Saturday 4 January 2014

కొండా,కోనల్లో ...

క్రిస్మస్ హాలిడేస్ లో గౌహాటి కి వెళ్లాలని ఒక రెండు నెలలు ముందుగా టికెట్స్ బుక్ చేయించుకున్నాము.అంత ముందుగా ఎందుకంటే ,ఈ మధ్య టికెట్స్ దొరకటం గగనం అవుతుంది కదా అందుకన్నమాట !దగ్గర దగ్గర గా 50 గంటలు రైల్లో ప్రయాణం తలుచుకుంటే కొంచం భయం అనిపించింది కాని ధైర్యం చేసి వెళ్ళాము.గౌహాటి లో మా బస నారంగి లో ఉన్న కంటోన్మెంట్ ఏరియా - తమ్ముడు వాళ్ళ ఇంట్లో !చుట్టూ అడవి ,కొండలు మధ్యలో క్వార్టర్స్! ప్రొద్దున్నే పావురాలు,గోరింకలు,పిచ్చుకలు సుప్రభాతాలతో మేలుకొలుపు. చలికాలం అవటం తో నాలుగింటికే చీకటి పడి టైం ఏ ఎనిమిదో తొమ్మిదో అయినట్లు ఉంటుంది.5,6 గంటలప్పుడు ఏనుగుల విహారం ! 
 

 
కొంచం ప్రొద్దెక్కితె కోతుల పలకరింపులు.

  క్వార్టర్స్ దాటి కొంచం ఇవతలకు వస్తే కొంగలు

క్వార్టర్స్ దగ్గర  లో ఉన్న చిల్డ్రన్స్ పార్క్
కంటోన్మెంట్ ఏరియా దారి పొడుగూతా ఏనుగుల గురించి హెచ్చరికల బోర్డ్ లు   మరియు ఏనుగులు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల బోర్డ్ లు ఉన్నాయి.ఇక్కడ ఏనుగులను మహారాజ్ అంటారు.ఏనుగులను చూసిన వారు వెంటనే తెల్సిన అందరకి మహారాజులు వచ్చాయని మెసేజ్ పంపిస్తారు.ఆ టైం లో ఎవరు రోడ్ మీదకు రారు.ఇంట్లో లైట్స్ కూడా తీసేసి ,అవి వెళ్లిపోయాయని తెలుసుకున్నాక మళ్లీ వేస్తారు.
ఒక రోజు మేము బయటకు వెళ్లి వచ్చేప్పటికి ఏనుగులు వచ్చి ఉన్నాయి.మేము వెహికిల్ దిగుతూ ఉంటే,ఎదురింటి వాళ్ళు తలుపు కొద్దిగా తెరిచి,తల మాత్రమే బయట పెట్టి మహారాజ్ లు వచ్చాయి ,త్వరగా ఇంట్లోకి వెళ్ళండి అని చెప్పారు,మేము ఎవరం గమనించలేదు - వాళ్ళు చెప్పిన తర్వాత చూస్తే ,పది అడుగుల దూరం లో చెత్తకుండి దగ్గర ఉంది.అందరూ గబగబ లోనికి వెళ్ళారు ,నేను ఒక పక్కకు నుంచుని ఫోటో తీయబోయాను.ఇంతలో మా తమ్ముడు ,ఆర్మీ పోలీస్ చూసారంటే కేస్ అవుతుంది ,వచ్చేయ్ అనటం తో ఇక ఫోటో తీయలేదు . 

 మరి కొన్ని కబుర్లు తర్వాతి టపా లో . 

                    

No comments: