడవేసి,అరచేతులు తలకు ఆనించుకుని మెటికలు విరిచేవాళ్ళు.అలా చేసినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దిష్టి బాగా ఉందనో,లేదనో అనుకునే వాళ్ళు.దిష్టి ఎక్కువ ఉందని అనుకుంటే,ఇంకోసారి కళ్లుప్పు తో రిపీట్ ... అప్పటికి కూడా దిష్టి పోలేదు, ఇంకా ఉంది అనుకుంటే ఒక గుడ్డ పీలికను నూనె లో ముంచి,నూనె పిండేసి దానికి నిప్పంటించి అట్లకాడ పై వేసి తల చుట్టూ తిప్పేవాళ్ళు.అలా తిప్పినప్పుడు నూనె బొట్లు పడితే దిష్టి ఉన్నట్లు.పడకపోతే లేనట్లు.
ఒకసారి నాకు జ్వరం వచ్చింది.ఎంతకీ తగ్గలేదు. మా కాంపౌండ్ లోనే ఉంటున్న నాగరత్నం ఆంటీ(ఆంటీ వాళ్ళు బొంబాయి లో ఉండి వచ్చారు.మాట్లాడే ప్రతి మాటకి ముందు బొంబాయి ప్రసక్తి తీసుకు వస్తారని ఆవిడకు బొంబాయి అని నిక్ నేం పెట్టారు.ఆవిడ కూడా అది ఒక బిరుదులా ఫీల్ అయ్యేవారు)మా అమ్మకు, దిష్టి మంత్రం వేయించమని సలహా ఇచ్చారు.మేముండే దగ్గరే రోడ్ కు ఆవలి వైపు,కొత్తగా కాలనీ ఒకటి ఏర్పడింది.అక్కడ ఒక మామ్మగారు దిష్టి మంత్రం వేస్తారు అని చెప్పారు.ఆవిడ మంత్రం వేసినందుకు డబ్బులు ఏమీ తీసుకునేవారు కాదు.గుప్పిట్లో పట్టినన్ని బియ్యం తీసుకు వెళ్ళాలి.ఆవిడ ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ,కళ్ళు మూసుకుని మంత్రం చదివి బియ్యం మీద మూడుసార్లు ఊది ఆ బియ్యాన్ని తిరిగి మనకే ఇస్తారు.వాటిని వేరే బియ్యంతో కలిపి అన్నం వండుకుని తినాలి.ఆవిడ కు ఎలా తెలుస్తుందో మరి,దిష్టి ఎక్కువ ఉంది - రెండు లేదా మూడు సార్లు మంత్రం వెయ్యాలి అని చెప్పేవారు. కొన్ని సార్లు ఒక్కసారి వేస్తే సరిపోయేది. రోజుకు ఒక్క సారే మంత్రం వేస్తారు కనుక ప్రతి రోజూ వెళ్లి మంత్రం వేయించుకు వచ్చేవాళ్ళం.మంత్రాలు ఉన్నాయా అంటే నేనేమి చెప్పలేను కాని ,దిష్టి వలన కలిగిన లక్షణాలు మటుకు అన్నీ ఆ మంత్రం తో మాయమయ్యేవి.
2 comments:
మంత్రం కన్నా నమ్మకం బలమైనదనుకుంటానండీ.. మంత్రం సంగతేమో కానీ దిష్టిని మాత్రం నేను నమ్ముతాను. ఎప్పుడో భవిష్యత్తులో దీనికి సైంటిఫిక్ రీజనింగ్ కూడా దొరకచ్చు అని నా అభిప్రాయం :-)
ఒక గుంపు/ఎక్కువ జనం ఉన్న ప్రదేశం లో CO2 ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి ,కొంచం తక్కువ స్టామినా ఉన్నవాళ్ళు సిక్ గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది.దానినే దిష్టి అనుకుంటాము అని నా అభిప్రాయం వేణు గారు .:)
Post a Comment