Wednesday, 31 December 2014

నాగేటి చాలు




ఈ కథల సంపుటి లోని కథలన్నీ వాస్తవానికి అతిదగ్గరగా ఎలాంటి అతిశయోక్తులు లేకుండా ఆసక్తితో చదివేలా ఉన్నాయి.ఏదో కాలక్షేపానికి చదివి అవతల పారేసే కథలు కాదు ,చదివిన వారిని ఓ క్షణమైనా  ఆలోచింపచేసే కథలు ఇవి. 
ఎప్పుడూ పేదవారిని ధనవంతులు దోచుకునే కథలు చదివి చదివి విసుగొచ్చిందా ?అయితే ఈ కథల సంపుటి లోని దొరకోటు చదవండి.తమవర్గం లోనివారే తమవాళ్ళను ఎలా మభ్యపెడుతున్నారో ,పేదవాళ్ళు,పేదవాళ్ళలానే మిగిలిపోవటానికి కారణం ఏమిటో తెలుస్తుంది.ప్రభుత్వ సంక్షేమపధకాలఫలాలు అందవలసిన వాళ్లకు సక్రమంగా అందుతున్నాయా?తెలుసుకోవాలంటే ,ఎండమావి చదవండి.
పురుగు,నాగేటి చాలు,పంట ,పెళ్లి షరతు,గిట్టుబాటు,పరిహారం,పగ కథలు - రైతుల కష్టాలు ,కడగండ్లను తెలుపుతాయి.
వానప్రస్థం ,గుండెలోతులు -నేటి కాలం లో కుటుంబం లోని వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలలో వచ్చిన మార్పును ప్రస్తావించే కథలు .      

ప్రచురణ :జనవరి 2014 ,విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ .

ఈ సంవత్సరానికి ఇదే ఆఖరు పోస్ట్

బ్లాగ్ వీక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు !

 
 

Thursday, 4 December 2014

 తిలక్ గారు రాసిన ఆర్తగీతం కవిత నుంచి నాకు నచ్చిన పంక్తులు కొన్ని ...



 
నా దేశాన్ని గూర్చి పాడలేను,నీ ఆదేశాన్ని మన్నించలేను
ఈ విపంచికకు శ్రుతి కలుపలేను
గత చారిత్రక యశ:కలాపమ్ము వివరింపకు .
బహుళ వీరానేక గాథాసహస్రమ్ము వినిపింపకు

ఇంక నన్ను విసిగింపకు
నేడు నేను కన్నీరు గా కరిగిన గీతికను,సిగ్గుతో రెండుగా
చీలిన వెదురు బొంగును,
మంటలో అంతరాంతర దగ్దమైన బూడిదను
 
నేను చూశాను నిజం గా మూర్తీభవత్ దైన్యాన్ని,హైన్యాన్ని
క్షుభితాశ్రు కల్లోల నీరధుల్ని,గచ్చత్ శవాకార వికారుల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి?ఏ విజ్ఞాన ప్రకర్షకుపశ్రుతి?
ఏ బుద్దదేవుడి జన్మభూమి కి గర్వస్మృతి

ఇంక నన్ను నిర్భంధించకు నేస్తం ! ఈ రాత్రి నేను పాడలేను,
ఈ కృత్రిమ వేషాన్ని అభినయింపలేను
మానవత లేని లోకాన్ని స్తుతింపలేను
మానవుని గా శిరసెత్తుకు తిరుగలేను
ఈ నాగరికతారణ్యవాసం భరించలేను
 

Tuesday, 2 December 2014

నచ్చిన కవిత ఒకటి

 
 
 
 
 
మరచిపోయిన సామ్రాజ్యాలకు 
చిరిగిపోయిన జండా చిహ్నం 
మాయమైన మహాసముద్రాలను 
మరుభూమి లోని అడుగుజాడ స్మరిస్తుంది 
 
శిధిలమైన నగరాన్ని సూచిస్తుంది 
శిలా శాసనం మౌనం గా 
ఇంద్రధనుస్సును పీల్చే ఇవాళ్టి మన నేత్రం
 సాంద్ర  తమస్సు పీల్చే రేపటి మిణుగురు పురుగు 
 
 
కర్పూర ధూమ ధూపం లాంటి 
కాలం కాలుతూనే ఉంటుంది
ఎక్కడో ఎవ్వడో పాడిన పాట 
ఎప్పుడో ఎందుకో నవ్వే పాప 
 
బాంబుల  వర్షాలు వెలిసి పోయాక 
బాకుల నాట్యాలు అలసిపోయాక 
గడ్డిపువ్వులు హేళన గా నవ్వుతాయి 
గాలి జాలిగా నిస్వసిస్తుంది 
 
ఖడ్గాన్ని రద్దు చేస్తుంది ఖడ్గం 
సైన్యాన్ని తినేస్తుంది సైన్యం
 పొలంలో హలంతో రైతు 
నిలుస్తాడివాళా ,రేపూ .  
 
 
ఈ కవిత, శ్రీ శ్రీ గారు రాసినది . 

Sunday, 23 November 2014

యాగంటి

అగస్త్య ముని ఈ ప్రదేశం లో వెంకటేశ్వరస్వామి ని ప్రతిష్టించదలచారట. అయితే విగ్రహపు కాలి గోరు విరగటం తో, ఆ విగ్రహాన్ని ఒక గుహ లో ఉంచి తపస్సు చేసారంట.శివుడు ప్రత్యక్షమవగా ,నేకంటి శివుని నేకంటి అని ఆనందం తో అన్నారంట. కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని ఒక కథనం. తన తప్పు ఏమన్నా ఉందా ?ఎందువలన  విగ్రహ ప్రతిష్ట కు భంగం కలిగిందని ప్రశ్నించగా ,శివుడు - ఈ క్షేత్రం కైలాసాన్ని తలపిస్తుంది ,కావున శివుని ప్రతిష్టించమని చెప్పారంట.అప్పుడు అగస్త్య ముని పార్వతీ సమేతం గా ఇక్కడ కొలువై ఉండవలసింది గా కోరటంతో,ఉమామహేశ్వరులు స్వయంభువులై వెలిశారు.ఇక్కడ ఒకే శివలింగం పై ఉమామహేశ్వరులు దర్శనమిస్తారు. 
ఇంకో కథనం ... చిట్టెప్ప అనే భక్తుడు కి శివుడు వ్యాఘ్ర రూపం లో కనిపించాడంట.అతడు ఆనందం తో నాట్యం చేస్తూ నేకంటి శివుని నేకంటి అని అన్నాడని ,కాలక్రమేణా అదే యాగంటి గా పిలవబడుతుందని . 
 
 
 

           

 
అగస్త్య పుష్కరిణి 
ఈ పుష్కరిణి లోకి నీరు నంది నోటి లో నుంచి వస్తుంది.అది ఎలా అన్నది ఇప్పటికీ తెలియని విషయం 
  
వెంకటేశ్వర గుహ (ఈ గుహ లోనే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచింది)
 
ఉమామహేశ్వర ఆలయ ద్వజ స్థంభం (కోతి కూడా పూజలు చేసుకుంటుంది)  

ఏ గుడి కి లేని విధం గా ,ఇక్కడ గుడి చుట్టూ ప్రాకారం నిర్మించారు.
ఈ ప్రాకారాన్ని చూసిన వెంటనే నాకు ,చైనా వాల్ గుర్తొచ్చింది :) 
 
 శంకర గుహ (వీర బ్రహ్మేంద్ర స్వామి ప్రతిష్టించిన శివలింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది )
 
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి భార్య ఉపయోగించిన రోలు (జనాలు ,రోలు కు కూడా పూజలు చేస్తున్నారు )
 
ప్రభుత్వం ,ఈ గుడిని జాతీయ వారసత్వ సంపద గా గుర్తించింది.  
 
 
 యాగంటి బసవన్న (కలియుగాంతం లో రంకె వేస్తుందని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో ఉంది )
 
గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు ,పని వారు రాయిని పగలకొట్టిన ప్రతిసారి తిరిగి అతుక్కుని పరిమాణం పెరుగుతూండేప్పటికి భయపడ్డారంట. శివుని ఆదేశం మేరకు స్వయానా ఆ నందీశ్వరుడు వేలిసాడంట.
ఇక్కడ ఉన్న నంది విగ్రహం చెక్కిన విగ్రహం కాదు,రాయి నంది ఆకారం దాల్చింది .
ఇప్పటికీ నంది ,పరిమాణం లో పెరుగుతూ ఉంది .     


Thursday, 20 November 2014

అహోబిలం contd.,

స్థల పురాణం ప్రకారం ,దేవతలు హిరణ్యకశ్యపుని చంపటానికి స్వామి దాల్చిన ఉగ్రరూపాన్ని కాంచి ,అహోబల అని స్తుతించారు అంట.అందువల్ల అహోబిలం/అహోబలం అనే పేరు.ఈ క్రింది శ్లోకం ఈ విషయాన్ని ధృవీకరిస్తుంది.  
 
"అహో వీర్యం,అహో శౌర్యం,అహో బాహుపరాక్రమ 
నరసింహం పరం దైవం అహోబిలం అహోబలం "
 
ఇంకో కథనం ఏమిటంటే ,గరుడ తపస్సు చేసిన గుహ వల్ల అహోబిలం అనే పేరు వచ్చింది అని. ఇక్కడ నరసింహ స్వామి గుహలో వెలిశారు. 
  
 మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకల్లా బయలుదేరి ఆరున్నర కి ఎగువ అహోబిలం చేరుకున్నాము.చిన్న    జలపాతం ...

 
 గుడి ప్రవేశ ద్వారం . 
 

 గుడి తెరవటానికి ఇంకా అరగంట టైం ఉండటం తో ,కొంతమంది గుడి ముందు శుభ్రం చేసి నీళ్ళు చల్లి ముగ్గులు వేసారు. మేము నలుగురైదుగురం కొండ పైకి వెళ్లి వరాహ నరసింహ స్వామి గుడి చూసి వచ్చాము.
 
వరాహ నరసింహస్వామి గుడి కి వెళ్ళే దారి ...  
  

                                    కొండ పైన చిన్న చిన్న జలపాతాలు చాలా నే ఉన్నాయి.
   
 
 
ఈ గుడి దగ్గర ,వెళ్ళే దారిలో కోతులు గుంపులు గుంపులు గా ఉన్నాయి. కొంచం సేపు వాటి విన్యాసాలు చూసి ఆనందించాము.
దైవ భక్తి ఉన్నా ,లేకపోయినా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించటానికైనా తప్పక వెళ్ళదగ్గది - అహోబిలం :)     
 
  

Wednesday, 19 November 2014

అహోబిలం

మహానంది లో దైవదర్శనం పూర్తి చేసుకుని అక్కడే గుడి వెలుపల  భోజనాలు చేసాము.ఆ తర్వాత అహోబిలానికి బయలుదేరాము.అక్కడికి చేరేటప్పటికి సమయం 7:30గం. బస్ లో కొంతమంది ఎగువ అహోబిలం లోని స్వామి ని   దర్శించుకోకుండా  ఈ గుడికి వెళ్ళకూడదు అని అనటం తో ఎగువ అహోబిలం వెళ్ళాము.మేము వెళ్ళేప్పటికి గుడి మూసివెయ్యడం తో తిరిగి దిగువ అహోబిలం వచ్చి లక్ష్మీనరసింహస్వామి ని దర్శించుకున్నాము.ఈ గుడికి వెళ్ళే దారి లో రెండు వైపులా మంటపాలు లాంటివి ఉన్నాయి.అందులో కొన్ని శిధిలమయి ఉన్నాయి .పూర్వం వాటిని దేని కొరకు ఉపయోగించారో తెలియదు కానీ ,ప్రస్తుతం అంగళ్లు ఉన్నాయి.గుడి లోపల ప్రాంగణం లో కూడా కొన్ని మంటపాలు శిధిలావస్థ లో ఉన్నాయి.
తిరుపతి వేంకటేశ్వరస్వామి వివాహం చేసుకునే ముందు నరసింహస్వామి ఆశీస్సులు తీసుకోవటానికి ఎగువ అహోబిలం  వచ్చారంట.అక్కడ స్వామి ఉగ్రరూపంలో ఉండటంచూసి,దిగువ  అహోబిలం వచ్చి  
లక్ష్మీనరసింహస్వామి  ని  ప్రతిష్టించారట.
ఇలాంటి టూర్ కి గ్రూప్ గా వెళితే అడ్వాంటేజ్ ఎంత ఉందో ,డిజ్అడ్వాంటేజ్ కూడా అంతే ఉంది.హడావిడి గా చూసి వచ్చెయ్యాలి.ఇంకోసారి మా ఫామిలీ వరకే వెళ్ళాలి అనుకున్నాము. ఎప్పటికి కుదిరేనో !      
             




            గుడి మంటపం లోని స్థంబాల పైన చెక్కిన విగ్రహాలకు కూడా భక్తులు పూజలు చేస్తున్నారు . 



 
 

Tuesday, 18 November 2014

మహానంది

 ప్రతి సంవత్సరం లానే కార్తీక మాసం లో ,సాయిబాబా గుడి వాళ్ళు శివ,వైష్ణవ గుడి సందర్శనకు ప్రోగ్రాం వేసారు.ఈ సంవత్సరం మహానంది,యాగంటి ,అహోబిలం ,మంత్రాలయం తీసుకు వెళ్ళారు. నంద్యాల కు 21 కి.మీ దూరం లో ఉన్న ఈగుడి  మొట్టమొదటగా 1500ఏళ్ళ క్రితం నిర్మించబడింది. కాలక్రమంలో అనేకసార్లు పునర్నిర్మించారు. ప్రపంచం లోనే అతిపెద్దదైన నంది విగ్రహం ఇక్కడ నంది పార్క్ లో ఉంది.ఇక్కడ ఉన్న కోనేటి లోకి నీరు ఎలా వస్తుంది అన్నది మిస్టరి.గర్భగుడి లో ఉన్న శివలింగం వద్ద నుంచి కోనేటి లోకి నీరు వస్తుంది అని అనుకోలు.కోనేటి లో నీరు చాలా స్వచ్చం గా ఉంది. ఈ గుడి ప్రాంగణం లోనే ఉన్న కామేశ్వరి అమ్మవారి  గుడి మంటపం పై కప్పు,స్తంభాల మీద చెక్కిన శిల్పాలను చూస్తే నిజం గానే  అందరూ చెప్తున్నట్టు దేవశిల్పి ఈ గుడి నిర్మాణం చేసి ఉండొచ్చు అని  నమ్మవచ్చు.మాటల్లో చెప్పలేనంత అందం గా ఉంది.నవనందుల్లో ఒకటైన వినాయక నంది ని కూడా దర్శించుకుని అహోబిలం వెళ్ళాము .

 
             ప్రవేశ ద్వారం 



 
కోనేరు లో ... 
 
 
 
 

Tuesday, 11 November 2014

ఎవరి అభిప్రాయాలు వారివి

 
 



నాకు ఏడుపుగొట్టు సినిమాలంటే  పరమ చిరాకు.ఆడవాళ్ళకు ఏడుపుగొట్టు సినిమాలంటే ఇష్టం.ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు.ఇలాంటి మాటలు ఎవరన్నా అంటే సహజం గానే ఖండిస్తాను. ఎందుకంటే నేను అలాంటి సినిమాలు ఇష్టపడను కనుక.సహజం గానే ప్రతి ఒక్కరు తమకు ఎదురైన సంఘటనలను బట్టో,తన చుట్టూ ఉన్న వారిని చూసో తమకంటూ కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు.వాటికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి అభిప్రాయాలను మన్నించరు.వారేదో తప్పుగా మాట్లాడారు అనుకుంటారు. 
 
పంచతంత్రం చదివినవారికి "బ్రాహ్మణుడు- నల్లమేక కథ గుర్తుండి ఉంటుంది.దొంగలు,మేకను కుక్క అని నమ్మించి  కాజేస్తారు.అబద్దానైనా పదే పదే  వల్లిస్తే అదే నిజమని బ్రమించే మనుషులకు ఈ లోకం లో కొదవ లేదు.ప్రస్తుతం సమాజంలో జరుగుతున్నది అదే !నిజాలకంటే అబద్ధాలకే ప్రాధాన్యత ఎక్కువ.ఎదుటివారు చెప్పేదాన్ని ,పూర్తి అవగాహన లేకుండా  ఖండించటం ఎంత తప్పో ,డూ డూ బసవన్న లా తల ఊపుతూ ఆమోదించటం కూడా అంతే తప్పు.   





                            


Wednesday, 29 October 2014

పునర్దర్శన ప్రాప్తి

పునర్దర్శన ప్రాప్తి రస్తు .
 తిరపతో ,శ్రీశైలమో ... కొంచం పేరున్న గుళ్ళకు వెళ్ళినప్పుడు పునర్దర్శన ప్రాప్తి అని రాసి ఉండటం చూసే ఉంటారు . మొదటి సారి చదివినప్పుడు ఇలా అయితే ,ఒక్కసారి ఆ గుడి కి వెళితే జీవితాంతం వెళుతూనే ఉండాలి అని అనుకోని నవ్వుకున్నాను.ఒక్కసారి వెళ్ళటమే గగనం ,మళ్లీ వెళతానా అనుకున్నాను కానీ , మూడున్నర సంవత్సరాల తర్వాత శ్రీశైల మల్లిఖార్జుని మళ్లీ దర్శించుకునే భాగ్యం కలిగింది. అదీ కార్తీక మాసం ,మొదటి సోమవారం . విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ చాలా చక్కగా దర్శనం అయ్యింది . 
 
 

 
 
 
 
శిఖర దర్శనం కోసం వెళ్తే ,ఆలయ శిఖరం కనిపించలేదు. అంతా పొగమంచు తో నిండిపోయి ఉంది . ఈ కోతి  కనిపించింది . కోతి కూడా ఆలయ శిఖరం కనిపిస్తుందేమో అని చూస్తున్నట్టు ఉంది కదా !
 
 
 
 
 

Sunday, 12 October 2014

పెంపకం

 
 
 
 
 
ఈ రోజు వాకింగ్ కి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన 
 
మాముందు చిన్నపిల్లలు ఇద్దరు పరిగెడుతూ కింద పడ్డారు . ఆ పిల్లల వెనక ఉన్న ఆయన ,ఆ పిల్లలను పైకి లేపకుండా,ఏం పెంపకం ?అసలు వాళ్ళ అమ్మ నాన్నలను అనాలి ,పిల్లలను అలా వదిలేసారు అంటూ   పెంపకం గూర్చి లెక్చర్ మొదలు పెట్టాడు. ఆ పిల్లలు పరిగెడుతూ పడిన దానికీ పెంపకానికి సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. ఒకప్పటి కాలం లో బయట ఎక్స్పోజర్ తక్కువ కాబట్టి ,పిల్లల సత్ప్రవర్తన అయినా దుష్ప్రవర్తన అయినా తల్లి తండ్రుల మీద ఆధారపడి ఉండవచ్చు. ఇప్పటి కాలంలో, ఒక వయసు వరకే  తల్లితండ్రుల ప్రభావం . ఆ తర్వాత  పిల్లల మీద తల్లితండ్రుల ప్రభావం  కంటే ,స్నేహితులు సమాజ ప్రభావమే ఎక్కువ. ఒక వ్యసనపరుడి కొడుకు వ్యసనపరుడే అవుతాడని ఏమీ లేదు.అలాగే అసలు ఏ వ్యసనాలు లేని వ్యక్తి పిల్లలు వ్యసన పరులు అవ్వొచ్చు.  సరే ,దేనినైనా వ్యతిరేకించేవాళ్ళు " ఎక్సెప్షన్ స్  ఉంటాయి అనవచ్చు "  కాని అలాంటి వాళ్ళను ఈ సమాజం లో చాలా మందినే చూస్తూ ఉంటాము. నాకు తెలిసిన ఒక వ్యక్తి " మా అమ్మ,నాన్న - నన్ను చాలా పధ్ధతి గా పెంచారు "అని అంటూ ఉంటారు. ఎవరి అమ్మా నాన్న అయినా పధ్ధతి గానే పెంచుతారు. క్రైమ్ చెయ్యమనో ,చెడు అలవాట్లు నేర్చుకోమనో ఎవరూ చెప్పరు.  అలా తయారు అవ్వటానికి, స్నేహితులు ,సమాజం యొక్క ప్రభావం చాలానే ఉంటుంది.    
 
    

Thursday, 25 September 2014

ఒకానొక ఊరిలో ఒకానొక సర్వే







ఆంజనేయస్వామి కి ఆధార్ కార్డ్ . కొన్ని జోక్స్ కన్నా ఇలాంటి న్యూస్ చదివితే బాగా నవ్వొస్తుంది. రాజశేఖర్ రెడ్డి హయాం లో 40 రూపాయలు వసూలు చేసి మరీ రేషన్ కార్డ్లు ఇచ్చారు . మా పక్కింటి ఆవిడ వాళ్ళ పిల్లల వయసులు సరిగ్గానే చెప్పారు కాని ఆవిడ వయసు తగ్గించి చెప్పుకున్నారు. వాళ్ళ పెద్ద అమ్మాయి వయసు 23 ఏళ్ళు అయితే ఆవిడ వయసు 32మాత్రమే. వివరాలు రాసుకునే ఆవిడ  కూడా అదేంటి అనే ప్రశ్న వెయ్యకుండా   రాసుకుని వెళ్ళారు ,కార్డ్ లో కూడా అలాగే వచ్చింది.తెల్ల కార్డ్ కి అర్హులు కాకపోయినా వాళ్ళు ఇచ్చిన వివరాల్ని బట్టి తెల్ల కార్డ్ వచ్చింది.కొన్నాళ్ళు మేము ఆవిడని ఆటపట్టించి నవ్వుకున్నాము. ఏ విధమైన సర్వే అయినా ,డేటా కలెక్ట్   చేసిన దానిలో నిజం కంటే అబద్దం పాళ్ళే ఎక్కువ .

మేము డిగ్రీ ఫైనల్ చదివేప్పుడు ప్రాజెక్ట్ వర్క్ లో భాగం గా ,మా కాలేజ్ వాళ్ళు దత్తు తీసుకున్న గ్రామం లో సర్వే కి వెళ్ళాము.వారానికి ఒక రోజు (శనివారం) సర్వే చేయటానికి కేటాయించారు. మొదటిసారి వెళ్ళినప్పుడు కొంతమంది అసలు తలుపు తెరవలేదు. కొంతమంది తలుపు ఓరగా తెరిచి ఎందుకు వచ్చారు అని అడిగి ,సర్వే అని చెప్పగానే టక్కున తలుపు వేసుకున్నారు.కొంతమంది డబ్బులు ఇస్తారా అని అడిగి ,ఇవ్వము కాలేజ్ నుంచి వచ్చాము అనగానే అయితే వివరాలు ఎందుకు ?అని ,కొంతమంది ... ఇలా చాలామందే వచ్చి రాసుకెళ్ళారు ,ఎవరూ ఏమి చెయ్యలేదు ,మీరయినా అంతే మేము చెప్పమని ... లంచ్ టైం అయ్యింది ,కనీసం ఒక్క ఇంటి వివరాలు కూడా తీసుకోలేక పోయాము.భోంచేసి మళ్లీ వెళ్ళొచ్చులే  అని కాలేజ్ బస్ దగ్గరికి వెళ్లి భోజనం కానిచ్చాము.ఆ తర్వాత కూడా నో యూజ్.నెక్స్ట్ డే ,మా లెక్చరర్ గారు ఏమంటారో అని కొద్దిగా భయపడుతూనే క్లాస్ కి వెళ్ళాము.అయితే అందుకు భిన్నం గా ,పర్వాలేదు ,రెండు మూడు సార్లు విజిట్ చేస్తే ఆ ఊరు వాళ్ళు మీకు పరిచయమవుతారు ,అప్పుడు ఈజీ గా వివరాలు సేకరించవచ్చు అన్నారు.

సెకండ్ విజిట్ లో వివరాలు సేకరించలేకపోయినా కొద్దిగా మాటలు కలిపి కొంతమందిని పరిచయం చేసుకోగలిగాము.ఆ తర్వాతి విజిట్ లో ఒక ఇంట్లో సంభాషణ ...

మీ పేరు ?
-----
మీ ఆయన పేరు ?
ఎవరయినా ఆయన పేరు చెప్తారా ?
చెప్తే ఏమవుతుంది ?
చెప్పకూడదు
మీ వయసు ?
మీకు మల్లే పేపర్ లో పుస్తకాల్లో రాసి పెట్టుకుంటామ ,తెలియదు .
పిల్లలు ఎంతమంది ?
---
వాళ్ళ వయసు ఎంత ?
తెలియదు
మీ పిల్లల వయసు మీకు తెలియదా ?
---
మీకు పొలం ఎంత ఉంది ?
తెలియదు

ఒక్క పేర్లు తప్పించి ,ఎలాంటి వివరాలు సేకరించలేకపోయాము . మగవాళ్ళు ఉన్నప్పుడు వస్తే పొలము, ఆదాయ వివరాలు తెలుస్తాయి అని చెపితే వాళ్ళు ఎప్పుడు ఉంటారు అని అడిగి ఆ టైం కి మళ్లీ వెళ్ళాము . ఒకరు రెండు ఎకరాలు పొలం ఉంది అని చెప్పి ఆదాయం సంవత్సరానికి మూడు నాలుగు వేలు వస్తుందని చెపితే ,ఇంకొకరు అర ఎకరం పొలం - సంవత్సరానికి ఆదాయం 50,000 నుంచి 75,000 వస్తుందని ...
ఆదాయం తక్కువ వస్తుందంటే వాళ్లకు డబ్బు ఇస్తారేమో అనే అభిప్రాయం కొందరిదయితే , గొప్పలు చెప్పే వాళ్ళు కొందరు .
మేము రాసుకున్న వివరాలు ,పేర్లు తప్పించి మిగతావి అన్నీ కరెక్ట్ కాదు అని తెలుస్తూనే ఉంది.పిల్లల చదువుకునే క్లాస్ ని బట్టి వాళ్ళ వయసు వేసి ,పెద్దవాళ్ళకు  ఉజ్జాయింపుగా పిల్లల వయసును బేస్ చేసుకుని ,భార్య భర్తలకు 5 లేదా 6 ఏళ్ళు తేడా ఉంచి వేసాము.ఇక ఆదాయం విషయానికి వస్తే -  లైబ్రరీ కి వెళ్లి రెఫెరెన్స్ బుక్స్ తీసుకుని ,ఏ పంటకు ఎంత ఆదాయం అన్నది చూసుకుని 500, 1000 రూపాయలు ఎక్కువ లేదా తక్కువ కలిపి వేసాము.  అలా ఎలా అయితే ఏమి విజయవంతం గా సర్వే ని పూర్తి చేసాము :)

  
                       

Saturday, 13 September 2014

అనూరాధ /అనురాధ ?

 
 
 
అనూరాధ /అనురాధ  ఈ రెండిటిలో ఏది కరెక్ట్ ? అసలే దేశం మరియు ఆంధ్ర రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులలో ఉంటే ఈ సమస్య (అసలు సమస్యేనా ?) ముఖ్యమా ? ఇన్నాళ్ళూ ఈ సందేహం రాలేదు .అనూరాధ అనే రాస్తున్నాను . ఈ మధ్యే తెలిసింది ,అనూరాధ  అని రాయటం తప్పు అనురాధ అని రాయాలి అని . నివేదన సంపాదకులు రవికృష్ణ గారు  చెప్పారు . మీ పేరుకు అర్ధం తెలుసా అని అడిగితే , నేను - అర్ధం ఏముంటుంది ?ఒక నక్షత్రం పేరు అని చెప్పాను . అనూరాధ  అని రాయకూడదు అంటే బుక్స్ లో నక్షత్రం పేరు అలాగే రాస్తారు కదండీ అన్నాను . బుక్స్ లో తప్పు రాస్తున్నారు , అను రాధ  అంటే రాధను అనుసరించునది . అలా రాయటమే కరెక్ట్ అని చెప్పారు . ఒకరిని అనుసరించే వారిని అనుచరుడు అంటాము కానీ అనూచరుడు అనం కదా ? అలాగే మీ పేరు అన్నారు . వినటానికి సమంజసం గానే ఉన్నా ఒక విధం గా రాయటానికి అలవాటు పడ్డాక అంత తొందరగా మార్చుకోవటం కష్టమేమో ?

 
 

Monday, 8 September 2014

ఏమిటో ఈ సర్వే

ఓ రెండు రోజుల క్రితం మధ్యానం 2:45కి ఒక కాల్ వచ్చింది. నంబర్ తెలిసినది కాదు.ఎవరయి ఉంటారు అనుకుంటూ లిఫ్ట్ చేసాను . 
 
నేను : హలో ,ఎవరు ?
అటు : ఫోన్ సర్వే చేస్తున్నాము మేడం ,ఒక్క క్షణం లైన్ లో ఉంటారా ?
 
ఈ ఫోన్ సర్వ్ ఏమిటో ,దేని గురించి సర్వే ? తెలియకుండా ఎందుకు మాట్లాడటం ? అని ఫోన్ పెట్టేసాను . 
ఒక పది నిమిషాల తర్వాత మళ్లీ కాల్ ,చూస్తే సర్వే వాళ్ళే !ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాను . ఏమిటి మేడం లైన్ లో ఉండమన్నా కదా ,కట్ చేసేసారు ?
 
నేను : ఫోన్ సర్వే ఏమిటి ?ఎప్పుడూ వినలేదు ?
అటు : మీ ఫోన్ ఏ ఏరియా లో ఉందో లొకేట్ చేస్తున్నాము మేడం  
నేను : ఏ ఏరియా లో ఉందో లొకేట్ చేసి ఏమి   చేస్తారు ? ఎందుకు లోకేట్ చేస్తున్నారు ? సర్వే అంటే  ఏరియా లొకేట్
          చెయ్యటమే నా ?
 
అటు : లేదు మేడం ! మీకు లక్ష రూపాయల ఇన్స్యూరెన్స్ ఇస్తున్నాము . దాని గురించే ఇదంతా . 
నేను : మాకు ఇన్స్యూరెన్స్ అవసరం లేదు  అని ఫోన్ పెట్టేసాను . మళ్లీ ఫోన్ రింగవుతూ ఉంది ,చూస్తే వాళ్ళే !       ఫోన్     లిఫ్ట్ చేసి హలో అనగానే ,
 
ఏమిటండి మీరు ,మాటి మాటికి ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు ? అని ప్రశ్న . 
 నేను : మీరు మాటి మాటికి ఫోన్ ఎందుకు చేస్తున్నారు ? ఇన్స్యూరెన్స్ అవసరం లేదు  అని చెప్పాగా ,మళ్లీ ఫోన్ ఎందుకు చేసింది . 
అటు :  మేమేమన్నా మిమ్మల్ని డబ్బులు కట్టమన్నామా ? మీకు ఫ్రీ గా లక్ష రూపాయలు ఇన్స్యూరెన్స్ ఇస్తున్నాము అని చెప్పాగా ?
నేను :  ఫ్రీ గా ఎందుకు ఇస్తున్నారు ?
అటు :  అదేగా మరి ,మమ్మల్ని డీటైల్స్ చెప్పనివ్వకుండా మీరు ఫోన్ కట్ చేస్తున్నారు . 
నేను  : ఓహో ,నాకు ఫ్రీ ఇన్స్యూరెన్స్ వద్దు ,డీటెయిల్స్ కూడా  అవసరం లేదు  అని ఫోన్ పెట్టేసాను . 
 
మళ్లీ ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చెయ్యక పోవటం తో ఇక ఆపేశారు.  
 
ఫోన్ సర్వే ఏమిటో ,ఏరియా లోకేట్ చెయ్యటం ఏమిటో ,ఫ్రీ ఇన్స్యూరెన్స్ ఏమిటో ! అసలు సంగతి  ఆ పరమాత్మునికే ఎరుక  :))
 
 

Monday, 21 July 2014

కొండపాక రుద్రేశ్వర & కొమురవెల్లి మల్లన్న ఆలయం

820 ఏళ్ళ క్రితం కాకతీయ రాజు రుద్రదేవుడి పేరు మీద ,ఆ రాజు వద్ద పని చేసే 30 మంది సైనికులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆ గుడి పూర్తి గా శిధిలావస్థ కు చేరుకోవటం తో కొండపాక గ్రామస్థులు గుడిని పునర్నిర్మించారు. పురాతన గుడికి సంబంధించిన రాతి ధ్వజస్థంభం ,నటరాజు బండ (దేవదాసీలు,ఆ బండమీద నృత్యం చేసేవారట) కొత్తగా నిర్మించిన గుడిలో ఉంచారు.అలనాటి శాసనాలు ఓ రెండు ఉన్నాయి . 

మేము ముందుగా వేములవాడ వెళ్లి రాజరాజేశ్వరుని దర్శించుకుని కొండపాక వచ్చేప్పటికి గుడి మూసి ఉంది.అది చూసి నీరసం వచ్చింది.అక్కడే ఉన్న ఒక గ్రామస్తుడు,పూజారి గారి ఫోన్ నంబర్ ఇస్తాను ,ఫోన్ చెయ్యండి వస్తారు అని చెప్పటం తో కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యాము.నంబర్ తీసుకుని ఫోన్ చేసాము.పది నిమిషాలలో పూజారి గారు వచ్చారు.గర్భగుడిలోకి వెళ్లి,పూజారిగారు మంత్రాలు చదువుతుంటే స్వయంగా స్వామివారికి అబిషేకం చేసుకున్నాం. అందుకనే నాకు పేరున్న గుళ్ళకు వెళ్ళటం కంటే అంతగా ప్రాముఖ్యత లేని గుడికి వెళ్ళటమే ఇష్టం :)

                  




ఆ తర్వాత కొమురవెల్లి మల్లన్న ఆలయం కి వెళ్ళాము. చిన్న కొండ పైన   గుహ లో  ఆలయం ఉంది.మల్లిఖార్జున స్వామి సుమారు 500 ఏళ్ళ క్రితం స్వయం భూ గా గుహలో వెలిసారంట. ఇక్కడ స్వామి వారు విగ్రహ రూపం లో కేతమ్మ ,మేడాలమ్మ సహితం దర్శనమిస్తారు. 




   




చివరి రెండు పిక్స్ గూగుల్ సౌజన్యం తో .