Thursday, 19 December 2013

స్టాంప్ కలెక్షన్


మనం చేసే చాలా పనులు ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్న వేసుకుంటే కారణాలు దొరకవు.దీని వలన ఉపయోగం ఏమిటి అనే ప్రశ్న వేసుకుంటే చెయ్యాలి అనుకున్నవి చాలానే చెయ్యము.అప్పుడు జీవితం చాలా చప్పగా,ఆసక్తి అన్నదే లేకుండా ఉంటుందేమో!

మా నాన్నగారి ఫ్రెండ్ (వాళ్ళ వైఫ్ కువైట్ లో వర్క్ చేసేవారు )వాళ్ళ వైఫ్ పంపించారని,నాకు ఒక పెన్ (గ్రీన్ షేడ్ )ఒక కవర్ లో కొన్ని స్టాంప్స్ ఇచ్చారు.ఆ పెన్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం.చాలా బాగా రాసేది.మా ట్యూషన్ టీచర్ వాళ్ళ అమ్మాయి (బొమ్మి అక్క )ఆ పెన్ తనకు ఇస్తే, నాకు రెండు పెన్నులు ఇస్తాను అని చాల సార్లు అడిగింది కానీ,నేను ఇవ్వలేదు.డిగ్రీ వరకు అదే పెన్ ఉండేది.ఆ తర్వాత ఆ పెన్ ని పోగొట్టుకున్నాను. :(    ఇక స్టాంప్స్ - వాటిని చూసి,బాగున్నాయి అనుకుని కొన్ని రోజులు ఉంచి ఆ తర్వాత పారేసాను. 

సెలవలకు అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళితే, అక్కడ నా ఫ్రెండ్స్ అందరి దగ్గర స్టాంప్స్ ఆల్బమ్స్.కొత్తగా వచ్చిన సోషల్ టీచర్ కలెక్ట్ చెయ్యమని చెప్పారు అని ఎక్కువ కలెక్ట్ చేసిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు అని చెప్పారు.అది విన్నాక నేను పారేసిన  స్టాంప్స్ గుర్తొచ్చి అయ్యో అనుకున్నాను!   
   
స్టాంప్ కలెక్షన్ అనేది ఒక హాబీ అని, ఆ కలెక్ట్ చేసిన స్టాంప్స్ దాచటానికి ఆల్బం ఉంటుందని అప్పటికి తెలియదు.ఇక అప్పట్నుంచి నేను కూడా స్టాంప్స్ కలెక్ట్ చేద్దాము అనుకున్నాను. వాళ్ళ అందరికి సోర్స్ మా వరలక్ష్మి మామ్మ!వాళ్ళింటికి వెళ్లి ,ఇకనుంచి వాళ్లకు స్టాంప్స్ ఇవ్వొద్దు ,నాకే ఇవ్వాలి అని చెప్పాను.దానికి మామ్మ లెటర్ ఇంటికి వచ్చేటప్పటికే స్టాంపులు ఉండటం లేదమ్మాయ్,పోస్ట్మాన్ ని అడిగి తీసేసుకుంటున్నారు,  పోస్ట్మాన్ కి గట్టిగా చెప్పాలి ఇవ్వొద్దని ,ఈసారి నువ్వొచ్చెప్పటికి దాచి ఉంచుతాను అని చెప్పారు. ఒక 2 లేదా 3 సంవత్సరాలు కలెక్ట్ చేసి ఉంటాను.ఫ్రెండ్స్,చుట్టాలు సహాయం తో చాలా స్టాంప్సే కలెక్ట్ చేసాను.ఆ తర్వాత మానేసాను.స్టాంప్ కలెక్షన్ పోస్ట్స్ చూసే ఉంటారు కదా !ఇంకా పోస్ట్ చెయ్యాల్సినవి ఉన్నాయి.   


Monday, 16 December 2013

ఆధార్ కార్డ్

తుగ్లక్ పరిపాలన అది ఎలా ఉండేదో తెలియదు .కొంచం వింతగా/పిచ్చి గా ఉన్న వాళ్ళను తుగ్లక్ అని అనటం విన్నాను.దానిని బట్టి  తుగ్లక్ పరిపాలన అంటే పిచ్చిగా ఉంటుందని అనుకోవచ్చు అన్నమాట! ప్రస్తుత ప్రభుత్వ పరిపాలన అలానే ఉంది. 
 ఏ పని జరగాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, అన్నింటీకీ ఆ ఒక్కటే 'ఆధార'మంటూ అందరూ అంటుంటే,నేను కూడా ఆధార్ కార్డ్ నమోదు కేంద్రానికి వెళ్లాను.అది మా ఇంటి దగ్గర ఉన్న డైట్ కాలేజ్ లోనే ఉంది.తెల్లవారు ఝామున టిఫిన్ క్యారియర్ లతో వచ్చి జనం రోడ్ మీద నుంచుని ఉండేవాళ్ళు.కాలేజ్ గేట్ 10 గంటలకు కాని తెరవరు కదా,ఎందుకు ఇంత ప్రొద్దునే వచ్చి పడిగాపులు కాయటం అనిపించేది వాళ్ళను చూస్తే !సరే,పేరు నమోదు చేయించటానికి మొదటిసారి వెళ్ళినప్పుడు గుమ్మం వరకు చేరేటప్పటికి టైం అయిపోయింది ,రేపు రండి అని చెప్పి పంపించేసారు.మధ్యానం అయితే కొంచం జనం తక్కువ ఉన్నట్లున్నారు అని రెండో రోజు  మధ్యానం వెళితే ,ఇప్పుడు ఓన్లీ ప్రెస్ వాళ్లకు మాత్రమే ,రేపు రండి అని సలహా!ఆ విధం గా ఒక నాలుగు రోజులు తిరిగి విసుగొచ్చి కార్డ్ లేకపోతే వచ్చిన  నష్టం ఏమీ లేదులే అని ఇక వెళ్ళలేదు.ఆ తర్వాత రెండు నెలలకు,తొందరలో నమోదు కేంద్రాన్ని అక్కడనుంచి తీసివేస్తారని సమాచారం రావటంతో మళ్ళీ తిరుగుడు మొదలు.ఈ సారి ఒక రెండు రోజులు ప్రొద్దున,మధ్యానం తిరిగి ఎలాగయితే పేరు నమోదు చేయించుకోవటం లో విజయం సాధించాను. 
ఆ తర్వాత గాస్ సబ్సిడీ కావాలంటే డీలర్ ఆఫీస్ కి వెళ్లి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి అంటే అక్కడకు వెళ్ళాను.మాకు ఆధార్ కార్డ్ వచ్చేప్పటికి ఇల్లు మారాము.గాస్ బుక్ లో ఉన్న అడ్రస్ వేరు,ఆధార్ కార్డ్ లో ఉన్న అడ్రస్ వేరు కాబట్టి అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చెయ్యాలి,అది తీసుకు రండి అని చెప్పటం తో మళ్ళీ ఆ అడ్రస్ ప్రూఫ్ తీసుకువెళ్ళి ఎలా అయితే ఏమి ఆ పని కూడా పూర్తి చేసుకున్నాను.

The AADHAAR number is not recognized as a legal proof of residence due to issues with the data protection.   
 
ఇల్లు మారిన ప్రతిసారీ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్చెయ్యాల్సి వస్తే ఇంక ఆధార్ కార్డ్ ఎందుకో నాకు అర్ధం కాలేదు.సబ్సిడీలు పొందటానికి మాత్రమే ఆధార్ కార్డ్... 
నెక్స్ట్ బ్యాంక్ లో ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ చెయ్యటం . అది కూడా పూర్తయ్యింది. ఇంతలో ఈ న్యూస్ .
Adhaar Card Not Mandatory for LPG Subsidy'

By Express News Service - BANGALORE

Published: 08th December 2013 07:23 AM

It is not mandatory to display your Aadhaar card to get subsidies for LPG connections, Union Petroleum Minister M Veerappa Moily said. He added gas supply agencies insisted that customers show their Aadhaar card only to identify illegal connections.

నేను మా ఎదురింటి వాళ్ళింటికి వెళ్ళేప్పటికి ఆవిడ రాలి పడిన ఎండు కొబ్బరికాయలు ఏరి వాటి పీచు తీస్తున్నారు.నేను, ఆధార్ కార్డ్ అవసరం లేదంట అండి న్యూస్ వచ్చింది అనగానే ఆవిడ కోపం తో ఎవరండి చెప్పింది ,నా ఎదురుగా ఉంటే వాళ్ళ తల మీదే ఈ కొబ్బరి కాయను పగలకొడతాను అని అన్నారు.వాళ్ళు లైన్ లో నించోకుండా ,1000 ఇచ్చి (ముగ్గురి పేర్లు )నమోదు చేయించుకున్నారంట. ఎంత డబ్బు వేస్ట్ అండి ఓ బాధ పడిపోయారు . మళ్లీ ఇప్పుడు ఈ న్యూస్ ... 

December 13, 2013 13:39 IST
Link your Aadhaar number by January 31 to get LPG subsidy

ఇప్పుడు ఏది నిజమో తెలియదు . 
About Rs. 35 billion (Rs.3,500 crore) was spent on Aadhaar program from beginning (January-2009) till September2013 with enrollment of 50 crore persons. It includes operating costs as well as capital expenditure  

ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఎంతో కొంత క్లారిటీ ఉండాలి కదా ?వాళ్లకు లేదు సరే,జనాల్ని కూడా అయోమయం లో పడేస్తున్నారు .    


              

Thursday, 12 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 3




దిష్టి మంత్రం :

దిష్టి అనేది ఉందనో లేదనో ,నేను స్టేట్మెంట్ ఇవ్వటం లేదు.దిష్టి ఉందని నమ్మేవాళ్ళు ,నమ్మని వాళ్ళు రెండు రకాల వాళ్ళు ఉంటారు.ఇక నా సంగతికొస్తే నమ్మాలా ,వద్దా అని సందిగ్దం.జీవిత పయనం లో మనకు కలిగే సందేహాలకు చాలా వాటికి సమాధానాలు ఉండవు / దొరకవు.కొన్ని నమ్మకాలకు లాజిక్ లు ఉండవు.మన అనుభవం లోకి వచ్చే కొన్ని సంఘటనల వల్ల కొన్ని నమ్మకాలు ఏర్పడతాయి.అవి ఎదుటివారికి వింతగానో పిచ్చిగానో అనిపించవచ్చు. 

చిన్నప్పుడు,ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే,వచ్చిన అతిధులు అందరూ వెళ్లిపోయినాక ఇంట్లోని చిన్నపిల్లలకు దిష్టి తీయటం అనేది సాధారణంగా జరిగేదే !అలాగే బయటకు వెళ్లి వచ్చినా ! 
చీపురుకట్ట తల చుట్టూ3సార్లు తిప్పి అవతల పడవేసి,అరచేతులు తలకు ఆనించుకుని మెటికలు విరిచేవాళ్ళు.అలా చేసినప్పుడు వచ్చే శబ్దాన్ని బట్టి దిష్టి బాగా ఉందనో,లేదనో అనుకునే వాళ్ళు.దిష్టి ఎక్కువ ఉందని అనుకుంటే,ఇంకోసారి కళ్లుప్పు తో రిపీట్ ... అప్పటికి కూడా దిష్టి పోలేదు, ఇంకా ఉంది అనుకుంటే ఒక గుడ్డ పీలికను నూనె లో ముంచి,నూనె పిండేసి దానికి నిప్పంటించి అట్లకాడ పై వేసి తల చుట్టూ తిప్పేవాళ్ళు.అలా తిప్పినప్పుడు నూనె బొట్లు పడితే దిష్టి ఉన్నట్లు.పడకపోతే లేనట్లు.

ఒకసారి నాకు జ్వరం వచ్చింది.ఎంతకీ తగ్గలేదు. మా కాంపౌండ్ లోనే ఉంటున్న నాగరత్నం ఆంటీ(ఆంటీ వాళ్ళు బొంబాయి లో ఉండి వచ్చారు.మాట్లాడే ప్రతి మాటకి ముందు బొంబాయి ప్రసక్తి తీసుకు వస్తారని ఆవిడకు బొంబాయి అని నిక్ నేం పెట్టారు.ఆవిడ కూడా అది ఒక బిరుదులా ఫీల్ అయ్యేవారు)మా అమ్మకు, దిష్టి మంత్రం వేయించమని సలహా ఇచ్చారు.మేముండే దగ్గరే రోడ్ కు ఆవలి వైపు,కొత్తగా కాలనీ ఒకటి ఏర్పడింది.అక్కడ ఒక మామ్మగారు దిష్టి మంత్రం వేస్తారు అని చెప్పారు.ఆవిడ మంత్రం వేసినందుకు డబ్బులు ఏమీ తీసుకునేవారు కాదు.గుప్పిట్లో పట్టినన్ని బియ్యం తీసుకు వెళ్ళాలి.ఆవిడ ఆ బియ్యాన్ని చేతిలోకి తీసుకుని ,కళ్ళు మూసుకుని మంత్రం చదివి బియ్యం మీద మూడుసార్లు ఊది ఆ బియ్యాన్ని తిరిగి మనకే ఇస్తారు.వాటిని వేరే బియ్యంతో కలిపి అన్నం వండుకుని తినాలి.ఆవిడ కు ఎలా తెలుస్తుందో మరి,దిష్టి ఎక్కువ ఉంది - రెండు లేదా మూడు సార్లు మంత్రం వెయ్యాలి అని చెప్పేవారు. కొన్ని సార్లు ఒక్కసారి వేస్తే సరిపోయేది. రోజుకు ఒక్క సారే మంత్రం వేస్తారు కనుక ప్రతి రోజూ వెళ్లి మంత్రం వేయించుకు వచ్చేవాళ్ళం.మంత్రాలు ఉన్నాయా అంటే నేనేమి చెప్పలేను కాని ,దిష్టి వలన కలిగిన లక్షణాలు మటుకు అన్నీ  ఆ మంత్రం తో మాయమయ్యేవి.     

                        

Monday, 9 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 2

ఎక్కువ నచ్చినవి / ఇష్టమైనవి

వేసవి లో తర్బూజా తిని, గింజల్ని ఎండబెట్టి ఉంచేవాళ్ళం.హావలాక్ లైన్స్ (ఆర్మీ క్వార్టర్స్ ) చివరికి వెళ్ళితే పెద్ద పెద్ద కొండరాళ్ళు ఉండేవి.అప్పుడప్పుడు సాయంకాలం,ఆ ఎండబెట్టిన గింజల్ని తీసుకుని ఆ కొండరాళ్ళ దగ్గరకు వెళ్ళేవాళ్ళం.ఆ రాళ్ళ పైకి ఎక్కితే బేగంపేట్ విమానాశ్రయం చాలా చక్కగా కనిపించేది.ఇప్పుడు రాక్ క్లైంబింగ్ అనే పేరు తో మీట్ అప్ లు నిర్వహిస్తున్నారు కాని అప్పట్లో అలాంటివి ఏమి లేవు.ఆ రాళ్ళు ఎక్కి కూర్చుని తర్బూజా గింజల్ని వలుచుకుతింటూ  సూర్యాస్తమయాన్ని చూడటం ,అలానే టేకాఫ్ మరియు లాండ్ అవుతున్న విమానాల్ని చూడటం ఎంతో ఇష్టం మరియు ఆనందం. 

ఇంకో ఇష్టమైన విషయం డబల్ డెక్కర్ బస్ . 
 











స్కూల్ కి వెళ్ళేప్పుడు ముందుగా ఏ బస్ వస్తే ఆ బస్ ఎక్కినా ,తిరిగి వచ్చేప్పుడు మాత్రం డబల్ డెక్కర్ బస్ కోసం
వేచి ఉండేవాళ్ళం.స్కూల్ కి ఇంటికి మధ్య దారి పొడుగూ మోదుగుపూల చెట్లు ఉండేవి.ఆ పూలు కోసుకోవాలంటే మామూలుగా అందవు కాబట్టి డబల్ డెక్కర్ బస్ ఎక్కితే ఆ పూలు కోసుకోవచ్చు అని ఆ బస్ కోసం వేచి ఉండేవాళ్ళమన్నమాట.ఇప్పుడు ఆ దారిలో అసలు చెట్టన్నదే లేకుండా పోయింది. :(    


Sunday, 8 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు 1

ట్రాన్స్ లేటర్  అవతారం

ట్యూషన్ లో ఒకరకం కష్టాలు అయితే ,స్కూల్లో ఇంకోరకం కష్టాలు.అంతకు ముందు చదివినది పల్లెటూళ్ళో,ప్రభుత్వ పాటశాల లో. పాఠం చెప్పిన తర్వాత టెక్స్ట్ బుక్ లో ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసుకుని నోట్స్ లో రాసుకునే వాళ్ళం.అదే హోంవర్క్.ఒక్క లెక్కలకు తప్పించి మిగతా సబ్జెక్ట్స్ కి ప్రత్యేకించి వేరే  హోంవర్క్ ఏమీ ఉండేది కాదు.
ఇక ఇప్పటి విషయానికి వస్తే ,ప్రతి సబ్జెక్ట్ కి ఒక క్లాస్ నోట్ బుక్ ,హోంవర్క్ కి ఒకటి,వీక్లీ టెస్ట్ కి ఒకటి,మంత్లీ టెస్ట్ కి ఒకటి , అలా ఒక్కో సబ్జెక్ట్ కి నాలుగు నోట్ బుక్స్.కాకపోతే ఇప్పటి పిల్లల్లా అన్నీ మోసుకెళ్ళే బాధ లేదు.టెస్ట్ నోట్స్ అన్నీ,క్లాస్ లోనే ఉన్న అలమర లో ఉంచేవాళ్ళు.వాటి బాధ్యత క్లాస్ లీడర్ ది.కీస్ తన దగ్గర ఉండేవి.టెస్ట్ ఉన్న రోజు బుక్స్ తీసి ఎవరివి వాళ్లకు ఇచ్చేది.ఇక టెక్స్ట్ బుక్స్,వేరే నోట్ బుక్స్ అవసరమైనవి మాత్రమే ఇంటికి తీసుకెళ్ళేవాళ్ళం.మిగతావి  డెస్క్ లో పెట్టి లాక్ చేసుకునే వాళ్ళం.అతి పెద్ద ప్రాబ్లం నోట్స్ డిక్టేట్ చెయ్యడం.ప్రత్యేకించి సోషల్ &ఇంగ్లిష్ .ఆవిడ ఏమి చెప్తుందో అర్ధమయ్యేది కాదు.పైగా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్పీడ్ లో.(మలయాళీ లు మాట్లాడుతున్నప్పుడు విన్నారా?అలా అన్నమాట :)  )క్రొత్తలో ఏమీ రాసుకోలేక ఏడ్చేసేదాన్ని.నెమ్మదిగా ఇంప్రూవ్ అయ్యాను.మాథ్స్,సైన్స్,తెలుగు - ఇబ్బంది లేని సబ్జెక్ట్స్.ఇక హిందీ.పిల్లల గొంతు వినిపించని క్లాస్ ఏదన్నా ఉందంటే అది ఇదే ! ఆ క్లాస్ లో హిందీ తప్పించి వేరే బాష లో మాట్లాడితే 10 పైసలు ఫైన్.అందుకని టీచర్ అడిగిన దానికి జవాబు చెప్పటానికి తప్పించి ఎవరూ నోరు తెరిచేవాళ్ళు కాదు.

సరే,ఇక ట్యూషన్ లో పెద్ద కష్టం వచ్చిందన్నాను కదా ! అదేమిటంటే ...
 ట్యూషన్ లోచేరిన ఒక నాలుగు నెలలకు అనుకుంటా,వారానికి ఒకసారి - మంగళవారం క్రైస్తవ ప్రచారకులు వచ్చేవాళ్ళు.ఒక గంటన్నర పాటు,బైబిల్ లో కొన్ని వాక్యాలు చదివి చెప్పేవాళ్ళు.వాటి తో పాటు కొన్ని పిట్టకథలు.ఆ తర్వాత క్రైస్తవ భక్తి గీతాలు పాడించేవాళ్ళు.ఆ చెప్పేవాళ్లకు తెలుగు రానందున వెంట ఒక ట్రాన్స్లేటర్ ని కూడా తీసుకుని వచ్చేవాళ్ళు.ఒకరోజు ఆ  ట్రాన్స్లేటర్ ఒకటి తప్పు చెప్పటం తో నేను,విని ఊరుకోకుండా ,దాని అర్ధం అది కాదు అని సరిదిద్దాను.అంతే !నువ్వు బాగా చెప్తున్నావు,ఇక నుంచి తెలుగు లో నువ్వే చెప్పు అని ట్రాన్స్లేషన్ బాధ్యత నాకిచ్చేసారు.అది తప్పు చెప్పారు కనుక సరిచేసాను,మొత్తం చెప్పాలంటే నాకు రాదు అన్నా వినలేదు.గుంపు లో కూర్చుంటే,పూర్తిగా విన్నా వినకపోయినా సమస్య లేదు.కాని ట్రాన్స్లేషన్ చెయ్యాలంటే చచ్చినట్టు శ్రద్ధగా అంతా వినాల్సిందే!తప్పించుకునే మార్గం లేకపోయింది :(
ఆ తర్వాత భక్తి గీతాలు పాడేటప్పుడు " మేరా మన్ మే హై ఈసా,తన్ మే హై ఈసా" అని పాడిస్తున్నారు.నేనేమో మేరా మన్ మే హై రామ్ ,తన్ మే హై రామ్ అని పాడుతున్నాను.టీచర్ ఎప్పుడు వచ్చారో తెలియదు,నీకెంత పొగరు అని నెత్తి మీద మొట్టారు.హోం వర్క్ చెయ్యలేదనో,మార్క్స్ తక్కువ వచ్చాయనో ఎప్పుడూ తన్నులు తినలేదు కానీ,ఇలాంటి వాటికి అప్పుడప్పుడు చీవాట్లు తినేదాన్ని.

తర్వాత కొన్నిరోజులకు నాకు  బైబిల్ కొని ఇచ్చారు.ఒక ఆదివారం హెబ్రోన్ కి తీసుకువెళ్ళారు.ప్రవచనాలు పూర్తయ్యాక,ఈ వారం ఏ తప్పు(సినిమాలు చూడకపోవటం,సినిమా పాటలు వినకపోవడం,మత గ్రంధాలు తప్పించి వేరే పుస్తకాలు చదవక పోవటం ,అబద్దాలు చెప్పకపోవటం etc ) చెయ్యని వాళ్ళు చేతులు ఎత్తమన్నారు.చాలా కొద్దిమంది చేతులు ఎత్తారు.అలా చేతులు ఎత్తిన వారికి చిన్న బ్రెడ్ ముక్క నోట్లో వేసి కొంచం వైన్ పోశారు.కొంతమంది కన్ఫెషన్ రూం అని ఉంది,అక్కడకు వెళ్లి కన్ఫెసర్ కి తమ తప్పులను చెప్పుకున్నారు.ఆ తర్వాత సాంబార్ అన్నం తిని ఇంటికి వచ్చేసాము.
నాకు అప్పుడప్పుడు మతం మార్చుకోవాలని అనిపించినా ఎక్కడో చిన్న హెజిటేషన్.అందుకనే మతం మారలేదు :)                                        

 
                               

Thursday, 5 December 2013

మేథి తెప్లా



కావలసినవి :

గోధుమ పిండి : 4 గుప్పిళ్ళు లేదా 150 గ్రాములు 
మెంతి కూర : ఒక కట్ట 
కొత్తిమీర : సగం  కట్ట 
అల్లం : చిన్న ముక్క 
పచ్చిమిర్చి : 2
జీలకర్ర పొడి : పావు స్పూన్ 
పెరుగు : చిన్న కప్పు 
బెల్లం (పొడి చేసినది) : సగం కప్పు 
నూనె :రెండు టేబిల్ స్పూన్స్
ఉప్పు : తగినంత 

చేసే పద్ధతి :
మెంతి కూర,కొత్తిమీర ఆకులు సన్నగా తరుక్కోవాలి.
పెరుగు లో బెల్లం పొడి వేసి కలుపుకోవాలి.
గోధుమ పిండి లో ఉప్పు,నూనె,అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ,మెంతి కొత్తిమీర ఆకులు , జీలకర్ర పొడి వేసి బెల్లం కలిపిన పెరుగు తో కలపాలి.   
ఈ పిండిని ముద్దలు గా చేసుకుని ,చపాతీ ల్లా వత్తి పెనం మీద కాల్చుకోవాలి.
ఇది గుజరాతీయులు చేసుకునే రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన వంటకం.   
 
 


Tuesday, 3 December 2013

సికింద్రాబాద్ - కొన్ని జ్ఞాపకాలు

నాకు 11 ఏళ్లప్పుడు నేను సికిందరాబాద్ వచ్చాను.నా తెలివితేటల మీద అపారనమ్మకం కల నా తల్లితండ్రులు ,ఎ,బి,సి,డి లు ,కాట్,రాట్ లాంటి చిన్న పదాలు మాత్రమే తెలిసిన నన్ను అమాంతం గా తెలుగు మీడియం నుంచి తీసుకొచ్చి ఇంగ్లిష్ మీడియం లో పడేశారు.దేశం కాని దేశం లో దారి తప్పిన బాటసారి లా అయ్యింది నా పరిస్థితి.మేము ఉన్న ఇంటి కాంపౌండ్ లో 4 ఇళ్ళు ఉండేవి.అందులో ఒక దాంట్లో ఇంటి ఓనర్ (కన్నడ)ఉండేవాళ్ళు.ఇంటి పక్కన మళయాళ మామి.ఆ పక్కన బెంగాలి బేన్జీ (బెహన్ జీ వాడుకలో అలా అయ్యింది)ఆవిడ కి మా అమ్మమ్మ గారి వయసు అయినా ,మా అమ్మ వాళ్లకు మాకు అందరికి బేన్జీ నే.వాళ్లకు చిన్నకిరాణా షాప్ ఉండేది.అర్జంట్ గా సరకులు ఏమన్నా కావాల్సివస్తే అక్కడనుంచి తెచ్చేవాళ్ళం.ఆ పక్కనే వరసగా తమిళియన్స్ ఇళ్ళు.ఆ ఏరియా లో తమిళియన్స్ ఎక్కువే ఉండేవాళ్ళు.తర్వాత ఒక ఆంగ్లోఇండియన్ వాళ్ళు.ఇంటి కి ఇంకో ప్రక్కన కూడా తమిళియన్స్ ,ఒక పంజాబీ ఫామిలీ ఉండేది. కాంపౌండ్ దాటి బయటకు వస్తే ఒక వైపు సికిందరాబాద్ వెళ్ళే మెయిన్ రోడ్ ,ఇంకో వైపు ఆర్మీ క్వార్టర్స్ (హావ్లక్ లైన్స్)క్వార్టర్స్ మొదట్లో పార్క్ ఉండేది.అక్కడే మా ఆటలన్నీ!మెయిన్ రోడ్ కి ,ఇంటికి మధ్యలో ఖాళీ స్థలం ఉండేది.సాయంకాలం ,ఆ ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళు అందరూ అక్కడ చేరి కబుర్లు చెప్పుకునే వాళ్ళు.అప్పుడప్పుడు పిల్లలం కూడా వెళ్లి వచ్చే,పోయే బస్ లను చూస్తూ కూర్చునేవాళ్ళం.ఇంటి కి దగ్గర లోనే మహంకాళి గుడి.అక్కడ కూర్చుంటే మహంకాళి గుడి కనిపిస్తూ ఉండేది.         
ఆగస్ట్ లో బోనాలు పండగ అప్పుడు చాలా సందడి గా ఉండేది.బోనాలు మొదలవుతాయనగా రెండు రోజులు ముందు గుడి దగ్గరకు పోలీస్ వ్యాన్ వచ్చేది.వ్యాన్ ఆగగానే బిల బిల కొంతమంది వచ్చి వ్యాన్ లో కూర్చునేవాళ్ళు. బోనాలప్పుడే కాకుండా ,మామూలు రోజుల్లో కూడా అప్పుడప్పుడు  పోలీస్ వ్యాన్ వస్తే అదే సీను.వీళ్ళకు సిగ్గు శరం లేదు,పోలీసులకు శ్రమ లేకుండా వాళ్ళే నవ్వుకుంటూ వచ్చి వ్యాన్ లో కూర్చుంటున్నారు అని పెద్దవాళ్ళు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. 

నాకు ఇంగ్లిష్ రాదు కాబట్టి ,ఇంగ్లిష్ నేర్పటానికి ట్యూషన్ ...   ట్యూషన్ టీచర్ -పేరు రాధ.మా స్కూల్లోనే ఎలెమెంటరీ సెక్షన్ లో పని చేసేవారు.మా చెల్లి,తమ్ముడు,కజిన్ అందరమూ అక్కడే !ఆ టీచర్ గారికి 4 పిల్లలు.ఆడ పిల్లల పేర్లు బొమ్మి మరియు కుట్టి.ట్యూషన్ కి వచ్చిన పిల్లలందరూ ఒక దగ్గర కూర్చుంటే నన్ను మాత్రం సెపరేట్ గా వేరే రూం లో కూర్చోపెట్టే వాళ్ళు.పర్యవేక్షణ బొమ్మి మరియు కుట్టి.అరగంట కో సారి ఒక స్టూడెంట్ ని మలాయ్ చాయ్ తెమ్మని పంపించే వాళ్ళు.ఆ చాయ్ తేవటానికి పాపం చాలామంది రెడీ గా ఉండేవాళ్ళు.కాని ,అది తెచ్చే అదృష్టం ఒకరికే దక్కేది.ఎందుకంటే ఆ అబ్బాయి అయితేనే చాయ్ లో మలాయ్ ఎక్కువ వేయించుకుని వస్తాడంట. :)  

అలా ఒక్కదాన్నే కూర్చుని చదవాలంటే చాలా విసుగ్గా ఉండేది.అందరి లో కూర్చున్టానంటే ఒప్పుకునే వాళ్ళు కాదు. కొంతలో కొంత రిలీఫ్ ఏమిటంటే బెన్నీ అని టీచర్ గారి బంధువు.తను గిటార్ ప్లే చేస్తూ ఉండేవాడు.అది వినటం.ఇక బొమ్మి అక్క,తను MA చదువుతుంది అనుకుంట.సరిగా గుర్తు లేదు.తన బుక్స్ ఇచ్చి నన్ను పెద్దగా చదవమనేది.అలా చదివితే తను చదువుకోవటం ,నాకు ఇంగ్లిష్ రావటం రెండూ జరుగుతాయి అని చెప్పేది.ఇలా కష్టాల కడలి లో ఈదుతూ చదువు కొనసాగిస్తూ ఉండగా ఇంకో పెద్ద కష్టం వచ్చి పడింది. 

ఆ కష్టం ఏమిటి అనేది నెక్స్ట్ పోస్ట్ లో   :)                                              

జంట నగరాలు



ఈ నవల పదునెట్టువాదు అక్షతగలు అనే తమిళ నవలకు అనువాదం.భూమధ్య రేఖ కు ఉత్తరం గా 'పద్దెనిమిదవ అక్షాంశ రేఖ' దగ్గర ఉంది అట హైదరాబాద్ నగరం.చిన్నప్పుడు సోషల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ ఒకటి చదువుకున్నాను కానీ,ఈ విషయం ఇప్పటివరకూ తెలియదు :) 
తమిళనాడు నుంచి ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్లి స్థిరపడిన కుటుంబం లోని అబ్బాయి చంద్రశేఖర్ అనుభవాలు ఈ నవల కథా వస్తువు.నవలా కాలం 1930-40 కి మధ్య. 
స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశం లో చేరకుండా విడిగా ఉన్న హైదరాబాద్ లో ప్రజలు అనుభవించిన కష్టాలు ,విలీనం కావటానికి నిరాకరించినప్పుడు సైనిక చర్య తో భారత ప్రభుత్వం ఇండియన్ యూనియన్ లో కలిపేసుకోవడం ... ఈ రాజకీయ పరిణామాలు ఒక విద్యార్ధి జీవితాన్ని ఏ విధం గా బాధించింది అన్నదే ఈ నవల. 
అప్పటికి ,ఇప్పటికి పరిస్థితులలో పెద్ద మార్పేమీ లేదు అనుకుంటా !కాకపోతే ఉద్యమాలకి కారణాలు మారాయి . 

        

Sunday, 1 December 2013

ఏడు పాయల

దేని మీదైనా ఎక్కువ అంచనాలు లేకపోతే అంత నిరాశ ఉండదేమో !అంచనా లు ఎక్కువైతే నిరాశ కూడా ఎక్కువే!
ఏడు పాయల గురించి చదివి ,ఫోటో లు చూసి -  ఎంత అందం గా ఉందో ,తప్పకుండా చూడాలి అనుకుని ఒక రెండు నెలల క్రితం అనుకున్నాను. అప్పట్నించి వెళ్ళటానికి ఒక తేది అనుకోవటం,చివరి నిమిషం లో ఏదో ఒక అవాంతరం . అలా వాయిదా పడుతూ వచ్చి చివరకు నిన్న వెళ్లి చూసి వచ్చాము.తీరా అక్కడకు వెళ్ళిన తర్వాత ,ఏమిటి దీని కోసమా ఇంతగా ... అనిపించింది .

       
దర్శనం బాగా జరిగింది.అమ్మ వారిని చూడటానికి రెండు కళ్ళు చాలవు.అంత సుందర స్వరూపం . 
ఆ తర్వాత, దగ్గర లోనే ఉన్న మంజీరా డాం చూడటానికి వెళ్ళాము.డాం అంటే నాగార్జునసాగర్ ,శ్రీశైలం డాం ల లాగా ఉంటుందేమో అనుకున్నాము.కాని డాం లు ఇలా కూడా ఉంటాయని తెల్సింది.   

      


వెళ్లే దారి లో వానర సైన్యం 


గుడి ప్రాంగణం లో 


Wednesday, 13 November 2013

ఏది నెగిటివ్ థింకింగ్ ? ఏది పాజిటివ్ థింకింగ్ ?

చాలా సార్లు నాకు ఈ డౌట్ వచ్చింది . పాజిటివ్ థింకింగ్ అని చెప్పేదంతా పాజిటివ్ థింకింగేనా అని. దీని గురించి ఒక సీరీస్ రాయాలని ఉంది . ఎంతవరకూ రాస్తానో తెలియదు . ప్రస్తుతానికి ఇది మొదలు ... 



ఇది అందరికి తెలిసినదే ! కొత్తగా దాని మీద జోకులు కూడా వచ్చాయి . వాళ్ళిద్దరూ అలా అనుకుంటూ ఉంటే ,ఆపర్చునిస్ట్ వచ్చి గ్లాస్ ఖాళీ చేసాడు అని . 

గ్లాస్ సగం నిండి ఉంది అని అనుకునే వాళ్ళు పాజిటివ్ థింకర్స్ అవ్వొచ్చు ,కాకపోవచ్చు . ఎలాగు సగం నిండి ఉంది కదా అని దానితోనే తృప్తి పడొచ్చు . 
గ్లాస్ సగం ఖాళీ ఉంది అని అనుకునే వాళ్ళు నెగిటివ్ థింకర్స్ కానక్కరలేదు . సగం ఖాళీ ఉంది,గ్లాస్ ని పూర్తి గా నింపాలి అనుకుని ట్రై చెయ్యొచ్చు. 

అప్పుడు ఇద్దరి లో ఎవరు పాజిటివ్ థింకర్ ? ఎవరు నెగిటివ్ థింకర్ ?



Saturday, 14 September 2013

పేరు ప్రఖ్యాతులు



What we have done for ourselves alone dies with us; what we have done for others and the world remains and is immortal.

ఇప్పటివరకూ ఏది చేసినా నాకు మాత్రమే చేసుకున్నా.ఇకనుంచి లోకానికి కూడా ఏమన్నా చేయాలని నిర్ణయించుకున్నాను.అలా చేస్తే కొద్దో గొప్పో పేరు ప్రఖ్యాతులు వస్తే నా పేరు చిరస్మరణీయం అవుతుందని ఒక దురాశ /పేరాశ. అలా పేరు సంపాదించుకోవాలంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తూ,
 సైంటిస్ట్ నయినా కాకపోతి కొత్త ఆవిష్కరణలు చేయగా అని రాయినయినా కాకపోతి ట్యూన్ లో పాడుకుంటూ ఉంటే ,ఒక అద్భుతమయిన ఆలోచన తట్టింది.
వంటిల్లే పెద్ద ప్రయోగశాల అని (ఆల్రెడీ ఎవరన్నా అన్నారా?) కొత్త కొత్త వంటలు కనిపెట్టి లోకానికి సేవ చేయోచ్చు కదా అని.
ఆలోచన వచ్చిందే తడవు ,కొత్తగా  -  ఆరోగ్యానికి మంచి చేసే వంటలు ఏమి చెయ్యొచ్చా అనుకుంటుంటే వంటింట్లో ఎదురుగా కాకరకాయలు కనిపించాయి.చాలా మందికి కాకరకాయ అంటే ఇష్టం ఉండదు,తినరు కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కదా ! కావున నా ప్రయోగం దీనితో మొదలు చేస్తే బాగుంటుంది అనుకున్నాను.కూర టైప్ లో వండితే కాకరకాయ అని తెలిసిపోతుంది కాబట్టి ఏదన్నా స్నాక్ లాంటిది ట్రై చేస్తే బెటర్ అని కాకరకాయ కారప్పూస ,స్వీట్ - కాకరకాయ హల్వా చేసి చక్కగా అలంకరించి ఫోటో లు తీసి, చేసే విధానం రాసి పత్రిక కు పంపించాను.వాళ్ళ పత్రికలో అది ప్రచురించలేక పోతున్నందుకు చింతిస్తూన్నాము అనే నోట్ తో భద్రం గా  వెనక్కి వచ్చెయ్యటం కూడా జరిగింది.అయినా పట్టు వదలని విక్రమార్కుడు లా బంగాళా దుంప బాసుంది,బీరకాయ బిర్యాని, కాబేజీ కజ్జికాయ ,చేమదుంప చేకోడి , పపాయా పాపకార్న్ లాంటి వినూత్న వంటకాలు కనిపెట్టి వాటిని పత్రికలకు పంపించటం ,అవి రాకెట్ వేగం తో తిరిగి రావటం కామన్ అయిపోయింది.ఇక ఇలా లాభం లేదని ,నేనే స్వయం గా బుక్ పబ్లిష్ చేయాలని నిర్ణయించుకున్నాను. సరిగ్గా అదే సమయం లో ,అంతర్జాలం లో విహరిస్తుంటే - మీ బుక్ ని మీరే పబ్లిష్ చేసుకోండి అనే ప్రకటన కనిపించి,సంతోషాన్ని కలిగించింది. కొద్దిగా ఆలస్యం గా నయినా ఇలా పేరు తెచ్చుకుంటు న్నందుకు ఆనందం గా ఉంది   :))



Thursday, 5 September 2013

ఉపాధ్యాయ దినోత్సవం





టీచర్స్ డే - దిగుమతి చేసుకున్న సంప్రదాయమో ,మనదే నో తెలియదు కానీ,

దసరా అప్పుడు అయ్యవారలకు చాలు ఐదు వరహాలు,పిల్లవాండ్రకు చాలు పప్పు బెల్లాలు అని పాడుకుంటూ ఇల్లిల్లు తిరిగిన జ్ఞాపకం ఉంది  :) టీచర్స్ డే కి బహుమతులు ఇవ్వటం లాంటివి ఏమీ లేవు . ఇప్పటివాళ్ళు పిల్లల దగ్గర్నుంచి డబ్బులు బాగానే పోగు చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు అనుకోండి . 

మా స్కూల్లో నేనొక రాజకుమారిని. మాస్టార్లందరికి నేను అమ్మాయినే.వేసవి లో ఇంట్లో ఉంటే ఎండలో ఆడతామని ప్రైవేట్ (ట్యూషన్)కి పంపించేవారు. అక్కడ కూడా మనదే రాజ్యం :) నా హోంవర్క్ ,చదవటం చాలా తొందర గా అయిపోయేది ,ఆ తర్వాత వేరే పిల్లల హోంవర్క్ బుక్స్ కరక్ట్ చేయటం ,తప్పులు చేస్తే బెత్తం తో వడ్డించటం కూడా :))
అక్కడ ఏమి అనలేక,చెయ్యలేక మా ఇంటికి వచ్చి, అనూ చదవకుండా ఇలా చేస్తుంది అని చెప్పేవాళ్ళు . నిన్ను ప్రైవేట్ కి పంపిస్తుంది ఎందుకు అని ఇంట్లో అక్షింతలు పడేవి అనుకోండి.ఇక ప్రొద్దున్నుంచి ,సాయంకాలం వరకు అక్కడే కాబట్టి తిండి ,తిప్పలు కూడా అక్కడే . నేను తీసుకెళ్ళినవి కాకుండా,మా మాస్టారు గారి ఇంటి నుంచి వచ్చిన వాటిలో కూడా నాకు వాటా అన్నమాట :) అలా మొదటిసారి సబ్జా విత్తుల పానీయం రుచి చూసాను.
మా అమ్మాయి పెద్ద డాక్టర్ అవుతుంది రా అని అందరి తో అంటూ ఉండేవాళ్ళు.పలక మీద అనూరాధ Mbbs అని రాసే వాళ్ళు.కానీ ఆ విధాత నా నుదిటి మీద రాయక పోతే ఏమి చేస్తాము?నేను డాక్టర్ అవలేదు.

మా సాంబశివ రావు మాస్టారిని (ట్యూషన్)ఎప్పటికీ మర్చిపోలేను . నాకు చదువు నేర్పించిన గురువులందరికీ వందనాలు.వారందరూ ఆయురారోగ్యాలతో సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను.     


Friday, 2 August 2013

అభిమన్యుడుని





జీవితమనే కురుక్షేత్ర పోరాటం లో
బంధాలనే పద్మవ్యూహం లో
చిక్కుకున్న అభిమన్యుడుని నేను
బయటపడటం తెలియదని ,
మృత్యువు తధ్యమని ఎరుక ఉన్నా
అడుగు పెట్టడమే తెలుసు

Wednesday, 31 July 2013

వెలలేని ఆభరణాలు ,బొమ్మలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసి దిగులు ఒక పక్క.జోరున వర్షం ఇంకో పక్క . విపరీతమైన చిరాకు ,ఏ పని చెయ్యాలనిపించటం లేదు.బాల్కనీ లో నుంచొని అలా వర్షాన్ని చూస్తూ ఉంటే ,రాలి పడిన కొబ్బరి మట్ట ఒకటి కనిపించింది . దాన్ని చూస్తే ,చిన్నప్పుడు ఆడిన ఆటలు జ్ఞాపకానికి వచ్చాయి.

కొబ్బరి ఆకులతో బొమ్మలు చేసి ఆ బొమ్మలకు అలంకరణ చేసి ఆ బొమ్మలకు పెళ్లి చేసే వాళ్ళం :)
అలంకరణకు బట్టలు - వూళ్ళో ఉన్న ఏకైక దర్జీ ,బాజీ గారి ని అడిగి తెచ్చే వాళ్ళం.సరే మరి పెళ్లి జరిపించే వాళ్లకు ఆభరణాలు కావొద్దూ! వాచీ ,ఉంగరం కొబ్బరి ఆకులతో చేసుకొనేవాళ్ళం.మరి ఆ బొమ్మలు ,ఆభరణాలు ఎలా ఉంటాయో చూడాలని ఉందా?అయితే చూడండి ... 




          



Tuesday, 23 July 2013

ఏమిటి ఈ లోకం

అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి ,ఆ పాట విన్నప్పుడు అబ్బా నాకు కూడా ఒక అన్నయ్య ఉంటే ఎంత బాగుండేది అనుకునేదాన్ని. చిన్నతనం కదా,లోకం పోకడ అంత తెలియనప్పుడు అన్నమాట.రామాయణం లో లక్ష్మణ ,భరతుల గురించి విన్నప్పుడు  ఆహా ,ఆ తమ్ముళ్ళకు అన్న అంటే ఎంత ప్రేమ అనిపించేది.అలా సినిమాల్లో అన్న దమ్ముల  ప్రేమ ని  చూసి నిజ జీవితం లో కూడా అలాగే ఉంటారేమో అనుకునేదాన్ని. 
కొద్ది కొద్ది గా లోకజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ,ఆ సినిమాల్లో చూపించేది అంతా పెద్ద ట్రాష్ అని ... 
అనుబంధం ,ఆత్మీయత అంతా ఒక బూటకం,ఆత్మతృప్తి కై మనుషులు ఆడుకునే నాటకం అని తాత మనవడు సినిమా లో పాట విని  అదే నిజం అని తెలుసుకున్నాను. 



 ఇక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ లో కొటేషన్స్ అయితే చెప్పక్కరలేదు.If you love your brother/sister/mother/father/daughter   share this అంటూ.అలాగే స్నేహితుల గురించి . స్నేహితులు లేని జీవితం వృధా ,బ్లా  బ్లా బ్లా 
సరే ,ఇప్పుడు ఈ ఉపోద్గాతమంతా ఎందుకు అంటే , ... 

మూడు నెలల క్రితం మా తమ్ముడి వాళ్ళ ఇంట్లో   ఒక ఫంక్షన్ జరిగింది.ఆ ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళలో ఒక పాప తన ముద్దు ముద్దు మాటల తో అందరిని ఆకట్టుకుంది.5 లేక 6 ఏళ్ళు ఉండొచ్చు.మాటల పోగు అయినప్పటికీ ,తన పేరు ఏమిటో తనతో ఎవరమూ చెప్పించలేక పోయాము.మళ్ళీ ఆ పాపను ఈ విధం గా గుర్తు చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు.ఆ పాప వాళ్ళ నాన్న,పెదనాన్న ఇద్దరూ పంచాయతీ  ఎలెక్షన్స్ లో పోటీ చేస్తున్నారు.ఇద్దరూ చెరొక పార్టీ .ప్రచారం చేసేప్పుడు ఇద్దరికీ గొడవ జరిగింది.ఆ గొడవ లో అన్న తమ్ముడిని చంపేసాడు.ఈ విషయం విన్న దగ్గర్నుంచి ఎంతో బాధ అనిపిస్తుంది.అంత చిన్న వయసులో ఆ పాప తండ్రిని కోల్పోవటం ,అదీ తన పెదనాన్న చేతి లో .   :(

           


  

Wednesday, 10 July 2013

స్వేచ్ఛ





స్వేచ్ఛ అంటే ఏమిటి ? అసలు భూమి మీద ఎవరికైనా పూర్తి స్వేచ్ఛ ఉంటుందా ?
అబ్బా పిల్లల పని హాయి. ఏ బాధ్యతలు ఉండవు ,హ్యాపీ గా ఉండొచ్చు అనుకుంటాము. కాని వాళ్ళ బాధలు వాళ్ళవి. ఎప్పుడూ ఆడుకుంటూ ఉండాలనే ఉంటుంది ,చదువు పెద్ద గుదిబండ లా తోస్తుంది.హాయిగా ఆడుకుందామంటే ,ఈ హోం వర్క్,పరీక్షలు అంటూ అమ్మ ఆడుకోనివ్వదు అనుకుంటారు . 

ఆకాశం లో ఎగిరే పక్షులు ,అడవి లో తిరిగే జంతువులు ... వాటికి ఎంత స్వేచ్ఛ అనుకోకుండా ఎవరు ఉండరేమో . అదొక మిస్ కాన్సేప్షన్.స్వేచ్ఛ అనేది  ఏ జీవికైనా కొన్ని పరిమితులకు లోబడే అన్నది పచ్చి నిజం. 

ఆకాశం లో స్వేచ్ఛ గానే ఎగురుతుంది పక్షి . కాని ఎప్పుడు ఏ వేటగాడు దాని ప్రాణాన్ని హరిస్తాడో తెలియదు . నాకు స్వేచ్ఛ ఉంది,నేను ఇక్కడే కదలకుండా ఉంటాను అని జింక   ఏ సింహమో ,పులో వస్తున్నా అలాగే ఉంటే  వాటికి ఆహారం అవ్వక తప్పదు.

నిప్పు కాలుతుంది అని తెలుసు,అందుకే దాన్ని ముట్టుకోము.నిప్పును ముట్టుకునే స్వేచ్ఛ నాకు లేదా అనుకోము కదా !మనకు ఏదైనా మంచిది కాదు ప్రమాదం అని తెల్సినప్పుడు ఆ పని చేయకుండా ఉండటమే విజ్ఞత.అలా కాకుండా నాకు ఏదైనా చేసే స్వేచ్ఛఉంది,నేను నాకిష్టమొచ్చినట్టు ఉంటాను అనుకుంటే దాని ద్వారా ఎదురయ్యే ప్రమాదాన్ని ఎదుర్కోవటానికి కూడా సిద్ధం గా ఉండాలి .  

మానవ జీవితం లోని ఏ దశ లోనూ స్వేచ్ఛ లేదని చెప్పే ఈ పద్యం డా. వానమామలై గారు రచించిన 'సూక్తి వైజయంతి' నుంచి ...


బాల్యమొక పంజరపు చిల్క ,పర్వులెత్తు 
జవ్వనము పాలపొంగు ,ముసలితనమ్ము 
పాటిదప్పిన కొలబ్రద్ద ,భయద మృతియె 
కాచుకొని యున్న పులి,బందెకాన బ్రతుకు. 




Thursday, 16 May 2013

జీవితం ఓ మిస్టరీ

సినిమాలు చూస్తుంటే తర్వాత సీన్ ఏంటన్నది ఇట్టే ఊహించేయ్యోచ్చు . అలాగే నవలలు ,కతలు ... ముగింపు . చాలా వరకు మనం గెస్ చేసినట్లే ఉంటాయి. అలా మనం ముందే ఏమవుతుందో చెప్పేస్తుంటే పక్కన ఉన్నవాళ్ళకి  ఆశ్చర్యం,అనుమానం . ఆశ్చర్యం సరే ,అనుమానం ఎందుకు అంటారా ? ముందే ఆ సినిమా చూసి ఉంటానేమో అని అన్నమాట . మనకి ఒక్కసారి చూడాలంటేనే పరమ చిరాకు. మళ్ళీ రెండో సారి చూడటం అసంభవం . ఆ సంగతి చెప్పినా వాళ్లకు అర్ధం కాదు,నమ్మరు . కానీ జీవితం అలా కాదు. మరుక్షణం ఏమవుతుందో తెలియదు. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది.ఎక్కడో ఒకరు ఉంటారేమో వాళ్ళు అనుకున్నది అనుకున్నట్లు జరిగే అదృష్టవంతులు.బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు ,నీకిది వేడుక అని ఒక సినీ కవి గారు రాసారు . అది నిజమే . అంతా సాఫీ గా జరిగి పోతుంటే ఇంక వేడుక ఏమి ఉంటుంది?ఆ దేవుడ్ని ఎవరు గుర్తు చేసుకుంటారు ?
కొన్ని quotes చదువుతుంటే నవ్వు వస్తుంది. నీకేం కావాలో ,ఏది ఇవ్వాలో దేవుడి కి తెలుసు.నీకు ఎప్పుడు ఏది అవసరమో అప్పుడు దేవుడు అది నీకు అందేలా చేస్తాడు . నేను చూసినంతవరకూ ... just opposite.
Leo Tolstoy రాసిన God Sees The Truth But Waits,     లో లా ఎప్పుడో జీవిత చరమాంకం లో ఉన్నప్పుడు చూస్తాడు . అప్పుడు ఇక కోరుకునేది ఏముంటుంది ,చావు తప్పించి . కానీ ఆ చావు ను తప్పించి వేరే ఏవో ఇస్తుంటాడు.నాకు తెలిసి దేవుడంత గొప్ప సాడిస్ట్ ఇక ఎవరు ఉండరేమో?జీవితం మిస్టరీ అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాను,ఇక అసలు విషయానికి వస్తాను.
ఆత్మలు ,పునర్జన్మలు ఉన్నాయా? కళ్ళతో చూసినా కూడా అన్నీ నమ్మెయ్యకూడదు అంటారు. మరి చూడని వాటి గురించి నమ్మటం కష్టం కదా !ఒకప్పుడు అలాంటి వాటిని నమ్మేదాన్ని కాదు ,ఇప్పుడు కూడా నమ్మాలో వద్దో తెలియని స్టేజ్ లో ఉన్నా అన్నమాట .
కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు ఆత్మీయులను కోల్పోయాను . సాధారణం గా నాకు కలలు రావు. ఒక రెండేళ్ళ క్రితం జరిగిన సంఘటన ...
ఒక కల. ఆ కల లో ... తలుపు శబ్దం విని తలుపు తీస్తే ఎదురు గా చనిపోయిన ఇద్దరూ . ఒక క్షణం నోట మాట రాలేదు . అప్రయత్నం గా నా నోటి నుంచి ,ఏమిటి మీరు చనిపోలేదా అనే మాటలు . మేము చనిపోవటం ఏమిటి?ఎవరు చెప్పారు నీకు ,మేము బతికే ఉన్నాము అని వాళ్ళు అనటం తో మరి ఇన్నాళ్ళు ఏమయ్యారు అని అడిగాను . వారి నుంచి సమాధానం ఏమీ లేదు,మెలకువ వచ్చింది . ఆ కల వల్ల కొంచం డిస్ట్రబ్ అయ్యాను,ఆ తర్వాత మర్చిపోయాను . ఈ ఇన్సిడెంట్ తర్వాత మా ఇంటికి రెండు పావురాలు ,రోజూ ఉదయం 7 గంటలకు రావటం మొదలు . అది కార్తీక మాసం . నెల రోజులు ,ఒకటే టైం కి వచ్చేవి . నేను రోజూ ఆ టైం కి పిట్ట గోడ మీద బియ్యం పోసేదాన్ని .ఒక్కొ క్క రోజు అన్నం,పెసలు పెట్టే దాన్ని. వేరే పావురాలు వస్తే వాటిని తరిమికొట్టి ,ఆ రెండు పావురాలు తినేసి వెళ్ళేవి . కార్తీక మాసం పూర్తయిన తర్వాత రోజు నుంచి రావటం మానివేసాయి . పక్కన డాబా మీదే ఉన్నా వచ్చేవి కావు . ఆ తర్వాత పండుగల రోజు వచ్చేవి.అప్పటి వరకు పట్టించుకోని నాకు సడన్ గా ఒక అనుమానం.చాలా సిల్లీ గా అనిపిస్తుంది. జరిగిన వాటిని తలచుకుంటే ఆ చనిపోయిన వ్యక్తులే ఈ పావురాల రూపం లో వచ్చారేమో,లేదా వారి ఆత్మలు ఆ పావురాల లో ఉన్నాయేమో ?ఇంకా సందిగ్ధం.


              

Friday, 10 May 2013

శిల్పారామం

ఎప్పటి నుంచో శిల్పారామం చూడాలని అనుకుంటున్నా వెళ్ళటం కుదరలేదు . పోయిన నెలలో శ్రీరామ నవమి రోజున మా తమ్ముడి వాళ్ళ పాప డాన్స్ ప్రోగ్రాం అక్కడ ఉండటం తో అనుకోకుండా వెళ్ళాము :)
ఎంట్రన్స్ మొదలులో సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత రాముల వారికి పూజా కార్యక్రమాలు జరుపుతుండటంతో అటు వెళ్లి దైవ దర్శనం చేసుకుని బయటకు రాగానే ... ఒక పక్కన, ప్రసాదం తీసుకుని వెళ్ళండి అని   వెళ్ళే వాళ్ళను వద్దు అన్నా ఆపి మరీ ప్రసాదాలు ఇస్తున్నారు. ఆ ప్రసాదం భోజనానికి తక్కువ,టిఫిన్ కి ఎక్కువ అన్న టైప్ లో ఉంది .( 2 పూరీలు,బంగాళ దుంప కూరతో ,పులిహోర,రవ్వ కేసరి) సరే ప్రోగ్రాం మొదలు కావటానికి ఎలాగు టైం ఉంది కదా అని నెమ్మది గా ప్రసాదాన్ని ఆరగించి ,అటు ఇటు తిరుగుతూ కొన్ని ఫోటో లు తీసుకుని ప్రోగ్రాం స్థలానికి  చేరుకున్నాము . 

   










Sunday, 5 May 2013

ఎలా ?


 
 
 
కాలం - గాయాన్ని మాన్పుతుంది నిజమే ,
గాయం తాలూకు మచ్చని కాదు 
ఆ మచ్చ గాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది 
 
 గతం నీడలా  
వెన్నంటి ఉంటే  గతాన్ని 
మర్చిపోవడం ఎలా?
మరపు అన్నది తెలియకపోతే
మర్చిపోవడం ఎలా ?
 
 

Thursday, 2 May 2013

Saturday, 6 April 2013

మనకు కూడా ఇలాంటి గ్రామాలు కావాలేమో !

నాగరికత పెరిగే కొద్దీ మనుషులు అనాగరికంగా తయారు అవుతున్నారు. 
ఈ మధ్య ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మరీ ఎక్కువ అయిపోయాయి. పేపర్,టి.విల్లో అవే మెయిన్ న్యూస్.  దానికి కారణాలు ,ఎవరికి తోచినవి వారు చెపుతున్నారు అనుకోండి.  మరి పరిష్కారం ఏమిటి ?కెన్యా లో లా మహిళా గ్రామం నిర్మించు కోవటమేనా ?


 
 

 
 
25 అక్టోబర్ 2009 ఈనాడు ఆదివారం నుంచి సేకరణ . 


    

Sunday, 10 March 2013

వినడానికో మనిషి



ప్రస్తుత బిజీ ప్రపంచం లో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నది తాము మాట్లాడితే వినటానికి ఒక మనిషి . వినే తీరిక ఎవరి కుంది?
వంశీ మంగళూరు లో సాఫ్ట్ వేర్ ఇంజనేర్ గా పని చేస్తుంటాడు . ఒక పెళ్లి అటెండ్ అవటానికి హైదరాబాద్ వస్తాడు . తాతకు గిఫ్ట్ గా షాల్ ఇస్తాడు
"నా కిప్పుడు కావాల్సింది గిఫ్ట్ లు కాదురా ,నేను చెప్పేది వినే మనిషి ,నా ఆలోచనల్ని అర్ధం చేసుకునే ప్రాణి " అంటాడు తాత.
తాత మనవడికి చెప్పిన కథే ఈ 'వినడానికో మనిషి ' నవల.

అంతగా చదువుకోని ,లోకజ్ఞానం లేని,మాట్లాడటం తెలియని ఒక పల్లెటూరి అబ్బాయి జీవితగమనం .
జీవితం లో ఎదురైన కొన్ని సంఘటనలు అతని నెగెటివ్ ఆలోచనల్ని పాజిటివ్ గా మార్చిన వైనం ...
మాష్టారి ఆజ్ఞ తు.చ తప్పకుండా పాటిస్తూ తనను వంద గుంజీళ్ళు తీయించిన సహాధ్యాయి మీద ప్రతీకారం తీర్చుకోవాలని వేసిన ప్లాన్ ఫలించకపోగా, ఆ సహాధ్యాయి యే తనను ఆపదనుంచి కాపాడటం తో తను చేయాలనుకున్న పని ఎంత బుద్దిహీనమైనదో అర్ధమవుతుంది. రాయి విసిరిన వాడిని వదిలేసి రాయిని శిక్షించ టానికి పూనుకున్నట్లు గా ఉంది అని అనుకుంటాడు.

ఒక లక్ష్యమంటూ లేని అతనికి , స్నేహితుల ద్వారా ఎదురైన ఒక చేదు సంఘటన  తదుపరి పరిణామాలు ఒక లక్ష్యాన్ని ఏర్పరుస్తాయి.

అమాయకత్వం,అజ్ఞానం ,అవమానాలు,వైఫల్యాలు,సమస్యలు  అన్నీ విజయం లో భాగాలే. చావును జీవితం నుండి వేరు చేసి చూడకూడనట్లే ఓటమిని గెలుపు నుండి వేరు చేసి చూడకూడదు అనే సందేశం రచయిత అందించారు.
తాత చెప్పిన ఆత్మ కథ  మనవడి సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. 
గొప్ప నవల అని చెప్పలేను కాని ,చదవదగ్గ నవల అని మాత్రం చెప్పగలను.  :)




Monday, 25 February 2013

ప్రయాణం లో పదనిసలు




ఒకానొక రోజు బస్ లో ప్రయాణిస్తున్న నాకు ,నా సహ ప్రయాణికురాలికి మధ్య జరిగిన సంభాషణ .
ఈ రోజుల్లో పిల్లలు ఎలా తయారు అయ్యారు అన్న దగ్గర్నుంచి రాజకీయాలు,అవినీతి ,ధరల పెరుగుదల మొదలైన విషయాల గురించి ఏకధాటిగా మాట్లాడారు. ఈ విధంగా ధరలు పెరిగితే సామాన్యుడు ఏం తింటాడు,ఏం బ్రతుకుతాడు అని అంటూ ఉంటే నేను ఊ కొడుతూ  బుద్ధి గా వింటూన్నాను. 
మాది వైజాగ్. మెహదీపట్నం లో ప్రార్ధనలు ఉంటె వెళుతున్నాను . నా వయసు 65 ఏళ్ళు . ఈ వయసు లో ఎందుకు అంత దూరం వెళ్ళటం అని మా అమ్మాయిలూ,మనవడు వద్దు అన్నా వెళుతున్నాను. అంతా ఆ ప్రభువే చూసుకుంటాడు .కాశీ చూసాను . ఇంకా చాలా పుణ్య క్షేత్రాలు చూసాను. కానీ నాకు ఆ ఏసు ప్రభువు ను నమ్ముకున్నాకే అంతా మంచి జరిగింది. ఇవాళ రాత్రి ఇది కావాలని కోరుకుంటే మరుసటి రోజు అది దొరికేది. ఉద్యోగం కావాలనుకున్నాను ,ఇచ్చాడు . ఇల్లు కట్టుకోవాలనుకున్నాను . కట్టుకున్నాను . ఇప్పటికే మనవాళ్ళు చాలా మంది ఆ ప్రభువు ను నమ్ముకున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ప్రభువు ను నమ్ముకోవాలని ప్రార్ధన చేస్తున్నాను. అందరికీ ప్రభువు ఆ ఏసు అయ్యే రోజు కోసం చూస్తున్నాను .  నీ పేరు చెప్పమ్మా . నీ కోసం కూడా ప్రార్ధన చేస్తాను. పేరు చెప్పాను.      
    
ఆ తర్వాత  సంభాషణ ప్రశ్నల పర్వం లోకి మళ్ళింది.  

ఆమె: ఉద్యోగం చేస్తున్నావా?
నేను: లేదండి . 
ఆమె:ఎందుకు చెయ్యటం లేదు ,ఉద్యోగం చెయ్యొచ్చు గా. 
నేను ఆరోగ్యం బాగోదు . 
ఆమె: ఏమిటి ప్రాబ్లం?
నేను:  *****
ఆమె: ప్రార్ధన జరిగే చోట ఒక చిన్న బాటిల్ లో నూనె అమ్ముతారు. పది రూపాయలే !ప్రొద్దున్నే మొహం కడుక్కొని మూడు చుక్కలు నోట్లో వేసుకుని ఏసు జయం అనుకుంటే చాలు ,ఇక మళ్ళీ అనారోగ్యం అంటూ ఉండదు . 
నేను:  నేను అలాంటివి అన్నీ నమ్మను అండి . 
ఆమె: ఒక్కసారి ఏసు ను నమ్ముకో . అంతా మంచే జరుగుతుంది. 
నేను ఏ దేవుడ్ని నమ్మను అండి . అయినా గీత లో మన మతం ఎంత చెడ్డ దయినా పర మతం లో కి మార కూడదు అని చెప్పారు కదా. 
ఆమె: హిందూ మతం చెడ్డదని చెప్పటం లేదు. ఏసు ని నమ్ముకుంటే మంచి జరుగుతుందని చెపుతున్నాను. 
నేను: మంచో,చెడో హిందూ మతం లో పుట్టాను ,ఆ మతం లోనే ఉంటాను ... 
ఇక మాటలు లేవు :)   
  



Tuesday, 22 January 2013

చిన్ననాటి తీపి గురుతులు



నేను సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు ,మా స్కూల్ రైల్వే స్టేషన్ కు పది అడుగుల దూరం లో ఉండేది.మా స్కూల్ వదిలే టైం కి ఎప్పుడన్నా ఒకసారి గేటు పడుతూ ఉండేది.ఒంగోలు వెళ్ళే ప్యాసెంజర్ ఆ టైం లో వచ్చేది.(ఇండియన్ రైళ్ళు రైట్ టైం కి ఎప్పుడు వస్తాయి కనుక)గేటు పక్కనుంచి వెళ్ళేదారున్నా,మేము వెళ్ళకుండా ఆ గేటు దగ్గరే నుంచునేవాళ్ళం.రైలు వచ్చే లోపు పట్టాల పైన డబ్బులు (5,10పైసల నాణాలు) ఉంటే డబ్బులు లేకపోతే పిన్నీసులు పెట్టె వాళ్ళం.రైలు వెళ్ళిన తరువాత అప్పచ్చుల్లాగా అయిన వాటిని తీసుకుని సంబరపడేవాళ్ళం.రైలు వచ్చి ఆగిన తరువాత ఇంజిన్ దగ్గరకు వెళ్లి,డ్రైవర్ కాకుండా ఇంకా ఇద్దరు ఉండేవాళ్ళు.వాళ్ళను  గ్రీజ్ అడిగే వాళ్ళం.డ్రైవర్ వెళ్ళండి అని అరిచే వాడు కానీ ,వేరే అతను ఒకళ్లిద్దరికి గ్రీజ్ ఇచ్చి ,ఇక వెళ్ళండి,రైలు కదులుతుంది అని పంపించేసేవాడు.ఆ ఇచ్చిన గ్రీజ్ ను తలా కొంచం పంచుకుని ఇంటికి తీసుకువెళ్ళేవాళ్ళం.అంతకు ముందు మా ఇంట్లో కొట్టుడు పంపు పాడయినప్పుడు  బాగు చేయటానికి వచ్చినతను ,పంపు బాగుచేసినాక నట్టులకి గ్రీజ్ రాయటం చూసాను.గ్రీజ్ రాస్తే పంపు పాడవకుండా ఉంటుంది అనే ఉద్దేశ్యం తో నేను ఇంటికి వెళ్ళగానే ,గ్రీజ్ ను పంపుకు నట్టు కనిపించిన చోటల్లా రాసాను.ఈ క్రమం లో గ్రీజ్ ,పంపుకే కాకుండా ,నా బట్టలకు,వంటికి కూడా అంటింది.పాపం ఇప్పటి వాళ్లకు తెలిసినట్లు గా ......మరక మంచిదేనని అప్పటి వాళ్లకు తెలియదు గా ! అందుకని మా అమ్మమ్మ బట్టలతో పాటూ నన్నూ ఉతికి ఆరవేసేది. 

Saturday, 19 January 2013

Main Aisa Kyun Hoon

 నా ఫ్రెండ్  - సినిమా కి వెళదామా 
నేను -అబ్బా !చూడదగ్గ సినిమాలు ఏమున్నాయి ? డబ్బులు  వదిలించుకుని తలనెప్పి తెప్పించుకోవటం తప్పించి,నేను రాను.
కొత్తగా రిలీజ్ అయిన రెండు సినిమాలు చాలా బాగున్నాయంట.ఒకటి,కామెడీ రెండోది ఫామిలీ ఎంటర్టైనర్ అంట.రెండిటి లో ఏదో ఒక దానికి వెళదాము.చాయిస్ నీదే!
ఈ మధ్య సినిమాల్లో కామెడి చూస్తుంటే నవ్వు కాదు ,చీదర వేస్తుంది ఆ వెకిలితనం భరించలేక.ఫామిలీ ఎంటర్టైనర్ సినిమాల్లో ఫామిలీ లను భరించటం అంత కంటే కష్టం.వాళ్ళ అతి ప్రేమలూ వాళ్ళూ నూ . నా వల్ల కాదు.నేను రాను.
ఇంక నీకు నచ్చే సినిమాలు ఏంటి తల్లీ.దెయ్యం సినిమా లు చూస్తావా?
న్యూస్ చానల్స్ చూస్తే  చాలదూ ,దయ్యాల కంటే భయంకరం గా ప్రవర్తిస్తున్న వాళ్ళను లైవ్ చూడొచ్చు.అనవసరం గా డబ్బులు వేస్ట్ .
అసలు సినిమా కి వస్తావా అని నిన్ను అడగటం వేస్ట్ .నేను వెళుతున్నా .bye .
హ్మ్మ్...

Main Aisa Kyun Hoon 



ఒకప్పుడు సినిమా చూస్తుంటే ఏడుపు సీను వస్తే ఆటోమేటిక్ గా కన్నీళ్లు అలా ధారలు కట్టేవి.ఇప్పటి సినిమాల్లో ఏడుపు సీనులు వస్తే నవ్వు వస్తుంది. Aisa Kyun? అలా ఎందుకు?ఆహా !ఒహో ఏమి కామెడీ అని అందరూ విరగబడి నవ్వుతూ ఉంటె నాకు నవ్వు రావటం లేదు.ఏమిటి నీకు నవ్వు రావటం లేదా అని అడుగుతుంటే ఏమి చెప్పాలో తెలియక వెర్రి చూపులు చూడాల్సి వస్తుంది.నాలోనే లోపం ఉందా?సైకియాట్రిస్ట్ కి చూపించు కోవాలేమో?
ఇలా ఆలోచిస్తూ ఉంటె ఒక ఆత్మా రాధ కుడివైపు నుంచి -అలా ఉండటం వల్ల నీకు నష్టం ఏమిటి అని అడిగింది.
ఇంకో ఆత్మా రాధ ఎడమ వైపు నుంచి -నష్టం ఎందుకు లేదు?సినిమాలు చూసి ఆనందించలేని బ్రతుకు ఒక బ్రతుకా అని అడిగింది.
ఒక ఆత్మ వస్తే సరి పోతుంది గా ఇద్దరు ఎందుకు ?ఒకళ్ళు వెళ్ళిపొండి అని నేను...
నేను వెళ్ళనంటే నేను వెళ్ళను అని ఆత్మలు భీష్మించు కోవటం తో సరే మీరు ఆర్గ్యూ చేసుకుంటూ ఉండండి అని నేను ,బ్లాగ్ లో పోస్ట్ వేసి చాలా రోజులు అయ్యింది ,పోస్ట్ వేస్తాను అని ఇలా వచ్చాను అన్నమాట.
ఇక చదివి మీరు నవ్వుకుంటారో ,తల బాదుకుంటారో మరి మీ ఇష్టం :)