Tuesday 3 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు

నాకు 11 ఏళ్లప్పుడు నేను సికిందరాబాద్ వచ్చాను.నా తెలివితేటల మీద అపారనమ్మకం కల నా తల్లితండ్రులు ,ఎ,బి,సి,డి లు ,కాట్,రాట్ లాంటి చిన్న పదాలు మాత్రమే తెలిసిన నన్ను అమాంతం గా తెలుగు మీడియం నుంచి తీసుకొచ్చి ఇంగ్లిష్ మీడియం లో పడేశారు.దేశం కాని దేశం లో దారి తప్పిన బాటసారి లా అయ్యింది నా పరిస్థితి.మేము ఉన్న ఇంటి కాంపౌండ్ లో 4 ఇళ్ళు ఉండేవి.అందులో ఒక దాంట్లో ఇంటి ఓనర్ (కన్నడ)ఉండేవాళ్ళు.ఇంటి పక్కన మళయాళ మామి.ఆ పక్కన బెంగాలి బేన్జీ (బెహన్ జీ వాడుకలో అలా అయ్యింది)ఆవిడ కి మా అమ్మమ్మ గారి వయసు అయినా ,మా అమ్మ వాళ్లకు మాకు అందరికి బేన్జీ నే.వాళ్లకు చిన్నకిరాణా షాప్ ఉండేది.అర్జంట్ గా సరకులు ఏమన్నా కావాల్సివస్తే అక్కడనుంచి తెచ్చేవాళ్ళం.ఆ పక్కనే వరసగా తమిళియన్స్ ఇళ్ళు.ఆ ఏరియా లో తమిళియన్స్ ఎక్కువే ఉండేవాళ్ళు.తర్వాత ఒక ఆంగ్లోఇండియన్ వాళ్ళు.ఇంటి కి ఇంకో ప్రక్కన కూడా తమిళియన్స్ ,ఒక పంజాబీ ఫామిలీ ఉండేది. కాంపౌండ్ దాటి బయటకు వస్తే ఒక వైపు సికిందరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ ,ఇంకో వైపు ఆర్మీ క్వార్టర్స్ (హావ్లక్ లైన్స్)క్వార్టర్స్ మొదట్లో పార్క్ ఉండేది.అక్కడే మా ఆటలన్నీ!మెయిన్ రోడ్ కి ,ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉండేది.సాయంకాలం ,ఆ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు.అప్పుడప్పుడు పిల్లలం కూడా వెళ్లి వచ్చే,పోయే బస్ లను చూస్తూ కూర్చునేవాళ్ళం.ఇంటి కి దగ్గర లోనే మహంకాళి గుడి.అక్కడ కూర్చుంటే మహంకాళి గుడి కనిపిస్తూ ఉండేది.         
ఆగస్ట్ లో బోనాలు పండగ అప్పుడు చాలా సందడి గా ఉండేది.బోనాలు మొదలవుతాయనగా రెండు రోజులు ముందు గుడి దగ్గరకు పోలీస్ వ్యాన్ వచ్చేది.వ్యాన్ ఆగగానే బిల బిల కొంతమంది వచ్చి వ్యాన్ లో కూర్చునేవాళ్ళు. బోనాలప్పుడే కాకుండా ,మామూలు రోజుల్లో కూడా అప్పుడప్పుడు  పోలీస్ వ్యాన్ వస్తే అదే సీను.వీళ్ళకు సిగ్గు శరం లేదు,పోలీసులకు శ్రమ లేకుండా వాళ్ళే నవ్వుకుంటూ వచ్చి వ్యాన్ లో కూర్చుంటున్నారు అని పెద్దవాళ్ళు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. 

నాకు ఇంగ్లిష్ రాదు కాబట్టి ,ఇంగ్లిష్ నేర్పటానికి ట్యూషన్ ...   ట్యూషన్ టీచర్ -పేరు రాధ.మా స్కూల్లోనే ఎలెమెంటరీ సెక్షన్ లో పని చేసేవారు.మా చెల్లి,తమ్ముడు,కజిన్ అందరమూ అక్కడే !ఆ టీచర్ గారికి 4 పిల్లలు.ఆడ పిల్లల పేర్లు బొమ్మి మరియు కుట్టి.ట్యూషన్ కి వచ్చిన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చుంటే నన్ను మాత్రం సెపరేట్ గా వేరే రూం లో కూర్చోపెట్టే వాళ్ళు.పర్యవేక్షణ బొమ్మి మరియు కుట్టి.అరగంట కో సారి ఒక స్టూడెంట్ ని మలాయ్ చాయ్ తెమ్మని పంపించే వాళ్ళు.ఆ చాయ్ తేవటానికి పాపం చాలామంది రెడీ గా ఉండేవాళ్ళు.కాని ,అది తెచ్చే అదృష్టం ఒకరికే దక్కేది.ఎందుకంటే ఆ అబ్బాయి అయితేనే చాయ్ లో మలాయ్ ఎక్కువ వేయించుకుని వస్తాడంట. :)  

అలా ఒక్కదాన్నే కూర్చుని చదవాలంటే చాలా విసుగ్గా ఉండేది.అందరి లో కూర్చున్టానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కొంతలో కొంత రిలీఫ్ ఏమిటంటే బెన్నీ అని టీచర్ గారి బంధువు.తను గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు.అది వినటం.ఇక బొమ్మి అక్క,తను MA చదువుతుంది అనుకుంట.సరిగా గుర్తు లేదు.తన బుక్స్ ఇచ్చి నన్ను పెద్దగా చదవమనేది.అలా చదివితే తను చదువుకోవటం ,నాకు ఇంగ్లిష్ రావటం రెండూ జరుగుతాయి అని చెప్పేది.ఇలా కష్టాల కడలి లో ఈదుతూ చదువు కొనసాగిస్తూ ఉండగా ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. 

ఆ కష్టం ఏమిటి అనేది నెక్స్ట్ పోస్ట్ లో   :)                                              

No comments: